The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 1
PoorBest 

 

From Editor : This article was first published in www.aavakaaya.com in June, 2008

 

ఈశావాస్యోపనిషత్తులో ఆత్మ గురించిన వివరణలో వో చోట "కవి" గురించిన వివరణ వుంది.

కవిర్మనీషీ పరిభూ:
స్వయంభూ: యాథాతథ్యత:
అర్థాన్ వ్యదధాత్
శాశ్వతీభ్య: సమాభ్య:

ఆ ఆత్మకవి - సర్వవ్యాపి, క్రాంతదర్శి, ఋషి ఐవుంటాడు. అంతేకాదు అతను విశ్వప్రేమి, ఆత్మనిష్టావంతుడు, యధార్థాన్ని మాత్రమే మాట్లాడేవాడు, కాలదృష్టి కలిగి శాశ్వతుడై వుంటాడు.

పై ఉపనిషత్తు వాక్యాల్లోని ఆధ్యాత్మికార్థాలు యేవైనా మనకందుబాటులో వున్నంత వరకూ "కవి" లక్షణాల్ని చక్కగా చెప్తున్నాయి.శాశ్వతుడై, క్రాంతదర్శియై వుండాలి కవి. అప్పుడే ఆ రచనలు శాశ్వతంగా వుంటాయి. గానీ ఇప్పుడు వేలకొద్దీ "కవులు" రాస్తున్న లక్షలకొద్దీ రచనల్లో కాలం ధాటికి కాళ్ళు తేలనివెన్ని? పేలపిండి కవిత్వం యెవరి నుద్ధరించడానికి?

హేతుబద్ధమైన బుద్ధికి, హేతురాహిత్యంతో కూడిన మనసుకీ మధ్య సమన్వయం సాధించడమే కవిత్వం. ప్రతిదానికీ తర్కాన్ని వెతికే బుద్ధిని, ప్రతి స్పందనకీ ప్రతిస్పందించే మనసులోకి యేకీకరించడమే కవిత్వం. ఇల్లా పుట్టిన కవిత్వాన్నే మమ్మటుడు "తదదోషౌ, శబ్దార్థౌ, సగుణావనలం కృతి పున: కాపి" అన్నాడు. ఇట్లాంటి కవిత్వాన్నే "వాక్యం రసాత్మకం కావ్యం" అన్నాడు సాహిత్యదర్పణకారుడు.

ఇన్‍స్టంట్ ఇడ్లీ, ఇన్‍స్టంట్ దోసా తినేసి, తద్దోషఫలితంగా ఇన్‍స్టంట్ కవులైపోతున్న ఈ కాలంలో కవిత్వ రూప వైశిష్ట్యాల్ని చదివి, మననం జేసుకొని మనసు కేంద్రీకరించగలిగే తీరికేది? ఋషిత్వం రానిదే కవిత్వం రాదని మహామహులు మొత్తుకొంటుంటే, అక్షరమాల వొచ్చేసిందే చాలని, చప్పట్ల కోసమే యెగబడే వారు కూడా కవిత్వానికి దిగేస్తున్నారు. ఇల్లాంటి వాళ్ళని యెవరైనా విమర్శమన్యుడు కటువుగా విమర్శించాడే అనుకోండి, ’చిటికెడు ఆత్మనింద, డబ్బాడు ఆత్మస్తుతి’ని వెళ్ళగక్కి, అది చాలదన్నట్టు భట్రాజు బృందాలను ఉసిగొల్పేస్తారు.

అట్టి కవికుమారులు/కుమార్తెలు విమర్శకుల్లో సహృదయత గురించి మాట్లాడేముందర తమలో వుండాల్సిన సహృదయత గురించి తెల్సుకోవాల్సిన అవసరం చాలా వుంది.

ధ్వన్యాలోకకారుడైన ఆనందవర్ధనుడు ఈ విషయం గురించి ఇల్లా అన్నాడు...

 

 

"ధ్వనేస్వత్వం గిరామ్ అగోచరవన్ సహృదయ హృదయ సంవేద్యం యేవం సమాఖ్యాతవంత:"

కావ్యానికి ఆత్మవంటిదైన ధ్వని తత్వం మాటల్లో వర్ణించలేనిది.ఇది సహృదయవంతులైన వ్యక్తుల అనుభవం లోనిది.

"న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంత:కరణే గృహ్యతే"

ధ్వని తత్వం స్వయంగా తమతమ అంత:కరణంతోనే గ్రహించడం సాధ్యం.

అంటే మొత్తంగా ఆనందవర్ధనుడు చెప్పేదేంటంటే కావ్యానికి ఆత్మవంటిదైన "ధ్వని" గురించి తెల్సుకోవడానికి కవి అన్నవాడికి శుద్ధమైన అంత:కరణ, సహృదయత అవసరమని. "కవిత్వాన్ని రాసేస్తున్నామహో" అని హోరెత్తేస్తున్న కవికులాలంకారుల్లో యెందరు ఈ ఆత్మజ్ఞానాన్ని సాధించారు? యెందరికి స్వచ్ఛమైన, అమలినమైన అంత:కరణముంది? యెంతమంది తమకుతాము ఇల్లాంటి ప్రశ్నలేసుకొన్నారు?

"యావత్కావ్యం లోకోత్తర వర్ణనానిపుణం"గా వుండాలని, ఇదే "కవి కర్మ"అని మమ్మటుడు చెప్పాడు. "లోకోత్తరాణాం చేతాంసి, కో హి విజ్ఞాతు మర్హసి?" అని భవభూతి నిలవేస్తాడు. సమాధానమిచ్చే దినుసు వున్నవాళ్ళు కృతకృత్యంగా ఇస్తారు. లేనివాళ్ళు మందీమార్బల భట భట్రాజు సమేతంగా పలాయనం చిత్తగిస్తారు.

ముగింపు:

"కవనీయం కావ్యమ్. తస్య భావశ్చ కావ్యత్వం. సహృదయహృదయాహ్లాది శబ్దార్థమయత్వమేవ కావ్యలక్షణమ్."

ఇదీ సంగతి.

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh