The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 2
PoorBest 

Img: colourbox.com

పంచాంగం ప్రకారం తెలుగు ప్రజలు ఈ ఉగాది మన్మధ నామ సంవత్సరంలో ప్రవేశించేరు. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  ఏం జరగబోతోందని చూస్తే ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా  ఈ సంవత్సరాన్ని “మన్మధ నామ” అని కాక “నిర్మాణ నామ” సంవత్సరం అని పిల్చుకుంటే బావుంటున్దనిపిస్తోంది. ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఏనాడూ చూడనంత భారీ స్థాయిలో ఈ ఏడు నిర్మాణ రంగం పుంజుకోబోతోంది కాబట్టి.

కాస్త వెనక్కు వెళ్లి, క్రితం ఏడు జూన్ లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ పరిపాలనా పగ్గాలు చేపట్టిన నాటి రోజులు గుర్తుకు తెచ్చుకుందాం. ఈ ‘పాత పేరున్న కొత్త రాష్ట్రం’ ఆది లోనే హంస పాదు అన్నట్టుగా ఎన్నో సమస్యలతో జనించింది. రాజధాని లేదు. ఎక్కడ వస్తుందో కూడా తెలీదు. ఉన్నత విద్యాలయాలు లేవు. వ్యాపార కార్యాలయాలు లేవు. ఉద్యోగాలు అసలే లేవు. రాష్ట్రానిదేమో లోటు బడ్జెట్టు. కేంద్రం సాయమందిస్తే తప్ప జీత భత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితి. అసలు ఏం చేద్దాం? ఎలా చేద్దాం? అని ఆలోచించడానికకే భయమేసే పరిస్థితి. ఈ నాటికీ అలాగే ఉన్నట్టుగా కొందరికీ అనిపించవచ్చు. కానీ చాప కింద నీరులా నెమ్మదిగా, నిదానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో విషయాల్లో చాలా వరకూ స్పష్టత తీసుకొచ్చింది.

మొదట రాజధాని విషయానికొద్దాం.

రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినా వేరే ప్రాంతం నుంచి వ్యతిరేకత ఎదురవుతుందని అందరూ అనుకున్నారు. నాతో సహా. ముఖ్యంగా, రాజధాని విజయవాడ ప్రాంతంలో అని తెలిసిన తర్వాత, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల్లో ఆందోళన మొదలవుతుందని అందరూ ఊహించారు. అలా జరగలేదు. ఈ విషయం సరే, “కృష్ణా నదీ తీరంలో అంటున్నారు, మరి రాజధానికి కావలసిన భూముల సమీకరణ ఎలా? ఇది జరిగేది కాదులే!!” అని కొందరు ఇంకా అంటుండగానే, 30,000 వేల ఎకరాల సమీకరణ కూడా జరిగిపోయింది.  ఈ విషయంలో ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా, ఇది చంద్రబాబు ప్రభుత్వం సాధించిన పెద్ద విజయంగా పరిగణించవలసిందే. కొత్త రాష్ట్రం ఏర్పడిన కేవలం తొమ్మిది నెలల్లోనే, రాజధానికి స్థల ఎంపిక మాత్రమే కాకుండా ఇంత పెద్ద ఎత్తున భూసమీకరణ జరగడం రాష్ట్రానికి ఏంతో శుభ పరిణామం. ఇంత జరిగిన తర్వాత రాజధాని నిర్మాణం మరో రెండు మూడు నెలల్లో మొదలవుతుందని అనుకోవడంలో ఎవరికీ సందేహం అక్కరలేదు. రాజధాని భవనాల నిర్మాణం రాబోయే 12 నెలల్లో జరగక పోయినా, భూమి చదును చేయడం, భూగర్భంలో నీరు, సీవేజ్, విద్యుత్తూ, బ్రాడ్ బాండ్ వంటి వసతులకి కావాల్సిన పైపులు అమర్చటమే కాక, కొన్ని ముఖ్యమైన రహదార్లు నిర్మించటం వంటి నిర్మాణ రంగ పనులు తప్పక జరుగుతాయి.

మరో వైపు, కొత్త రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పుంజుకోవడానికి కావలిసిన పెట్టుబడులని ఆకర్షించే పనిని చంద్రబాబు స్వయంగా తలకెత్తుకున్నారు. ఈ సబ్జెక్టు ఆయనికి కొట్టిన పిండి. ఈ విషయంలో ఆయనిది అందె వేసిన చెయ్యి. పది సంవత్సరాల క్రితం ఆయన ఉమ్మడి రాష్ట్రానికి మఖ్య మంత్రిగా ఉన్నప్పుడు కూడా పారిశ్రామిక వేత్తలని ఆకర్షించటంలో ఆయనకి ఆయనే సాటి అని పేరు తెచ్చుకున్నారు. ఈ పర్యాయం కూడా చంద్రబాబు నేతృత్వంలో గత తొమ్మిది నెలల్లోనే ఆంద్ర రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి మంచి బీజాలు పడ్డాయి అని అనుకోవాల్సి వస్తుంది. ఈ తొమ్మిది నెలల్లోనే హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్ వంటి సంస్థలు పక్క రాష్ట్రాలను కాదనుకొని మన రాష్ట్రానికి వచ్చేయి. ఇవే కాక సుమితోమో సంస్థ  శ్రీకాకుళంలో  పవర్ ప్లాంట్ పెట్టటానికి మొగ్గు చూపటం, ఎన్నో జపనీస్ సంస్థలు రాజధాని ప్రాంతంలో వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టటానికి ముందుకు రావడం కూడా మనకి తెలిసిందే.  ప్రభుత్వ రంగంలో కూడా, BEL మరియు NACEN సంస్థలు తమ కార్యకలాపాలకి అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో పెద్ద ఎత్తున శ్రీకారం చుట్ట బోతున్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో న్యుక్లయార్ ఫ్యూయల్ కాంప్లెక్స్, కాకినాడలో LNG టెర్మినల్ ప్రారంభ దశలో ఉన్నాయి. తమిళనాడు తోలు పరిశ్రమ కృష్ణపట్నం వైపు మొగ్గు చూపడం, చిత్తూరు జిల్లా లోని శ్రీ సిటీ దేశంలోనే అతి పెద్ద SEZ గా అవతరించే దిశగా అడుగులు వేయడం మనం చూస్తున్నాం. విశాఖలో విప్రో, టెక్ మహీంద్రా బూజు పట్టిన తమ ప్రాజెక్ట్లకి  బూజు దులుపి తిరిగి ప్రారంభించడం కూడా ఈ తొమ్మిది నెలల్లోనే జరిగింది. పైన ఉదాహరించిన ప్రైవేటు, పబ్లిక్ సంస్థలన్నీ కూడా కొంత కాబోతే కొంతైనా వచ్చే 12 నెలల్లో నిర్మాణం మొదలెడతాయి.

ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికొస్తే గన్నవరం విమానాశ్రయ విస్తరణ , విశాఖ భోగాపురంలో కొత్త విమానాశ్రయ ఏర్పాటుకి శ్రీకారం, రాజధాని చుట్టూ 192 కి.మీల భారీ రహదారి నిర్మాణం, పోలవరం పనుల ప్రారంభం, మచిలీపట్టణం పోర్ట్ పనులు, వగైరా వగైరా నిర్మాణ కార్యకలాపాలు వచ్చే 12 నెలల్లోనే ఊపందుకుంటాయి. విద్యా రంగ ప్రస్తావన కూడా చేస్తాను. హైదరాబాద్లో ISB, NALSAR ల తర్వాత ఆంద్ర ప్రదేశ్లో వచ్చిన ఉన్నత విద్య సంస్థలు శూన్యం. ఇప్పుడు విభజన పుణ్యమా అని IIT, IIM, AIIMS తదితర higher institutes, మిగత ఎన్నిటితో సహా, ఈ సంవత్సరం నిర్మాణం మొదలెట్టనున్నాయి. వీటికి స్థల ఎంపిక ఇప్పటికే జరిగింది.

పైన చెప్పినవన్నీ సంఘటిత రంగంలో పెద్ద ఎత్తున జరగబోతున్న నిర్మాణాలు. వీటికి తోడుగా గృహ, ఆఫీసు, వాణిజ్య సముదాయాల నిర్మాణం జరగనే జరుగుతుంది. మంగళగిరి సమీపంలో తాత్కాలిక రాజధాని గనక ఏర్పాటయి కొందరయినా ఉద్యోగులు హైదరాబాద్నుంచి అక్కడికి తరలి వస్తే ఆ చుట్టుపక్కల ఒక చిన్న నగరమే కళ్ళు మూసి తెరిచేలోపుల వెలుస్తుంది. ఇల చెప్పుకుంటూ పొతే మన ఊహ కందనివి, మనం లెక్కపెట్టలేనన్ని ఎన్నో నిర్మాణాలు ఆంద్ర రాష్ట్రంలో జరగబోతున్నాయి.

Infrastructure, construction రంగంలో ఆంద్ర రాష్ట్రానికి చెందిన ఎంతో మంది వ్యాపారవేత్తలు దేశంలోనే ప్రముఖ స్థానంలో ఉన్నారు. వీరిలో చాలమంది  సంస్థల వ్యాపార బీజాలు 1955-67ల  మధ్య నాగార్జున సాగర్ నిర్మాణ కాలంలో పడ్డాయి. ఆంద్ర ప్రదేశ్ నిర్మాణ రంగంలో అటువంటి అరుదైన రోజులూ , అంతటి అవకాశాలూ ఇప్పుడు మళ్ళీ వస్తునాయి. ఈ విధంగా ఆలోచిస్తే, రాబోయే “మన్మధ నామ” సంవత్సరంలో ఆంద్ర ప్రదేశ్ ప్రజల మీద మన్మధుడి ప్రభావం ఎంతుంటుందో చెప్పలేను కానీ, దేవతల “ఆర్కిటెక్ట్ కం బిల్డర్” అయిన విశ్వకర్మ ప్రభావం మాత్రం చాలా ఉండబోతోందని చెప్పగలను. ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఏనాడూ చూడనంత భారీ స్థాయిలో సివిల్ కన్స్ట్రక్షన్ ఈ “ నిర్మాణ నామ” సంవత్సరంలో జరగబోతోందని అనుకోవడంలో అతిశయోక్తి లేదు.

@@@@@

Vishnushankar is a real estate expert and owner of Crorepatihomes, Bangalore

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh