The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 1
PoorBest 

 "నమస్కారాలు గురూ!"

"వెర్రోహం! ఇదేమిటి శిష్యా? ఎన్నడూ లేనిది కాళ్ళు పట్టి మరీ మస్కారాలు చెబుతున్నావ్! ఏదేనీ ఫిక్సింగాలోచనా?"

"అహో! మీరు మహాజ్ఞానులు...త్రికాలవేత్తులు...ఎన్న తరమా గురువు మహిమా వెర్రి గరిమా ఆహాహాహా!"

"ఇక ఆపు శిష్యా! పాయంటులోకి రా...ఐపీఎల్ అనబడే కంకాళ క్రీడ గురించేగా నీ వెర్రోహ సందేహ సందోహము? "

"అద్భుతం గురూ! మీ దృష్టి యొక్క పౌనఃపున్యము, తరంగదైర్ఘ్యము, వేగము....."

"హు..హు...హు...ఈ ఫిక్సింగు ఇక చాలు శిష్యా!"

"అవశ్యం గురూ! మీరన్నట్టుగా ఐపీఎల్ ఒక కంకాళ క్రీడయే కాదు డొంక లాగితే తీగ తెగే వ్యవహారంలా ఉంది. నాలాంటి వెర్రోహులు అనేకమంది వున్నారు. మీ విజ్ఞానోపదేశాన్ని విప్పి చెప్పి మమ్మల్ని ఉద్ధరించండి."

"అలాగే శిష్యా! మొదటగా ఫిక్సింగ్ పంకిలం అంటుకున్న ఆ ముగ్గురు కుర్రకుంక కంకాళాలలో ఒకడు అశాంతుడు, మరొకడు ఛండాలుడు మూడోవాడు చవట. అవునా!"

"శ్రీశాంత్, అజిత్ చండీలా మరియు అంకీత్ చవాన్ల రహస్యనామాలు విప్పి చెప్పారా గురూ! ధన్యోస్మి ధన్యోస్మి!"

"చూశావురా, ఈ కంకాళ మహిమంతా ఆ పేర్లలోనే దాగివుందిరా. ."

"ఆహా...దివ్యోపదేశము. మరి ఈ అస్థిపంజారాలపై బీసీసీఐ శ్రీనివాసుడు కనికరమును చూపెట్టాడెందుకు గురూ!"

"అక్కుపక్షీ! ఆ మాత్రం తెలుసుకోలేవుట్రా? అసలుకే మోసమొచ్చుననే ఈ అసందర్భ కనికార ప్రదర్శనము!"

"అర్థం కాలేదు గురూ!"

"అహో దుర్భరార్భకుడా! విను...అసలు ఈ ఐపీయెల్లే ఒక పెద్ద దగుల్బాజీ వ్యవహారం. దేశాన్ని ప్రతినిధింపజేసే ఒక అంతర్జాతీయ క్రీడలోకి ప్రాంతీయ విభేదాలు సృష్టించి, లేనిపోని అభిమానాల్ని చొప్పించి, ఐకమత్యాన్ని దెబ్బతీయించడంలో ఈ ఐపీఎల్ ఘనత వహించింది. ఆ మధ్యన జరిగిన బెంగళూరు-ముంబై ఆటలో విరాట్ కొహ్లి ముంబాయి ఇండియన్స్ అభిమానుల అతి చేష్టలను నిరసించలేదా? ఐపీఎల్ వచ్చేదాకా క్రికెటర్ల సంపాదనపై దేశప్రజలెవ్వరూ అంతగా దృష్టి పెట్టలేదు. ఈ ముదనష్టపు ఆట వచ్చాక ఏ ఆటగాడు ఎంతకు అమ్ముడుపోయాడన్న ఆరాలు తీయడంలోనే కాలం వ్యర్థమైపోతోంది. సంతలో పశువుల్ని అమ్మినట్టుగా ఆటగాళ్ళు అమ్ముడుపోతున్నారు. ఇలా మూలంలోనే అనేక జాడ్యాలు అంటుకొన్న ఈ మహమ్మారీ ఆటలో లంచాలు పుచ్చుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు. అందుకనే ఈ శ్రీనివాసుడు నోరు కట్టేసుకొని దుష్టుల్ని క్షమించేసినట్టు పోజులు కొడుతున్నాడు."

"అమ్మయ్యోయ్...!"

"శిష్యా! బోర్ద్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అన్న వింతైన పేరున్న ఏకైక క్రికెట్ అథారిటీ BCCI మాత్రమే. ఇందులో రాజకీయుల అరాచక నియంత్రణ తప్ప క్రీడ పైన, దాని ఉన్నతి పైనా, ఆటగాళ్ళ నైతికతపైనా ఎలాంటి నియంత్రణలూ లేకపోవడమే దీని ప్రత్యేకత. బుకీలపైన మాకు నియంత్రణ లేదు అని సదరు శ్రీనివాసుడు నొక్కివక్కాణించడంలోనే అసలు విషయం ఉందిరా!"

"ఇకపై నేను క్రికెట్ మ్యాచులు చూడను గురూ!"

"పోరా వెర్రివాడా! ఈ ఆశ్రమాన్ని దాటి నీ డ్రాయింగు రూములోకి వెళ్ళేవరికేరా నీ క్రికెట్ వైరాగ్యం బ్రతికి బట్టకట్టేది. వందకోట్ల వెర్రిపుచ్చకాయలున్న ఈ దేశంలో కంకాళ క్రీడలు, కళంకిత క్రీడాకారులు బ్రతికిపోయి బట్టకట్టి వీరోచితంగా తిరుగుతూనేవుంటారు. దేశం ఏమైతేనేం, ఎటుపోతేనేం? ఫో!  పోయి ఐపీఎల్ మ్యాచుల్లో మునుగు...చావు."

"గురూ! శపించకండి!"

"......."

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh