The Natural HR Theory by Dr IVNS Raju

Articles

User Rating:  / 0
PoorBest 

"గురూ!"

"ఎంద శిష్యా?"

"మామూలుగా నేను నోరెత్తగానే నా బొందలోని సందేహాన్ని ఇట్టే కనిపెట్టేవారు....నేడేమిటి...ఇలా ఎంద అంటున్నారు?"


"హు..హు..హు...కాలమహిమ శిష్యా! విషయమేంటో చెప్పు."

"గురూ! గత సంవత్సరం ఇదే ఐపిఎల్ సీజన్లో మీరు నాకు మహత్తరమైన ఉప్పుదేశాన్ని చేశారు. దాన్ని గుర్తుచేసుకుంటూ వచ్చాను."

"అవునా? నా మతికి మరుపా? అసంభవం! ఏదీ ఒకసారి టైమ్ మిషీన్ నడుపు!"

"చిత్తం గురూ..."

* * * *

Time Stamp: Last IPL Season

"గురూ!"

"చెప్పు శిష్యా!"

"చెప్పుకంటే అడుగు బాగుంటుంది గురూ!"

"వెర్రివాడా! చెప్పుకు అడుగుకు అవినాభావ సంబంధమే కాదు అద్వైత భావమూ ఉందిరా. సరే అడుగు ముందుకు.."

"గురూ! క్రికెట్లో పుష్కరాలొచ్చాయంటగా?"

"శిష్యా! నీ సిగ్నల్ బలం బలహీనంగా ఉన్నట్టుందిరా! ఎందుకైనా మేలు వీడియోకాన్ మొబైల్ వాడి చూడు!"

"చిత్తం గురూ! మీ దక్షిణ కొద్దిగా ఇటుపడేయండి."

"......"

"దక్షిణం పై ఉత్తరం ఉండదా గురూ! సరే పోనివ్వండి. మీ వీడియోలమ్మైనా మొబైలు కొంటాను!"

"#@*^@^"

"ధన్యోస్మి గురూ! వీడియోలమ్మకుండానే వీడియోకాన్ మొబైల్ వచ్చింది. మరి అడగనా? చెప్పనా?"

"హు..హు..హు....క్రికెట్లో పుష్కరాల మాటేగా శిష్యా?"

"చిత్తం గురూ!"

"శిష్యా!

కూడులేనివాళ్ళు కోటానుకోట్లురా
కోట్లు ఉన్నవాళ్ళు కొలదిమందే
కడుపునిండినోళ్ళ కాళ్ళనంటే తిరుగు
నోట్లకట్టలన్ని నోము నోచి!"

"ఆహా! గొప్పమాటన్నారు గురూ! ఈ పుష్కరం గురించి ఇంకా చెప్పండి!"

"పరాయి పుష్కరాలపై అధికమైన మోజు తగదు శిష్యా!"

"అమ్మణ్ణి చేసుకోబోయేది రెండో వివాహమట. థరూరయ్య చేసుకొంటే ఆయనకు మూడోదట! అట్టిది నా మొజుకు చోటేది గురూ! దయచేసి చెప్పండి!"

"సరే శిష్యా! నీ సిగ్నల్ బలం పుంజుకొంది. చెబుతాను. సునందమ్మణ్ణి కాశ్మీర సుందరి. మొదట కాశ్మీరవాసినే పెళ్ళాడింది. ఆడి వదిలింది. పిమ్మట మళయాళ దేశీయుణ్ణి వలచింది. వివాహమాడింది. పరంతూ! ఆ మగడు ప్రమాదంలో పరమపదించాడు. ప్రస్తుతం అమ్మణ్ణి ఒంటరిది."

"భలే! అదే నోట థరూరయ్య మోన్ గారి వివరాలనూ చెప్పండి!"


"ఆహా! శిష్యా! పరుల గురించి మాటాడుట కాషాయధారికి శోభస్కరము కాదురా!"

"ఆహా! గురూ! వీడియోలను తీయుట. తీసి చూపించకుండుట శిష్యులకు శ్రేయస్కరము కాదు!"

"ఆమ్ మ్మ్ మ్మ్! సరే వినుము. థరూరయ్య మొదలు వలచినది తిలోత్తమను..."

"ఎంద! ఎంద చాట? అంద స్వర్గలోకత్తిల తిలోత్తమ ఇంద భూలోక థరూర మోనుం మోజు పడ్డమా? నమ్మశక్యమా యిరక్కమాట్టే!"

"ఇరుకు లేదు మురుకు లేదు అలా అరవకో శిష్యా! తిలోత్తమ అంటే ఆ తిలోత్తమ కాదు. తిలోత్తమ ముఖర్జీ. ఒరు బెంగాలీ పెణ్. ఆమా!"

"అప్పిడియా! సరే గురూ! మనసిలాయో! చెప్పండి"

"అలా తిలోత్తమను మనువాడిన మనవాడు ఎందుకో మనసు విరిగి వదిలినాడు. అటుపై

రూటును మార్చెనూ..ఊ..ఊ..ఊ...హోయ్...
దేశము మార్చెనూ..ఊ...ఊ...ఊ...హోయ్!
కెనడా పోయేనూ..ఊ...ఊ...ఊ..ఊ...
అచట క్రిస్టా గైల్సును చూసెను....
ఐనా..ఆ..ఆ.ఆ..పెళ్ళి నిలువలేదు
అయ్యకు కాలు నిలువలేదు"

"అంటే

వేషము మార్చెనూ...భాషను నేర్చెను
మోసము నేర్చెనూ...తనకు తానే మారెను"

"లెస్స గ్రహించితివి శిష్యా!"

"ధన్యుణ్ణి గురూ! మీ అమోఘ విశ్లేషణను ఇంకాస్త వెదజల్లితే మరింత ధన్యుణ్ణి ఔతాను!"


"తప్పకుండా శిష్యా! ఉత్తర, దక్షిణ భారతాలకు చెందిన కోటీశ్వరులు కొన్న ఫ్రాంచైజీల గుట్లు లలిత్ మోడీ కోటు గుండీల్లో పదిలంగా ఉండగా మా కొచ్చి పై కోపమెందుకొచ్చెన్ అని మళయాళీలు పంచెలు దులిపి మరీ అడుగుతున్నారు. కానీ సదరు కొచ్చీ టీమును కొన్న రెండవూలో ఒక్క మళయాళీ కూడా లేడన్నది నిష్టుర సత్యం."

"ఓహో! నిజమే గురూ! థరూరయ్య చక్కెర గుళిక కూడా మళయాళ మనోరమ కాదు!"


"నీ సిగ్నల్ బలం క్షణక్షణమూ వృద్ధిపొందుతోంది శిష్యా! ఇంకా విను! సునందమ్మ అక్కడెక్కడో దుబాయిలో సౌందర్య మెరుగుల కొట్టు నడుపుతోంది..అంటే బ్యూటీ పార్లరన్నమాట. బ్యూటీ పార్లర్ వోనర్ వద్ద డెబ్బై కోట్ల డబ్బుందంటే నమ్ముతావా శిష్యా?"

"కుక్క తోక సరళ రేఖ అంటే నమ్ముతాను గురూ! కానీ...డెబ్భై కోట్ల బ్యూటీ పార్లర్ని...ఊహూ!"

"అదే శిష్యా! మహిమంటే"

"ఎంద మహిమ గురూ?"

"నీ బొంద! ఈ ఆర్టికల్ శీర్షికరా శిష్యా!"

"మరి ముందేమిటి దారి గురూ!"

"నా దారి రహదారి. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే!"

"ష్యూర్ గురూ! వస్తా...వెళ్ళొస్తా!"

"వెళ్ళే ముందు నా వీడియోలు శిష్యా!"

"తీసినప్పుడు తప్పక ఇస్తాను గురూ!"

"అంటే?!?"

"ఇప్పుడే మొబైల్ విత్ టూ మెగాపిగ్సల్ కెమెరాను ఇప్పించారుగా!"

"హతోస్మి శిష్యా!"

"ధన్యోస్మి గురూ!"


Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh