The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 2
PoorBest 

"అమ్మ చిక్కిపోతోంది" అని బుధులు బాధ పడడంలో అర్థమూ, అంతరార్థమూ ఉన్నాయి. జీవ గమనాన్ని నిర్దేశించే ప్రతీ అంశాన్ని లౌకీకమైన బంధాలనుండి ఆవలకి చూడగలగడమే మానవ జన్మ ప్రథమోద్దేశము. ప్రధానోద్దేశము కూడాను.

మన దైనందిన జీవనాన్ని అత్యంత ప్రభావశాలిగా తీర్చడంలో అక్షరాల పాత్ర అమోఘము. అద్భుతము. అటువంటి అక్షరాలను దినేదినే కుంచింప చేయడము విచారకరము.

ఈ పరిస్థితిలో మన పూర్విజులు యేతత్ అక్షరాలను ఎలా నిర్వచించారు? ఎలా అన్వయించుకొన్నారు? ఎలా పూజించారు? అన్న విషయాలను సూక్ష్మంగానూ, సంగ్రహంగాను చెప్పడమే ప్రస్తుత రచన యొక్క ఉద్దేశ్యము.

"అక్షరాణాం అకారోస్మి" అని భగవంతుడు పేర్కొన్నాడు. నేనే అక్షరాన్నని భగవంతుడు చెప్పుకోవడము యేతత్ అక్షరాల గరిమను, మహిమను తేటతెల్లం చేస్తుంది. అంతేకాదు "ఓమ్ ఇత్యేకాక్షరం బ్రహ్మ" అన్న గీతా వాక్యము కూడా అక్షరాల మహత్తును చాటుతుంది.

అన్ని అక్షరాలకు మూలమైన ఓమ్ కారము 8 అక్షరాల సమ్మిశ్రము. అవి ఏవనగా అ, ఉ, మ, నాద, బిందు, ఘోష, శాంత, అతిశాంత. ఇందులో మొదటి మూడు మాత్రమే మన చెవులకు ప్రకటమౌతాయి. మిగిలిన ఐదూ మానవానుభవానికి దొరకవు.

అక్షరము పుట్టే మునుపు ఉన్న అవస్థ "అతిశాంత". దానినుండి "శాంత". దానినుండి "కలా". దానినుండి "బిందు". అద్దాని నుండి అస్పష్టమైన "నాదము". నాదమునుండి అస్పష్టమైన అక్షరము యొక్క ఉత్పత్తి. ఈవిధముగా ఐదు అస్ఫుటమైన అక్షరాలు, మూడు స్ఫుటమైన అక్షరాలు కలిసి సమస్త అక్షరాలకు మాతృక అయిన ఓం కారము ఏర్పడింది.

"నాద బిందు కలా ధ్యానాత్" అని చెప్పినట్టు అస్ఫుటాలైన మొదటి ఐదు అక్షరాలను కేవలము ధ్యానములోనే కనుగొనవచ్చును.

సంస్కృత భాషలో మొత్తము అక్షరాల సంఖ్య 50. ఇందులో స్వరాక్షరాలు 16. వర్గీయ వ్యంజనాలు 25. అవర్గీయ వ్యంజనాలు 9. ఇవన్నీ 8 అక్షరాల సమ్మిశ్రమైన ఓంకారం నుండే ప్రకటితమయ్యాయి. అందుకు నిదర్శనం:

ఈ 50 అక్షరాలను ఎనిమిది గుంపులుగా వింగడిస్తే ఒక్కొక్క గుంపూ ఒక్కొక్క ప్రణవాక్షరం నుండి అభివ్యక్తమయ్యాయి. అంటే:


అకారము - స్వరాక్షరములు (అ,ఆ మొదలైనవి)
ఉకారము - క వర్గము
మకారము- చ వర్గము
నాదము - ట వర్గము
బిందు - త వర్గము
కలా - ప వర్గము
శాంత - య, ర, ల, వ
అతిశాంత - శ నుండి ళ వరకు

గమనించి చూస్తే క వర్గము మొదలుగొని అన్ని అక్షరాలూ "అ"కారముతో కూడియే ఉచ్ఛరింపబడతాయి. నాలుక - పై పెదవితోను, క్రింది పెదవితోను, నోటి లోపలి పైభాగముతోనూ కలిసి, అకార సహితముగా ఉచ్ఛరించినపుడు ఈ వ్యంజనాలు ఏర్పడుతాయి. అందువల్లనే భగవంతుడు అక్షరములలో అకారాన్ని అని చెప్పుకొన్నాడు.


ప్రతి అక్షరమూ ఒక భగవంతుని రూపమునకు ప్రతినిధి.

అ - అజ - పుట్టుకయే లేనివాడు
ఆ - ఆనంద - సుఖరూప
ఇ - ఇంద్ర - ఉత్తమ సామర్థ్యము కలవాడు
ఈ - ఈశ - లక్ష్మీదేవికి భర్త (ఈం = లక్ష్మి)
ఉ - ఉగ్ర - సంహారకుడు
ఊ - ఊర్జు - శక్తివంతుడు మరియు క్రియా పూర్ణుడు
ఋ - ఋతంభర - జగదోద్ధారకుడు
ౠ - ౠఘ - దానవుల జననియైన దనూదేవికి సంతాప జనకుడు
లు - లుశ - దేవమాత అదితికి సుఖ కారకుడు
లూ - లూజి - దుష్టులను జయించినవాడు
ఏ - ఏకాత్మ - ముఖ్య స్వామి
ఐ - ఐర - రుద్రుని జయించిన వాడు
ఓ - ఓజోభృత్ - సర్వ సమర్థుడు
ఔ - ఔరస - బ్రహ్మను పుత్రునిగా బడసినవాడు
అం - అంత - లయకారకుడు
అ: - అర్ధగర్భ - బ్రహ్మాదులను ఉదరములో ధరించినవాడు

క - కపిల - సుఖరూపి, జగత్పాలకుడు, లయకారకుడు
ఖ - ఖపతి - ఇంద్రియాలకు నియామకుడు
గ - గరుడాసన - గరుడవాహనుడు
ఘ - ఘర్మ - శతృ సంతాపకుడు
జ్ఞ - జ్ఞసార - విషయ వస్తువులలో సార రూపము ధరించినవాడు

చ - చార్వాంగ - సుందరాంగుడు
ఛ - ఛందోగమ్య - వేదవేద్యుడు
జ - జనార్దన - చావు, పుట్టుకల బంధ నాశకుడు
ఝ - ఝూటితారి - శతృవులను దూరము చేసెడి వాడి
ఇణ్య - ణ్యమ - స్త్రోతము చేయువాని పై అభిమానము చూపువాడు

ట - టంకీ - కులిశ ఆయుధం ధరించినవాడు
ఠ - ఠలక - రుద్ర, ఇంద్రులకు సుఖప్రదుడు (ఠ: - రుద్ర, ల: = ఇంద్ర)
డ - డరక - చంద్రాగ్నులకు ప్రకాశము నిచ్చువాడు
ఢ - ఢరీ - చతుర్ముఖునిచే వంద్యుడు
ణ - ణాత్మ - సుఖరూపి

త - తార - అనిష్టములనుండి దాటించేవాడు
థ - థభ - శిలలనెత్తినవాడు (గోవర్ధనోద్ధారి)
ద - దండి - పశువుల మేపుటకు దండము ధరించినవాడు
ధ - ధన్వీ - విలుకాడు
న - నమ్య - అందరిచే వందనములు స్వీకరించువాడు

ప - పర - పాలకుడు
ఫ - ఫలీ - కర్మఫలము నిచ్చువాడు
బ - బలీ - బలప్రదుడు
భ - భగ - పూర్ణైశ్వర్య రూపుడు
మ - మను - అవబోధ రూపి

య - యజ్ఞ - అందరిచే పూజనీయుడు
ర - రామ - రమాపతి
ల - లక్ష్మీపతి
వ - వర - (లక్ష్మీదేవి చే) వరింపబడేవాడు
శ - శాంతసంవిత్ - సుఖరూపమైన జ్ఞానము కలవాడు
ష - షడ్గుణ - ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, కాంతి, జ్ఞానము, విజ్ఞాన
మను ఆరు గుణములతో కూడినవాడు.
స - సారాత్మ - సర్వోత్తముడైన వాడు
హ - హంస - అన్నింటినీ లయము చేసెడి సార రూపమైన వాడు

ఇలా ప్రతి అక్షరమూ భగవత్స్వరూప ప్రతిపాదకముగా ఉన్నది. అనగా ఏ ఒక్కటినూ వ్యర్థము కానిది. ఐతే పలుకుటకు కష్టమైనదని, ఓపిక లేదని భావించి తొలగించుట వ్యక్తియొక్క అయోగ్యతను సూచిస్తుందే తప్ప అక్షరముల నిరర్ధకతను కాదు.

మనము పుట్టించని వాటిని తొలగించే అధికారము మనకు లేదు. ఐననూ స్వతంత్ర్యించి విధి నియమాన్ని ధిక్కరించినచో నష్టము మనకు, మన భావితరాలకు మాత్రమేనన్న ప్రజ్ఞ ఇక మీదటనైననూ నిలవాలని ప్రార్థన.


ఉపయుక్త గ్రంథము : శ్రీ ఆనందతీర్థ విరచిత "తంత్రసార" గ్రంథము.

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh