The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 2
PoorBest 

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖానిచ|

కింనో రాజ్యేన గోవిందా కిం భోగైర్జివితేనె వా||

మహాభారత యుద్ధారంభంలో అర్జునుడి వైరాగ్యమిది. తెలంగాణా సాధించిన తర్వాత కూడా గుర్తుకొస్తున్న భగవద్గీత పంక్తులివి. కాబోదనుకున్న నిజమేనా కళ్ళెదురుగా కనబడుతున్నది? సాక్ష్యాలు లేకుండా చేయబడ్డ ఓ చారిత్రాత్మక ఘట్టానికి ఇది సరైనా ముగింపేనా? అసలు ఇది ముగింపా, మరో అధ్యాయానికి పొడుగింపా? పోరాడి సాధించిన గెలుపే అయినా, పార్లమెంటులో జరిగిన అంతిమ యుద్ధం తెలంగాణా పోరాటానికి చివరి మలుపు కాదు, మలి మలుపే. ప్రస్తుతానికి ఇది గెలుపోటములకు సంబంధించిన విషయం కాకపోవచ్చు. గెలిచి ఓడిందెవరో, ఓడి గెలిచిందెవరో ప్రస్తుతానికి నిర్వచించలేకపోవచ్చు.

 

ప్రత్యేక తెలంగాణా ఎన్ని సంవత్సరాల పోరాటమో అన్న విషయం పక్కనబెడితే, ఇప్పటి విజయానికి కారణమైన పోరాటాన్ని డిసెంబరు 2009 ప్రకటనకు ముందు ప్రకటనకు తర్వాతగా విశ్లేషించుకోవచ్చు. ప్రకటనకు ముందు జరిగిన పోరాటం ఎన్నో అవహేళనలకు గురయ్యిందనే మాట వాస్తవమే. దానికితోడుగా చేవలేని కె.సి.ఆర్. నాయకత్వం కూడా ఉద్యమాన్ని పరిహాసాస్పదం చేసింది. ప్రజాస్వామ్యంలో పది రకాల అభిప్రాయల కన్నా, మెజారిటీ అభిప్రాయానికే విలువనివ్వాలన్న ఇంగితం లేకుండా ఏకాభిప్రాయ సాధన కోసం కృషి చేస్తున్నామని చెప్పుకున్న పార్టీతో అంటకాగిన కె.సి.ఆర్. ఆనాడు చెప్పినవన్నీ కల్లబొల్లి కబుర్లే! అరపూట కూడా ఉపవాసం ఉండలేని అర్భకుడు ఆసుపత్రిలో  ఆమరణదీక్ష కొనసాగించటం ఓ విచిత్రమైతే, దానికి బెదిరి కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 2009లో తెలంగాణా ప్రకటన చేయటం మరో వింత.

ఏదేమైనా, ప్రత్యేక తెలంగాణా మొదటి నుంచి ప్రజల ఉద్యమంగానే ఉన్నదనే మాట వాస్తవం. ఉద్యమాన్ని వాడుకుని అందలాలు ఎక్కిన నాయకులు ఉన్నా, ప్రజల మనస్సుల నుంచి ప్రత్యేక తెలంగాణా స్వప్నాలు చెరిపివేయబడలేదనే మాట కూడా వాస్తవమే. 1970 దశకంలో ముగించివేయబడ్డ పోరాటం, రెండున్నర దశాబ్దాల తర్వాత కూడా అదే ఊపుతో కనబడటం దీనికి ఉదాహరణ. ఈ ఉద్యమ పరిష్కారం రాజకీయపరమైనది కాబట్టి, ఆయా సమయాలలో ఉద్యమానికి ఊతమిచ్చిన రాజకీయ నాయకులకు తెలంగాణా ప్రజలు తోడుగా నిలిచారు. పూటకో అబద్ధంతో, రోజుకో వాగ్దానంతో, పార్టీ వైషమ్యాలతో అప్పుడప్పుడు నాయకులు పక్కదోవ పట్టినా, పట్టించినా, ప్రజలు మాత్రం ఉద్యమంతోనే మమేకమయ్యారు. 

సమైక్య ఉద్యమాన్ని చూసుకుంటే, 2009 డిసెంబరు ప్రకటనకు ముందు వరకు, తెలంగాణా ఉద్యమాన్ని, ఉద్యమకారులను, ఉద్యమ తీరుతెన్నులను అపహాస్యం చేస్తూనే గడిపారు సమైక్యవాదులు. అర్ధనగ్న ప్రదర్శనలు, రోడ్ల మీద వంటలు, బతుకమ్మ పాటలా ఉద్యమమంటే అనే ఈసడింపులతో ఎగతాళి చేస్తూనే గడిపారు సమైక్య నాయకులు, ప్రజలు. అక్కడక్కడ సమైక్య  ప్రదర్శనలు జరిగినా, అవి తెలంగాణా ప్రదర్శనలకు ప్రతిక్రియగా జరిగినవే కానీ, సమైక్య ఉద్యమ ధ్యేయంతో చేసినవి కావు. డిసెంబరు 2009 ప్రకటన తరువాతి నాటకీయ పరిణామాలలో సమైక్య ఉద్యమం కూడా ఊపందుకొని ఇవే అర్ధనగ్న ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దహనాలు, విగ్రహాల విధ్వంసము, రోడ్ల మీద వంటలు, సంక్రాంతి గొబ్బెమ్మలతో కొనసాగింది.

 

ప్రజా ఉద్యమానికి లొంగి కేంద్ర ప్రభుత్వం తెలంగాణా కల సాకారమయ్యేలా చర్యలు తీసుకున్నదనేది అబద్ధం. తెలంగాణా ప్రజల ఆకాంక్షే అయినా, తద్విరుద్ధమైన కారణాలతోనే తెలంగాణా ప్రకటన చేయబడిందనేది బహిరంగ రహస్యం. ఏకాభిప్రాయంతోనే తెలంగాణా ఏర్పాటు చేస్తామన్న కేంద్రప్రభుత్వం ఎవరి అభిప్రాయాలకూ విలువ ఇవ్వలేదనేది కూడా సుస్పష్టం.  ఏకాభిప్రాయమంటే అందరి అభిప్రాయాలు ఒక్కటిగా ఉండాలనే అర్ధం కాదని, తనదొక్కటే అభిప్రాయం అని, దానికి అనుగుణంగానే వేయాల్సిన పిల్లిమొగ్గలన్నీ కేంద్రప్రభుత్వం వేసిందని అర్ధంకాని ప్రబుద్ధులు ఎవరూ ఉండరు.

 

తెలంగాణా లక్ష్యంగా సీమాంధ్రలో అంగబలం అర్ధబలం ఉన్నదనుకున్న నాయకులకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చి కుడితిలో పడేసింది కాంగ్రెస్ అధిష్టానం. అధికార పిపాసులై, సమైక్యాంధ్ర ప్రజల ఆకాంక్షలను ఈ ప్రతినిధులు విస్మరించారు. అధికార, ధనమదంతో విర్రవీగిన సీమాంధ్ర నాయకులు తెలంగాణా అయ్యే పని కాదని కధలు చెబుతూ కులాసాగా కాలం గడిపేసారు. ముసాయిదా బిల్లు తయారయ్యే సమయానికి కూడా పదవులకు రాజీనామాలు చేస్తే ఉపయోగంలేదనే కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేసారు సమైక్య నాయకులు.

అప్పటికే చేతులు కాలిపోయాయి. డిసెంబరు ప్రకటనకు ముందు అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమన్న నాయకులకు ఆ అధిష్టానాన్ని ప్రశ్నించే దమ్ములేక, ఇటు ప్రజలకు సమాధాన మివ్వలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయినా స్వార్ధ ప్రయోజనాలను మాత్రం విస్మరించలేకపోయారు! రెండు కళ్ళ సిద్ధాంతాలని, సమ న్యాయమని ఓ నాయకుడు గర్జిస్తే, ఆత్మాహుతి చేసుకుంటామని మరో నాయకుడు బెదిరింపులు. రోజుకో వేషంతో పార్లమెంటును రక్తి కట్టించానని ఒక నాయకుడు భావిస్తే, బ్రహ్మాస్త్రం దాచిపెట్టానన్న నాయకుడు మిరియాలపొడితో సాక్షాత్తు పార్లమెంటులో అరాచకం సృష్టించాడు. సమైక్యాంధ్రకు దిక్కుతెన్ను నేనేనంటూ జగన్ రంగంలోకి దిగేసరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

చివరికి నాయకులు లేకుండానే సమైక్య ఉద్యమం కొనసాగింది. నమ్మదగ్గ నాయకుడు ఎవరూ కనపడక ఆంధ్ర ఎన్.జి.వో. నాయకుడినే నెత్తిన మోసారు. రాజకీయ పరపతిలేని ఆ నాయకుడు చేయగలిగిందేమీ లేకపోయింది. డిసెంబరు 2009 ప్రకటనకు ముందు తెలంగాణా ప్రజల పరిస్థితే, ఇప్పటి సీమాంధ్ర ప్రజల పరిస్థితి. ప్రజల గౌరవాభిమానాలు అందుకోగలిగే నాయకుడు లేకపోగా, ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునే రాజకీయ నాయకుల గుంపు కార్చిన మొసలి కన్నీళ్ళతో సమైక్య ఉద్యమం నీరుగారిపోయింది.

సామరస్యంగా బ్రతుకుతున్న ప్రజల మధ్య పార్టీలు పెట్టిన చిచ్చు గత రెండు దశాబ్దాలుగా రగులుతూనే ఉంది. రాజకీయ దురుద్దేశాలతో పాచికలాడిన పార్టీలు, ప్రభుత్వాలు తెలంగాణా కలను సాకారమైతే చేసాయి కానీ, ప్రజల మధ్య వైషమ్యాన్ని మాత్రం దూరం చేయలేకపోయాయనేది నిష్టూరమైన నిజం. కాలం రేపిన ఈ గాయాలు ఎటువంటి దుష్ఫలితాలకు దారితీస్తాయో ఊహించలేం. ఏదేమైనా, ఇప్పుడు తెలంగాణా రాష్ట్రం ఓ నిజం. సీమాంధ్ర రాష్ట్రం మరో నిజం. ఓ ఫేస్‌బుక్ మిత్రుడు చెప్పినట్లు పాత సమస్యలతో కొత్త రాష్ట్రం, కొత్త సమస్యలతో పాత రాష్ట్రం - రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలని ప్రభావితం చేయబోయే పరిణామాలకు కారణం కాబోతాయనే విషయంలో ఎటువంటి అనుమానాలూ లేవు. ఇరు రాష్ట్రాల ప్రజలు విజ్ఞతను, సంయమనాన్ని ప్రదర్శించాల్సిన నిజమైన తరుణం ఇదే.

Pics Courtesy : Google

Comments   

 
+1 #2 రెండు రాష్ట్రాలు - ఓ పరామర్శ Jai Gottimukkala 2014-02-20 07:53
"సమైక్య ఉద్యమం" అనేది ఒక ప్రతిక్రియగా వచ్చింది. ఒకరు తమ మాట నెగ్గించుకుంటున ్నారు కాబట్టి అవతలివారికి ఉక్రోషం రావడం సహజం. బీజం ఉడుకుమోతుతనం అయినప్పుడు దాని ఆకారం విక్రుతంగానే ఉంటుంది.

అయితే మీడియాలో, రాజకీయవెదికలలొ & అంతర్జాలంలో కక్కుతున్నంత స్తాయిలో ఈ "ఉద్యమం" లేదన్నది నాకు ప్రత్యక్షంగా తెలిసిన వాస్తవం.

చిచ్చు ఎన్నాళ్ళు రగులుతుందనేది ఊహాగానం మాత్రమె. ఇప్పుడు మీడియాలో & అంతర్జాలంలో రెచ్చిపోయే వ్యక్తులలో ఎక్కువ శాతానికి గ్రామీణ స్తాయిలో క్షేత్ర నిజానిజాల అవగాహన లేదు. వీరిలో పలువురికి బడుగు బలహీన ప్రజలతో అనుబంధం లేదు. కనీసం తమ ప్రాంతపు బీదాబిక్కీ సమస్యలపై సానుభూతి కూడా కరువే. తమ మనసులో ఉన్న ఉక్రోశాన్ని ప్రజలందరికీ అంటగట్టి ఆనందం చెందుతున్నారు.
Quote
 
 
+5 #1 శ్యామలీయం తాడిగడప శ్యామలరావు 2014-02-19 13:29
ఆర్యా,
మీ వ్యాసం బాగుంది. ఒక్క విషయం. చరిత్రలో ఆరంభాలు ముగింపులూ ఏవీ‌ ఉండవు. ఒక రేఖలో ఆద్యబిందువు అంత్యబిందువు అనేవి ఏవీ ఉండవు కదా.

అటూ ఇటూ అనంతంగా నడిచే కాలప్రవాహంలో మనం చూడగలిగంత మేరకు మనకు అందుబాటులోనికి వచ్చిన గతమే మన చరిత్ర. ప్రతిక్షణమూ అది పుట్టుతూనే చరిత్రలో కలిసిపోతున్నది గతంగా మారిపోతూ.

కొన్ని సంఘటనల ప్రభావం కొంతకాలం కనిపిస్తుంది, అది కొన్నికొన్నింటి విషయంలో సుదీర్ఘంగా ఉండటంతో సమకాలీనసమాజానిక ి శాశ్వతమైన ప్రభావం అనిపించవచ్చును. ఉదాహరణకు ఇంగ్లీషువారు బెంగాలుని విభజించారు జనాగ్రహం మధ్యనే. కాలక్రమేణా ఆ భూభాగాల్లో ఒకటి వేరే దేశమై కూర్చుంది. ప్రస్తుత స్థితి ఇది. కాని అనంతకాలప్రవాహంల ో భవిష్యంలో ఏ భూభాగం సంగత్తి ఎలాగుంటుందో చెప్పలేము కదా.

ఇక తెలుగువారి చరిత్రలో అనేక ఘట్తాలు నడిచాయి. ఇది కూడా ఒకటి. ప్రవాహంలో కట్టెపుల్లలు కలుస్తూ విడిపోతూ ఉన్నట్లు రాజ్యాలూ వాటి ప్రజలూ కలుస్తూ విడిపోతూనే ఉంటారు. ఏ కలయికా శాశ్వతం కాదు - ఏ విడతీతా శాశ్వతం కాకపోవచ్చును.

స్వస్తి.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh