The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 3
PoorBest 

అంతా మనవాళ్ళే కానీ, అన్నం పెట్టేవాళ్ళే లేరు! అయ్యా, స్థూలంగా ఇది ఆంధ్ర పరిస్థితి. అసలు ఆంధ్ర రాష్ట్ర విభజనే చాలా వింతగా జరిగింది. విడిపోయిన రాష్ట్రానికి సహజంగా ఇబ్బందులు ఎదురౌతాయి. కానీ ఇక్కడి పరిస్థితి వేరు. పాత రాజధానితో కొత్త రాష్ట్రం పేరుతో తెలంగాణా చాలా త్వరగానే కోలుకుంది. పాత రాష్ట్రం పేరుతో కొత్త రాజధాని కోసం ఆంధ్రా  ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉంది. సచివాలయం లేదు, శాసనసభ లేదు, మంత్రులకు, అధికారులకు ఇంకా నివాసాలే ఏర్పాటు కాలేదు. ప్రభుత్వోద్యోగులు ఇంకా ఆంధ్రకు బదిలీ కాలేదు. పరిపాలన ఎక్కడి నుంచి జరుగుతుందో కూడా తెలియటంలేదు. అంతా అస్తవ్యస్తంగా తయారయ్యింది.

 

రాష్ట్ర విభజన, అలా విభజింపబడిన కొత్త రాష్ట్రాలకు ఎన్నికలు, దరిమిలా ప్రభుత్వాలు కొన్ని నెలల తేడాతో జరిగిపోయాయి. తెలంగాణా సాధించిన మొనగాడిగా కె.సి.ఆర్.ను తెలంగాణా ప్రజలు అందలం ఎక్కించటమే కాకుండా, తెలుగుదేశం, కాంగ్రెస్‌సహా అన్ని పార్టీలను మట్టి కరిపించారు. దాదాపు అదే స్థాయిలో ఆంధ్ర ప్రజలు రాష్ట్ర విభజనను నిరసిస్తున్నట్లుగా కాంగ్రెస్‌కు పాతరవేసి, అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు మంచి మెజారిటీ ఇచ్చారు.

 

రాష్ట్రం పేరు కొత్తదైనా, తెలంగాణాకు మొదటి నుంచి రాజధానితో సహా కావలసిన అన్ని వనరులు ఉన్నాయి. శాసనసభ, సచివాలయం, పరిశ్రమలు, అంతా రెడీమేడ్‌గా లభించాయి. కాబట్టి, పాత సమస్యలతో, కొత్త ప్రణాళికలతో ముందుకు దూసుకువెళ్ళటానికి కె.సి.ఆర్. అంతగా శ్రమించాల్సిన అవసరం లేకపోయింది. కానీ ఆంధ్ర పరిస్థితి వేరు. సంయుక్త రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వాలన్నీ, రాజధానిగా ఉన్న హైద్రాబాదు సమీపంలోనే ఎక్కువగా పరిశ్రమలు నెలకొల్పాయి. రాయలసీమ, కోస్తాలలో పరిశ్రమలు అంతంత మాత్రమే. పరిపాలన కేంద్రీకరించటానికి కొత్తరాజధాని అవసరం. గత రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రితోపాటుగా మంత్రులే హైద్రాబాదు వదిలి రావటానికి ఉత్సాహం చూపించకపోతుంటే, అధికారుల విషయం చెప్పేదేముంది? కొత్తరాజధాని నిర్మాణానికి నిధులు లేవు. గత రెండు సంవత్సరాలుగా లోటు బడ్జెట్. పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోతున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ప్రకటించమని కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడాల్సి వస్తున్నది. సంయుక్తరాష్ట్రంలో కోస్తా రాయలసీమలను చిన్నచూపు చూసినందుకు తగిన ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాల్సి వస్తున్నది. క్షణం తీరిక లేకుండా, దమ్మిడీ ఆదాయం లేకుండా నిప్పుల మీద నడుస్తున్న పరిస్థితి చంద్రబాబుది.

 

ఊహలు ఊళ్ళు ఏలుతుంటే, ఖర్మం కట్టెలు మోస్తుందన్నట్లుంది పరిస్థితి. దీనికి చంద్రబాబే జవాబుదారీ. మనం స్థిరపడటానికి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ముందుగా ఆ ఊరికెళ్ళి, ఓ అద్దె ఇల్లు తీసుకొని స్థిరపడే మార్గాలు చూస్తామా? లేక, ఆ ఊళ్ళోనే మరో ఇల్లు కట్టుకునే దాకా తాత్సారం చేస్తామా? ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేయాలనే మీమాంస నుంచి నిన్న మొన్నటి అమరావతి శంకుస్థాపన దాకా పరిపాలన హైద్రాబాదు నుండే కొనసాగింది. నోటుకు వోటు వ్యవహారంలో ఫోను ట్యాపింగు అవుతున్నదన్న విషయం తెలిసిన తర్వాత మాత్రమే కొద్దోగొప్పో ఇక్కడి నుంచి పరిపాలన మొదలయ్యింది. కనీసం ఉద్యోగులకు అవసరమైన కార్యాలయాల నిర్మాణం కూడా మొదలే కాలేదు! అందరికీ లక్ష్యాలు నిర్దేశించే బాబుగారికి దిశానిర్దేశం చేయగలిగే ధైర్యం ఎవరికి ఉంటుంది! ఆ నిర్లక్ష్యం ఫలితమే శంఖుస్థాపనలు తప్పించి అమరావతికి పురోగతి కనిపించటంలేదు.

 

ఇక, విభజనలో అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి విషయం గురించి మాట్లాడుకుంటే, కాంగ్రెస్ నుంచి భా.జ.పా. దాకా అన్నీ మోసం చేసిన పార్టీలే. విభజన చట్టం రూపొందించిన యు.పి.ఎ. ప్రభుత్వం ఆ చట్టంలో ప్రత్యేక ప్రతిపత్తి ఊసే ఎత్తలేదు. ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చిన మోడీ లాంటి భా.జ.పా. అగ్రనేతలందరూ ప్రత్యేక ప్రతిపత్తి విషయంలో సానుకూలంగా ఉన్నామనే సందేశాలు ప్రచారం చేసారు. అక్కర ఉన్నంతకాలం ఆదినారాయణులుగా ఆంధ్రులని మోసిన భా.జ.పా., ఇప్పుడు గూడనారాయణులంటూ ఆంధ్రులని దూరం పెట్టేస్తున్నది.

 

మునుపటి బడ్జెట్‌లో కూడా ఆంధ్రాకు మొండి చేయే చూపించారు. మొదటిసారిగా, పూర్తిస్థాయిలో భా.జ.పా. రూపొందించిన ఆ బడ్జెట్‌కు ఆంధ్రులు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినా, ఇప్పటి బడ్జెట్‌లో కూడా అన్యాయమే జరిగింది. ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి, రైతులకు ప్రాధాన్యత కల్పించామని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఇచ్చింది వంద కోట్లే! ఏ రంగానికి సంబంధించిన కేటాయింపులు చూసినా అదే పరిస్థితి. విశాఖపట్నం మెట్రోకు అక్షరాలా మూడు లక్షలు చదివించి పండగ చేసుకోమంటున్నది మోడీ ప్రభుత్వం!  కేంద్ర మంత్రులుగా ఉన్న తె.దే.పా. నాయకులైనా మోడీ భజనలోనే మునిగితేలుతున్నట్లున్నారు కానీ, బడ్జెట్‌లో ఆంధ్రకు జరిగిన ద్రోహం గురించి మాట్లాడటంలేదు. కనీసం, వారివారి శాఖలకు సంబంధించి రాష్ట్రానికి ఏమి చేసారో, చేస్తున్నారో కూడా ఎవరికీ తెలియటంలేదు.

 

అయిపోయిన పెళ్ళికి మేళం అన్నట్లు, బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని చంద్రబాబు ఒక నిట్టూర్పుతో సరిపెట్టారు. కొబ్బరికాయ కొట్టించటానికో, గుమ్మడికాయతో దిష్టి తీయించటానికో నెలకోసారి భా.జ.పా. మంత్రులని ఆంధ్రాకి పిలవటం, వాళ్ళేదో చేస్తామని చెవిలో చెప్పారని ప్రజలను ఊదరగొట్టేయట తప్పించి ఇంతవరకు అధికారికంగా ఆంధ్రాకు ఏమి ఇస్తారనే విషయంలో స్పష్టత మాత్రం ఎవరూ ఇవ్వటంలేదు. ఇంకా దౌర్భాగ్యం ఏమిటంటే, మునుపు ఉద్యమించిన ఓ సినీ నటుడిని, ఓ ప్రతిపక్ష నేతను చావగొట్టి చెవులు మూసినంత పని చేసిందీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం! నిజంగా రాష్ట్ర శ్రేయస్సును కోరుకునే పార్టీనే అయితే, తెలుగుదేశం వెంటనే కేంద్రం నుంచి వైదొలగాలి.

 

అయ్యా ఏతావాతా అమరావతి శంఖుస్థాపన కోసం మోడీ గారు ఇచ్చి వెళ్ళిన గుప్పెడు మట్టి, చెంబెడు నీళ్ళే ఆంధ్రాకి ప్రాప్తం. మన హక్కులు మనం సాధించుకోటానికి దేబిరించాల్సిన దౌర్బల్యం, దొడ్డిదారులు వెదకాల్సిన దౌర్భాగ్యం దేనికి? కాబట్టి, ఉద్యమిద్దామా, ఉస్సూరు మని కూర్చుందామో మన ఇష్టం.

 

Pictures Courtesy : Google

Comments   

 
+2 #1 గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్ళు IVNS 2016-03-03 13:10
కొన్ని ముఖ్య ప్రశ్నలు తెలుగు జాతి గా మనకు
అన్ని కోట్ల విలువైన రాజధాని వెంటనే కావాలా ?
పరిపాలన లో IT వాడకం ద్వారా ఇంకా సులభం చేసికోలేమా ?
మన సత్తా ఏమిటో మనం తెలుపలేమా
ఒక విధం గా మన ఆత్మగౌరవం నిరూపించు కోవడానికి ఇది అవకాశం కాదా ?
మనం ఒకరు వేసే బిక్ష కై ఎందుకు ఆధార పడాలి ?
చట్టపరం గా రాజ్యాంగ పరం గా మనకు రావలసింది రాబట్టుకోవాలి అంతే.
మెట్రో ల అవసరం నిజం గా లేదు చక్కటి రోడ్లు ఎక్కువ ఫ్లై ఓవర్ లు ఉంటె చాలు. నిజానికి హైదరాబాద్ కు కూడా మెట్రో అనవసరం అని మెట్రో ఎక్స్పర్ట్ శ్రీధరన్ ఎప్పుడో చెప్పాడు

విభజన చేసిన ముఠా లో ఉన్న దొంగ భాజపా. అది మనకు మేలు చేస్తుంది అనుకోవడం శుద్ధ తప్పు.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh