User Rating:  / 4
PoorBest 

నల్లకోడైనా పెట్టేది తెల్ల గుడ్డే. కాంగ్రెస్ అయినా, భాజపా అయినే మనకు మిగిలిందీ పెద్ద గుడ్డే!

 

"నవ్యాంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర రాజధాని అమరావతికి తగినంత సహాయం చేస్తూనే ఉన్నాం. దానికి వార్షిక బడ్జెట్‌కు సంబంధం ఏమీ లేదు." కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో ఆంధ్ర ప్రస్తావన లేనందుకు నిరసన తెలుపుతున్న ఆంధ్రులకు సమాధానంగా ఒకానొక న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పిన మాటలు ఇవి. మరి గత వార్షిక బడ్జెట్‌లో విశాఖ మెట్రోకు అయిదు లక్షలు, పోలవరానికి వంద కోట్లు మాత్రమే కేటాయించినప్పుడు ఈ తెలివితేటలు ఎందుకు ప్రదర్శించలేదని ఎవరూ అడగలేదు!

 

కేంద్రం ఆంధ్రుల మీద సవతితల్లి ప్రేమ చూపిస్తున్నదనే మాట వాస్తవం. సాగితే బొంకు, సాగక పోతే రంకు అన్నట్లు, సాగినంత కాలం అరకొర సహాయాలతో సాగదీసుకున్న కేంద్రం, సాగదని తెలిసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని కారణంగా చూపించాలని ప్రయత్నిస్తున్నది. నేను తినను, మరొకరిని తిననివ్వను అని ప్రతి సభలోనూ పూనకంతో ప్రసంగించిన ప్రధాన మంత్రి, అవినీతి నిజమే అయితే, ఆ విషయంలో చర్యలు తీసుకోకుండా తాత్సారం ఎందుకు చేస్తున్నట్లు? ఇష్టమైన ప్రతిసారి 'మన్ కీ బాత్' అంటూ 125 కోట్ల ప్రజలతో మాట్లాడే పెద్ద మనిషికి, 5 కోట్ల ఆంధ్రులతో మాట్లాడే తీరిక లేకపోయిందా? వారికి ఈ అవినీతి వివరించే ఓపిక లేకపోయిందా. మిత్రధర్మం పాటిస్తున్న మాటైతే, సత్రకాయ్ సర్రాజులు, వడ్లగింజ వీర్రాజులతో రోజుకో ప్రకటన ఎందుకు చేయిస్తున్నది?

 

ఆ మాటకొస్తే, మధ్యప్రదేశ్‌లో స్వచ్చ భారత్ అభియాన్ కింద విడుదలైన నిధులలో దాదాపు 1500 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. విచారణ ఏమైనా జరిపించారా? సరే, ఇవి పనికిమాలిన ఆరోపణలే అనుకుందాం. నారదా కేసులో అడ్డంగా దొరికిపోయిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ముకుల్ రాయ్ భాజపాలో ఎలా చేరగలిగాడు? అస్సాంలోని గౌహతి నీటి కుంభకోణంలో ముఖ్య ఆరోపిగా భాజపా ప్రస్తావించిన హిమంతబిశ్వ శర్మ, ఆ వెంటనే భాజపాలో ఎలా చేరగలిగాడు? ఒక్క పైసా అటూ ఇటూ కాకుండానే, గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందా భాజపా? ఇవి కాక, ఆంధ్ర రాష్ట్ర పనితనాన్ని విమర్శించిన కాగ్ నివేదికలు ఇప్పుడు లీక్ చేయిస్తున్నారు. కాగ్ విమర్శించని ఒక్క రాష్ట్ర పనితనం చూపించగలరా?

 

నిజం చెప్పాలంటే, ఇవన్నీ గుజరాత్ మోడెల్ రాజకీయాలు. ఈ రాజకీయాల్లో ప్రభుత్వ పథకాలు విఫలం కావటానికి ప్రజలే కారణం అని చెప్పిస్తారు. అలా కుదరదనుకుంటే, ఆ పథకాల వల్ల తెలియని మరెన్నో ఉపయోగాలు కలిగాయని చెబుతారు. ఇదో అద్భుతమైన రాజకీయం. 2014 ఎన్నికల ప్రసంగాలలో మోడీ ఏమన్నాడు - ప్రజల్లోను, వాళ్ళ ఆలోచనా ధోరణిలోనూ మార్పులు రావాలని చెప్పాడు. అమాయకంగా మనమంతా ప్రభుత్వాన్ని మార్చేసాం. ప్రభుత్వాన్ని మార్చారు సరే, మీరు మారకపోతే నేనెలా పనిచేయగలను అని ఆనక తీరిగ్గా అంటున్నాడు ఈ పెద్దమనిషి. విఫలమైన ప్రతి పథకానికి కారణం మనలో మార్పు లేకపోవటం అని చూపిస్తాడు ఈయన.

 

ఉదాహరణకు స్వచ్చ భారత్ అభియాన్ - గాంధీ కళ్ళజోడు నుంచి అమితాబ్ బచ్చన్ వరకూ అందరినీ వాడుకున్నాడు మోడీ. మీకు ఒంటేలే కాదు, చెత్త కూడా పారేయటం చేతకాదు అని దేశమంతా మరుగుదొడ్లు, చెత్త బుట్టలు పెట్టించాడు. అవైనా, ఫొటోలు తీసే చోటే కనిపిస్తాయి కానీ, మనకు అవసరమైన చోట కనిపించవు, కానీ వేల కోట్లు మాత్రం ఖర్చైపోతాయి. ఇదేంటని అడిగితే, ముందు మీరు పరిశుద్ధంగా ఉండటం నేర్చుకోకపోతే ప్రభుత్వం మాత్రం ఏం చేయగలదనే ఈసడింపులు మొదలేస్తారు మోడీ భక్తులు.

 

మరో ఉదాహరణ చూద్దాం - పెద్ద నోట్ల రద్దు. ఉన్నట్లుండి ఓ రాత్రి ప్రజలనుద్దేశించి ఈయన ప్రసంగించాడు. మనలోనే కొందరు బ్లాక్ మనీ గాళ్ళు ఉన్నారు. మనలో మార్పు రావాలంటే, ముందు వీళ్ళ పీచం అణగదొక్కాలి, కాబట్టి మీకు ఇబ్బందైనా ఓ మూడు నెలలు ఓపిక పట్టండి అవినీతి తిమింగలాలు దొరికిపోతాయని ఒట్టేసాడు. మనకు ఆత్మగౌరవం ఉన్నా, అనుమాన పిశాచులం కదా, పక్కింటివాడిని కూడా అవినీతి బకాసురుడుగా అనుమానిస్తూ ఓ సంవత్సరం గడిపాం. ఆ తర్వాత తేలింది ఏమిటి, రద్దైన నోట్లలో, 95% పైగా రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వచ్చాయి. అంటే ఏమనుకోవాలి, దేశంలో 5% మాత్రమే నల్లధనం ఉన్నదనుకోవాలా?

 

గుజరాత్ మోడెల్ రాజకీయాలు, ఇక్కడితో కూడా తప్పు ఒప్పుకోవు. వెంటనే భాజపా సత్రకాయలందరూ దిగేసారు. పెద్దనోట్ల రద్దు వెనుక ప్రధాన కారణం, ప్రజలందరినీ పన్నుల వలలోకి లాగటం అని ఆర్ధిక మంత్రి అంటే, అంతేకాదు, దీనివల్ల వ్యభిచారం కూడా తగ్గించటం అని రవిశంకర ప్రసాద్ అంటాడు.

 

గుజరాత్ మోడెల్ రాజకీయాల గురించి స్థూలంగా చెప్పాలంటే, మోడీ చొరవతో రోడ్ల మీది పకోడీ బండ్ల వాళ్ళందరూ ఆనందంతో ఎలా ఉబ్బితబ్బిబై పోతున్నారో టముకు వేయాలి. ఆ పక్కనే, చెత్త బుట్ట లేదని అడిగితే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతిని ఎండగట్టాలి.

 

ఏదేమైనా, ఆంధ్రాలో నాలుగు ఓట్లు స్వంతంగా తెచ్చుకోలేని పార్టీ భాజపా. అరువు తెచ్చుకున్న ఓట్లతో కొన్ని సీట్లు గెలిచి, వాపు చూసి బలమని భ్రమిస్తున్న పార్టీ భాజపా. రాష్ట్రమంతా కాంగ్రెస్ వ్యతిరేక గాలులు వీస్తున్న సందర్భంలో, తనో ప్రత్యామ్నాయం కాగలనన్న భ్రమలతో తెదేపాతో సీట్ల సర్దుబాటు చేసుకొని సూదిలా వచ్చి దబ్బనమవ్వాలని ప్రయత్నిస్తున్న పార్టీ భాజపా. అడ్డదిడ్డంగా ఆంధ్రాను విభజించిన పాపంలో కాంగ్రెస్‌తో సరిసమానమైన పాత్ర పోషించిన పార్టీ భాజపా అనే విషయం ప్రజలు మరువరు.

 

అగ్నికి ఆజ్యం పోసినట్లు, 2014లో ప్రతి ఎన్నికల సభలో ప్రత్యేక ప్రతిపత్తి వాగ్దానం చేసి, గెలిచిన తర్వాత నీతీ ఆయోగ్ ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రతిపత్తి కుదరదంటూ కాల్చిన గుడ్డ ఆంధ్రుల మొహాన పడేసిన పెద్దమనిషి ఈ నరేంద్ర దామోదర్‌దాస్ మోడీనే. రాజధాని శంఖుస్థాపనకు గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు ఇచ్చి ఆంధ్రుల ఆత్మగౌరవం మీద ఉమ్మేసిన పెద్దమనిషి ఈ మోడీనే. ప్రత్యేక ప్రతిపత్తి లేకపోతే పోయింది, కనీసం ప్రత్యేక ప్యాకేజీ కైనా చట్టబద్ధత కల్పించారా అంటే, అదీ లేదు. ఇప్పుడు బడ్జెట్‌లో కూడా అనవసరం అంటున్నాడు జైట్లీ.

 

రాష్ట్రపరంగా చూస్తే, కాంగ్రెస్ కన్నా మరింత ప్రమాదకారి భాజపా. వచ్చే ఎన్నికలలో, ఈ రాష్ట్రంలో ఈ పార్టీతో పొత్తు పెట్టుకునే ఏ ఒక్క పార్టీనీ ఆంధ్రులు క్షమించరు. పార్లమెంటు సాక్షిగా అప్పటి ప్రధాని ఇచ్చిన అయిదు సంవత్సరాల ప్రత్యేక ప్రతిపత్తి ఆంధ్రుల హక్కు. హక్కుల కోసం చేసే పోరాటంలో ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టాల్సిన పని లేదు. దేబిరించాల్సిన అవసరం లేదు. సాగిలపడి మొక్కాల్సిన అవసరం అంతకన్నా లేదు.

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh