The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 1
PoorBest 

 

 

First published in www.aavakaaya.com in the year 2008

 

 

"కలౌ దుష్టజనాకీర్ణే" అని "అజ్ఞాన వ్యాకులే లోకే" అని చాలామంది తిట్టిపోస్తుంటారు. మామూలు ప్రపంచం మాటెట్లున్నా ప్రస్తుతం తెలుగునేల్లో ముఖ్యంగా సాహిత్యసీమలో ఈ తిట్లు అక్షర సత్యాలు.

చాలా బ్లాగుల్లో యితరుల రాతల్ని తిట్టిపోసుకొంటూ attacking is the best defense అన్నట్టు తమతమ రాతల్ని కాపాడుకొనే వో విచిత్ర వ్యవహారం ప్రబలిపోయింది. యే ఎడిటరూ అవసరంలేదని, మా బాగోగులు మాకే బాగా తెల్సుననే గదా బ్లాగు ప్రచురణల్ని జేసుకొనేది! పొగిడేస్తే పరమ ఆప్తులు. కొంచెం అటుయిటూ గాక గోడ మీది పిల్లి వ్యాఖ్యలు జేస్తే వాళ్ళు అతిథులు. చెడమడా తిట్టేస్తే సాహిత్య ద్రోహులు. యిల్లా వొహరి రాతల్ని మరొహరు "విమర్శించటం" యే లోకనీతో? ఆయా "విమర్శల్ని" ఖండిస్తూ పేజీల కొద్దీ తిట్లకు లంకించుకోడం యే సత్సాంప్రదాయమో? రాసిన రాతల్లోనే పసలేనప్పుడు వాటిపై వొచ్చే విమర్శలు తిట్లకి యెక్కువ - బూతులకి తక్కువనే జెప్పాలి.

సరే. యీ భేషజాలు పక్కనెట్టి మళ్ళీ కవిత్వం విషయాన్ని జూసినప్పుడు, మొన్న చెప్పుకొన్న కొన్ని సంగతులతోబాటు ఇంకొన్ని జేర్చాలని అనిపించింది.

యిక్కడే వొచ్చిన వో హాస్య వ్యాసంలో జెప్పినట్టు నానా రకాల కవిత్వాలు కలుపుమొక్కల్లా తెలుగునేల పొడవు, వెడల్పుల మేరా పరుచుకొనిపోయాయి. అప్పుడప్పుడూ సూటి విమర్శల కొడవళ్ళతో నరక్కపోతే ప్రమాదమే!

చాలామంది కవుల్లో (అచ్చులో వున్నవాళ్ళనొదిలేసి బ్లాగుల్లో వెలిగిపోతున్నవాళ్ళు) "నాకంటూ వో శైలివుందని" భ్రమల్లో తేలిపోతున్నవాళ్ళున్నారు. కారణం వాళ్ళ సో కాల్డ్ అభిమాన బ్లాగర్లు. యీ అభిమానులకి అక్షరాల్ని చదవడమే దప్ప వాటి ఆత్మల్ని చూడ్డం తెలీదు. యిల్లా అంటే మేం భూతవైద్యుల్ని కామని దెప్పిపోడవొచ్చు. అది వారి అజ్ఞానం.

"యిందులో మీరే కనపడ్డారు" "యిల్లా మీరు మాత్రమే చెప్పగలరు" "అర్రే యిది ఫలానా వారి స్టైల్లా వుందే అనుకొన్నా. తీరా జూస్తే వారిదే" - యిల్లా సాగుతాయ్ కామెంట్లు. యిందులో పనికొచ్చే వొక్క అంశమూ వుండదు.

యిల్లాంటి పొగడ్తల్ని చదవగానే సదరు కవిగారికి "శైలి" ప్రజ్ఞ పుట్టుకొస్తుంది. ఇహ ఆపై సాగే నడక కుంటి నడకే. ఎవరో చెప్పేస్తే నమ్మేసి "ఓహో ఇది నా శైలి" అని ఎప్పుడైతే అనిపిస్తుందో ఇహ అంతే సంగతులు. శైలి అనేది ఒక గుర్తింపు జబ్బు. భావానికి తగిన భాషను కవి నిర్మించుకోవాలి గానీ "ఇది నా శైలి" అని పడికట్టులో పడిపోతే ఎలా?

 

 

అట్లైతే శ్రీశ్రీ, తిలక్, అజంతా వగైరాలందరు నిర్మించిందేవిటి? శైలికాదా? అనడిగితే కచ్చితంగా కాదంటాను. అది మన అజ్ఞానం కొద్దీ వాళ్ళకాపాదించిన తొడుగంటాను.వారి అద్వితీయ ప్రతిభను మనం "శైలి" అన్న చట్రంలో ఇమిడ్చి చూస్తున్నాం అంటాను.వాళ్ళు అల్లా కాక యింకోలా రాసుంటే వాళ్ళకీ అస్తిత్వం వొచ్చేదికాదు. అందుకే వాళ్ళ ప్రతిభ వాళ్ళకే పరిమితం. అది అనుకరణకి లొంగేదికాదు.

యీ విషయాన్ని గుర్తించలేక కొంతమంది గుడ్డెద్దు చేల్లో పడ్డరీతిలో మనమూ ఆ "శైలి"ని అనుకరించి వాళ్ళలా రాసెయ్యగలమని రాయబోయి బొక్క బోర్లా పడ్తున్నారు. గానీ భట్రాజు బృందాలు "అర్రే యిది తిలక్ రచనలా వుందే!" అనొ "వోహ్ టాగోర్ను గుర్తుజేసారనో!" కామెంట్లు రాస్తారు. దానికి ఆ రచైతలు "అర్రే భలే కనిపెట్టేసారే!" అని వొంకర్లు తిరిపోతారు. యిదంతా అప్రబుద్ధాలు. మనసు పెరగనితనం. నాన్న గెడ్డం గీసుకోడం జూసిన పిల్లవాడు క్రీము రాసుకోని రేజరు వాడే తీరు.

అనుకరణ తప్పు అని కాదు. గానీ అదొక తాత్కాలిక స్థాయి మాత్రమే. అనుకరించినా మన ప్రతిభను పోగొట్టుకొరాదు. మొదట్లో అనుకరించినా తర్వాతైనా బైటపడాలి. యేదో వొకరోజున నీ మానాన నువ్వు రాసుకుపోవాలి. అప్పుడే ఉత్తమ సాహిత్యం, నిజమైన సాహిత్యం సృష్టించబడుతుంది. లేదంటే క్లోనింగు సంతతితో జీవచ్ఛవ సాహిత్యమే పుడుతుంది. సొంతగొంతుకతో రాయడం వొక నిశ్చింత మనసులాంటిది. తొణకదు. బెణకదు.

వొక కవి రచనల్తో ప్రభావితమయ్యావంటే కవిత్వ స్వరూపం గురించి అతని/ఆమె దృష్టికోణంలోనుంచి నువ్వూ జూస్తున్నావనే. అల్లా జూసి రాసినదాన్ని సిద్ధాంతీకరణమనే అనాలిగానీ సాహిత్యమని అనలేం. యింకోలా చెప్పుకొంటే - ఆ ప్రభావం వల్ల కవిత్వం రూపు రేఖల పట్ల నీకో నిశ్చితాభిప్రాయం వొచ్చివుంటుంది. యిల్లా రాస్తే కవిత్వం కావొచ్చునన్న ప్రాధమిక అంచనా దొరికినట్టే. యిక్కడే ఆగిపోక దాని ఆధారంగా నువ్వు నీ వస్తువు, భావం, భాషను తీర్చుకోవాలి. అంటే ప్రాధమిక విషయాల్లో నీకు అనుమానాలుండరాదు. అప్పుడే నీ కవితలో గందరగోళం ఉండదు. ఆ నిర్మలత్వాన్ని వొక్కొక్కరు వొక్కో పంధాలో సాధించవొచ్చు. ఆ సాధనని మళ్ళీ యీ లోకం "శైలి" అనే పిలుస్తుంది. అల్లా పిలవడం లోకం బలహీనత. ఆ బలహీనత కవిశబ్దవాచ్యుల్లో వుంటే రోగం ముదిరినట్టే!

అసలు కవిత్వంలో గందరగోళం ఉండకూడదు. గానీ లోకం ఒక శైలిని ఆపాదించింది గదాని దున్నడం మొదలు పెడితే అకవి అవతారమనే తీర్మానించాలి.

వొక్కసారి ఆలోచించి చూడండి..సముద్రానికి శైలేమిటి? మనసు సముద్రం కదా మరి దానికి శైలేమిటి? ఆలోచనలు తరంగాలు కదా వాటికి శైలేమిటి? సముద్రం ఎప్పటికప్పుడు కొత్తదే....అలానే మన భావాలూ!

రంగు, రుచి, వాసనా మారని సముద్రం కొన్ని కోట్ల సంవత్సరాలుగా మనిషిని ప్రభావితం చేస్తూవచ్చింది. అల్లానే మన స్థాయీ భావాలు సైతం మనల్ని యుగాలుగా అల్లకల్లోలం జేస్తూనే వొస్తున్నాయి.

ఒకేరకమైన స్థాయీ భావాలు మాటకారినీ, మూగవాడినీ కుదుపుతాయి. మాటవచ్చినవాడు మౌనంగా అనుభవిస్తే, మూగవాడు అక్షరబద్ధం చేయవచ్చు. అది "వైవిధ్యం" అని లోకమంటే "సహజక్రియ" అని నేను అంటాను. స్పందనలొకటిగా వున్నా వ్యక్తీకరణ భేదాలుంటాయి. అవే రచనల్లో ప్రతిఫలిస్తాయి. దాన్ని శైలనో మరొకటనో చెప్పుకోవడం మన లౌల్యమే గానీ ప్రతిభకు కొలమానం గాదు.

యెంత రాసామన్నది ముఖ్యం గాదు. కాలానికి యెదురీది యేది నిలిచిందన్నది ముఖ్యం. నే కవిత్వం రాస్తున్నా మొర్రోమని మనం గీపెట్టుకోడం అనవసరం. అది మనని చదివినవాళ్ళు చెప్పాల్సింది.

పిడికెడు అక్షరాల్లో అనంతభావ సంపుటుల్ని నింపే కవిత్వ సాధన మానేసి బ్లాగోగులు, బ్రాహ్మినికల్ యాటిట్యూడ్లు, అట్రాసిటీ కేసులు వగైరాల్తో మనం బతకాల్సి రావడం మన దౌర్భాగ్యం!

@@@@@

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh