The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 1
PoorBest 

చిన్నప్పుడు మన స్కూళ్ళల్లో కొద్దిమందిని చూసుంటాము. చూట్టానికి వెర్రిబాగులవాళ్ళుగా కనిపించేవాళ్ళు కొందరు ఉండేవారు. వేళాకోళం చేయటానికి, ఎగతాళి చేసి ఏడ్పించటానికి వాళ్ళే అందరికీ టార్గెట్లుగా ఉండేవాళ్ళు. అటువైపు వెళ్తూ ఒకసారి, ఇటువైపు వస్తూ మరోసారి మనం వాళ్ళకి ఓ టెంకిజెల్లో, మొట్టికాయో ఇచ్చేవాళ్ళం. ఆ బాపతు జనాలు మనకు కాలేజీరోజుల్లోను, ఇప్పుడు పని చేసే ఆఫీసుల్లోను కూడా కనిపిస్తు ఉంటారు. వీళ్ళంటే అందరికీ లోకువే. ఇంకొద్దిగా అర్ధమయ్యేట్లు చెప్పుకోవాలంటే, మన సినిమాల్లో హాస్యం కోసం నడ్డి మీద తన్నించుకునే బ్రహ్మానందాలు, బాబుమోహన్ల బ్యాచువాళ్ళన్నమాట. పాపం వాళ్ళ ఇంటివాళ్ళు కూడా వాళ్ళని స్పేర్ చేయరు. 

వాడెవడో బిట్టిట! ఏడేళ్ళ క్రితం ఓ విదేశీ వనితను మానభంగం చేసిన కేసులో శిక్షపడిన తర్వాత ఓసారి పెరోల్ మీద బయటకు వచ్చి నిన్నటిదాకా పత్తా లేకుండా పోయాడు! వాడి తండ్రి ఓ రిటైర్డ్ పోలీసు ఆఫీసరుట! ఏడు సంవత్సరాలపాటు పోలీసులను, న్యాయవ్యవస్థను బడుద్ధాయిలుగా చేసి హాయిగా కేరళలో ఉద్యోగం చేసుకుంటున్నాడట! 

పి.జె.కురియన్ - రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్... సూర్యనెల్లి బాలిక మానభంగం కేసులో అడ్డంగా ఇరుక్కుపోయాడు. 16 ఏళ్ళ నుంచి నలుగుతున్నది ఈ కేసు. ఇప్పుడు ఆ బాలిక ఓ వ్యభిచారి అని నా మీద కేసు పెట్టటానికి వీల్లేదని అంటున్నాడు. రేపు చేసింది లేనిదీ చెప్పలేదు విచిత్రంగా. సరే, ఆ బాలిక వ్యభిచారి అన్న ఈ పెద్దమనిషి బానే ఉన్నాడు. అలా వాగాడని కొందరు మళయాళీలు ఫేస్ బుక్ లో ఆయన్ని ఖండిస్తే, పోలీసులు అలా ఖండించిన 100 మందిని స్టేషనుకు తీసుకెళ్ళి విచారించారట! 

పాపం పోలీసులు కురియన్ ను అరెస్టు చేసి విచారించాలని తెలియని బడుద్ధాయిలన్న మాట. వీళ్ళకు ఫేస్ బుక్ లో జనాలు బడుద్ధాయిలుగా కనిపించి ఉంటారు. అందుకే వాళ్ళని బుక్ చేసారు! 

వందకోట్ల మంది చేత *** పోయిస్తానని పూరి జగన్నాధో చపాతీ జగన్నాధో "బిజినెస్ మ్యాన్" సినిమాలో హీరో చేత ప్రతిజ్ఞ చేయిస్తాడు. విజిల్సేసుకుంటూ చూసాం. పది నిముషాలపాటు పోలీసులు పక్కకెళ్తే వందకోట్లమందిని మేం పాతిక కోట్లమంది చూసుకుంటాం అని అల్లాఉద్దీనో అక్బరుద్దీనో విజిల్సు మధ్యే హెచ్చరిస్తాడు. ఆరు వారాలు తిరక్కముందే వాడికి బెయిల్ వచ్చేస్తుంది. రేపు వాడు మాయమైపోయినా ఆశ్చర్యం ఉండబోదు. 

వీడి మాటలు విని *** పోసుకునే వాళ్ళు 100 కోట్ల మంది బడుద్ధాయిలన్నమాట. వాడేదో నిజంగా పొడిచేస్తాడనుకుని ఓట్లు వేయాలనుకునే బడుద్ధాయిలు పాతిక కోట్లన్నమాట! ఇంతాచేసి, నేనేం వాగానో నాకే గుర్తు లేదు. నాకేదో రోగం వచ్చి వాగుంటాను. ఎవరో క్షుద్రప్రయోగాలు చేసారని పోలీసులని, న్యాయస్థానాలని కూడా బడుద్ధాయిలను చేసేందుకు ప్రయత్నించాడట ఈ బడుద్ధాయ్! 

వాడెవడో రాజా భయ్యాట! ఇండిపెండెంట్ ఎమ్మేల్యేగా గెలిచాడు. అదీ జైల్లో నుంచే ఎన్నికల్లో నిలబడి మరీ గెలిచాడు. వాడో గూండా, కిడ్నాపర్, టెర్రరిస్ట్, బద్మాష్ అని యు.పి.లో ఏనుగు ప్రభుత్వం 2002లో పోటా కేసు పెట్టి మరీ బుక్ చేసింది. 2003 ఎన్నికల్లో గెలిచిన అరగంటలోపే సైకిల్ ప్రభుత్వం, వాడు ఓ సచ్ఛీలుడు, సన్మార్గి, వాడిని రాజకీయ కారణాలతో బొక్కలో పెట్టారని పోటా ఎత్తివేసింది. 2004 కల్లా వాడిని బయటకు తీసుకువచ్చి ఓ మంత్రిపదవి కూడా ఇచ్చింది. 2007 లో మళ్ళీ ఏనుగు ప్రభుత్వం వచ్చి ఈయన మళ్ళీ బొక్కలో చేరాడు. 2012 లో మళ్ళీ సైకిల్ ప్రభుత్వం వచ్చి సకల లాంఛనాలతో విడుదల అయ్యాడు!  2004 లో విడుదలయ్యాక, ఆప్పట్లో ఇతగాడి కేసు చూస్తున్న పోలీస్ ఆఫీసర్ ఆర్.ఎస్.పాండే ఓ రోడ్ ఆక్సిడెంటులో పోయాడట! అలానే, మొన్న బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇతగాడి కేసు చూస్తున్న జియా ఉల్ హక్ అనే మరో పోలీసు ఆఫీసరు కూడా ఏదో గ్రామంలో జరిగిన గొడవల్లో చంపబడ్డాడు. ఎవరు ఎవరిని బడుద్ధాయిలుగా చేస్తున్నారో కూడా తెలీనంతగా బడుద్ధాయిలమౌతున్నాం! 

ఇదంతా ఎందుకంటే, మన నాయకులు మనలనే కాదు, మనదేశాన్ని కూడా బడుద్ధాయి దేశంగా మార్చేసారు! ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం చాలా లోకువైపోయింది. మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, చైనా ఇవన్నీ ఓ ఆట ఆడుకున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు వంతు వచ్చిందే తడవుగా ఇటలీ కూడా ఓ చేయి వేసి వెళ్ళింది. 

ఆమాటకొస్తే, ప్రపంచ దేశాలేం ఖర్మ, యునైటెడ్ కార్బైన్సు నుంచి, బోఫోర్సు నుంచి చాలాచాలా కంపెనీలు కూడా దురదపుట్టినప్పుడల్లా ఓ జెల్లకాయ ఇచ్చేసి వెళుతూనే ఉన్నాయి. అయినా, మనం నిస్సిగ్గుగా ఓ చిరునవ్వు నవ్వేసి ఊరుకుంటూ ఉంటాము ఆ బడుద్ధాయిల్లాగా! నిజానికి దేశప్రజలందరం అలా అలా బడుద్ధాయిలం అయినట్లు అనుమానం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. 

ఏదెమైనా, ఏ ఊరైనా, ఏ దేశమైనా పెద్ద బడుద్ధాయిలకు పిల్ల బడుద్ధాయిలంటే లోకువే మరి! పెద్దలంటే అధికారం ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళని అర్ధం.  మరోలా చెప్పుకోవాలంటే, అధికారముంటే ఎవరినైనా బడుద్ధాయిలుగా చేయొచ్చు అన్న మాట!

Comments   

 
+2 #1 చిటపటలు-26 "బడుద్ధాయిలు - భారతదేశం" IC 2013-03-13 16:09
Hello KS!

Perfect political satire,
Please continue your CHITAPATALU...

IC'
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh