The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 5
PoorBest 

నేనిక్కడ ఎలా ఉన్నానో, ఎక్కడికి పోతున్నానో నాకు తెలీదు. ఊహ తెలిసినప్పట్నుంచీ ఓ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉండడమే తెలుసు. "నేను" ఉన్నాను అనుకుంటాను తప్ప ఎక్కడున్నాను? ఏం చేస్తున్నాను? ఎందుకు చేస్తున్నాను? లాంటివేమీ తెలీదు. ఆ ఊహా, ధ్యాస లేవు. ఆలోచన, జ్ఞాపకం, భయం, సుఖం .... ఇలాంటివేమీ లేవు నాలో. జిజ్ఞాస, ప్రశ్న అనే గుణాలు పుట్టేవరకు. అవెలా ఎందుకు పుట్టాయో ఇప్పటికీ తెలీదు. కానీ అవి మొదలైనప్పప్పట్నించీ బతుకు బుద్బుదప్రాయం అయిపొయింది. అయిపొయిందేంటి నా మొహం? బుడగ బతుకు బుద్బుద ప్రాయం కాక ఇంకే ప్రాయం అవుతుంది?

నేను --- ఉన్నాను --- పోతున్నాను ఈ మూడు భావాలూ చాలు ఒక బుడగ జీవితం దుర్భరం అవ్వడానికి. అవును జీవితం బుడగస్య బుడగః అన్న చలపతి స్వామి మాట నా విషయంలో అక్షరాలా నిజం.

(Note : కొత్త గురువులు, స్వామీజీల కోసం ఎదురు చూసే వీరభక్తశిఖామణులకి దుర్వార్త :-- చలపతి స్వామంటే దేశంలో జనాభా కి డైరెక్ట్ ప్రపోర్షన్ లో పెరిగిపోతున్న స్వామీజీల్లో ఎవరూ కాదు. కే. విశ్వనాధ్ గారి శుభోదయంలో హీరో.)

Cogito ergo sum, I think, therefore I am, నేను ఆలోచిస్తున్నాను అందుచే నేను ఉన్నాను --- అని రినీ దేకార్త్ (René Descartes)ఒక్కడే కాదు ఓ బుడక్కూడా అనుకోగలదు. ఉన్న తేడా అంతా వ్యక్తీకరణలోనే. ఆయనైతే అమ్మయ్య నేనున్నానన్న మాట అని వీపు చరుచుకోగలడు. (బుడగలకది కుదరదు. చరుచుకుంటే బుడగ ఉండదు కనక.)

దేకార్త్ ముందూ తరవాతా ఎంతమందికీ ఐడియా వచ్చుండదు? ఐడియా రాని వాళ్ళ కన్నా వచ్చినా చెప్పని వాళ్ళే ఎక్కువుంటారు లోకంలో. (రినీ దేకార్త్ René Descartes, Refer: http://en.wikipedia.org/wiki/Ren%C3%A9_Descartes <లేక> నండూరి రామ్మోహన రావు గారి విశ్వదర్శనం)

ఎనీవేస్, నాకా ఐడియా వచ్చింది. అందుకే ఎంత బుడగస్య బుడగః అయినా నేనున్నాను, నేనూ ఉన్నాను అని ధాటీగా చెప్పగలను. ఉండడం అనే స్థితిని మించిన ఆనందం, ఉండలేకపోవడం అనే ఆలోచనకి మించిన దుఃఖం బుడగలకుండవు. నిజానికి ఆ రెండు స్థితులూ తప్పనిదేదైనా బుడగే. కొన్ని రకాల బుడగలకి ఈ రెండు స్థితుల మధ్యలో ఇంకా ఏవేవో ఆనందాలుంటాయి(ట). (మనుషులు అనీ మరో మహత్తర బుడగ జాతి ఉందట. వాళ్ళకీ ఆనందాలు మరీ ఎక్కువట. ఆ ఆనందాలు దూరమైనప్పుడల్లా నమ్మకురా ఇల్లాలు, పిల్లలూ బొమ్మలురా జీవా అనీ, జగమే మాయ బ్రతుకే మాయా అనీ, మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే అనీ కొందరు పాటలు అని అవి పాడతారుట. అయినా పెద్ద లాభం ఉండదుట ఆ టైపు బుడగలకి.)

అసలు ఉండడం, being, అనే పని ఎంత కష్టమో తెలిస్తే జస్ట్ ఉన్నందుకే ప్రతి బుడక్కీ ఓ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇవ్వచ్చు. అంటే, ఒక లైఫ్ టైం గడప గలిగినందుకు ఈ అవార్డ్ అనమాట. అలాంటిది ఆలోచించే బుడక్కి మరెలాంటి అవార్డ్ ఇవ్వాలో? ఐతే, బుడగల్లో లైఫ్ గురించి ఆలోచించడం కన్నా లైఫ్ ని అచీవ్ చెయ్యడానికే ప్రాధాన్యత. ఆలోచించి మాత్రం ఓ బుడగేం చెయ్యగలదు కనక? నా స్టోరీ అంతా విన్నాక మీకే తెలుస్తుంది. అప్పటికీ తెలియకపోతే మీకింకా బుద్బుదత్వ సిద్ధి కలగలేదని అర్ధం. (బుద్బుదత్వ సిద్ధి అంటే నేనూ ఓ బుడగమాత్రుణ్ణే అనే వినయం, అంతేకానీ అదేదో తాంత్రిక సిద్ధి అనుకునేరు, ఆ పని చెయ్యకండి. ఈ మధ్య మనదేశంలో సిద్ధులకోసం, గుప్తనిధుల కోసం హోమాలు, తంత్రాలూ ఎక్కువైపోయాయిట, టీవీల్లో ప్రవచన కర్తలు నెత్తీ నోరూ బాదుకుని మరీ చెప్తున్నారు)

నేను ఉనికిలోకోచ్చిన చాలాకాలం వరకూ నేను గ్రహించలేదు నేనున్నది ఒక ప్రవాహంలోనని. (నా చుట్టూ ఉన్న బుడగలే నా ప్రపంచం, కొట్టుకుపోవడమే మా జీవితం.) నేను, నేను అని ఇంత ఇదిగా అంటానేగానీ కొట్టుకుపోడంలో ఈ "నేను" ప్రమేయం ఏమన్నా ఉందానని సందేహం రా(లే)దు. (సందేహం వచ్చినా అది తీరే సరికి ఈ దేహం ఉండకపోవచ్చు. పోవచ్చు కాదు ఉండదు, 99.9%) జీవితం బుడగస్య బుడగః అన్న చలపతి స్వామి మహావాక్యం తెలిసి కొన్ని, తెలియక కొన్ని, తెలిసినా ఆ సత్యం తట్టుకోలేక మర్చిపోయి కొన్ని మొత్తం మీద బుడగలందరం హడావిడిగా, ఆనందంగా కొట్టుకుపోతూ ఉంటాం. కొట్టుకుపోకపొతే కొంపేదో ములిగిపోతున్నంత బిల్డప్ ఇస్తూ ఉంటాం. నిజానికి అదే మా జీవితం, అదేమా సంతోషం. ఐతే దానికప్పుడప్పుడూ బ్రేకులు పడతాయి. ఎలాగంటే ---

హాయిగా పోతున్న ఓ బుడగ సడెన్ గా మాయమైపోతుంది. మళ్ళీ కనబడదు. అప్పుడు లోపల ఓ రకమైన అలజడి కలుగుతుంది. అస్సలు బావుండదు ఆ అలజడి. మొదటిసారి నా పక్కనే ఉన్న ఒక బుడగ నా కళ్ళ ముందే అదృశ్యం అయిపోయినప్పుడు ఒక క్షణం ఆశ్చర్య పడ్డా. ఆశ్చర్యం అనే భావం మొదటిసారి అప్పుడే కలిగిందని గుర్తు. అంతలోనే ఆ విషయం వదిలేసి కొట్టుకుపోడంలో బిజీ ఐపోయా..అంతలో మరో బుడగ మాయం. ఈ సారి షాకయ్యా. ఏమౌతోంది? వీళ్ళెక్కడికి పోయారు? ఎంతకీ రారేం? ఏం జరిగింది? వూఁ....ఫ్ -- ఏం జరుగుతోంది? వూఁ...ఫ్ --- ఏం జరగబోతోంది? వూఁ...ఫ్ --- నాకు తెలియాలి. తెలిసి త్తీరా...లి. "అతడు"లో ఎమ్మెస్ నారాయణ పాత్రలా గర్జించాను. (అసలీ పాత్రే పెద్ద బుడగ. కధలో ఎందుకు ఎలా ఎంటరయిందో, ఎలా నిష్క్రమించిందో తెలీదు. Hats off to Trivikram !!!)

నా లాగే ఇతర బుడగలూ గర్జిస్తున్నాయా? ఏమో! అసలు ఆ ధ్యాస ఏ ఒక్క భంగురానికీ ఉన్నట్టు లేదు. నాకు తప్ప. (మధ్యలో ఈ ఈగో ఒకటి. బుడగలందు పుణ్య బుడగలు వేరయా, అది నేనయా అనుకుంటే కానీ బుడగ మెంటాలిటీకి హాయి ఉండదు) ఈసారి మూడు బుడగలు ఒక్కుమ్మడిగా మాయం. భయం పుడుతోంది. నేనూ ఇలా మాయమైపోతానేమోనని. ఎలా ఇక్కడున్నానో తెలియదు. ఎక్కడినుంచో ఇక్కడికి వచ్చానంటే ఏం చెప్తాను? అది తెలిస్తే మళ్ళీ అక్కడికే పోతాం అని సరిపెట్టుకోవచ్చు. ఆ అదృష్టం లేదు.

ఏం చెయ్యను? ఆలోచన అనేది లేకపోతే హాయిగా ఉండేది. నేనెలా వచ్చానో తెలీనట్టే ఈ ఆలోచన ఎందుకొస్తుందో, ఎందుకుంటుందో కూడా తెలీదు.

ఈ బుద్బుదాంతరంగ మధనంలో ఓ పిడకల వేట కూడా ఉందండోయ్. ఈ అంతర్మధనం నాకేనా ఇతర బుద్బుదములకూ కలదా అనే ధర్మ సందేహం కలిగి అదో సంకటంగా మారింది. ఇదంతా నా స్వంతం, నా స్వయం ప్రతిభ, అనితర సాధ్యం అనిపించి అదేదో మంచి ఇదిగా ఉంది. బుడగలందు పుణ్య బుడగలు వేరయా లాంటి ఫీల్. అదొచ్చినప్పుడల్లా కొంచెం ఉబ్బుతాను. మరీ ఉబ్బితే ఐపోతావ్ అని నాలోపల్నుంచి ఎవరో అరిచినట్టనిపించి ఆ ప్రయత్నం వదిలేస్తా.

మధ్య మధ్య ఈ సంకటం తలెత్తుతూ ఉంటుంది. లోపల్నుంచి అరుపు వినబడకపోతే ఇంతే సంగతులు. ఇంతకుముందు అదృశ్యమైన బుడగల బతుకిలాగే తెల్లారిందా? ఏమో? ఈ పిడకల వేట వల్ల ఓ మంచి కూడా జరిగిందనిపిస్తుంది. వేరు వేరుగా కనిపించినా జన్మతః బబుల్సన్నీ ఒకటే అనిపిస్తుంది. ముఖ్యంగా ఉబ్బితబ్బిబ్బవడం వల్లే బుడగలు మాయమైపోతాయని స్ట్రాంగ్ గా అనుకున్నప్పుడు. అందులో బుడగాత్మలన్నిటినీ కలిపే అదృశ్యపరమాత్మ స్ఫురిస్తుంది. మొత్తమ్మీద నా మాత్రం ఆలోచించే బుడగలుండకపోవు అని తేల్చుకున్నా.

మరైతే ఏం తెలియనట్టు మూసుక్కుచుటాయేం? ఏమో? అయినా నాకు తెలిసిందంతా నేనందరికీ చెప్పగలుస్తున్నానా ఏం? ఒకవేళ చెప్పినా అవి వింటాయా? పట్టించుకుంటాయా? మరి నా సంగతీ? అసలు తోటి బుడగలేమైనా చెప్తే వినే మర్యాదా, గౌరవం నాకున్నాయా? ఇలా అనుకున్నాక దురహంకారం కాస్త తగ్గింది. ఉబ్బడం కూడా. బబుల్స్ అన్నీ ఒకలాగే ఆలోచిస్తాయి. ఆలోచించాలి. కొంచెం వెనకా ముందూ అంతే. [ఉబ్బు లేక ఉలుపు లేక ఊదు లేక శోథము లేక శోఫ లేక శోఫము లేక శ్వయధువు లేక శ్వయనము లేక శ్వయము తగ్గినా బుద్బుదప్రాయత్వం మీద నా అబ్జర్వేషన్స్ బుద్బుదలోకం అంతటికీ తెలియజెయ్యాలని తాపత్రయం కలుగుతుంటుంది మధ్య మధ్య.

ఏదో కొత్త విషయం అర్ధమైనప్పుడు, rather అర్ధమైందనిపించినప్పుడు, మరీను. క్షణ క్షణ గండంగా బతికే ఓ బుడక్కి ఈ తాపత్రయం ఎందుకంటా? ఉన్నట్టుండి బుడగలోకాన్ని మార్చిపారేయ్యాలనా? అనవసర తాపత్రయమే. కానీ ఉంది. ఎలాగో మాయమైపోయే బుడగలకి మీరు మాయమైపోతారు, గుర్తు పెట్టుకోండి అని చెప్పాలా? ఎందుకు? విషయం తెలిసినా తెలీకపోయినా చివరికి మిగిలేది మాయమైపోవడమేగా? అదేదో అజ్ఞానంలోనే జరిగిపోవచ్చుగా? నేనో మహాబుద్బుదాత్మనై పోవాలనా, బుడగజాతి నా అడుగులకి మడుగులొత్తాలనా?లేక బుద్బుదానందాలకి అడ్డుకట్ట వెయ్యాలనా, వాళ్ళందర్నీ నా అవసరార్ధం మానిప్యులేట్ చేయ్యాలనా? ఎందుకు నాకీ తాపత్రయం? ఇది కూడా బుడగలన్నిటికీ కామన్ ట్రెయిట్ అయుండచ్చు. బుద్బుదత్వమే, కానీ enlightened అండ్ exalted బుద్బుదత్వం] ఇన్ని విషయాలు నాకెలా తెలిసిపోతాయో? తెలియడం అనొకటుంటుందా బుడగల్లో? నాలోని తెలుసుకునే గుణం, ఇకపైన తెలివి అంటా, ఇదో స్పెషల్ క్వాలిటీ ఏమో? నేనొ గొప్ప బుడగనేమో అనిపిస్తుంది ఒకోసారి. ఈ తెలివిని ఉపయోగించి బుడగలు మాయం అవడం వెనకున్న రహస్యం తెలుసుకుంటే? అసలు బుడగలెలా వస్తాయో కూడా తెలుసుకోవాలి. అదేదో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లాగ "నేనే తెలివైనవాణ్ణిగదా, ఆలోచిస్తా" అనుకుంటూ ఈ తాలూకూ ఆలోచనల్లో కొట్టుకుపోతూనే చుట్టూ చూసాను. ప్రవాహానికి ఇరు పక్కలా బుడగల్లాంటివి కాకుండా ఇంకా ఎమేమిటో వింత వింత ఆకారాలు, రంగులు,కదలికలు, శబ్దాలు.. నా తోటి బుడగలు ఎక్కడికి పోతున్నాయి. ఈ కొత్త వింత వస్తువులు ఎలా వస్తున్నాయి?

బుర్ర తిరుగుతోంది!

ఇంతలోనే ప్రవాహంలో ఏదో మార్పు. కొంచెం హాయి, ఆహ్లాదం, అంతలో కాస్త భయం, ఆందోళన, ఆత్రుత...అవేంటో ఎలా కలుగుతాయోగానీ కలిగాయి. అంతలోనే చుట్టూ ఉన్న ప్రపంచం చూస్తూ ఉంటే ఎందుకో తెలియని ఆనందం, ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలనే ఆత్రుత, లోపల ఏంటో తెలియని ఒక ఆందోళన...అన్నీ ఒకసారే. ఇంతలో నా పక్కనే, నన్నంటుకుంటూ, నాతో పాటే కొట్టుకుపోతూ మరో బుడగ. కొంచెం ధైర్యం వచ్చింది. వచ్చిందా? ఏమో. భయం తగ్గింది అంటే కరెక్టేమో. నిజానికి ఇందాక చెప్పిన మూడు అంతు తెలియని భావాల జోరు, హోరు తగ్గినట్టు ఉంది. వాటిలో అవి బాలెన్స్ అయినట్టు ఉంది. నా లోపల ఒక రకమైన ఈక్విలిబ్రియం ఏర్పడినట్టు (నిజానికి ప్రవాహం ఒడిదుడుకులు లేకుండా, కొండలమీంచి దూక్కుండా, లోయల్లో ఒరుసుకుంటూ పోకుండా ఉండడం ఈ ఈక్విలిబ్రియానికి ఆధారం అని తరవాత్తెలిసింది.)

ఆ కొత్త బుడగా, నేనూ. ఇద్దరం కలిసి అలా కొట్టుకుపోతున్నాం. ఇలా కలిసికోట్టుకుపోవడం ఆ బుడగకీ నచ్చినట్టుంది. దానికీ భయం తగ్గి ఉంటుంది. కాదు కాదు.దానిలోనూ ఈక్విలిబ్రియం వచ్చినట్టుంది. ఇద్దరం చుట్టూ ఉన్న, జరుగుతున్న విషయాలు మర్చిపోయాం. మర్చిపోయాం అనుకుంటున్నానా? నిజంగానే మర్చిపోయానా? ఏమో. ఈ లోపులో మా ఇద్దర్నీ తగులుతూ, మాతో పాటే కొట్టుకుపోతూ మరో చిన్న బుడగ. ఈ సామూహిక ప్రయాణం బావుంది. అలా ఎంత దూరం వెళ్ళామో కలిసి. మధ్య మధ్య మాయమైపోయిన బుడగలు గుర్తొస్తున్నాయి. ఏమై పోయుంటాయవి? అవేవీ ఇలా కల్సి ప్రయాణించడం ఎంజాయ్ చేసుండవు పాపం. అవునూ ఇప్పుడు మూడు బుడగలం కలిసి హాయిగా కొట్టుకుపోతున్నాం, మేం కూడా ఇలా మాయమైపోంగదా? ఈ థాట్ రాగానే ఒక్క క్షణం ఒళ్ళు జలదరించింది? ఎందుకు? ఏమో? ఇంకొంత దూరం ప్రయాణం. మాక్కొంచెం ముందుగా కొట్టుకుపోతూ ఓ బుడగ జంట కనబడింది. అలా చూస్తున్నా వాటిని. ఇలా కలిసి ప్రయాణించే బుడగలు ఇంకా ఉంటాయన్నమాట.

మా లాగే అవీ ఒక రకమైన తృప్తితో కొట్టుకుపోతూ ఉండొచ్చు అనే భావం కలిగి ఇంకొంచెం సంతోషం కలిగింది. చాల సేపు ఆ జంట, మా గుంపు పక్కపక్కనే ప్రయాణించాము. అప్పుడే గమనించా. ప్రవాహం పక్కనే కనిపిస్తున్న వింత ఆకుపచ్చ ఆకారాల్లో ఒకటి ప్రవాహం మధ్య వరకూ అడ్డుపడి ఉంది.

మా పక్కనే ఉన్న బుడగల జంట దాని వైపే వెళ్తోంది. వెళ్లి దానికి గుద్దుకుంది. అంతే రెండిట్లో ఒక బుడగ "టప్" అని మాయమైపోయింది. రెండో బుడగ ముందుకి సాగింది. కానీ వణుకుతూ పోతున్నట్టు అనిపించింది. కొంత దూరంలోనే అదీ "టప్" మని మాయం. మరీ దగ్గరగా ఉందేమో ఆ మాయం అవడంలో దానిలోంచి చిన్న చిన్న చుక్కల్లా ఉన్నాయి అవేమిటో చుట్టూ ఎగిరి ప్రవాహంలో పడిపోయాయి. అందులో "కలిసిపోయాయి". కలిసిపోయాయా? అంటే? ఏమో? అసలీ ప్రవాహం ఏమిటో తెలియదు. అందులో ఈ బుడగలు ఎలా వచ్చాయో అంతకన్నా తెలియదు. మాయం అయిపోయినప్పుడు ఎక్కడికి పోతున్నాయో తెలియదు.ఇప్పుడు ఇంత దగ్గర్నుంచి చూసాక అనిపిస్తోంది. బుడగ ప్రవాహంలో కలిసిపోవడమేనేమో ఈ మాయం. ఒళ్ళు గగుర్పొడిచింది. ఒళ్లా అదేమిటి? ఇదో కొత్త ఆలోచన వస్తోంది.నేను బుడగని అని నాకెలా తెలిసిందో తెలిసింది. నా ఆకారం, చుట్టూ పక్కల ఉన్న ఇతర ఆకారాలు చూస్తుంటే నాలంటివి కొన్ని, నాలాంటివి కానివి కొన్ని కనిపిస్తుంటే నాలో ఉన్న ఏదో నాకు చెప్తోంది. ఇది నేను, ఇది నేను అని. నేను అనే ఫీలింగ్ భలే వింతగా ఉంది. ఐతే అదొక్కటే కాదు నేను కానిది కూడా ఉంది.

అది మరో బుడగ కావచ్చు, చుట్టూ ఉన్న వింత ఆకారాలు కావచ్చు, ఈ ప్రవాహం కావచ్చు.

నేను, నేను కానివి కొన్ని( అందులో మళ్ళీ రకరకాలు),

ఇవన్నీ ఉంటున్న మరో మరోటి, అంటే ఈ ప్రవాహం,

ఈ ప్రవాహం కూడా ఉంటున్న ఒక శూన్యం (?), ఉన్న వాటిలో కొన్ని మాయమైపోవడం, తనంతట తను మాయమైపోయేది ఒకటి, దేనికో గుద్దుకుని మాయమైపోయేదొకటి, ఉండడం, ఉండకపోవడం...ఏంటిదంతా?

ఏమైతేనేం ఈ నా థాట్స్ అన్నీ నా పక్కనున్న పెద్ద బుడక్కీ, చిన్న బుడక్కీ చెప్పాలనిపిస్తోంది. నాలో ఉన్న భావాలు వాళ్ళలోనూ కలగాలని, అవి నానుంచే వాళ్ళకి కలగాలనీ ... ఏంటో, లోపల ఏదో కదుల్తున్నట్టు, ఏదో, ఏదో, ఏదో .... అయితే వాళ్ళెం పట్టనట్టు ఉన్నారు. వాళ్ళకీ నాలాగే అనిపిస్తూ ఉండచ్చు, వాళ్ళకీ తమ భావాలని నాకు పంపడం ఎలాగో తెలియక అలజడి పడుతూ ఉన్నారేమో? ఏమో.

ప్రవాహం ముందుకి పోతోంది. ఆలోచనలు ఆపి మళ్ళీ చుట్టూ ప్రపంచాన్ని చూస్తున్నా. అప్పుడే ఒకటి జరిగింది.

నా ఆలోచనలని, నా జీవితాన్నీ మలుపు తిప్పిన సంఘటన. నా బుద్బుదత్వంలో శాశ్వతత్వం ఉందనిపింపజేసే ఘటన.

పై నుంచి ఒకటేదో ప్రవాహంలో "టప్" అని పడింది. ఆ పడినప్పుడు ఇందాక బుడగ పగిలిపోయినప్పుడు ఎగిరిన చిన్న నలకల్లాంటివి ప్రవాహంలోంచి ఎగిరి మళ్ళీ అందులో పడిపోయాయి. ఆశ్చర్యం. ఓ కొత్త బుడగ ప్రత్యక్షం. అరె ఎలా జరిగిందిది? నేనూ ఇలాగే ప్రత్యక్షమయ్యానా? నాలాగే బుడగలన్నీ ఇలా ప్రత్యక్షం అవుతాయా? భలే. కొత్త బుడగ మా వెనకే వస్తోంది.

నా ఆలోచన పెరిగింది. ప్రవాహంలో ఏదో పడితే బుడగలు పుట్టును అని సిద్ధాంతం ఒకటి తయారయింది బుద్బుద మస్తిష్కంలో.

నా అబ్జర్వేషన్స్, rather questions, ఇలా ఉన్నాయి - పైనుంచి అదేదో పడినప్పుడు ఎగిసిన చుక్కలు ప్రవాహంలో కలిసిపోయాయి. అంటే ప్రవాహంలో ఉన్న పదార్ధం, పై నుంచి పడిన పదార్ధం ఒకటేనా? అదేదో పడడంవలన ఒక ఆకారం, నేనే, ఎందుకు ఏర్పడాలి? అంటే ఆ పడే దాంట్లో నేను ఆల్రెడీ ఉన్నానా?

అంతులేని ప్రశ్నలు. జవాబులేని ప్రశ్నలు.

చివరికి- పైనున్న పదార్ధం కిందున్న అదే పదార్ధంలో పడినప్పుడు బుడగలు పుట్టును, నా థియరీని కొంచెం మోడిఫై చేశా. ఇది కొంచెం బావుంది. ఇందాకటి ఆలోచన కన్నా. అంతా తెలిసిపోయినట్టుంది. బుడగలే కాదు ఇతర ఆకారాలకీ ఇలాంటి కారణమే ఏదో ఉంటుంది.

ఇంకో రకం పదార్ధం పైనుంచి కింద ఉన్న అలాంటి పదార్ధంలో పడితే ఫలానా ఆకారం ఏర్పడును. ప్రతి ఆకారానికీ ఇదే థియరీ. మిగిలిపోయిన మిస్టరీ ఏంటంటే పైనున్న పదార్ధం ఎప్పుడు పడుతుందో తెలియదు, కిందున్న పదార్ధం, అదే ప్రవాహం, ఎక్కడికి పోతుందో అసలే తెలియదు. తెలుసుకోవాలా? తెలుసుకోగలనా? ఒక బుడగ జీవితకాలం సరిపోతుందా? రెండు పదార్ధాలూ ఒకటే అయితే, అందులోంచి పుట్టిన బుడగలో కూడా అదే పదార్ధం ఉండాలిగా. వేరే ఉంటుందా? ఆకారాన్ని కలిగించే ఒకానొక విషయం ఏదో అందులో ఉండుంటుంది. అదేంటో తెలుసుకోవాలి. ఇంతలో మళ్ళీ పీడ కల. తెలుసుకునేలోపు నేను మాయమైపోతే? ఏదైనా అడ్డుపడి దానికి గుద్దుకుని "టప్"అని పెలిపోతే? ఏముంది? ప్రవాహంలో కలిసిపోతాను. అప్పుడు ప్రవాహంలో ఏముందో? ఎక్కడికెళ్తోందో తెలుస్తుందేమో? వామ్మో ! నా వల్లకాదు. బుద్బుదప్రాయమైనా ఈ బుడగ జీవితంలో ఉన్న హాయి ప్రవాహంలో ఉంటుందా? ఐ డోంట్ థింక్ సో. అరె పైనుంచి ఇందాకటిలాగే ప్రవాహంలాంటి పదార్ధం పడుతోంది. ఇంకో బుడగ ఏర్పడుతుంది. ఈ సారి జాగ్రత్తగా చూడాలి. చూసాను. ఆ పదార్ధం ప్రవాహంలో పడలేదు. మా వెనక వస్తున్న కొత్త బుడగ మీద పడింది.

"టప్"......చుక్కలు మాయం!!

ఓర్నాయనోయ్. ఇంత భయంకరమా ఈ బుడగత్వము? పైనుంచి అదేదో నా పక్కనున్న బుడగల మీదా పడితే? నా మీదే పడితే?

ఇప్పుడు బుడగల సృష్టి క్రమం మీద నేను తయారు చేసిన థియరీ ఏం కాను?హడిలిపోతున్నా! నా తర్వాత వచ్చిన బుడగ నా కంటే ముందే టప్పుమంది. నా పనే నయం.

ఓ పక్క ఏ చుక్క ఎప్పుడు మీద పడుతుందో అని హడలు, మరో పక్క విషయం తెలుసుకోమని దొలుస్తోన్న పురుగు. ఏదో మీద పడి పుట్టి మునిగే వరకూ ఏదో ఒకటి చెయ్యలిగా. పురుగుకే తల వొంచా.

చుక్క ప్రవాహంలో పడితే బుడగ, చుక్క బుడగ మీద పడితే నో మోర్ బుడగ. ఓ మై గాడ్! హాఁ! ఏమన్నాను? గాడ్?

G.. O.. D, గాడ్ ?

G for Generation O for Operation D for Destruction.....ఇంతేనా ? ఇంతేనా అంటే బుడగ వరకూ ఇంతే. పుట్టడం, కొట్టుకుపోడం, పేలిపోడం. బుడక్కి ముందూ, బుడగ తరువాత మాత్రం ఏదో ఉంది. పేలిపోయాక్కానీ అదేంటో తెలియదు. ఐ మీన్, బహుశః.

పైనుంచి చుక్క పడడం మిస్టరీ. ఎప్పుడు పడుతుందో తెలీదు. కిందున్న ప్రవాహం మరో మిస్టరీ. ఎక్కడికి పోతుందో తెలీదు. మధ్యలో బుడగ మాత్రం హిస్టరీ. (రెండు మిస్టరీల మధ్య ఉండేదాన్నే హిస్టరీ అనవచ్చును అని మరో కంక్లూషన్. "పుట్టుటయు నిజము, పోవుటయు నిజమూ, నట్ట నడిమీ పని నాటక"మని అన్నమయ్య వాచ ; వరల్డ్ ఈజ్ ఎ స్టేజంటూ షేక్స్పియర్ ఉవాచ)

రెండు "తప్పు"ల, (అంటే ఇద్దరు కలిసి చేసిన ఓకే తప్పుని రెండు తప్పుల కింద లెక్కేస్తే అది కరెక్టే; సారీ Laughing), for being a bit naughty, ఎంత బుడగైనా లైఫ్ లో కొంత ఫన్ కోరుకుంటుంది కదా)

రెండు "టప్పు"ల మధ్య బుడగ జీవితం నాటకమా, ఇదంతా ఒక డ్రామా స్టేజీయా, రెండు మిస్టరీల మధ్య నేనో హిస్టరీనా? అసలు నేనున్నానా, లేనా? నా అస్తిత్వంలో నా ప్రమేయం లేదా? వామ్మోవ్ అయితే పైనుండే చుక్కవ్వాలి, లేతే కిందున్న ప్రవాహం కావాలి, అప్పుడే నీకు శాశ్వతత్వము బుడగోత్తమా! అంటూ ఓ అశరీరవాణి హోరు మొదలైంది. ఎక్కణ్ణుంచో తెలీదు. ఇదెక్కడి గోలో?

పై చుక్క తను పడే వరకూ కనబడదు, ఎట్టి పరిస్థితిలోనూమాట్లాడదు. కింద ప్రవాహం ఆగదు, మనక్కావాల్సినట్టు చస్తే పోదు. (ఇండియాలో చట్టంలా "తన పని" తను చేసుకుపోతూ ఉంటుంది.) మధ్యలో ఈ అశరీరవాణి ఎక్కడ్నుంచి వచ్చిందిరా బుడగ్గా? అశరీరవాణికి ఎలా తెలుసో ఈ విషయం. కానీ చెప్పింది. దానికేం చెప్పడం చెప్పేస్తుంది. చెప్పేవాడికి అడిగేవాడు లోకువనే సామెత ఊరికే వచ్చిందా? (స్వామీజీలు, గురూజీలు, యంత్రాలూ కవచాలిచ్చేవాళ్ళూ, యజ్ఞయాగాలు చేసేసేవాళ్ళూ, నెంబర్లతో, పేరుమార్పుల్తో, వాస్తుతో బ్రహ్మ కష్టపడి రాసిన రాతల్ని చేరిపేస్తున్నవాళ్ళని చూస్తే తెలీట్లా?)

బుడగలన్నీ ఆశాజీవులు కనక, ఎంత ఆలోచనా పరుణ్ణయినా బుడగనే కనక, చివరికి ఇలా సరిపెట్టున్నాను - "టప్" అనే లోపు మామూలుగా (అంటే హాయిగా అని అర్ధం చేసుకోవలెను) కొట్టుకుపోవచ్చు. అంతకన్నా ఈ బుడగ జీవితానికి కావాల్సిందేముంది? ఓ బుడగ కోరుకోదగ్గది మాత్రం ఏముంది? సాధించగల్చినప్పుడు కోరుకోవచ్చు గానీ .... ప్చ్! ఆలోచన అనవసరం.

తన్నుకున్నా పైనున్న శూన్యంలో ఏముందో తెలీదు. గింజుకున్నా కిందున్న ప్రవాహాన్ని మళ్ళించలేను. పై చుక్కనో, కింద ప్రవాహాన్నో ప్రార్ధించి, పూజించి తరించడం తప్ప ఒక బుడగగా ఏం చెయ్యలేను. అప్పట్నుంచీ పై నుంచి పడే చుక్కని నా మీద పడవద్దని, ప్రవాహాన్ని నాకేమి ఇతర ఆకారాలు తగలకుండా చూడమనీ ప్రార్ధించడం మొదలెట్టాను. ఆనందంగా కొట్టుకుపోతున్నా. నా ప్రార్ధన ఫలించింది. అలా అనుకున్నా అంటే బెటర్. ఏదో నెత్తి మీద పడే వరకూ ప్రార్ధన ఫలించినట్టు లెక్క, పడితే ప్రార్ధన సరిపోలేదని సరిపెట్టేసుకోడం. ప్రార్ధన వల్ల పడడం ఆగిందా లేక పడే వరకూ చేసిన ప్రార్ధన నా point of attention ని మరిపించిందా? I decided not to know that.

పై చుక్క, ప్రవాహం వీళ్ళే దేవుళ్ళు. దేవుళ్ళు బుడగల్ని చల్లగా చూస్తారు. మంచి బుడగల్ని మరీ చల్లగా చూస్తారు. చిరంజీవుల్ని చేస్తారు. నేను మంచి బుడగని.......... ఇదే నాకు నచ్చిన ఆలోచన విధానం. అందరూ ఇలాగే ఆలోచిస్తే పుడమి బుడగ మీద chaos తగ్గుతుందేమో. ఫిలాసఫీ, సంపూర్ణ శరణాగతి బుడగలకీ ఉంటాయా అనిపిస్తోందా? బుడగలం కాబట్టే ఆ రెండూ కావాలి అని బుడగ బుర్రకి అర్ధం కాలేదనమాట. నాకర్ధం అయిన (అయిందనుకున్న) ఈ విషయాలన్నీ ప్రపంచంలో, అదేనండీ ప్రవాహంలో, ఉన్న అన్ని బుడగలకీ వివరించి వాటిని నాలాంటి భక్తబుడగలుగా మార్చెయ్యాలని ఒకటే తపన. నన్నుచూసి కొన్ని బుడగలు మారాయని కూడా అనుమానం. మారని వాటిని పట్టి పల్లర్చాలనే కసి కూడా. ప్చ్! బుడగత్వం!

నా చిన్ని బుడగకి శ్రీ రామ రక్షా, నెత్తిన ఏదో పడుటే శిక్షా కొట్టుకుపోవుట దేవుడి లీల, బుడగ బతుకులో ఆగని గోల, "టప్పు"కు ముందు బుడగ వుండదు "టప్పు" తరువాత బుడగ వుండదు టప్పులు లేక బుడగలు లేవు, బుడగల కోసం టప్పులాగవు నా చిన్ని బుడగకి శ్రీ రామ రక్షా, నెత్తిన ఏదో పడుటే శిక్షా......

ఇలా భజన చేస్తూ కొట్టుకుపోతున్నా (న్నాం). నా ఉద్దేశం అన్ని బుడగలూ ఇలాగే కొట్టుకుపోతాయని. "టప్" అనే వరకూ.

ఇంతలో ప్రవాహంలో ఏదో పెద్ద మార్పు, సడెన్ గా చుట్టూ లక్షలాది బుడగలు అన్నీ మావైపే వచ్చేస్తున్నాయి. మీదడి పోతున్నాయి. చుట్టూ "టప్" శబ్దాలు మార్మోగిపోతున్నాయి. బుడగలందరం హాహాకారాలు చేస్తున్నాం. వేగంగా కొట్టుకుపోతున్నాం. ఎక్కడికో పాతాళానికి పడిపోతున్నట్టు ప్రవాహం లాగేస్తోంది. పైనుంచి ఏదో శక్తి తోసేస్తోంది.

దేవుళ్ళిద్దరికీ ఏదో కోపం వచ్చేసినట్టుంది. బుడగల్ని నాశనం చేసేస్తున్నారు. నన్నంటి పెట్టుకు వచ్చిన బుడగలు మిగిలిన వాటిలో కలిసిపోయాయో, పగిలిపోయాయో ... అర్ధమైపోయింది. నాకూ "టప్"మనే టైమోచ్చేసిందని, అనేయ్యాలని, అనేస్తున్నాననీ.... "టప్" అంతే ఆ పైన నాకేం తెలియదు. "టప్" అన్న టైములో కనబడిన దృశ్యం తప్ప -

అదే, ప్రవాహం ప్రళయంగా మారిన చోట కోట్లాది కొత్త బుడగలు. ఎక్కడికో కొట్టుకుపోతూ కోట్లాది "కొత్త" బుడగలు. ప్రవాహం ఇంతకు ముందు లాగే తన పని తను చేసుకు పోతోంది. చట్టం లాగా. కానీ ప్రవాహం చుట్టూ ఉన్న సీనరీ మాత్రం మారిపోయింది. ముందు నేను చూసిన దానికన్నా భిన్నంగా ఉంది. ఆకారం, రంగు, శబ్దం అన్నీ తేడాగా ఉన్నాయి. ఈ కొత్త ప్రవాహంలో కొత్త సీనరీల మధ్యలో బుడగస్య బుడగ జీవితంలో ఏమైనా మార్పుంటుందా?ఏమో. ఉండదేమో? మారినట్టనిపించినా మారదేమో. ఆ కొత్త బుడగలకే తెలియాలి.

ఏదేమైనా బుడగై పుట్టాక "టప్పు"లు తప్పవు అనుకుంటూ టప్పుమని పగిలి సన్నటి తుప్పరయిపోయి ప్రవాహంలో పడిపోయా. మళ్ళీ బుడగయ్యానో, లేదో తెలుసుకునే అవకాశం లేదు.

అవుతాననే ఆశ, అందుకు అవకాశం ఉందనే నమ్మకం - వీటితోనే హాయిగా పేలిపోయా మళ్ళీ బుడగత్వపు భయాలూ, ప్రమాదాలూ, అనిశ్చితీ - వీటితోనే భయం భయంగా పేలిపోయా బుడగగానో, ప్రవాహం గానో, ఈ రెండిటికీ అతీతమైన ఇంకేదో అదృశ్య శక్తిగానో ఉంటూనే ఉంటానని తెలిసి పేలిపోయా ఉండడం ఒక్కటే నా స్వభావం అనీ, ఉండకపోవడం అనేది నాలో లేనేలేదని, నా చేత కాదని తెలుసుకుని ధైర్యంగా పేలిపోయా

Comments   

 
0 #5 యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ బుడగ! Gopal Yadavalli 2014-11-07 05:33
Too good. Thought provoking. Whole philosophy in a nut shell.
Quote
 
 
0 #4 యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ బుడగ! Raghothama Rao 2014-11-06 13:57
బావుంది యడవల్లి వి.ఆర్. గారు.
Quote
 
 
+2 #3 యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ బుడగ! Seshu 2014-11-04 02:51
వ్యాసం చాల బాగుంది. మీ ప్రశ్నకూడా బాగుంది. అన్ని బుడగలకి ఈ విషయం తెలుసా అని మన హీరో బుడగ అనుకోవడం ..
నా అభిప్రాయం : అన్ని బుడగల్లో ఎందుకు ప్రవాహం లో కొట్టుకు పోతున్నాను ? అనే ప్రశ్న ఉన్నా, లేకపోయినా.. ఎప్పుడో ఒకప్పుడు టఫ్ అంటానని తెలియడం తద్వారా టఫ్ అంటానేమో అనే భయం మట్టుకు సహజం గానే ఉంటుంది. చుట్టూ ఉన్న బుడగల్ని చూస్తూ కొంత ధైర్యం తెచ్చుకుంటూ , భయాన్ని కప్పి పుచ్చుకుంటూ ఎలాగో ఒకలా గడిపేసే ప్రయత్నం చేస్తాయి (95% అఫ్ ది బుడగలు).
మీరు చెప్పినట్టు " ఉండటం" దాని సహజ స్వభావం కాబట్టి "ఉండగలగడం" అనే స్థితి ముఖ్యం. అది ఏ ఆకృతిని పొంది ఉన్నాను? ఏమి చెయ్యగలుగుతున్న ాను? ఏమి చెయ్యలేకపోతున్న ాను? అనే ప్రశ్న లన్నిటిని మించిన స్థితి.
ఓ బుడగ పరిస్థితి చూసి ధైర్యం కోల్పోవడం లేక ధైర్యం తెచ్చుకోవడం లాంటివి ఆ బుడగ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది.
ధైర్యం గ ఉన్నా,అధైర్య పడినా... ప్రవాహం లో కొట్టుకు పోవడం తప్పదు. ఆకృతి లో మార్పు తప్ప ఉండగలగడం లో మార్పు లేదు.
ఈ సత్యం గ్రహించిన బుడగ తనకి అధైర్యం గ అనిపించిన ప్రతి సారి ఈ నిజం గుర్తు చేసుకుని ధైర్యం తెచ్చుకుంటుంది. ప్రతి క్షణం "ఉండగలగడం " అనే ఈ స్థితి ని ఆనందిస్తూ ఉంటుంది.
Quote
 
 
0 #2 యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ బుడగ! పార్థ 2014-11-03 03:50
చాలా బాగుంది.
Quote
 
 
0 #1 యాన్ ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ బుడగ! Sivaji.n 2014-11-02 18:44
Very good musing. good flow of thoughts n language.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh