The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 0
PoorBest 

నిన్న సాయంత్రం అలా నడుచుకొంటూ వెళుతుంటే ఒక వ్యక్తి వడివడిగా నన్ను దాటుకువెళ్ళాడు, సైకిల్ తోసుకొంటూ. మామూలు సైక్లిస్ట్ ఐతే ఈ వ్యాసం రాయడం జరిగేది కాదు. అతను ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతని సైకిల్ వెనుక భాగానికి ఒక బోర్డ్ వేళ్ళాడుతూ ఉండింది. దానిపై: 

సిగ్గులేని సినిమా నటులు
ఎగ్గులేని రాజకీయ నాయకులు
బుద్ధిలేని/రాని ప్రజలు
వెరసి రోగగ్రస్తమైన సమాజం

అని రాసి ఉంది. నాలో ఆసక్తి పెరిగింది. ధైర్యం చేసి అతన్ని ఆగమని అన్నాను. అతను ఆగాడు. హ్యాండిల్ నుండి మరో బోర్డ్ వేళ్ళాడుతోంది. ముందుకు వెళ్ళాను. అక్కడ

ఎయిడ్స్ ప్రాణాంతకమైన జబ్బు
అజ్ఞానమే దానికి మూల కారణం
కండోమ్ వాడండి

అని పెద్దటి ఎర్ర అక్షరాలతో రాసి ఉంది.

నిజానికి ఆ బోర్డ్ చూసి నాకేమీ గొప్ప ఆశ్చర్యం కలగలేదు. కానీ వెనక ఉన్న బోర్డ్ ను ఈ ముందు ఉన్న బోర్డనును కలిపి చదివినపుడు అతని ఉద్దేశ్యం చూచాయగా అర్థమైంది.

"థ్యాంక్సండి!" అని చెప్పి నేను ముందుకు వెళ్ళిపోయాను. అతను మళ్ళీ సైకిల్ తోసుకొంటూ నన్ను దాటుకు వెళ్ళిపోయాడు. అతని వివరాలను అడగాలని నాకు అనిపించలేదు. చెప్పాలన్న తాపత్రయం కూడా అతనిలో లేదేమో. అతని పర్సనల్ వివరాలకన్నా అతను చాటదలచుకొన్న విషయం గొప్పది.

సినిమా తారలు, రాజకీయ నాయకులు బాధ్యతలు తెలిసీ కూడా తెలియనట్టు ప్రవర్తించే విచిత్ర జీవులు. తాము ఏమి చేస్తే దాన్నేమూఢులైన ప్రజలు అనుకరిస్తారని వారికి తెలుసు. ఆ మూఢులే తమ పాప్యులారిటీకి మూల స్థంబాలని వారికి బాగా తెలుసు. ఆ మూఢులు ఏమాత్రం తెలివిని సంపాదించినా తమ పప్పులు ఉడకవనీ వారికి తెలుసు.

నా మాటలు కొద్దిగా వెటకారమనో, అర్థం లేని తనమనో అనిపించవచ్చు. కానీ కాస్త నా కోణం నుండి మీరూ చూడండి.

ఈమధ్య జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా చాలామంది సినిమా తారలు రాజకీయాల్లోకి వచ్చారు. కొందరు రిటైర్డ్ తారలు ఇప్పటికే వివిధ పదవుల్లో స్థిరపడి ఉన్నారు. ఇంకా ఎంతోమంది తమ మార్కెట్ వాల్యూ పడిపోయాక రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారు. తరచి చూస్తే వీళ్లందరూ వయసులో ఉన్నప్పుడు హీనమైన, నీచమైన సినిమాల్లోనూ పాత్రల్లోనూ నటించినవారే. అశ్లీలమైన, అసభ్యమైన ద్వంద్వార్థాలు, విపరీతార్థాలున్న సంభాషణలను నోరారా వల్లించినవారే. అప్పుడు లేని, రాని సామాజిక బాధ్యత రిటైర్ అయిన తరువాత వచ్చిందీ అంటే వారి మానసిక పరిణితిని తీవ్రంగా సందేహించాల్సిందే.

కండలు, జబ్బలు దిట్టంగా ఉన్ననాడు వాటిల్నే చూపించుకొని దిన భత్యం పుట్టించుకొన్న వాళ్లు ఈ తారలు(!). రోత పుట్టించే అంగాంగ విన్యాసాలతో, విచిత్రము, సత్యానికి దూరము ఐన టీనేజ్ ప్రేమల్ని ప్రదర్శించి యువకుల్ని, యువతుల్ని పెడత్రోవ పట్టించడమే కాకుండా వాళ్లను ఇహానికి, పరానికీ, ఐన వాళ్ళకీ కానీయకుండా చేసేది ఈ తారలు(!).

అర్ధనగ్న దుస్తులతోనే రోజు వెళ్ళబుచ్చిన ఒక హీరోయిన్ ఇప్పుడు ఒక పెద్ద పార్టీకి మహిళా శాఖ అధ్యక్షురాలు. డిమాండ్ ఉన్న రోజుల్లో హీరో ప్రేమ కోసమని కోడికూర, కల్లు సీసా పట్టుకొని కులికిన ఆమె సారా వ్యతిరేక ఉద్యమం లాంటి వాటి గురించి లెక్చర్లు ఇస్తుంటే నవ్వాలో ఏడ్వాలో తెలీని పరిస్థితి కలుగుతుంది.

ఈ సినీ జీవులకు ఇప్పుడు హఠాత్తుగా వచ్చిపడిన జ్ఞానం ఆరోజుల్లో ఎందుకు రాలేదు? సమాజానికి హాని చేసే పాత్రలను కానీ, చేష్టలను కానీ చేయనని వ్రతం పూని ఉండవచ్చు కదా!

మరో పెద్ద హీరో పార్టీ పెట్టడమూ రెండేళ్ళలో కొట్టు కట్టేయడము జరిగిపోయింది. తిట్టి పోసిన ఒక పార్టీలో కలిసిపోవడము జరిగింది. విచిత్రమేమంటే ఆ పెద్ద హీరో గారు తమ రాజకీయ ఆరంగేట్రంకు ముందస్తు తయారీగా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. పెద్ద పెద్ద బిరుదుల్ని సంపాదించారు. ఐతే ఆయన నటించిన సినిమాల్లో కూడా అశ్లీలం లేకుండా పోలేదు.

ప్రేమ అంటే కేవలం శరీరాకర్షణ అన్నదే స్థిరపరిచేసి ఇంకా చేస్తూనే ఉన్నారు సినిమావాళ్లు. వీరు చూపించే అశ్లీలతే జీవిత సత్యమని అనుకొని దారితప్పి ఇక్కట్లకు గురౌతున్నారు ప్రజలు.

ఇలా ప్రజల్ని దారి తప్పించే సినిమా తారలు నేడు మనకు దిశా నిర్దేశం చేయగలరా? చేస్తారా?

కోట్లను దిగమ్రింగే రాజకీయ నాయకుల గురించి పెద్ద పెద్ద పత్రికలు రోజూ పేజీల కొద్దీ రాస్తూనే ఉన్నాయి. వారి దగ్గర మూల్గుతున్న నల్ల డబ్బుతో ఎంతోమందికి ఆసరాను ఇవ్వవచ్చు. తమతమ పదవులను కాపాడుకొనే తహతహ తప్పించి ప్రజల గురించే కలవరించి తపించే నాయకుడు/నాయకురాలు ఒక్కరూ ఈ దేశంలో లేరు. తమ పుట్టినరోజుకు, మెట్టిన రోజుకు వీరు తయారు చేయించే బ్యానర్ల డబ్బును కూడబెట్టినా సరే డొక్కాడని ప్రజలకు ఒక పూట కడుపైనా నిండుతుది. ప్రజా సేవకులని చెప్పుకొంటూ చుట్టూ వందలమంది భద్రతా సిబ్బందిని, పరిచారకుల్ని, వంధిమాగధులను వెంటేసుకొని వ్యర్థం చేసే డబ్బులో ఒక్క శాతం పొదుపు చేసినా చాలు అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు వాళ్లు చేస్తున్న తప్పిదాల గురించి వివరించడానికి.

ఐతే కేవలం సినిమావారిని, రాజకీయ నాయకుల్ని విమర్శించి ప్రయోజనం లేదు. మాయ మాయేనని, సత్యం సత్యమేనని ప్రజలు గ్రహించగలగాలి. కాళ్లెప్పుడూ నేల మీదే ఉంటాయిగాని ఆకాశంలో కాదని తెలుసుకోవాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడ్డం చేతకాని తనమని గుర్తించాలి.

ఎయిడ్స్ మహమ్మారే. ఐతే అది శరీరాన్ని మాత్రమే చంపేస్తుంది. సినిమావాళ్లు, రాజకీయ నాయకులు ఎక్కిస్తున్న ఎయిడ్స్ వైరస్ మనసును చెడుపుతోంది. బ్రతికి ఉండగానే చంపేస్తోంది.

ఆ సైక్లిస్ట్ ఆవేదన ఇదేనని నా భావం. అవునో కాదో అతను మళ్లీ ఎదురుపడితే అడగాలి!

@@@@@

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh