The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 2
PoorBest 

కూటములా, కాలకూటములా?

 

1975లో ఇందిరాగాంధీ విధించిన అత్యయిక పరిస్థితుల పుణ్యమా అని, దేశంలో మొట్టమొదటి నాన్-కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. భారతీయ జనసంఘ్, లోక్‌దళ్, సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్ (ఒ) పార్టీల కూటమిగా ఎన్నికల్లో పాల్గొన్న జనతా పార్టీ 542 సీట్లకు గాను, 298 సీట్లు గెలిచింది. ఆ తర్వాత, కమ్యూనిస్టులు తదితర 7 పార్టీల అలయెన్సుతో 345 మంది సభ్యుల బలంతో మొరార్జీ దేశాయి ప్రధానిగా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఏడు పార్టీల కాంగ్రెస్ కూటమి 189 సీట్లు గెలుచుకోగా, అందులో కాంగ్రెస్ గెలుచుకోగలిగింది 153 సీట్లు.  కాంగ్రెస్‌కు సరైన ప్రత్యామ్నాయంలా కనిపించినా, ఆనాటి ఎన్నికల్లో కేవలం ఆరు సీట్లు మాత్రమే గెలిచి దక్షిణాదిన ఎటువంటి ప్రభావాన్ని జనతాపార్టీ చూపలేకపోయింది. ఆ వెంటనే, పది రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో, అన్నిటా ఇందిరాగాంధి కాంగ్రెస్ (ఆర్) ఓడిపోగా, అందులో ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌లలో జనతా పార్టీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఉత్తరాదిన కాంగ్రెస్‌ను దాదాపుగా తుడిచేసి జనతా పార్టీ ఓ ప్రభంజనాన్నే సృష్టించిందంటే అతిశయోక్తి కాదు.

 

ఎంతో అద్భుతంగా మొదలైన జనతాపార్టీ ప్రయాణం అంత అధ్వాన్నంగానే ముగిసింది. ఎన్నికలైన వెంటనే లుకలుకలు ప్రారంభమైనాయి. పార్లమెంటరీ పార్టీ నేతను ఎన్నుకునే వేళకు చరణ్‌సింగ్, జగ్‌జీవన్‌రామ్, జార్జ్ ఫెర్నాండేజ్‌ల అసంతృప్తి మొదలయ్యింది. చరణ్‌సింగ్, జగ్‌జీవన్‌రామ్‌లను ఉపప్రధానులుగా ప్రకటించాకా పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చినట్లు అనిపించినా, కూటమిలోని సామ్యవాదులకు, లౌకికవాదులకు కూటమిలోని హిందుత్వవాదులుగా ముద్రపడ్డ వాజ్‌పేయి, అద్వానీలతో పొరాపొచ్ఛాలు మొదలైనాయి. ప్రభుత్వంలో ఉండాలో, ఆరెస్సెస్‌లో ఉండాలో తేల్చుకోమని వారిని హెచ్చరించేంతగా పరిస్థితులు విషమించాయి. ఆరెస్సెస్ వైపే మొగ్గు చూపిన భారతీయ జన్‌సంఘ్ నేతలు ప్రభుత్వాన్ని వదులుకున్నారు. మొరార్జీ దేశాయ్ తన మొండి వైఖరితో ఉపప్రధానులైన చరణ్‌సింగ్, జగ్‌జీవన్‌రామ్‌లతో సర్దుకోలేకపోయాడు. చివరికి చరణ్‌సింగ్ ప్రభుత్వం నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ రాజకీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య కోకాకోలా, ఐ.బి.ఎమ్ లాంటి కంపెనీలు ప్రభుత్వ ఆర్ధిక సంస్కరణలతో వేగలేమని భారత్ నుంచి నిష్క్రమించటం, ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్‌వారు చేసిన అత్యాచారాలపై మొరార్జీ ప్రభుత్వం వేసిన కేసులు సాక్ష్యాలు లేక వీగిపోవటం లాంటి సవాలక్షా కారణాలతో దాదాపు 27 నెలలు ప్రధానిగా కొనసాగిన మొరార్జీ దేశాయి చివరికి రాజీనామ చేసాడు.

 

కేవలం 64 మంది ఎం.పీ.లతో, కాంగ్రెస్ మద్దతుతో చరణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, నెలరోజులకే కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవటంతో, రాష్ట్రపతి పార్లమెంటును రద్దు చేయటం జరిగింది. ఆ తర్వాతి ఎన్నికల్లో (1980) ఇందిరా కాంగ్రెస్ 351 సీట్లు గెలిచి జయకేతనం ఎగురవేస్తే, 31 సీట్లు మాత్రమే గెలిచి జనతాపార్టీ తన అవసానదశకు చేరువయ్యింది.

***


దాదాపు ఓ దశాబ్దం తర్వాత, 1989లో ఎన్‌టి రామారావు చొరవతో నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. జనతాదళ్, డి.ఎం.కె., అస్సాం గణపరిషత్ తదితర పార్టీలతో ఏర్పడ్డ ఈ కూటమి 1989 ఎన్నికలలో 146 సీట్లు గెలుచుకోగా, అందులో జనతాదళ్ 143, తెలుగుదేశం 2, ఇండియన్ సోషలిస్ట్ కాంగ్రెస్ 1 సీటు గెలుచుకున్నాయి. 197 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు చొరవ చూపించలేదు. 86 సీట్లతో భారతీయ జనతా పార్టీ, 52 సీట్లతో కమ్యూనిస్టులు బయటి నుండి మద్దతు ప్రకటించగా నేషనల్ ఫ్రంట్ విపి సింగ్ ప్రధానిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడు. ఇప్పటి అరవింద్‌కేజ్రీవాల్‌కు అప్పటి విపి సింగ్‌కు ఒక్క విషయంలో మంచి పోలిక కనిపిస్తుంది. బోఫోర్స్ కుంభకోణం బయటపడ్డ దరిమిలా జరిగిన ఆ ఎన్నికలలో, కేజ్రీవాల్ షీలా దీక్షిత్ అవినీతిపై 400 పేజీల ఆధారాలు ఉన్నాయని చూపించినట్లుగా, బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్ గాంధీ పాత్రపై తన దగ్గర ఆధారాలు జేబులో ఉన్నాయని విపి సింగ్ ప్రతి సభలోనూ ఏదో ఓ కాగితాన్ని చూపిస్తూ ప్రకటించేవాడు. ప్రధాని అయిన తర్వాత ఆ ఆధారాలు ఏమైనాయో ఎవరికీ తెలీదు. ఇప్పటికీ ఆ కేసు అలా సా....గుతూనే ఉంది.

 

జనతాపార్టీ ప్రయోగంలో ఆయా పార్టీల మధ్య లుకలుకలు మొదలైతే, నేషనల్‌ఫ్రంట్ విషయానికి వచ్చేసరికి, జనతాదళ్‌లోనే లుకలుకలు మొదలయ్యాయి. చంద్రశేఖర్ మొదటి నుంచి విపి సింగ్‌కు వ్యతిరేకమే. దేవీలాల్ తనని కనీసం ఉపప్రధానిగానైనా చేయాలని మొదటి నుంచి దేబిరిస్తూనే దబాయించటం మొదలేసాడు. కొడుకు చౌతాలా ముఖ్యమంత్రిత్వపరంగా దేవీలాల్ విపి సింగ్‌ల మధ్య గొడవలు మొదలైనాయి. చరణ్‌సింగ్ కొడుకు అజిత్‌సింగ్‌తో దేవీలాల్‌కు సరిపడదు. దేవీలాల్‌తో ఒక్క చంద్రశేఖర్‌కు తప్ప మరెవరికీ సరిపడదు. చివరికి చౌతాల ఎన్నిక వివాదాస్పదం కావటం, అయినా అతనినే మళ్ళీ ముఖ్యమంత్రిగా దేవీలాల్ చేయబూనటం, మొదటిసారి విపి సింగ్ రాజీనామా చేసి, వెనక్కి తీసుకోవటం, అరుణ్‌నెహ్రూ, దేవీలాల్ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో ఈ ప్రభుత్వం పూర్తి సమయాన్ని అంతర్గత కుమ్ములాటల్లోనే గడిపేసింది. మండల్ కమిషన్ నివేదిక అమలుదాకా, చెప్పుకోతగ్గ విధానపరమైన నిర్ణయాలేవీ విపి.సింగ్ తీసుకోలేదు. విపి.సింగ్ ఏకపక్షంగా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే నేషనల్‌ఫ్రంట్ ప్రభుత్వానికి సమాధి కట్టింది. ఆ సమయంలోనే అయోధ్యలో రామ మందిరం కోసం అద్వాని రథయాత్ర మొదలేయటం జరిగింది. బీహారులో అద్వానిని అరెస్టు చేసినందుకు నిరసనగా, విపి.సింగ్ ప్రభుత్వానికి భా.జ.పా. మద్దతు ఉపసంహరించటం, విపి సింగ్ రాజీనామా చేయటం, ఆ వెంటనే 58 మంది ఎంపీలు, కాంగ్రెస్ బయటి మద్దతుతో చంద్రశేఖర్ ప్రధాని అవ్వటం, ఆయన రాజీవ్ గాంధీ మీద నిఘా ఏర్పాటు చేసాడన్న ఆరోపణలతో కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవటం చకచకా జరిగిపోయాయి. దాదాపు 11 నెలల విపి.సింగ్ పాలన, 4 నెలల చంద్రశేఖర్ పాలన చరిత్ర పుస్తకాలు నింపటానికే కానీ, దేశానికి ఒరగబెట్టిందేమీ లేదు.

 

***

 

ప్రజాస్వామ్యంలోని ఎన్నికల రాజకీయాల వికృతరూపం 1996 ఎన్నికల్లో మరింత వికృతంగా ప్రదర్శితమయ్యింది. ఆ ఎన్నికల తర్వాత. భా.జ.పా. (161) కూటమి 187 సీట్లతో పెద్ద కూటమిగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి అందించిన అవకాశాన్ని ఉపయోగించుకోలేక 13 రోజుల్లోనే వాజ్‌పేయి చేతులెత్తేసాడు. 140 సీట్లతో రెండవ పెద్ద పార్టీగా నిలచిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరించింది. 79 సీట్లు గెలుచుకున్న మూడు పార్టీల నేషనల్‌ఫ్రంట్, మరో పది పార్టీలను కలుపుకొని యునైటెడ్ ఫ్రంట్‌గా అవతరించి కాంగ్రెస్ బయటి మద్దతుతో దేవెగౌడ ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 10 నెలల దేవెగౌడ ముచ్చట తీరిన తర్వాత, 7 నెలల గుజ్రాల్ ముచ్చట కూడా తీర్చి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది కాంగ్రెస్! నిజానికి ప్రధానమంత్రిగా యునైటెడ్‌ఫ్రంట్ మొదటి ప్రాధాన్యత దేవెగౌడ కాదు. విపి సింగ్, జ్యోతిబసులు నిరాకరించిన పిమ్మట దేవెగౌడ ప్రధానిగా రాజీ పడటం జరిగింది. అప్పుడు అవకాశాన్ని వదులుకోవటం చారిత్రాత్మక తప్పిదమని కమ్యూనిస్టులు ఇప్పుడు భావిస్తారు.

 

అద్వానీ కొనసాగించిన అయోధ్య రథయాత్రలో, ఆయన్ని బీహారులో అరెస్టు చేయటం వి.పి.సింగ్ ప్రభుత్వానికి భా.జ.పా. మద్దతు వెనక్కి తీసుకోటానికి కారణమైతే;  స్లీపింగ్ పి.ఎం.గా పేరొందిన దేవెగౌడ తన హయాంలో తీసుకున్న నిర్ణయాలలో తమను భాగస్వాముల చేయలేదనే కారణంతో కాంగ్రెస్ ఆయన్ని తప్పించాలని డిమాండు చేయటం ఓ వింత. ఆ తర్వాత ప్రధానిగా నియమింపబడ్డ ఐ.కె. గుజ్రాల్ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోటానికి కారణం మరెంత విచిత్రమో చూడండి. ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న డి.ఎం.కె.కు రాజీవ్‌గాంధీ హత్యలో ప్రమేయముందన్న మిషతో ఆ పార్టీని ప్రభుత్వం నుండి తీసివేయాలని కాంగ్రెస్ డిమాండు చేసింది. అది ఒప్పుకోనందుకు మద్దతు వెనక్కి తీసుకుంది. అదే కాంగ్రెస్ తన యు.పి.ఎ.1, యు.పి.ఎ.2 ప్రభుత్వాలలో (అందులోనూ సోనియా గాంధి నాయకత్వంలో) డి.ఎం.కె.ను చేర్చుకోవటమే కాకుండా ప్రాధాన్యమున్న మంత్రివర్గాలు కూడా కేటాయించింది!

 

1998లో ఏర్పాటైన ఎన్.డి.ఎ. ప్రభుత్వం 13 నెలలకే కుప్పకూలిపోయింది. దానికి కారణం జయలలిత! అప్పటి తమిళనాడు ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్ చేయాలని కోరిన జయలలిత తన డిమాండు నెరవేర్చనందుకు నిరసనగా ఎన్.డి.ఎ. ప్రభుత్వాన్ని కూలదోసింది. అంతాచేసి అప్పటి ఎ.ఐ.ఎ.డి.ఎం.కె.కి ఉన్న బలం 18! అప్పటి అవిశ్వాస తీర్మానంలో ఒకే ఒక్క ఓటుతో వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయింది.

***

 

ఓ అయిదు సంవత్సరాలు భా.జ.పా. పెద్ద పార్టీగా ఎన్.డి.ఎ. కూటమి, ఓ పది సంవత్సరాలు కాంగ్రెస్ పెద్ద పార్టీగా యు.పి.ఎ. కూటమి ప్రభుత్వాలు నడపగలిగినా, ఆయా ప్రభుత్వాలు అంతులేని అవినీతికి అడ్రసులుగా మారాయనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. సంకీర్ణ ప్రభుత్వపు సంక్లిష్టతలు ఆ అవినీతికి కారణం అని చెబుతున్నా, అవి నమ్మేంత అమాయకత్వంతో ప్రజలు లేరు. ఇక కప్పల తక్కెడలాంటి మూడో ఫ్రంటు ప్రభుత్వాలు ఆయా కాలాల్లో ఆరుగురు ప్రధాన మంత్రులు అయిదేళ్ళు పరిపాలించగలిగారంటేనే,  ఏమాత్రం ఉధ్ధరించాయనేది కూడా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూనే ఉంది. అలానే, ఏకపార్టీ పాలనగా కేవలం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్నే చాలా సంవత్సరాలు భరించాం. అలాంటి ఏకపార్టీ పాలన అవకాశాన్ని కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న భా.జ.పా.కు ఇవ్వాల్సిన చారిత్రక అవసరం ప్రస్తుతం కనిపిస్తుంది. ఆ ముచ్చట కూడా మనం తీర్చుకుంటే, మనకు కూటముల ప్రభుత్వాలు అభివృద్ధిని చూపిస్తాయా, ఏకపార్టీలా అనే సందేహం కూడా పూర్తిగా తొలగిపోతుంది.

 

Pictures Courtesy : Google.com

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh