User Rating:  / 0
PoorBest 

ఈరోజు (19 డిసెంబర్) అంతర్జాతీయ మరుగుదొడ్ల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు(ము). మరుగుదొడ్లే మానవాభివృద్ధికి సూచికలని, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య సాంప్రదాయంలో అది ప్రజల అవసరమే కాక, ప్రతి మనిషికీ ఉన్న హక్కు అని అప్పుడెప్పుడో శ్రీ జైరాం రమేష్ గారు సూచించారు కూడా. ఆయనే ఆ మంత్రిగా కంటిన్యూ అయ్యుంటే, మనిషికో మరుగుదొడ్డి పథకం కూడా “ఎవరో గాంధీ” పేరు మీద మొదలయ్యేదేమో! మరుగుదొడ్లు, పార్లమెంటు అనగానే గుర్తుకొస్తుంది. రెండు మూడు నెలల క్రితం అసీం త్రివేది అనే కార్టూనిస్టు, పార్లమెంటును మరుగుదొడ్డిగా చిత్రీకరించినందుకు దేశద్రోహ నేరంపై అరెస్టు కూడా అయ్యాడు. ఆ తర్వాత, ఆ కేసు ఆగిపోయిందనుకోండి. 

మరుగుదొడ్ల గురించి జైరాం రమేష్ గారి మాటల్లో ఎలానూ చెప్పుకున్నాం కాబట్టి, ఇక మన నాయకుల గురించి చెప్పుకుందాం. మరుగుదొడ్లకి, మన నాయకులకి సంబంధం ఏమిటనుకుంటున్నారా? మన నాయకులు చాలాసార్లు మాట్లాడరు, విసర్జిస్తూ ఉంటారు. దాన్నే, నోటి దూల, నోటి దురద, నోటికి తీట, వాచాలత అని కూడా అంటారు. అలా విసర్జించే ప్రకటనలనే పదార్ధాలు ఎంత గబ్బుకొడుతూ ఉంటాయో వేరే చెప్పనక్కరలేదు. ఏదేమైనా, మరుగుదొడ్ల మహోత్సవం సందర్భంగా మన నాయకుల కొన్ని ప్రకటనలు చదువుకొని, మన మరుగుదొడ్లే పరిశుభ్రంగా ఉన్నందుకు ఆనందిద్దాం. 

ఎన్.టీ.ఆర్.కు ముందు ఎలా ఉండేదో అంతగా తెలీదు కానీ, రాజకీయాల్లో గబ్బు ప్రకటనలకు మాత్రం మన అన్నగారు ఇతోధికంగా ఊపునందించారు. కాంగ్రెస్ వాళ్ళు కుక్కమూతిపిందెలనీ, మోచేతి నీళ్ళు తాగే వెధవలనీ, రాజీవ్ గాంధి నపుంసకుడని....ఇలా. ఆ వెంటనే జలగం వెంగళ్రావు కూడా ఎన్.టీ.ఆర్.ని ఫుట్బాల్ కొట్టినట్లుగా కొట్టేస్తానని చిందులు వేసేసారు. అలా కొనసాగుతూ వచ్చిన మన నాయకుల నోటి తీట మరుగుదొడ్లని మరిపించటమేమో కానీ, మన పార్లమెంటరీ సంప్రదాయాలని భ్రష్టుపట్టిస్తున్నది. మచ్చుకు కొన్ని తీటలు...

 

ముందుగా తె.రా.స. అధినేత శ్రీమాన్ చంద్రశేఖర్ రావు గారు. ఆంధ్రోళ్ళని చీల్చేస్తాం, చెండాడేస్తాం నుంచి మొదలై, "ఆంధ్రోళ్ళ బిర్యాని పేడ లెక్కుంటుంది" అనేవరకు వచ్చింది! మహానుభావుడు, పేడ రుచి ఎలా తెలిసిందో, ఆంధ్రా పొడే గిట్టని వ్యక్తి, ఆంధ్రోళ్ళ బిర్యాని ఎలా తిన్నాడో అని ఎవ్వరూ అడగలేదు! 

సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి శ్రీ నారాయణగారు. వీరికీ నోరు తెగ పూస్తూనే ఉంటుంది. నిన్నంటే నిన్ననే ఆయనా నోరు ఇలా పారేసుకున్నారు ....28న తెలంగాణాపై జరిగే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణాకు అనుకూలంగా ఒక్కటే సమాధానం చెప్పాలని, అలా కాక రెండు వేరువేరు అభిప్రాయాలు చెబితే నాలుకలు కోసేస్తానని ఇతర పార్టీల ప్రతినిధులని హెచ్చరించారు! 

మొన్నామధ్య ఎఫ్.డి.ఐ. పై రాజ్యసభలో జరిగిన చర్చలో, తన ఉపన్యాసానికి అడ్డు పడుతున్నారని ఓ మహిళా ఎం.పీ.ని "బేవకూఫ్" అనేసారట భా.జ.పా. నాయకుడు వెంకయ్య నాయుడుగారు! 

"పెద్ద సింహాల్లా మాట్లాడుతారు కానీ, కుక్కల్లా కాంగ్రెస్, సోనియాల కాళ్ళు మాత్రం నాకుతూనే ఉంటారు" - అంటూ లాలూ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ లను ఉద్దేశించి, సాక్షాత్తు భా.జ.పా. అధ్యక్షుడు శ్రీమాన్ నితిన్ గడ్కారి 2010లో నోటి దూల ప్రదర్శించారు. 

ఐ.క్యు. విషయంలో స్వామి వివేకానంద, మాఫియా లీడర్ దావూద్ ఒకరికొకరు తీసిపోరని కూడా ఈ మాననీయులే వాక్రుచ్చింది! 

"నేను కేంద్ర న్యాయశాఖా మంత్రిని, పెన్నుతోనే కాదు రక్తంతో కూడా రాయటం వచ్చు. దమ్ముంటే ఫరూకాబాద్ రా, తిరిగి ఎలా వెళతావో నేనూ చూస్తా"... ఇదేదో సినిమాలో తొడలు కొట్టి, మీసం మెలేస్తూ కటకటాల రుద్రయ్యో, సమరసింహారెడ్డో వేసిన పొలికేక కాదు. సాక్షాత్తు, అప్పటి కేంద్ర న్యాయశాఖా మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గారు అరవింద్ కేజ్రీవాల్ పై ఆగ్రహిస్తూ చేసిన శపథం! 

"అమ్మాయిలు వేసుకునే దుస్తులవల్లే మానభంగాలు జరుగుతున్నాయి" అని ఓ మహాశయుడు సెలవిస్తే, "పిల్లలకి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేస్తే మానభంగాలనేవే ఉండవు" అని మరో మహానుభావుడు ప్రకటిస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అటు దేశస్థాయిలో దిగ్విజయ్ సింగులు, కపిల్ సిబల్సు, మనీష్ తివారీలు, మణిశంకర్ అయ్యర్లు, ములాయంలు, లలూలు కూడా ఇతోధికంగా నోటి దూల ప్రదర్శిస్తుంటే, ఇటు రాష్ట్రస్థాయిలో కేకేలు, కాకాలు, వి.హెచ్.లు, సర్వేలు, శంకర్రావులు, సత్యనారాయణలు, కె.సి.ఆర్.లు, హరీష్ రావులు... బోల్డు మంది బోల్డు రకాలుగా నోటి దురద తీర్చుకుంటూ కనిపిస్తారు... సారీ వినిపిస్తూ ఉంటారు. 

అదీ చాలకపోతే, జనాలని చితకబాదుతూ చేతి తీట కూడా తీర్చుకునే నాయకులు కూడా ఉన్నారు వీరిలో కొందరు. 

ఏదేమైనా, మరుగుదొడ్లనైతే ఫినాయిల్ తో కడిగి, చీపురుతో చిమ్మేసుకుంటాం. మరి వీళ్ళని, వీళ్ళ నోళ్ళనీ..... ఎందుకులే బాబు ఇప్పటికే 'పోటా'నో, 'మోకా'నో పెట్టేసుంటారు నామీద!

@@@@@ 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh