The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 3
PoorBest 

ఆ మధ్యన బుచ్చిబాబు "చివరకు మిగిలేది" గురించి కొన్ని వ్యాసాలొచ్చాయి. వాటికి కొనసాగింపుగా కామెంట్లూ వొచ్చాయి. కొంచెంమందికి "చివరకు మిగిలేది" వొట్టి కధలా అనిపిస్తే కొంచెంమందికి కవితాత్మక వచనంగా కనిపించింది. యిప్పుడు నే రాస్తున్నది చివరకు మిగిలేది గురించి కాదు. కవిత్వం గురించి. కవిత్వంలా అనిపించే వచనం గురించి.

కవిత్వం-వచనం వేరువేరని యిప్పటికే చాలాసార్లు అనేసుకొన్నాం. గానీ మన తెలుగు వీరబాహులు చాలామంది వచనాన్నే కవిత్వమని బుకాయించి చెలామణి చేయిస్తూనేవున్నారు.

దీన్నలావుంచి మళ్ళీ కవిత్వం - వచనం గురించి ఆలోచించి చూస్తే కొన్ని విషయాలు గట్టిగా చెప్పాలనిపించింది.

వచనం ప్రధానంగా సాగేవి కధ, వ్యాసం, నాటికలు వగైరా. యీ విభాగాల్లో వచనం యెల్లా పనిజేస్తోందో కొంచెం తెలుసుకొంటే కవిత్వాన్ని వడగట్టే సాధనం పట్టుబడుతుంది. కధల్లో గానీ నాటికల్లో గానీ వుండేవి సంఘటనలు. ఒక క్రమంలో అమర్చిన సంఘటనలని చెప్పుకోవొచ్చు. ఈ సంఘటనలు కల్పితాలు గావొచ్చు, వాస్తవమూ గావొచ్చు. వో కధని చెప్పేటప్పుడు కధకుడు సంఘటనలకే యెక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. కొన్ని పాత ఘటనల సహాయంతో పాత్రల్లో యెప్పటికప్పుడు జరిగే ఆత్మ సంఘర్షణల్ని వర్ణిస్తాడు. యీ వర్ణనల్ని చదువుతున్నప్పుడు పాఠకులు ఉత్తేజానికి గురౌతారు. అది కల్పితమైన ఘటనైనా, వాస్తవమైన ఘటనైనా రచైత సామర్ధ్యాన్ని బట్టి యీ ఉత్తేజం కలుగుతుంది. యీ ఉత్తేజం తాత్కాలికం. కధ చదివినంతసేపో లేక కొద్ది రోజులో మాత్రమే! గమనించి జూస్తే ఉత్తేజం వొక శారీరిక స్పందన మాత్రమే.

కవిత్వంలోకొచ్చేసరికి సాదాసీదా వాక్యాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. మారిపోవాలి కూడా. కవిత్వం పాఠకులకి ఉత్తేజాన్ని మాత్రమే కలగనివ్వదు. వ్యక్తిగతమైన భావస్పందన్ని కూడ కలిగిస్తుంది. యీ కదలిక మానసికమూ, శాశ్వతమూ అయివుంటుంది.

**********

కవిత్వం ఆత్మను ప్రదర్శిస్తుంది. వచనం భౌతిక ప్రపంచాన్ని చూపుతుంది. కవిత్వంలో వాస్తవాల పట్ల కొంచెం అజ్ఞానం ప్రకటించబడ్డా దోషం కాదు. అదే వో వ్యాసంలో భౌతిక వాస్తవాలకి దూరంగా రాయడానికి కుదర్దు. ఎవర్నో ఉద్ధరించడానికి కవిత్వం రాస్తున్నానన్న యావ కవిలో పుట్టుకొచ్చినప్పుడు కవిత్వం మరణిస్తుంది. అదే కధనో, వ్యాసాన్నో, డ్రామాన్నో నాకోసం రాసుకొంటానని ఎవరైనా అంటే అది అజ్ఞాన పరమావధనే అనుకోవాలి.

కవిత్వమెప్పుడూ యేకాంతంలోనుండి పుట్టుకొస్తుంది. వున్నట్టుండి పుట్టుకొచ్చిన అపరిచత భావాలకి రూపాన్నివ్వడంలోనే కవి శబ్ద వాచ్యులు పుట్టేది గిట్టేది. మనసులో పుట్టి, యెంతో చెప్పాలకొన్నదానికి వ్యావహారిక భాషలో వుండే అతిదగ్గరి పదాల్ని యేర్చి పేర్చడం "క కొమ్మిస్తే కు" అన్నంత సులభం గాదు. అంచాత చేతి దురద కొద్దీ రాసి, రంగురంగు పేపర్లో అచ్చొత్తి, అంగళ్ళలో అమ్మేవన్నీ కవిత్వమైపోవు.

కవి యేకాంత మానసంలో జరిగిన మధనం చదువరి మనసులో కూడా జరగడమే రసాస్వాదన. అంటే వొక ఆత్మ మరో ఆత్మతో సంభాషించడం. ప్రపంచంలోకెల్ల కష్టమైన పని యిదేనని నా అభిప్రాయం.

కవిత్వం వొంటరిగా వున్న మనసులో పుట్టుకొచ్చినప్పుడు కవి మాత్రమే దాని సాక్షి. మూగవాడు సాక్ష్యం చెప్పాలంటే యెంత కష్టమో వొంటరితనంలో జరిగిన అంతర్మధనాన్ని బైట ప్రపంచానికి పరిచయం చైడం గూడా అంతే కష్టం. యిల్లా అష్టకష్టాలు పడి జీవితకాలంలో పట్టుమని పది కవితలు రాయడం గొప్ప. గానీ మన తెలుగునేలలో సంవత్సరానికో సంకలనం అదీ కనీసం 50-70 కేకలు పెడబొబ్బల్తో విసర్జించే ఘనాపాఠీలున్నారంటే సదరు కవిత్వం పుట్టుక యెల్లాంటిదో వూహించడం సులువు.

*********

మెప్పుకోసమో, సానుభూతి కోసమో రాసేది కవిత్వం కాలేదు. అరువు దెచ్చుకొన్న ఆవేశాలతో కవితలు పుట్టవు. పెట్టుడు మీసాలు గిన్నీసుబుక్కులోకి యెక్కవు. దుక్కిదున్ని, విత్తు విత్తకండానే సంకలనాల కొద్దీ కవిత్వ వ్యవసాయం జేయడమనేది వో మానసిక రోగం. నిజమైన బాధతో మాట్లాడినప్పుడు పచ్చి తాగుబోతు గూడా కవిత్వంలాంటిదే చెప్తాడు. దానికంటే హీనంగా రాసి కవిత్వమని బుకాయించడం "ఆత్మలోకంలో దివాలా" అనే జెప్పాలి.

కవిత్వం రాయడామో స్టేటస్ సింబల్ గాదు...అదో సాధన...గుప్తసాధన.

కవి మనస్సు లేనివాడు కవిత్వం రాస్తే అది వచనంలా తేలిపోతుంది. అందుకు కారణం సదరు వ్యక్తి వ్యాపార దృష్టే. నే గెలికినదానికి యెన్ని చప్పట్లొస్తాయి, యెంతమంది సొల్లు పొగడ్తలు జేస్తారనే కాకిలెక్కలు.

భౌతిక జీవితంలో అతి సాధారణంగా జీవించినా గొప్పకవులు మనోలోకాల్లో అద్భుత సౌధాల్ని నిర్మించుకొన్నారు. అంచాతనే వాళ్ళ కవిత్వమూ అద్భుతంగా పలికింది. మనో దారిద్ర్యం, భావదారిద్ర్యంతో చెప్పుకొచ్చిన కవిత్వాలు నామ్ కే వాస్తే జ్ఞానపీఠాల్ని యెక్కినా ప్రజల జ్ఞాపకాల్లో నిలవ్వు. 

*********

పౌరాణిక నాటకాల్లో కృష్ణపాత్రధారో, అర్జున పాత్రధారో తనే పద్యం పాడితే జనాలు వొన్స్ మోరంటారో అనుభవం మీద తెలుసుకొనుంటాడు. ఆ పద్యాన్ని అవసరం కంటే గూడా సాగపీకి పాడతాడు. అలా వో చట్రంలో యిరుక్కుపోయి బైటికి రమ్మన్నా రాలేడు. యిప్పుడు పెట్టుడు భుజకీర్తులు తగిలించుకొన్న కొద్దిమంది తెలుగు కవులు ప్రయోగాల్లోకి పోయి పైకి లేవనెత్త జూసినా లేవలేనంత రొంపిలో దిగబడిపోయారు. కవిత్వంకు టార్గెట్ ఆడియెన్సు వుండరన్న ప్రాధమిక సత్యం కూడా వీళ్ళకి తెలీదు.

యీమధ్యన తగ్గినట్టుందిగానీ, వొకప్పుడు కవిత్వ పోటీలు విరివిగా జరిగేవి. యింతకంటే హాస్యాస్పదమైనది మరొహటుండదు. దీనికంటే హాస్యాస్పదం సదరు పోటీలకి "న్యాయనిర్ణేతలు"గా విచ్చేసే మహామహోపాధ్యాయులు. వొచ్చిన వంద కోడిగుడ్లలో యే మూడు గుడ్లకి యీకలు మొలిచాయోనని లెక్కవేయజూసే వాళ్ళన్నమాట. ఆపై యీకల కోడిగుడ్లపై ఆ మహాశయులు జేసే వాచాలత్వం దుర్భరమే గాదు మన దౌర్భాగ్యాన్ని కూడా చాటుతుంది.

*******

అతితెలివికి, కవిత్వానికి తేడా తెలీని అర్భకులున్నంత కాలం "యేది కవిత్వం" అన్న చర్చ కొనసాగుతూనే వుంటుంది. యిల్లాంటి రాతల అవసరమూ కనపడుతుంది.

*******

Comments   

 
+1 #6 RE: కవిత్వం గురించి కొన్ని మాటలు narasimharao 2012-02-17 19:46
aalok

"భౌతిక జీవితంలో అతి సాధారణంగా జీవించినా గొప్పకవులు మనోలోకాల్లో అద్భుత సౌధాల్ని నిర్మించుకొన్నా రు. అంచాతనే వాళ్ళ కవిత్వమూ అద్భుతంగా పలికింది. మనో దారిద్ర్యం, భావదారిద్ర్యంతో చెప్పుకొచ్చిన కవిత్వాలు నామ్ కే వాస్తే జ్ఞానపీఠాల్ని యెక్కినా ప్రజల జ్ఞాపకాల్లో నిలవ్వు." అలోక్ వాస్తవ్,
ఇంతకంటే గోప్ప్హ వాక్యం ఈమధ్య కాలం లో చదవలేదు.
you are just felonious .
C Narasimha rao
9346 774 294
Quote
 
 
0 #5 RE: కవిత్వం గురించి కొన్ని మాటలు శివరామ్ ప్రాసాద్ 2011-12-02 04:40
కవిత్వము గూర్చి ఆలొక్ గారి ఆలొచనలు బాగా ఉన్నవి. కవిత్వము ఒక ఆల్కెమి. ఒక పరుసవెది.తాకినద న్తా బ౦గార౦.
Quote
 
 
+1 #4 RE: కవిత్వం గురించి కొన్ని మాటలు Raghothama Rao 2011-10-25 05:52
హల్లో సతీశ్!

ఎలా ఉన్నావ్ :-)

చాలా రోజులకు ఆవకాయను, కవిత్వాన్ని గుర్తుచేసుకున్న ట్టున్నావ్!!
Quote
 
 
+2 #3 RE: కవిత్వం గురించి కొన్ని మాటలు సతీష్ 2011-10-18 15:33
దురదృష్టవశాత్తూ ఎవడికి వాడు తాను రాసిందే కవిత్వమనే భ్రమలో ఉంటాడు. తాగేవాడిని చూసి తాగనివాడెంత జాలిపడతాడో, తాగనివాడిని చూసి తాగేవాడు అంతే జాలిపడతాడు! అది లోకసహజం.
Quote
 
 
0 #2 RE: కవిత్వం గురించి కొన్ని మాటలు I 2011-07-28 16:41
Hi Alok,
Inkaa chaalaa daachipettav,to be cont.... yeppudu?
with Kind Regards,
I'
Quote
 
 
+2 #1 RE: కవిత్వం గురించి కొన్ని మాటలు రమాపతిరావు 2011-02-18 05:26
బాగు బాగు..కొన్ని మాటలంటూ ఎన్ని మాటలన్నారు అలోక్ గారు.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh