"ఎంత భాగస్వామ్యపక్షమైతే మాత్రం, అడిగిందల్లా ఇస్తామా?"- అరుణ్ జైట్లీ

రెండు మూడు రోజుల క్రితం, ప్రత్యేకహోదా గురించి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై పార్లమెంటు సాక్షిగా దేశ ఆర్ధిక మంత్రి ఇచ్చిన సమాధానం! అహంకారపూరితమైన అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలు విన్న తర్వాత " ఎవడు ఇస్తామని చెప్పాడు బే?"అని అడగాలని అనిపించింది! భాగస్వామ్య పక్షాలకు ఇవ్వరు. వైరి పక్షాలకు ఇవ్వరు. ఏం, భా.జ.పా. ఏలుబడిలోని రాష్ట్రాలకే దోచిపడతారా?

 

ఇకపైగా, ఆంధ్రాకు చేసిన చదివింపులుగా ఏవేవో కాకి లెక్కలు చెప్పాడీ పెద్దమనిషి. కాకి లెక్కలు అని అంత ఖచ్చితంగా ఎలా చెప్పొచ్చునంటే, ఆయన ప్రసంగంలో పోలవరం, వైజాగ్ మెట్రోలు కూడా ప్రస్తావించారు కాబట్టి. ఈ సంవత్సరపు బడ్జెట్‌లో పోలవరానికి నూరు కోట్లు, వైజాగ్ మెట్రోకు అక్షరాలా మూడు లక్షలు చదివించిన పెద్దమనుషులు అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రానికే ఏవేవో ఇచ్చినట్లు కహానీలు చెబుతున్నారు! బొంకర బొంకరా పోలిగా అంటే, టంగుటూరు మిరియాలు తాటికాయంత అన్నాడట! అలా ఉంది అరుణ్‌జైట్లీ వ్యవహారం!

 

ముందుగా కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. పార్లమెంటు తలుపులు మూసి, ప్రసార కార్యక్రమాలు నిలిపివేసి, సరైన చర్చ, ఓటింగు లేకుండానే తెలంగాణా ఏర్పాటయ్యిందనేది అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణా బిల్లు ప్రవేశ పెట్టేందుకు ముందుగా ప్రధానితో జరిగిన సమావేశంలో, విడిపోతున్న ఆంధ్ర రాష్ట్రానికి వనరుల లేమి కారణంగా  అయిదు సంవత్సరాల ప్రత్యేక ప్రతిపత్తికి మద్దతు తెలిపింది భా.జ.పా. ఈ విషయం, మొన్నటి పత్రికా విలేఖరుల సమావేశంలో చంద్రబాబుగారే చెప్పారు!

 

ఆంధ్ర ప్రజల గురించి మొసలి కన్నీళ్ళు కార్చిన కాంగ్రెస్ తెలంగాణా బిల్లులో ప్రత్యేక ప్రతిపత్తి ఊసే ఎత్తలేదు. అందుకు భా.జ.పా కూడా అప్పటి ప్రధానిని నిలదీసింది. భా.జ.పా., వెంకయ్య నాయుడు ద్వారా అదే పార్లమెంటులో అయిదు కాదు, పది సంవత్సరాల ప్రత్యేక ప్రతిపత్తి కావాలని కూడా మన్‌మోహన్‌సింగ్ ను డిమాండ్ చేసిన విషయం కూడా రికార్డయిన వాస్తవం. ఆ వెంటనే జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో తె.దే.పా.తో జతకట్టిన భా.జ.పా., ప్రతి ఎన్నికల సభలోనూ ప్రత్యేక ప్రతిపత్తిపై ప్రజలకు వాగ్దానం చేసిందనేది కూడా వాస్తవం.

 

ఆర్ధిక సంక్షోభంలో కూనారిల్లే కొత్త తెలుగు రాష్ట్రాన్ని కళ్ళల్లో పెట్టుకు చూస్తామని మోడీ, వెంకయ్యలతో సహా పలువురు నాయకులు ఇచ్చిన హామీలతో అంధులైన ఆంధ్ర ప్రజలకు ఇప్పుడు అద్దం చూపిస్తున్నారు భా.జ.పా. నాయకులు! అసలు లేవురా మగడా అంటే, పెసరపప్పుతో వండుకోమనే పెత్తందారు పోకడలతో ప్రజలను వంచిస్తున్నారు భా.జ.పా. నాయకులు. ఎన్నికల ఫలితాలలో భా.జ.పా.కు ఎటువంటి భాగస్వామ్య పక్షాల అవసరం లేకుండానే పూర్తి మెజారిటీ వచ్చేసరికి, ఓడ మల్లయ్యలందరూ బోడి మల్లయ్యలయ్యారు! హఠాత్తుగా అనాథైన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రానిది. ఆ బాధ్యత విస్మరించి కుంటిసాకులు చూపుతూ, అడుక్కున్నా ఇవ్వం అని ఖరాఖండీగా చెబితే, ప్రజలు ఎక్కడికి పోవాలి?

 

అవసరానికి ఆడుకొని, ఆనక అవతల పడేసే పిల్లతనపు బుద్ధులు భా.జ.పా.కు కొత్తకాదు. అంతే కాదు, సూదిలా వచ్చి దబ్బనమయ్యే తేడా వ్యవహారాలూ ఈ పార్టీకి కొత్త కాదు.  ఒక మాయావతి, మరో నితీష్, మరో పట్నాయక్, ఇప్పుడు థాక్రే, చంద్రబాబు, త్వరలో బాదల్సు! భా.జ.పా. వ్యవహారంతో బొప్పికట్టించుకున్న బడుద్ధాయిలను చూసి జాగ్రత్త పడింది జయలలిత, మమతలే! ఈ నేతల ఆసరాతో ఆయా రాష్ట్రాలలో బలం పెంచుకోటానికి చూసిన పార్టీ భా.జ.పా. వాపు చూసి బలమని భ్రమ పడటమూ ఆ పార్టీకి అలవాటే. ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనలతో ప్రత్యేక ప్రతిపత్తి విషయాన్ని తాత్సారం చేసి,  2019లో ఇచ్చి, పొత్తులేవీ లేకుండా ఎన్నికలలో నిలబడితే ఆంధ్ర ప్రజలు భా.జ.పా.ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదరించరనే విషయాన్ని అమిత్‌షాలు, అరుణ్‌జైట్లీలు అర్ధం చేసుకుంటే మంచిది. అన్నిచోట్లా ఆ పప్పులు ఉడకవని ఈ కొత్త రాజులకు తెలిసొచ్చే రోజులకి కాంగ్రెస్ మరోసారి దేశపు కళ్ళాలు చేబట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

 

ఇక మన బాబుగారి దగ్గరకు వద్దాం. పాపం ఈయన ఎన్నికల లెఖ్ఖలు తారుమారయ్యేటప్పటికి వాజ్‌పేయి హయాం నాటి తరహాలో చక్రం తిప్పలేకపోతున్నారు. కేంద్రంలో భాగస్వామిగా ఉంటే, చక్రం తిప్పలేకపోయినా, కనీసం మంచం ఉన్నంతలో కాళ్ళు చాపుకోవచ్చని భావించారు. కానీ, భా.జ.పా. పట్టి పట్టి పంగనామాలు పెట్టిన ప్రతిసారి గోడచాటుకెళ్ళి చెరుపుకోవాల్సి వస్తుందనుకోలేదు! గతంలో జయంత్‌సిన్‌హా అనే చిన్నపాటి కేంద్రమంత్రి, ప్రత్యేక ప్రతిపత్తి తెలంగాణా బిల్లులో లేదని, కాబట్టి ఇవ్వలేం అని అటూ ఇటూ కాకుండా పార్లమెంటులో గునుస్తూ చెప్పినప్పుడు, పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్లు, మన చంద్రబాబుగారు రెండు కళ్ళు మూసుకు కూర్చున్నారు. ఇప్పటి దెబ్బకు ఆ రెండు కళ్ళూ తెరుచుకున్నాయి. ఆగ్రహోదగ్రులయ్యారని వార్తలు కూడా వస్తున్నాయి. అందుకు అనుగుణంగానే, తెలుగు తమ్ముళ్ళు పార్లమెంటును స్తంభింపచేస్తున్నారని కూడా వార్తలు. చంద్రబాబుగారు మూడో కన్నెప్పుడు తెరుస్తారా అని తెలుగు ప్రజలు కాచుకు కూర్చున్నారు!

 

పాపం ఈయన మాత్రం ఏం చేయగలరు. కనీసం మనోళ్ళు మంత్రులైనా అయితే కొద్దో గొప్పో రాష్ట్రానికేదో ఒరిగిస్తామని కేంద్ర ప్రభుత్వంలో చేరారు. ప్రధాని, ఆర్ధిక, రైల్వే మంత్రుల సంగతి తర్వాత, అసలు కేంద్రంలో ఉన్న మన తెలుగుదేశం మంత్రులు రాష్ట్రానికి ఇంతవరకు ఏం చేసారు? గొప్ప పనులు చేసి ఉంటే చెప్పుకోవాలి కదా, మరి ఆ విషయాలేమీ చెప్పరేమిటి? మొన్నటి తీర్మానంపై జరిగిన చర్చలో, ఈ తెలుగుదేశం వీరులంతా మోడీని, వెంకయ్యని పొగడటమే పనిగా పెట్టుకున్నారు కానీ, ప్రజల ఆకాంక్షల గురించి ఏమాత్రం ఆవేశపడలేదు మరి. దీనిపై కూడా బాబుగారు నిప్పులు చెరిగారని వార్తలు. ఎప్పుడు చూసినా మండిపడ్డారనే వార్తలే కానీ, మోడీని ఒప్పిస్తున్న ప్రయత్నాలైతే కనబడటంలేదు. పెళ్ళికి పందిరేయమంటే, చావుకి పాడె కట్టినట్లు; అమరావతి శంఖుస్థాపనకు మోడీని పిలిస్తే, గుప్పెడు మట్టి చెంబెడు నీళ్ళతో సరిపెట్టాడా పెద్దమనిషి! ఇక అడిగేదేముంది బూడిద అనుకున్నారేమో మన ముఖ్యమంత్రి నాలుక తడారిపోయి, మాటలు తడబిడపడి ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే అడిగారు!! పార్లమెంటులో తమ్ముళ్ళు అడుక్కోలేదని ఇప్పుడు అదిలించటం, బెదిరించటం, ఆవేశపడటం దేనికి?

 

ఈ ప్యాకేజీ, ఆ పాక్యేజీ, ప్రత్యేక ప్యాకేజీ అన్న కల్లబొల్లి కబుర్లతో కళ్ళకు గంతలు కట్టినా, ప్రజలు అర్ధం చేసుకోలేని అరుణ్‌జైట్లీలు కాదు. ప్రత్యేక ప్రతిపత్తి వల్ల ఒనగూడేది ఏదీలేనప్పుడు, ఆ ప్రత్యేక ప్రతిపత్తి గురించి పార్లమెంటులోను, బయట ఎందుకు ప్రస్తావించారు? అప్పుడు చెప్పింది మోసమా, ఇప్పుడు చేస్తున్నది మోసమా అనేది భా.జ.పా. నాయకులు తేల్చుకోవాలి. కొత్తగా తెలుస్తున్న తెర వెనుకటి నిజాలతో, విభజన పాపం ఎవరిదనే ప్రశ్న ప్రజలు వేయటంలేదు. ఆ తిలా పాపంలో పిడికెడు పాత్రలు ఎవరెవరు పోషించిందీ ప్రజలకు కళ్ళకు కట్టినట్లు తెలుస్తూనే ఉన్నది. ఆ పాపం మొత్తాన్నీ కాంగ్రెస్ పద్దులో వ్రాసేసినా, తిరిగి ఆ కాంగ్రెస్సే నవ్యాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వగలదనే అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారనేది వాస్తవం. గతి లేనమ్మకు గంజే పానకం అన్నట్లు, కాంగ్రెస్ ముక్త భారత్‌కు  పిలుపునిచ్చిన ఈ అభినవ రాజాధిరాజులకు ముక్తకంఠంతో తోడు నిలిచిన ఈ ప్రజలే, ఆ కాంగ్రెసే దేశానికి అవసరమని భావించే రోజులు కూడా వచ్చే సూచనలు కనబడుతున్నాయి.

 

ఐతే, ప్రత్యేక ప్రతిపత్తి విషయం రాజకీయాల పరిధులు దాటి ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా మారుతున్నది. ఉద్యమంగా రూపుదిద్దుకోబోతున్నది. ఉద్యమించే ప్రజలకు రాజకీయపు రంగులద్దే కార్యక్రమాలను పక్కనపెట్టి, పార్టీల కతీతంగా నాయకులందరూ ప్రజలతో మమేకమవ్వాలని ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్షే ప్రజలను 2019 కి సన్నద్ధం కూడా చేస్తుంది. చెప్పుతో కొట్టినట్లు బుద్ధి కూడా చెప్పబోతోంది. నవ్యాంధ్ర సంపూర్ణాభివృద్ధికి పదేళ్ళు కాకపోతే, వందేళ్ళు వేచిచూద్దాం. అంతేకానీ, హక్కుగా లభించాల్సిన వాటికోసం అడుక్కొని దేబిరించాల్సిన అగత్యం తెలుగు ఆత్మగౌరవానికి, పౌరుషానికి ప్రతీక అయిన ఎన్.టి.ఆర్. సాక్షిగా మనకేమాత్రం లేదు అని గ్రహిద్దాం. పార్లమెంటు చర్చలో పాల్గొన్న 11 పార్టీలు ప్రత్యేక ప్రతిపత్తికి తమ మద్దతు తెలిపాయి. రాష్ట్రంలోని ఇతర పార్టీలు ఈ విషయంలో ప్రజల పక్షానే ఉన్నాయి. ఇక, తెలుగుదేశం తానేం చేయాలనేది తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. భా.జ.పా.తో తెగతెంపులు చేసుకొని ఉద్యమానికి ఊపిరిలు ఊదటమా లేక భా.జ.పా. నేతృత్వానికి సాగిలబడి ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టటమా? తాడో పేడో తేల్చేయాల్సింది తెలుగుదేశమే!