The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 3
PoorBest 

తప్పనిసరయి ఇక తప్పదురా అనుకున్నప్పుడు అనుభవించి ఆనందించమని ఇంగ్లీష్ లో ఓ సామెత వుంది. మంచికో చెడుకో టీవీ అనేది ఇప్పుడు ‘నెసిసరీ ఈవిల్’ గా తయారయిందన్నది మాత్రం నిజం. తిట్టుకుంటూ అయినా చూడక తప్పని అవసరంగా మారిందన్నది మరో నిజం. కాదనలేని ఈ నిజాల దృష్ట్యా తిట్టుకోవడం కూడా మానేసి టీవీని చూస్తూపోతూవుంటే నష్టపోయేదేమీ వుండదు కరెంటు ఖర్చు తప్ప – అన్నాడో టీవీ విప్లవకవి.

వెనుకటి రోజుల్లో, ఆవు పేడ ఎక్కడ దొరుకుతుంది అంటే ‘దూరదర్శన్ లో‘ అనేవారు నవ్వుతాలుగా. కానీ ఇప్పడు యిరవై నాలుగ్గంటల న్యూస్ చానళ్ళు వచ్చేశాక మొదలయిన ఊకదంపుడు చర్చలు చూస్తునప్పుడు ఆ పేడా పిడకలే నయమనే వారు ఎక్కువయ్యారు.

వార్తల అధారంగా వ్యాఖ్యలు, వ్యాఖ్యల ఆధారంగా వార్తలు, మళ్ళీ వీటి ఆధారంగా చర్చలు, వాటిపై తిరిగి ‘ఫోన్ ఇన్ లు’, మధ్యమధ్యలో విలేకరుల విరుపులు, యాంకర్ల విన్యాసాలు, ‘లక్ష వొత్తుల నోములు’ లక్షసార్లు నోచుకోవాల్సిన న్యూస్ ప్రేజెంటర్ల మూకుమ్మడి తెలుగు భాషా హత్యాప్రయత్నాలు, బుల్లితెర నిండుగా ‘ఇప్పుడే అందిన ఎప్పటివో వార్తలు’, తాబేలు-కుందేలు మాదిరిగా డేకుతూ, పాకుతూ వెళ్ళే స్క్రోలింగులు, పంటికింది రాళ్ళలా యాడ్లు-ఒకటా రెండా యేమని చెప్పుదు ఆ టీవీల లీలలు. యేమని వర్ణింతునూ ఆ ఛానళ్ళ సొగసులు అన్నాడో వికటకవి.

**********

కానీ, ఇక్కడే కరెక్టుగా పైన చెప్పిన సామెత అక్కరకు వస్తుంది. అన్ని వేలుపోసి టీవీ కొనుక్కున్నదెందుకు? వున్న చీకాకులను మరచిపోయి హాయిగా కాలక్షేపం చేసేందుకు. అంతేకానీ, ఇలా అడ్డమయిన చర్చల్లో తలదూర్చి లేని తలనొప్పులు తెచ్చుకునేందుకు కాదుకదా. అందుకని తెలివయిన వాళ్ళు చేయాల్సింది ఏమిటంటే టీవీ రోట్లో పెట్టిన తలను రోట్లోనే వుంచేసి రోకటిపోటుని ఆహ్వానించి ఆస్వాదించడం అంటూ సెలవిస్తున్నాడో ఉచిత సలహా కవి.

అందుకాయన ఇస్తున్న ఉదాహరణలను సోదాహరణంగా గమనించండి.


"ముఖ్యమంత్రి రోశయ్య గారు ఈ సాయంత్రం డిల్లీ వెడతారా?"

"సోనియా గాంధీ ఆయనకు అప్పాయింట్మెంట్ ఇస్తారా ?"

"అహ్మద్ పటేల్ లేదా అందుబాటులో వున్న మరో నాయకుడినో కల్సి సరిపెట్టుకుంటారా?"

"ఈ పరిణామాలను జగన్ వర్గం ఎలా గమనిస్తోంది?"

"జగన్ వర్గం వేయబోయే ఎత్తులపై కాంగ్రెస్ సీనియర్లు ఏమనుకుంటున్నారు?"

"రోశయ్య తదుపరి చర్యలు ఎలావుండబోతున్నాయి?"

"ఆయన వర్గం ఎలా భావిస్తోంది?"

"ఇంతకీ రోశయ్య గారికి ఒక వర్గమంటూ వుందా?"

"జగన్ వ్యతిరేక వర్గమే ఆయన వర్గమా?"

"ఇన్ని రకాల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర కాంగ్రెస్ లో రానున్న రోజుల్లో

రాగల పరిణామాలెలా వుండబోతున్నాయి?"

"ఎంతో ఆసక్తిని రగిలిస్తున్న ఈ అంశాలపై మేము అంటే మా ఛానల్ మాత్రమే నిర్వహిస్తున్న చర్చను మా ఛానల్ లోనే ఈరోజే-ఇప్పుడే చూడండి"

వంటా వార్పూ కార్యక్రమంలో ‘ఇలా చేసి మాడండి’ తరహాలో వెలువడే ఈరకం ప్రకటనలు వింటుంటే నవ్వు రావడం లేదా? ఇంతటి హాస్యాన్ని ఇరవై నాలుగ్గంటలపాటు ఇంటింటికీ పంచుతున్న తెలుగు టీవీఛానళ్ళ నిర్విరామ, నిస్వార్ధ, నిర్వికార సేవానిరతిని కొనియాడడానికి మీకు మాటలు రావడం లేదా? అయినచో మీకు నిష్కృతి యెట్లు? మీబోటి బోంట్లకు అదే సరయిన మార్గం.

తలను రోటిలోనే వుంచండి. రోకటి పోటుకు వెరవకండి.

@@@@@

Comments   

 
+1 #3 ?? Indian Minerva 2011-09-02 03:54
తీవీ చూస్తున్నాప్పుడ ు నాకో సందేహం వస్తుందండీ. ఒకపక్క ఆడియో, వీడుయో ఇవిగాక రెండు స్రోలింగులు (న్యూస్ చానల్సైతే ఒక్కోసారి మూడు) వెరసు నాలుగు లేదా ఐదు info streams. మనకున్న ఒక్కతలతో ఇన్ని streams ని మనం follow అవ్వగలమా అని.
Quote
 
 
0 #2 RE: నేడే చూడండి Saikiran Kumar Kondamudi 2011-02-23 16:14
చాలా బాగా చెప్పారండి.
Quote
 
 
0 #1 RE: నేడే చూడండి రమాపతిరావు 2011-02-18 05:06
అంతా ఎంతోబాగుంది కానీ.....'నిర్వ ికార సేవానిరతి????? వికారం కలుగుతోంది.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh