The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 6
PoorBest 

“A man who has never gone to school may steal a freight car; but if he has a university education, he may steal the whole railroad.”- Theodore Roosevelt

 

కేవలం ఇంగ్లీషు మాట్లాడటం మాత్రమే చదువుకున్న ఓ ఇటాలియన్ మహిళ మరో దేశాన్ని దాదాపు పది సంవత్సరాలపాటు నిర్భయంగా అవినీతితో దోచుకోగలదని 26వ అమెరికా రాష్ట్రపతి రూజ్‌వెల్ట్ ఊహించికూడా ఉండకపోవచ్చు! ఏదేమైనా, చదువుకుని సంపాదించిన డిగ్రీలకు, తేరగా సంపాదించాలనుకునే అవినీతి ఆశలకు ఏమాత్రమూ సంబంధం లేదని, ఉండదనీ భారతీయులకు తెలిసినంతగా మరొకరికి తెలియకపోవటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

 

కొన్ని వందల సంవత్సరాల విదేశీయుల దోపిడీకి, పది సంవత్సరాల సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ దోపిడీకి ఏమాత్రము తేడా లేదు. దేశంలో దొంగలు పడ్డారని బాధపడాలా, పదేళ్ళు దేశాన్ని దొంగలే పరిపాలించారని ఏడవాలో అర్ధం కాని పరిస్థితి! దేశాన్ని పాలించిన పార్టీ కేవలం దొంగల పార్టీనే అయినా సర్దుకుపోవచ్చు, కానీ దేశద్రోహుల ముఠాగా ఆ పార్టీ దేశక్షేమాన్ని కూడా తాకట్టు పెట్టిందని తెలుస్తున్న కొద్దీ పదేళ్ళల్లో ఇంకెన్ని ఘోరాలకు పాల్పడి ఉంటారో అని అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.

 

అధికారాన్ని ఓ విషపాత్రగా తన తనయుడికి ఉధ్బోధించిన తల్లి ఆ అధికారం కోసం ఎంతగా తపించిందో అందరికీ తెలిసిన విషయమే. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ప్రమేయంతో ఆగింది కానీ, లేకుంటే ఈ దేశ ప్రధానిగా మనలను మరోసారి విదేశాలకు కట్టు బానిస కూడా చేసి ఉండేదే అని అనుమానించటంలో ఎటువంటి తప్పు ఉండబోదు.! ఒక జాతీయ పార్టీకి అధినేత్రిగా ఉన్న ఆ విదేశీ వనితకు దేశం పట్ల బాధ్యత లేకపోవటం విస్మయం కలిగించదు.

 

కానీ, ఆ పార్టీ నేతలు, ప్రధానులు, ఇతర మంత్రులు కనీసమాత్రంగానైనా బాధ్యత వహించకపోవటం ఆశ్చర్యమే కాదు ఆందోళన కలిగించే విషయం. 2జి, 3జి, అగస్టా వెస్ట్‌లాండ్, ఆదర్శ్, కామన్‌వెల్త్, బొగ్గు... ఇలా ప్రతి కుంభకోణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు, మంత్రులు సమర్ధించినవాళ్ళే! కుంభకోణంలో మా పాత్ర గురించి ఆధారాలు చూపిస్తే విచారణకు సిద్ధమని మీసాలు మెలేసిన మొనగాళ్ళే! సంకీర్ణ ప్రభుత్వం నడపటంలోని సంక్లిష్టతల వల్ల తమ మిత్రపక్షాల అవినీతి విషయంలో రాజీపడాల్సి వచ్చిందని నిస్సిగ్గుగా వాపోయిన కాంగ్రెస్ ప్రధాని మన్‌మోహన్‌సింగ్, తమ పార్టీ నాయకుల, అధినేతల అవినీతి గురించి కనీసం వాపోవటం కూడా జరగలేదు.

 

ముందు మన బంగారం నిక్కమైతే, మరొకరిని విమర్శించవచ్చు. 1990 తరువాత మన దేశంలో జరిగిన ప్రతి పెద్ద కుంభకోణానికి ఒక కామన్ లింక్ మన్‌మోహన్‌సింగ్. హర్షద్ మెహతా నుంచి అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం వరకు ఈయన చేసిందేమీ లేదంటే నమ్మ బుద్ధి వేస్తుందా? తన ఆధీనంలో ఉన్న బొగ్గు మంత్రిత్వ శాఖకు సంబంధించిన దస్తావేజులు మాయం చేయటం నుంచి, బోఫోర్సు కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన కత్రోచి బ్యాంకు అక్కౌంటులు పునరుద్ధరించటం వరకు ఆయన చేసింది దేశ సంక్షేమం గురించే అని భావించగలమా?

 

దీనికి కారణం ఏమిటి? దేశంలో అవినీతికి ఏ పార్టీ అతీతం కాదు. కానీ, కాంగ్రెస్‌పార్టీ అవినీతికి ఉన్న అన్ని హద్దులు చెరిపేసింది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు, తన అవినీతి భాగోతంలో అందరికీ పాలుపంచింది. అవినీతి మకిలి అంటని ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్‌లో లేడంటే అతిశయోక్తి కాదు. అంతేకాక, అగస్టా కుంభకోణంలో దాదాపు ఇరవైమంది పాత్రికేయులకు కూడా తన అవినీతి సొమ్ము పంచిపెట్టి ఆ అవినీతిలో వారిని భాగం చేసింది. కాబట్టే, దాదాపు ఆరు సంవత్సరాలు ఏ మీడియా కంపెనీ కూడా ఈ కుంభకోణం గురించి కనీసమాత్రంగా కూడా మాట్లాడలేదు. 100 రూపాయల అవినీతికి కక్కుర్తిపడే బిల్‌కలెక్టర్‌ల మీద రహస్య కెమేరాలు సంధించే పాత్రికేయులు వేల లక్షల కుంభకోణానికి కాపలాదారులుగా మిగిలిపోవటం దేశ దౌర్భాగ్యం.

 

చివరికి అవినీతి సొమ్ము కోసం కక్కుర్తి పడటమే కాకుండా, అందుకోసం అగస్టా అధికారులకు దేశరక్షణమంత్రిత్వశాఖకు సంబంధించిన కొన్ని దస్తావేజులు కూడా అందించటం దేశద్రోహానికి సంకేతం కాదా? ఈ విషయాలు తెలిసీ మౌనం వహించిన మన్‌మోహన్‌సింగ్, ఈ అవినీతిలో పాలుపంచుకుని మౌనం వహించిన ఇతర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పాత్రికేయులు దేశద్రోహులు కారు అని అనగలమా?

 

కాంగ్రెస్ అవినీతికి మించిన దారుణమైన విషయం ఏమిటంటే, హిందువులను వారిదేశంలోనే తీవ్రవాదులుగా చిత్రించి సెక్యులర్ పబ్బం గడుపుకునే ప్రయత్నం. మాలేగావ్, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుళ్ళకు సంబంధించి జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తోయ్‌బా లాంటి తీవ్రవాద సంస్థలకు ఉన్న లింకులను మరుగునపెట్టి, కాషాయ తీవ్రవాదాన్ని ఈ పేలుళ్ళకు కారణంగా పేర్కొని ఆరెస్సెస్‌తో లింకులు ఉన్న కొందరిపై కేసులు పెట్టి వారిని వేధించటం ఒక ఎత్తైతే, నీచ రాజకీయాలకు పరాకాష్టగా ఇష్రత్ జహాన్ కేసు గురించి చెప్పుకోవచ్చు.

 

లష్కర్-ఎ-తోయ్‌బాతో సంబంధాలు ఉన్నాయని ఐ.బి., ఎన్.ఐ.ఎ.లు ప్రస్తావించిన ఇష్రత్ జహాన్‌ను నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వాడుకునే ప్రయత్నం చేయటంలోనే కాంగ్రెసీయుల అధికార మదం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. తన ప్రణాళికలో భాగంగా ఒకవేళ ఇష్రత్ జహాన్ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని మట్టుబెట్టినా కాంగ్రెస్‌కు లాభమే. అలాకాక, ఎన్‌కౌంటర్‌లో ఇష్రత్ హతమైనా కాంగ్రెస్‌కు రాజకీయంగా లాభమే. రాజకీయ లాభాలకి, ప్రలోభాలకి దేశాన్ని, దేశ క్షేమాన్ని తాకట్టు పెట్టటానికైనా సిద్ధమైన పార్టీ కాంగ్రెస్! ఈ కేసుల్లో వెలికి వస్తున్న నిజాలు చూసి కాంగ్రెస్‌ను ఛీకొట్టని వ్యక్తులు ఉండకపోవచ్చు.

 

అంతేకాదు. తమ ఏలుబడిలో అమ్ముడుబోయిన మేథావులందరితో దేశంలో అసిహిష్ణుత పెరిగిపోతున్నదని నకిలీ ఉద్యమాలు చేయించి ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్రలు కూడా చేస్తున్నది ఈ కాంగ్రెస్సే! దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా గొప్పలు చెప్పుకునే ఈ పార్టీ జె.ఎన్.యు.లో దేశద్రోహుల కేకలకు, కూకలకు మద్దతుగా నిలబడటమేమిటి? మణిశంకర్అయ్యర్, సల్మాన్‌ఖుర్షీద్‌లకు పాకిస్తాన్‌తో ఉన్న సంబంధ బాంధవ్యాలేమిటి? మోడీ ప్రభుత్వాన్ని కూలదోయటానికి సహకరించమని పాకిస్తాన్ ప్రభుత్వానికి వీరు విజ్ఞప్తులు చేయటంలోని ఆంతర్యం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ అవినీతి బకాసురుల పార్టీనే కాదు, దేశద్రోహుల పార్టీ అని అనిపిస్తే ఎవరిది తప్పు?

 

అగస్టా వెస్ట్‌లాండ్ కేసుకు సంబంధించి లంచాలు ఇచ్చినందుకు ఇటలీ కోర్టు అక్కడి అధికారులకు ఇప్పటికే శిక్ష విధించింది. మన దేశంలోనైతే ఇంతవరకూ 2జి, 3జి, కామన్‌వెల్త్, బొగ్గు కుంభకోణాలకు సంబంధించి విచారణ సాగుతూపోతున్నదే కానీ ఒక కొలిక్కి వచ్చే సూచనలు ప్రస్తుతం మాత్రం కనిపించటంలేదు. న్యాయవాదులు, న్యాయమూర్తులు తక్కువయ్యారని కళ్ళనీళ్ళపర్యంతం అయ్యే పెద్ద న్యాయమూర్తి గారు అవినీతి కేసులను త్వరితగతిన తేల్చటానికి ఇంతవరకూ ఏంచేసారనేది ఎవ్వరికీ తెలియదు. మరీ ఈ న్యాయమూర్తులే ప్రభుత్వం ఫలానా పని ఎందుకు చేయలేదని గద్దిస్తూ, ఎప్పుడు ఎలా ఏం చేయాలో నిర్దేశిస్తారు కానీ, తమను తాము మాత్రం ఉద్ధరించుకోరు! ఇది అలుసుగా తీసుకొని లాలూ, ఏ.కె.రాజా, కణిమొళి లాంటి నేరస్థులు ఎంతమంది లేరు! ఇలాంటి వారివల్ల కదా, ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం సన్నగిల్లుతున్నది. ఇలాంటి వారివల్ల కదా, నేరస్థులకు మరింత ధైర్యం కలుగుతున్నది!

 

గురు గోవింద్‌సింగ్, మహారాజా రంజీత్‌సింగ్‌లను ఆదర్శంగా తీసుకోవాల్సిన మన్‌మోహన్‌సింగ్ దేశ చరిత్రలో ఓ జైచంద్‌గానో, అంభిగానో మిగిలిపోయి దేశ శ్రేయస్సును పణంగా పెట్టాడంటే ఆయన ఎంతటి దౌర్భాగ్యుడో అర్ధం ఔతుంది! వందేళ్ళ చరిత్ర ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ అవినీతిని వ్యతిరేకిస్తూ పార్టీని వీడిన ఒక్క నాయకుడిని గత దశాబ్దకాలంలో చూసి ఎరుగం! ఒక్కడంటే ఒక్క నాయకుడు, కనీసం ఒక్క కార్యకర్త కూడా ఈ అవినీతికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడి ఎరుగడు.  ఏమిటీ తెంపరితనం? అధికార మదం అణువణువునా నింపుకొని, తాము చెప్పిందే వేదం అని నమ్మబలికిన ఈ అవినీతి, దేశ ద్రోహ పిశాచులు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ దర్పాన్ని వదలటంలేదు!

 

సోనియా, రాహుల్ గాంధీల నిర్వాకాలకు, కాంగ్రెస్ అనేది ఒక పార్టీ స్థాయి నుంచి దిగజారి ఒక దుష్ట వ్యవస్థగా మారిపోయింది. వెన్నెముక లేని వ్యర్థ పరాన్నభుక్కులతో నిండిపోయింది. దేశ సర్వసత్తాక ప్రజాస్వామ్యానికి, సర్వ స్వతంత్ర సార్వభౌమత్వానికి, సర్వతోముఖ సాధికారానికి, సమగ్రతకు, శ్రేయస్సుకు ఈ కాంగ్రెస్ ఏమాత్రమూ పనికిరాదు. ఈ పార్టీ మనుగడ మన దేశానికి మరింత ముప్పు. 44 మంది పార్లమెంటు సభ్యులతోనే దేశాన్ని, దేశాభివృద్ధిని చెరబట్టిన ఈ కాంగ్రెస్ మరోసారి అధికారానికి వస్తే ఏం చేయగలదో ప్రజల వివేచనకు, అంచనాలకు తేలిగ్గానే అర్ధమౌతుంది. ఏ దేశానికైనా ఏకపార్టీ వ్యవస్థ మంచిది కాకపోయినా, ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కాంగ్రెస్‌ను మించిన ప్రమాదకరపార్టీ మరొకటి లేదు. కాబట్టి ఆ పార్టీని భూస్థాపితం చేయకతప్పదు.

 

Pics Courtesy : Google

Comments   

 
0 #1 కాంగ్రెస్ - ఒక దుష్ట వ్యవస్థ! veeresh 2016-07-15 11:40
I do not understand one thing why still people are voting for khangress
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh