The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 5
PoorBest 

 


మొత్తానికి ఓటమికి కారణాలు వెత్తుకోవటంలోనూ, దానికి ఎవరెవరినో బాధ్యులను చేస్తూ సాగుతున్న భా.జ.పా. నేతల, మద్దతుదారుల ప్రసంగాలతో సోషల్ మీడియా మోగిపోతున్నది. 
ఆత్మావలోకనం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నట్లయితే మాత్రం కనిపించటం లేదు. ఆడలేక మద్దెల ఓడన్నట్లున్న ఈ కారణాలు కొన్ని పరిశీలిద్దాం :

భా.జ.పా. కు వ్యతిరేకంగా మీడియా చాలా ప్రచారం చేసిందట! జాతీయ టీ.వీ. మీడియాలో ఎన్.డి.టీవి, ఆజ్ తక్, ఎ.బి.పి., ఇవన్నీ కాంగ్రెస్ / వామపక్ష పార్టీల మద్దతుదారులన్నది అందరికీ తెలిసిందే. కానీ, జీ టీవి, ఇండియా టీవి చాలావరకూ భా.జ.పా.కు అనుకూలంగానే వార్తలు ప్రసారం చేసాయనేది వాస్తవం. ఆ మాటకొస్తే, అసలు మీడియా మొత్తం మోడీకి వ్యతిరేకంగా ఉన్నదనుకున్నా, గత పదమూడేళ్ళలో మోడీ గుజరాత్‌లో మూడుసార్లు, మొన్నటికి మొన్న 2014 సార్వత్రిక ఎన్నికల్లోనూ గెలిచినవాడే కదా. ప్రజలు మీడియా ప్రచారానికి మోసపోతున్నారనుకుంటే రాజస్థాన్, గోవా, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్‌లలో  భా.జ.పా.ను గెలిపించేవారేనా? కాబట్టి మీడియా వ్యతిరేక ప్రచారం అనేది ఉత్తిమాటే.

ఇక, ఆర్జేడి, జెడి పార్టీలు సామాజిక స్థితిగతుల ఆధారంగా ప్రజలను విభజించాయట. అసలు విషయంలో కొసరు విషయం మర్చిపోయినట్లున్నారు. ఏడాది పొడుగూ అలికిడి లేకుండా తిరిగే ఆరెస్సెస్ నాయకులు, ఒక్కమాటుగా బీహార్ ఎన్నికల ముందురోజే రిజర్వేషన్ విషయాలు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది. రిజర్వేషన్ విధానాన్ని సమీక్షించాలన్న ఆరెస్సెస్ నాయకుల ప్రతిపాదనలో ఎటువంటి తప్పూ లేదు. మోహన్ భాగవత్ చేసిన ఈ ప్రకటన పేనుకు పెత్తనమిచ్చింది. ఆ పేనే లాలూ యాదవ్. ఈ ప్రకటన అవకాశంగా తీసుకొని ఈ ఎన్నికలను అగ్రవర్ణాల, వెనుకబడ్డ వర్గాల పోరాటంగా మార్చేసాడు లాలూ యాదవ్!

కుల సమీకరణాల ఎన్నికల పోరాటానికి ఊతమిచ్చింది ఆరెస్సెస్ ప్రకటన కాదని ఎవరైనా అనగలరా? వృద్ధ నేతలంటూ అద్వానీ, జోషి తదితర నాయకులను భా.జ.పా. చేత పక్కన పెట్టేయించింది ఆరెస్సేస్సే అనే విషయంలో ఎవరికీ అనుమానాలు లేవు. అది తప్పు కాదు, అవసరం కూడా. మరి ఆ ఆరెస్సెస్ తన సంస్థను ఆవిధంగా ఎందుకు ప్రక్షాళించుకోవటంలేదు. భా.జ.పా.లోని వృద్ధ నేతలు సంయమనంతో వ్యవహరించటంలేదని, అడ్డగోలు వ్యాఖ్యలతో అదుపు తప్పుతున్నారని విమర్శించే ఆరెస్సెస్, తను చేస్తున్నదేమిటో మాత్రం తెలియకుండానే ఉందా?

దాద్రీ ఘటనను ప్రతిపక్షాలు మతకోణంలో మసిపూసి భా.జ.పా.ను ఇరికించాయట. సరే, ప్రతిపక్షాలన్నీ దుర్మార్గంగా ఆలోచించాయి. ముస్లీముల ఓట్ల కోసం ఈ విషయాన్ని భూతద్దంలో చూపించాయి. తప్పే. మరి ప్రభుత్వ పక్షం ఏం చేసింది? హిందువులను రెచ్చగొట్టేలా, ఆవులను చంపిన వాళ్ళ తలలు తెగకోస్తామని కొందరు నేతలు వేసిన వెర్రి కేకలు పరిస్థితులను నియంత్రించ గలిగాయా? హిందువుల ఓట్లను కొల్లగొట్టాలని చేసిన ప్రయత్నంగా ఇది కనిపించటంలేదా? రాజకీయానికి రాజకీయంతో బదులు చెప్పే తెలివితేటలు భా.జ.పా.లో లేకపోయాయా!

మరో విచిత్ర కారణం ఓ పి.ఆర్. ఏజెన్సీ అట! మునుపు 2014 సార్వత్రిక ఎన్నికలలో భా.జ.పా.తో కాంట్రాక్టు ఉన్న ఓ ఏజెన్సీ ఈసారి జే.డీ. తో అంటకాగిందట. భా.జ.పా. ఆసుపాసులన్నీ తెలుసుకున్న ఆ ఏజెన్సీ బీహారులొ జే.డీ.తో కలిసి భా.జ.పా.తో ఓ ఆట ఆడుకుందట. పి.ఆర్. ఏజెన్సీల ప్రతిభతో ప్రభుత్వాలు ఏర్పడతాయనుకుంటే సోనియా, రాహుల్ గాంధీలు ఏనాడో ప్రధానులయ్యేవారు. ఆత్మావలోకనం చేసుకోలేని అసమర్ధతను, నిజాలని నిజాలుగా గౌరవించలేని అశక్తతను సూచించే ఈ ఆలోచనలన్నీ ప్రజా తీర్పును అవమానించటమే.

ఒక్క అవినీతి గురించి మోడీ సహా ఇతర భా.జ.పా. నాయకుల ప్రసంగాలు గుర్తుకు చేసుకుంటే, ఆయా అవినీతి కేసుల్లో ఈ ప్రభుత్వం ఏం సాధించిందనేది బట్టబయలౌతుంది. సార్వత్రిక ఎన్నికల వేళ అల్లుడుగారి అవినీతిపై మాటల తూటాలు పేల్చిన మోడీ, ప్రధాని అయిన ఒకటిన్నర సంవత్సరం దాటినా అల్లుడిగారిని అంటుకోలేకపోయారు. కారణం ఏమిటి? ఎన్నికల వేళ, నల్ల ధనం వెనక్కి వస్తే, సగటున ప్రతి పౌరుడి మీద 15 లక్షల రూపాయలు కూడబెట్టొచ్చన్న ప్రధాని ఆ దిశగా కనీసం పదిహేను రూపాయలు కూడా కూడబెట్టలేకపోవటానికి కారణం ఏమిటి? కొన్ని మీడియా సంస్థలు హవాలా దారుల్లో కోట్ల డబ్బు సరిహద్దులు దాటిస్తున్నాయన్న భా.జ.పా. నేతలు అటువంటి అవినీతి లావాదేవీలు నియంత్రించటానికి ఇంతవరకు ఏ ప్రయత్నమూ ఎందుకు చేయటంలేదు? నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలను కాపాడాలని ఎందుకు ప్రయత్నిస్తున్నదీ ప్రభుత్వం? అంటే ఎన్నికల రోజున, ప్రజలను మభ్య పెట్టటానికి చేసిన ఆరోపణలేనా ఇవన్నీ?

ప్రధాని అయిన తర్వాత శ్రీవారు ఆచార్యత్వం తీసుకున్నట్లు కనిపిస్తున్నది. ఎప్పుడు చూసినా విన్నా, అందరికీ నీతులు చెప్పటమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, ఎగువతరగతి ప్రజలు దిగువ తరగతి ప్రజల కోసం తమ గ్యాస్ సబ్సిడీలు వదులుకోవాలని, వీళ్ళు అలా పనిచేయాలని, వాళ్ళు అలా ప్రవర్తించాలని ప్రధాని చేస్తున్న ప్రవచనాలకు ప్రజలు విసిగి పోయారు. ప్రధానిగా ఆయన పనితనం ఇప్పుడు ప్రశ్నార్ధకం అవుతున్నది.

ఆశయాలు మంచివే అయినా, ఆర్భాటాల కారణంగా గందరగోళం నెలకొని ఉంది. మంత్రుల మధ్య సయోధ్య లేదు. సంస్థలతో సఖ్యత లేదు. కొందరు నేతల నోళ్ళకు అదుపు లేదు. అంటే ఆరడి, అనకపోతే అలుసన్నట్లుంది భా.జ.పా.లో పరిస్థితి. అస్మదీయులను అటకెక్కించి, తస్మదీయులను తలపై మోస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు వేసిన ఓడ మల్లయ్యలందరినీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బోడి మల్లయ్యలు చేసింది భా.జ.పా. ఏదేమైనా, మాటలతో దాదాపు రెండేళ్ళు గడచిపోయాయి. మిగిలిన మూడేళ్ళలో చేతలతో చూపిస్తేనే ప్రజలు మరో అవకాశం ఇస్తారు. లేదంటే ఏ శిఖరాగ్రాలకు భా.జ.పా.ను చేరవేశారో, అధ:పాతాళానికి దిగజార్చిన ఘనతను కూడా మోడీ మూట కట్టుకునే ప్రమాదం కనుచూపుమేరలో పొంచి ఉన్నదని కూడా గ్రహించాలి.

 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh