User Rating:  / 1
PoorBest 

తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదటి నాలుగు నెలలో ఎన్టీఆర్ రాజమండ్రి వచ్చినపుడు ఆయన సభకు వెళ్ళాను సభను ఆసాంతం ఒక్క సారి చూసి "నేల ఈనిందా" అని ఉద్వేగం గా బిగ్గర గా పలికారు ఆయన.  దీనికి స్పందన ఊహించని విధం గా వచ్చింది. 

అంతమంది భారతీయుల్ని ఒక సుదూరమైన విదేశం లో చూసినపుడు మోడీకి ఎలాంటి భావోద్వేగం కలిగిందదో తెలియదు కాని ఆయన సభకు వచ్చిన మన భారత సంతతి ని చూసి చాల మంది మన దేశ వాసులకు తప్పక ఉద్వేగం కలిగి ఉంటుంది. 

ఒక్క వ్యక్తిని చూడడానికి వచ్చారా లేక ఆ వ్యక్తి ఎలా భారతదేశ భవిష్యత్ ని నిర్దేశించబోతున్నాడో వినడానికి వచ్చారా అంటే సమాధానం: మోడీ ని చూడడానికి, అతను భారత ప్రధానిగా చెప్పే మాటలు వినడానికి వచ్చారు అనే చెప్పాలి. వ్యక్తి - అతని విధానం అభేదమైన విషయాలు, జీవి, జీవి యొక్క స్వభావం లా.    భారత దేశం లో మార్పు పవనాలు వీస్తున్నాయి అని చెప్పడానికి నిదర్శనం మోడీ ప్రసంగం. నేత పలికే మాటలే నీతి గా చెలామణి ఔతాయి. 

ఐ.ఏ.ఎస్. ఆఫీసర్స్ ప్రధానులకు  వ్రాసే ప్రసంగాల లో ఉండే భావనలు ఐఏఎస్ అధికారులవే ఎక్కువగా ఉంటాయి. తన ప్రసంగం తానే  చేయగల సత్తా ఉన్న నాయకుని మనం ఎన్నుకున్నాం అనే సంతోషం భారతీయుల్లో ఉంది. కాని ఒక చక్కని ప్రసంగం ఒక వ్యక్తి నుంచి రావాలి అంటే అంతే చక్కని మానసిక స్థితి లో ఆ వ్యక్తి ఉండాలి.  వేల సంఖ్యలో ఉన్న భారత సంతతి ని చూసి మోడీ కి ఏమనిపించిదో అదే ఆయన పలికారు. 

భారత సంతతి విదేశాలలో తన ప్రతిభను చాటడానికి కారణం వారి భారతీయతే.  పనిదినమైనా సెలవు పెట్టి మరీ రావడానికి కారణం మా ప్రధాన మంత్రి అని భావనే. ఒకవేళ ఖుర్షిద్ అన్నట్లు ఈ మీటింగ్  stage managed అని అనుకున్నా (రూ. 500/- చేతిలో పెట్టి లంచ్, సాయంత్రం బిరియాని, క్వార్టర్ బాటిల్ ఇచ్చి రానుపోను లారీలలో తెసుకొని వెళ్ళే భారతీయ రాజకీయ పార్టీల సభా నిర్వహణ విధానాలు సిడ్నీ కూడా చేరిపోయాయి అని అనుకున్నా) ఒక్క సారి అక్కడికి వచ్చి అంత మంది భారత సంతతిని చూసిన ప్రతి భారతీయుడూ ఒక ఉద్వేగానికి గురికావడం సహజమే !!  దేశం కాని చోట స్వదేశీ వాసుల్ని అంత మందిని ఒక్కసారి చూస్తె పెల్లుబికేది "భారతీయత" ,"మన ప్రధాని " అని భావన తక్క కాంగ్రెస్, భాజపా పార్టీల పేర్లు సిద్ధాంతాలు కావు.

మోడీ చేస్తున్న ప్రతి విదేశీ పర్యటనా ఆయన బాధ్యతను మరింతగా పెంచుతుంది. అలాగే దేశం లో భాజపా యొక్క నైతికత, పాలనా సమర్థత పట్ల మరింత శ్రద్ధ తీసుకొనే పరిస్థితిని కల్పిస్తుంది.  ఇదేదో పెప్ టాక్ అని భ్రమిస్తే నష్టపోయేది భాజపా, అటుపై దేశం కూడా. రాజకీయ భాషణ విని విని విసిగి వేసారిపోయారు భారతీయులు. మాటలు చేతల రూపాన్ని సంతరించున్నపుడు వాటి విలువ పెరుగుతుంది. 

పెట్టుబడులను ఆహ్వానించినంత మాత్రాననే కాదు,  దేశంలో తగిన పారదర్శక విధి విధానాలను దేశ సార్వభౌమత్వం, ప్రగతి, నైతికత పరిరక్షించే విధంగా (భారతం ప్రథమం - ఇండియా ఫస్ట్) అమలు చేయాలి. అలాగే దేశంలో ఉన్న వ్యాపార దక్షతను, దేశీయ, సంప్రదాయ వ్యాపారాన్ని అంతే  నిబద్ధత తో ప్రోత్సాహ పరచాలి.   ఉదా: తోపుడు బళ్లపై వండి అక్కడే విక్రయించే వారికి తగిన సాధనాలు, పని పద్ధతులు, స్వచ్చత, శుభ్రత పై అవగాహన కలిగించాలి. ముంబాయి కొలాబా ప్రాంతం లో కేవలం లంచ్ టైం లో చాల వ్యాపారం జరుగుతుంది ఈ తోపుడు బళ్లపై.  అక్కడ క్వాలిటీ, క్వాంటిటీ గురించి పట్టింపులు ఉండవు. అలాగే ప్రతి రాజధాని నగరం లోనూ, ఇతర పట్టణాలు, పల్లెల లోనూ  ఈ తోపుడు బళ్ల వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాలు మన దేశం లో ఆరోగ్య సమస్యలకు మూల కారణాలు. స్వచ్చ భారత్ ఉద్యమానికి ఉన్న మరొక ముఖ్య దృక్కోణం ఇది కూడా కావాలి. 

మోడీ విదేశీ యానం వలన దేశానికి ఒనగూరిన ప్రయోజనాలు కూడా దేశ వాసులకు తెలుపవలసిన బాధ్యత మోడీ ప్రభుత్వం పై ఉంది. ముఖ్యం గా పరిశ్రమల శాఖ వారు ఈ విషయాలను - ఎన్ని విదేశీ పెట్టుబడులు వచ్చాయి - మోడీ పర్యటన అనంతరము - వారి అధికారిక వెబ్సైటు లో ఉంచాలి.   అలాగే ప్రతి విదేశీ యానం ఖర్చు మన విదేశీ వ్యవహారాల శాఖ వారు తమ వెబ్సైటు లో తెలపాలి. దేశం లో ప్రభుత్వ నేతలు చేసే ఖర్చు దేశ ప్రజలకు తెలియాలి. 

మోడీ నేతృత్వం లో భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ఆత్మీయ మార్గదర్శి గా ఉండాలి. ఇదే Co-opeartive Federalism అంటే. ప్రతి పైసా ఎలా కేంద్ర ప్రభుత్వం  ఖర్చు చేస్తుందో ప్రజలకు తెలియాలి అప్పుడే రాష్ట్రాలు సైతం కేంద్రాన్ని అనుసరించక తప్పదు. భాజపా అధికారం లో ఉన్న రాష్ట్రాలలో కేంద్ర యొక్క పని పద్ధతులు ప్రస్ఫుటం గా ప్రతిఫలించాలి అప్పుడే ప్రజలకు భాజపా ప్రభుత్వాలపై విశ్వాసం పెరుగుతుంది.  

ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి, అలక్ష్యం (మురుగు కాలవలలో మహిళలు పిల్లలు పడి పోయి చనిపోవడం వంటి ఘటనలు) పెరిగి పోవడానికి కారణం ప్రభుత్వ ఉద్యోగాలలో జవాబుదారి తనం లేకుండా ఉండడమే. ప్రతి ఆరు నెలలకూ DA పెరగడం ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ రావడం యాంత్రికంగా జరిగిపోవడం వలన ఈ జవాబుదారీదనం ప్రభుత్వ ఉద్యోగులలో లేకుండా పోయింది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కి నిర్దిష్టమైన పనులు, ఆ పనులు చేసే సామర్ధ్యాన్ని కొలిచే విధానాలు ఉండి తీరాలి. ఇవి మోడీ ప్రభుత్వం అతి త్వరగా ఏర్పాటు చేయాలి. అప్పుడే విదేశీ పెట్టుబడులు, ప్రగతి, సరియైన పని పరిస్థితులు సాధ్యం ఔతాయి. 

మునుముందు మోడీ చేయబోయే విదేశీ పర్యటనలో ఆ దేశంలో నివసిస్తున్న భారత సంతతికి ఆయన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వాలి. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్‍ను మొదట భారత ప్రజలకు సమర్పించాలి. ఇది కాకి లెక్కలు కాని, దొంగ లెక్కలు లేని, కంటితుడుపులు చెయ్యని ప్రోగ్రెస్ రిపోర్ట్ అయివుండాలి. అప్పుడే నరేంద్ర మోడి నిజమైన దేశ సేవ చేసినట్టు అవుతుంది. లేదంటే శతకోటి లింగాల సామెత అవుతుంది.

@@@@

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh