The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 1
PoorBest 

"అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు" అనే వ్యవహార వాక్యం పిలక రాజకీయాల్లో మారిపోయింది. ముందుగా కాళ్ళావేళ్ళా బడటం. మాట వినకపోతే పిలక పట్టుకు పీకటం. స్థూలంగా చెప్పుకుంటే ఇదీ పిలక రాజకీయమంటే! మన రాజకీయాల్లో "పిలక రాజకీయ శకానికి" నాంది పలికింది ఇందిరా గాంధి అంటారు. అప్పట్లో, తనకు అడ్డుగాను, తన మీద, తన పరిపాలనపైన అసంతృప్తితో ఉండి అవాకులు చెవాకులు పేలే నాయకుల నోరు కట్టేయటానికి వారికి సంబంధించిన కొన్ని రహస్యాలు తెలుసుకొని, వాటితో వాళ్ళ నోళ్ళు మూయించేవారని అందరూ అనుకునేవారు. క్రమేణా ఆ విద్యను ప్రతిపక్ష నేతలపై కూడా ప్రయోగించేవారని కూడా కాకి కబుర్లు ఆరోజుల్లో విస్మయంగా చెప్పుకునేవారు. 

ఏక వ్యక్తి, ఏక పార్టీ పాలనలో ఈ "పిలక రాజకీయ విద్య" పరమార్ధం అందరికీ అంతగా తెలిసొచ్చేది కాదు. అయినా, భూత భవిష్యత్ వర్తమానాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెసీయులందరికీ ఇది నిర్బంధ విద్యగా చేసినట్లున్నారని అనిపిస్తుంది. గత మూడు దశాబ్దాలలో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాలే దేశాన్ని ఏలుతున్నాయి. కప్పల తక్కెడలా పది పదిహేను పార్టీలతో ప్రభుత్వాన్ని నడపాలంటే గుండెలో ప్రాణాలు గొంతులోకి వస్తాయి. ఈ పిలక రాజకీయ రహస్యాలు తెలీకే, జనతా పార్టీ, జనతా దళ్ ప్రయోగాలు  ఫలించలేదు. రెండుసార్లు కింద పడి, మూడోసారి మాత్రమే ముక్కుతూ మూలుగుతూ వాజ్ పేయి గారు ఐదేళ్ళు పరిపాలించామనుకున్నారు!

కానీ, ఈ విద్యలో మాత్రం కాంగ్రెస్ ఆరితేరిపోయింది. మొన్నెప్పుడో జె.ఎం.ఎం., నిన్నటికి నిన్న డి.ఎం.కె. దాదాపు తమకు మిత్రపక్షంగా ఉన్న ప్రతి పార్టీ పిలక తన గుప్పిట్లో బిగించేసింది. కాంగ్రెస్ వి కబంధ హస్తాలని ఊరకే అనలేదు మరి. పైగా, ఆ పార్టీ గుర్తు కూడా అదేనాయె! అయినా, కాంగ్రెస్ కు తరతమ బేధాలేవీ లేవు. తండ్రి పదవిలో ఉన్నంతకాలం, జగన్ పిలక 30 జనపథ్ లోనే దాచేసింది. జగన్ జెండా రంగు మార్చగానే, పిలక బయట పెట్టేసింది. పాపం డి.ఎం.కె.! దాదాపు తొమ్మిదేళ్ళు యు.పి.ఎ.కు ఊపిరి ఊదినా ఫలితం లేకపోయింది. మొన్న బయటకు రాగానే, నిన్న పిలక పట్టుకు ఊపేసింది కాంగ్రెస్! అయినా తొమ్మిదేళ్ళు 14 మంది బలంతో, వాళ్ళల్లో 5 గురికి మంత్రిపదవులతో 2జిలు, 3జిలు తిన్నప్పుడు డి.ఎం.కె.కు కమ్మగానే ఉంది. శ్రీలంక విషయంలో సర్దుకుపొమ్మంటే సర్దుకుందా! మరి కాంగ్రెస్ కు కాలిందంటే కాలదా మరి!

సరే, మిత్రపక్షాలైతే ఏదో గడ్డి తిన్నారు. ఆ గడ్డి తినేప్పుడు లేని బాధ ఇప్పుడు చూపిస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పిలక పీకిందనుకోవచ్చు. కానీ, తిన్నదీ లేదు, తుమ్మింది లేదు, పిలక మాత్రం పీకించుకునే బ్రహ్మానంద, బాబూ మోహన పార్టీలను చూస్తుంటే మాత్రం జాలేస్తుంది. యు.పి.లో కాంగ్రెస్ కు బద్ధ శత్రువులు. అంతేకాదు, అక్కడ ఆ పార్టీకి సమాధి కట్టిన రాజకీయ దురంధరులు ములాయం, మాయావతి! ఎప్పుడు ఏ మిత్రపక్షం హస్తం పార్టీకి చేయిచ్చినా, కాంగ్రెస్ ఫస్టు పీకేది వీళ్ళ పిలకలే! పిలక పీకటమే కాదు, సి.బి.ఐ. గిలక్కాయతో ఆడుకుంటే మాడు పగులుతుందని హెచ్చరిస్తు ఉంటుంది. పీకితే పీకారు, కనీసం అధికారం పంచుకుంటారా అంటే ఆ అవకాశం కూడా కాంగ్రెస్ ఇవ్వదు. కొద్దిగా అటూ ఇటుగా ఆర్జేడి లాలూది ఇదే బాధ!

కిందపడ్డా మీసాలకు మట్టి అంటలేదని బీరాలు పలికినట్లు, పిలక పీకించుకున్నా అది తప్పుకాదన్నట్లు, కమ్యునల్ పార్టీని అడ్డుకోటానికే పీకించుకుంటున్నామని బడా పోజులు కొట్టేస్తారు! వారున్న పరిస్థితుల్లో అది తప్పదు మరి. కానీ, వాళ్ళకు అసలుసిసలు వర్రీ సమ్ విషయం ఇక్కడే ఉంది. పిలక రాజకీయాలు వంటపట్టించుకుని రేపు ఆ కమ్యునల్ పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళ పరిస్థితి ఏమౌతుంది. ఒక్క పిలక, రెండు చేతులు, ఎన్నెన్ని పీకుళ్ళో!

@@@@@

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh