The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 3
PoorBest 

మేథావులుగా చలామణీ అవుతున్న నానారకాల రచయితలు, దేశం చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందని కింద మీదైపోతున్నారు. నేను సైతం ప్రపంచాగ్నికి సమిథనొక్కటి ఆహుతిచ్చానన్నట్లు నానా గడ్డీ తిని, అడ్డమైన ప్రతి అడ్డగాడిద కాళ్ళు పట్టుకొని సంపాదించుకున్న రకరకాల అవార్డులన్నిటినీ ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తున్నారు. గాడిదని చూసి ఓండ్రపెట్టాలనుకునే పంచతంత్రపు కుక్కల్లాగా, ''మేధావులు ఇన్ మేకింగ్'' లాంటి మరికొందరు అర్భకులు చదివిన డిగ్రీలు కూడా తీసుకోమని చెప్పి మొరాయిస్తున్నారుట!! అసలు ఏమిటయ్యా వీళ్ళ బాధ అని అడిగితే, కర్ణాటకలో ఓ రచయితని ఎవరో క్రిమినల్సు చంపేసారు, ఉత్తరప్రదేశ్‌లో గోమాంసం తిన్నాడని మరికొందరు క్రిమినల్సు ఒక ముస్లీముని చంపేసారు. అయినా ప్రధానిగా నరేంద్ర మోడీ ఈ విషయాల మీద నోరు విప్పలేదని వీరంతా ఆవేశపడిపోతున్నారట! వీటన్నిటికీ తోడు, మోడీ ప్రధాని అయిన తర్వాత దేశంలో రచయితలకు భావప్రకటనా స్వేచ్ఛ ఇప్పటికిప్పుడు తగ్గిపోయిందిట! ప్రభుత్వ విధానాలన్నిటినీ ఎడాపెడా కాషాయీకరణ చేసేస్తూ, వీళ్ళ హక్కులన్నిటినీ మోడీ కాల రాచి పారేస్తున్నాడట!!

ఈ ఆమాంబాపతు రచయితల్లో దాదాపు 90 శాతం మంది పైన చెప్పినట్లు నానా గడ్డి కరచి అవార్డులు గెల్చుకున్నవాళ్ళే. అంతేకాక, వీళ్ళలో దాదాపు అందరూ సామ్యవాదమని, సామాజికవాదమని, ప్రజాస్వామ్యమనీ, పౌరహక్కులని, విప్లవాలనీ, సమసమాజమనీ ఆవులిస్తూ, ఓండ్రపెడుతూ కాంగ్రెస్ మూతులు నాకినవాళ్ళే. దేశంలో ఎవరు ఎవరిని ఎందుకు ఎలా చంపినా తప్పే. అది ఖండించితీరాల్సిన విషయమే. కానీ, వీళ్ళ కళ్ళకి 2002 గుజరాత్‌లో జరిగిన మారణహోమం కనిపించినంత భయంకరంగా, కాశ్మీరీ పండితుల ఊచకోత కనిపించదు. దాద్రీలో చంపబడ్డ ఒక్క ముస్లీము కనిపించినట్లుగా 1984లో దమనకాండకు గురైన సిక్కులు కనిపించరు.

భావప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందంటున్న వీళ్ళల్లో ప్రతిఒక్కరూ దేశంలోని మెజారిటీ ప్రజల మనోభావాలు గాయపరిచినవాళ్ళే! యు.ఆర్. అనంతమూర్తి దేవుడి చిత్రపటం మీద ఉచ్చపోసానని వ్రాయటం భావప్రకటనా స్వేచ్ఛ! అది తప్పని ఆయన్ని విమర్శించి, ప్రదర్శనలు చేస్తే ఆయన భావప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో పడినట్లు! వాడెవడో డెన్మార్కులో ఓ దిక్కుమాలిన కార్టూను వేస్తే, వాడు ఓ మతంవారి ఓర్పును పరీక్షిస్తున్నట్లు. అదే తలకుమాసిన హుస్సేనో బుస్సేనో హిందు దేవతలను నగ్నంగా చిత్రిస్తే అది భావప్రకటనా స్వేచ్ఛ! వాడికి పద్మ అవార్డులు కూడా!! దేశాన్ని వదిలి, చట్టాన్ని ధిక్కరించి పారిపోయి కతార్‌లో చచ్చిన వాడిని మాత్రం ఇప్పటికీ బాధితుడిగానే పేర్కొంటారు. దేశంలోని చట్టాల ప్రకారం వాడి మీద కేసులు వేసిన వారిని హిందూ తీవ్రవాదులుగా పరిగణిస్తారు! అడిగేవాడు లేక వీళ్ళ పైత్యం ఎంతవరకూ ముదిరిందంటే, హిందువులు తరతరాలుగా చేసుకునే దీపావళిని టపాసులు లేకుండా చేసుకోమని సలహాలిస్తారు. రంగుల పండగ హోళీని రంగుల్లేకుండా చేసుకోమని సలహాలిస్తారు. ఈ పండగలవల్ల వాతావరణం కలుషితమౌతుందిట. అదే, కొవ్వొత్తులు కేకులు లేని క్రిస్మస్ చేసుకోమనో, రక్తం పారని బక్రీద్ చేసుకోమనో ఇతరులకు సలహాలివ్వగలరా?? ఇటువంటి వాగుళ్ళని ఎవరైనా ప్రతిఘటిస్తే, వాళ్ళని కాషాయ తీవ్రవాదులుగా ముద్ర వేస్తారు.

అవార్డులు తిరిగి ఇచ్చేసిన కొందరి హిపోక్రసీ చూడండి. ముహవ్వర్ రాణాకు డిసెంబరు, 2014లో సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది. అది తిరిగి ఇవ్వటానికి ఈయన దాదాపు సంవత్సరంపాటు ఎందుకు ఆగాల్సివచ్చింది? డిసెంబరులో ఆ అవార్డు వచ్చింది మోడీ పాలనలో ఉన్నప్పుడేగా!! కాశీనాథ్‌సింగ్ అనే ఆయన లక్ష రూపాయల బహుమతి మొత్తంతో అందిన సాహిత్య అకాడమీ అవార్డు తిప్పి ఇచ్చేసాడు కానీ, అయిదు లక్షల రూపాయల పారితోషికంతో అందిన యు.పి. హిందీ సంస్థాన్ అవార్డును మాత్రం తిప్పి ఇవ్వలేదు. ఇక నయనతార సెహగల్ - 1986లో సాహిత్య అకాడమీ అవార్డు స్వీకరించింది. 1984లో ఢిల్లీలో సిక్కుల ఊచకోత ఆ అవార్డు తీసుకోటానికి అడ్డం రాలేదు కానీ ఒక ముస్లీము హత్య మాత్రం ఆ అవార్డు తిప్పి ఇవ్వటానికి ఉపయోగపడింది! ఇదేదో అల్పసంఖ్యాకులైన ముస్లీముల మీది ప్రేమ అనో, మానవీయ కోణమో అని మురిసిపోవద్దు. ఎందుకంటే, అటువంటి విలువలు లేశమాత్రమైనా ఉన్నట్లయితే, ఆ అవార్డే తీసుకునేది కాదు ఈవిడ దాదాపు అరవై సంవత్సరాల పైబడ్డ కాంగ్రెస్ పాలనలో దేశం స్వర్గధామమేం కాలేదు, ఈరోజు మోడీ వచ్చి నరకం చేసాడనటానికి. ప్రజలు సుఖసంతోషాలతో ఏం వర్ధిల్లటంలేదు, మోడీ రాకతో ప్రజల జీవనం దుర్భరమయ్యిందనటానికి. నిజానికి, ఈ అరవై ఏళ్ళ పైబడ్డ కాంగ్రెస్ పాలనను తిరిగి గాడిలో పెట్టాలంటే, ఓ శతాబ్దమైనా పట్టవచ్చు. ప్రజలకి ఆ విషయం కూడా తెలుసు. కాబట్టే, మొదటి అడుగు వేసి, ఓ కాంగ్రెసేతర పార్టీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టి పట్టమెక్కించారు. అంతేకాదు, ఏ కాంగ్రెస్ అయితే దేశాన్ని, ప్రజలను పరిపాలించటం జన్మసిద్ధ అధికారంగా భావించిందో ఆ కాంగ్రెస్‌ను నిలువునా పాతరేసింది ఈ ప్రజలే. అవసరమనుకుంటే, మోడీకి కూడా గుణపాఠం చెప్పటానికి సందేహించరు ఈ సామాన్య ప్రజలు. అలా ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని ఇటువంటి బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలతో నియంత్రించాలని చూడటం ప్రజల తీర్పును ఎద్దేవా చేయటమే. ఏదేమైనా, నియంత్రిత వార్తలతో ప్రజల కళ్ళకు గంతలు కట్టిన పాత రోజులు, పాత రాజకీయాలకు కాలం చెల్లింది. సోషల్ మీడియా ప్రధాన సమాచార మాధ్యమంగా మారిన ఈ రోజుల్లో ప్రజలను ఏమార్చటం ఎవరికీ సాధ్యం కాదు. ఎంత రచయితలైనా, ఈ గురివిందలకైనా సరే... ప్రజలను ఏమార్చటం అసాధ్యం.

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh