The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 2
PoorBest 

ఆమ్ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయమా?

 

పది సంవత్సరాల యు.పి.ఎ. పాలనకు ప్రజలు విసుగెత్తిపోయారు. సహజంగానే సరైన ప్రత్యామ్నాయం ఎవరనే విషయాన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు. గత డిసెంబరులో జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో తమదైన అభిప్రాయాన్ని చూచాయగా స్పష్టం చేసే ప్రయత్నం కూడా ప్రజలు చేసారు. కేంద్రంలో ఎన్.డి.ఎ. పాలన చూసారు. కలగాపులగపు పార్టీల కలయికతో ఏర్పడ్డ మూడోఫ్రంటును చూసారు. అంతకు మునుపు ఏకపార్టీగా కాంగ్రెస్ పాలనా చూసారు, జనతా ప్రయోగమూ చూసారు. ఇక యు.పి.ఎ. సరేసరి.  మిగతా అన్ని పార్టీలనూ ఆయాదశల్లో లేదంటే ఆయా రాష్ట్రాల్లో ప్రజలు అధికారంలో చూసే ఉన్నారు. కాబట్టి, ప్రస్తుతానికి కొత్త ప్రత్యామ్నాయంగా కనబడే కొత్త పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ తప్ప మరోటి లేదు. పాత పార్టీలన్నిటికి కొత్త రాజకీయాలు నేర్పుతామని గర్వంగా ప్రకటించిన పార్టీ ఇది. అవినీతికి వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న పార్టీ ఇది. ఈ పార్టీని అంచనా వేయాల్సిన అవసరం చాలా ఉంది.

 

ఆ.ఆ.పా.తో ఎటువంటి సంబంధమూ లేదని అన్నా హజారే ప్రకటించినా, ఆ.ఆ.పా. అనగానే ప్రజలకు గుర్తుకొచ్చే వ్యక్తి అన్నా హజారే అనటంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ సందర్భంగా అన్నాహజారే గురించి కొంత తెలుసుకోవాలి. దాదాపు నాలుగయిదు దశాబ్దాలుగా నిజాయితీగా, నిస్వార్ధంగా సమాజసేవ చేస్తున్న వ్యక్తి ఆయన. రెండు మూడు ఖద్దరు పంచెలు, కుర్తాలు, గాంధీ టోపీలతో ఉన్న ఓ ముతక సంచి ఆయన చరాస్తి. ఒక చిన్న స్టవ్, రెండు మూడు అన్నం వండుకునే గిన్నెలు, గరిటెలు ఆయనకున్న స్థిరాస్తి. నిరాహార దీక్షలు ఆయనకు కొత్త కాదు. గతంలో, మహారాష్ట్రలో మహామహులనుకున్న కొందరు అవినీతి మంత్రులను రాజీనామా చేయించేదాకా నిరాహార దీక్షలు ఆపని దీక్షాదక్షుడు. అనేక పార్టీలు రాజ్యసభ సభ్యత్వాన్ని స్వీకరించమని బ్రతిమిలాడినా, గవర్నర్ పదవి ఇస్తామని ఆశలు పెట్టినా, చివరికి పద్మ పురస్కారాలు ఇస్తామని ప్రలోభపెట్టినా, వీటన్నిటినీ తృణప్రాయంగా వద్దనుకున్న నిరాడంబర జీవి ఈయన. ఒక్క వ్యక్తిగా ఉద్యమిస్తూనే, కోట్లాది ప్రజలలో చైతన్యస్ఫూర్తి రగిలించిన మహాశక్తి అన్నాహజారే. అన్నిటికన్నా ముఖ్యంగా, ప్రజాసేవ, దేశ సేవ చేయటానికి అధికారం అవసరంలేదని, సంకల్ప బలం ఉంటే చాలని రాలేగావ్ అనే ఆదర్శగ్రామాన్ని తీర్చిదిద్ది నిరూపించిన మహానుభావుడు అన్నా హజారే. ఈనాటికీ గాంధీ ఆదర్శాలకు ఊపిరులూదుతున్న మరో గాంధి అన్నాహజారే. ఇక్కడ అందరూ గమనించాల్సిన మరో ముఖ్యవిషయం ఏమిటంటే, ఈరోజు ఆమ్ఆద్మీ పార్టీ ప్రముఖులుగా ప్రస్తావించబడుతున్న అరవింద్‌కేజ్రీవాల్, ప్రశాంత్‌భూషణ్, అశుతోష్, సోమనాధ్‌భారతి, షాజియా ఇల్మీ లాంటి నేతలెవరూ ఇంతకు మునుపు ఏనాడూ అన్నాహజారే ఉద్యమాలలో పాలు పంచుకోలేదు, కనీసం సంఘీభావం కూడా కనబరచలేదు.

 

ఒక సగటు పౌరుడుగా యు.పి.ఎ. ప్రభుత్వంలో పెచ్చరిల్లిన అవినీతి చూసి చలించిపోయాడు అన్నాహజారే. ఆరు దశాబ్దాలుగా పార్లమెంటులో మగ్గిపోతున్న జనలోక్‌పాల్ బిల్లు వెలికితీసి, అవినీతి అంతమొందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఢిల్లీలో నిరాహారదీక్ష మొదలేసాడు ఈయన. అప్పటికి డెబ్భై ఏళ్ళ పైబడిన వయసులో ఆయన మొదలేసిన ఉద్యమం కోట్లాది ప్రజలను ఆలోచింపచేసింది. లక్షలాదిగా ప్రజలు ఆయన ఉద్యమంలో భాగం పంచుకోటానికి ఢిల్లీ చేరుకున్నారు. అప్పటికే, కొన్ని సామాజిక సంస్థలు నిర్వహిస్తున్న అరవింద్‌కేజ్రీవాల్, ప్రశాంత్‌భూషణ్, కిరణ్ బేడి, బాబా రాందేవ్  లాంటి వ్యక్తులు కూడా ఆయన ఉద్యమంలోకి దూసుకువచ్చారు. పార్టీలకు అతీతంగా మొదలైన ఆ ప్రజా ఉద్యమం పాలకులను వణికించిందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటువంటి ఉద్యమాలను అణగదొక్కడంలో కాకలు తీరిన కాంగ్రెస్ నాయకులు, అన్నాహజారే మీదనే అవినితీ పంకిలాన్ని అంటగట్టే ప్రయత్నాలు చేసినా, ప్రజలే వాటిని తిప్పికొట్టారు. సామ దాన దండోపాయాలన్ని ప్రయత్నించిన కాంగ్రెస్ బేధోపాయాన్ని కూడా ప్రయోగించి, తదనుగుణంగానే కపిల్‌సిబ్బల్, సల్మాన్‌ఖుర్షీద్ లాంటి నేతల ద్వారా, దమ్ముంటే ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొనాలని, కావాల్సిన చట్టాలు చేసుకోవాలని సవాళ్ళు విసిరింది కాంగ్రెస్ పార్టీ. అరవింద్‌కేజ్రీవాల్ లాంటి నాయకులు ఆ సవాలును ప్రజల కోసమే స్వీకరిస్తున్నామని ఆమ్ఆద్మీ పార్టీని మొదలుపెట్టటం ఇప్పుడు చరిత్ర. మొదటి నుంచీ, అధికారం పరమావధి కాదని, ప్రజాసేవే పరమావధి అనే ఆదర్శంతో ఉద్యమాలు కొనసాగించిన అన్నాహజారే, సహజంగానే ఆ పార్టీకి తాను దూరమని ప్రకటించాడు. అయినా, ఆయన ఆదర్శాలను, ఆశయాలను ముందుకు తీసుకువెళతామని ప్రకటించిన ఆ పార్టీ అధికారం హస్తగతం చేసుకునే దిశగా తమ రాజకీయ రంగాన్ని సిద్ధం చేసుకుంది. అందుకు ఢిల్లీ ఓ ప్రయోగవేదిక అయ్యింది.

 

ఇక్కడ ఆమ్ఆద్మీ పార్టీ నేతల, ముఖ్యంగా అరవింద్‌కేజ్రీవాల్ నిజాయితీ, నిబద్ధత మనం ప్రశ్నించుకోవాలి. జనలోక్‌పాల్ ఉద్యమంలో పాల్గొన్న రోజుల నుంచే తన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మరిన్ని సమస్యలకు కారణమయ్యేవాడు.

 

 • ఆనాడు, ప్రత్యక్ష ఎన్నికలలో ఏనాడు పాల్గోబోయేది లేదని తన బిడ్డల మీద ప్రమాణం చేసి మరీ ప్రకటించిన మూణ్ణాళ్ళకే పార్టీ కూడా మొదలుపెట్టాడు.
 • ఎన్నికల సమయంలో కూడా, ఏ పార్టీకి కూడా తాము మద్దతు ప్రకటించమని, వారి మద్దతు కూడా తీసుకోమని ప్రకటించిన రెణ్ణాళ్ళకే ఏ కాంగ్రెస్ అవినీతి మీద అన్నా ఉద్యమంలో భాగమయ్యాడో, అదే కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాడు.
 • అన్ని పార్టీలలోని అవినీతిని తూర్పారబెట్టే అరవింద్‌ కేజ్రీవాల్, తన పార్టీ సహచరులు ఢిల్లీ ఎన్నికల ముందు అవినీతికి పాల్పడినట్లు నిఘాకెమేరాలకు చిక్కినా, అన్ని పార్టీలలాగానే ఓ అంతర్గత కమిటీ ఏర్పాటుచేసి, వారికి క్లీన్‌చిట్ ఇప్పించాడు.
 • తనవారికి కాంగ్రెస్ దేశాన్ని దోచిపెడుతున్నదని విమర్శించిన కేజ్రీవాల్, ఢిల్లీలో తాను చేపట్టిన విద్యుత్ ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తల కరెంటు బిల్లులు తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత మాఫీ చేసాడు!
 • ప్రతి ఇంటికీ 700 లీటర్ల నీళ్ళు ఉచితంగా అందిస్తానన్న వ్యక్తి, అధికారంలోకి వచ్చిన తర్వాత, 700 కు ఒక్క లీటరు ఎక్కువ వాడినా మొత్తం అన్ని లీటర్ల నీళ్ళకూ డబ్బులు కట్టాలనే మెలిక పెట్టి, తానూ కాంగ్రెస్ స్థాయి రాజకీయాలకు తీసిపోనని నిరూపించాడు.
 • నిర్భయ అత్యాచార ఉదంతంతో ఢిల్లీ అట్టుడికిపోయినప్పుడు ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలను ఏకిపెట్టిన వ్యక్తి, తన మంత్రివర్గ సహచరుడే స్వయానా విదేశీ మహిళలతో అనుచితంగా ప్రవర్తించినా వెనకేసుకు రావటమే కాకుండా, తనను తానో అరాచకవాదిగా ప్రజలకు స్పష్టం చేస్తూ, ఢిల్లీ రైలుభవన్ దగ్గర ధర్నా చేసి ముఖ్యమంత్రి పదవినే బజారుకీడ్చిన ఘనుడు.
 • ఇకపైగా, ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తి, లక్షలాది ప్రజలను సమీకరించి రిపబ్లిక్‌డే వేడుకలు అడ్డుకుంటామని, పోలీసులను ఉద్యోగాలు వదిలేసి తమ ఉద్యమంలో పాలుపంచుకోమని కోరటంలోని ఔచిత్యం అర్ధం కాదు.
 • కాంగ్రెస్ సమర్ధనతో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజల అభిప్రాయాలు సేకరించిన పెద్దమనిషి, ప్రభుత్వ రాజీనామాకు ముందు ప్రజల అభిప్రాయాన్ని ఏనాడూ అడగలేదు.
 • పోలీసులకు స్వయంప్రతిపత్తి కల్పించాలని కోరిన ఈ పార్టీ, స్వతంత్రంగాను, చట్టబద్ధంగానూ వ్యవహరించిన ఇద్దరు ఢిల్లీ పోలీసు ఆఫీసర్లను సస్పెండు చేయించేదాకా దేశ రాజధానిలో గందరగోళం సృష్టించింది.
 • ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నారని గుజరాత్‌లో కేజ్రీవాల్‌ను పోలీసులు ప్రశ్నిస్తే, ఆయనను గుజరాత్ పోలీసులు అక్రమంగా అరెస్టు చేసారనే అబద్ధపు ప్రచారం చేసి, నిన్నగాక మొన్ననే మరోసారి ఢిల్లీలో భీతావహ పరిస్థితులకు ఆజ్యం పోసింది ఈ పార్టీ.
 • నిన్నటిదాకా, అవినీతి నిర్మూలనే ఏకైక లక్ష్యంగా ప్రకటించిన ఈ పార్టీ ఈరోజు ఓట్ల కోసం ప్రజలకు లౌకిత్వం ముసుగు వేసే ప్రయత్నం చేస్తున్నది.

 

కేంద్ర ప్రభుత్వపు జనలోక్‌పాల్ బిల్లు నచ్చలేదు. సరే, తమ ఆలోచనాధోరణికి అనుగుణంగా మరో బిల్లు రూపొందించారు. అంతవరకూ బానే ఉంది. ఆ బిల్లును రాజ్యంగబద్ధమైన పద్ధతిలో ఢిల్లీ లెఫ్టినెంటు గవర్నరుకు పంపకుండానే, శాసనసభలో ఆమోదింపచేయాలని ప్రయత్నించటం, అందుకు ఒప్పుకోని కాంగ్రెస్, భా.జ.పా. పార్టీలను బిల్లుకు వ్యతిరేకులుగా ప్రకటించి వారిని ప్రజా వ్యతిరేకులుగా మరోమారు నిరూపించాలని ప్రయత్నించటం విచిత్రంగా కనిపిస్తుంది. వారు నిజంగానే ప్రజా వ్యతిరేకులైతే, ఆ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఆ బిల్లు పంపి, దాన్ని ఆయన ఆమోదించినప్పుడో, ఆమోదించనప్పుడో శాసనసభలో ఈ వ్యవహారం నడిపిస్తే, ఎటువంటి అనుమానాలు రాకపోను. ఈ విషయంలో ఆ.ఆ.పా. నిజాయితీ లేమి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇది కేవలం ఓ మిష. 49 రోజుల పాలనలో ప్రజలకు చేసిన ఉపకారం కన్నా, తమ మీద తామే చల్లుకున్న బురద ఎక్కువయ్యిందని గ్రహించబట్టే, సార్వత్రిక ఎన్నికల ముందు ఢిల్లీ ప్రభుత్వపు మొహంచాటేసే ప్రయత్నం తప్ప మరేమీ కాదని ప్రజలకు అర్ధమయ్యే ఉంటుంది.

 

అంతేకాకుండా, జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై, విషయాలపై ఎటువంటి విధివిధానాల రూపుకల్పన చేసుకోలేని పార్టీ రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే అరాచకత్వం తప్ప మరేదీ మిగలదని మూణ్ణాళ్ళ ముచ్చటగా ముగిసిన ఆ.ఆ.పా. ఢిల్లీ తంతు స్పష్టం చేస్తుంది. ప్రతి రోజూ ఏదో ఒక అరాచక పరిస్థితి సృష్టించి, మీడియాలోనూ ప్రజల నోళ్ళలోనూ నానటమే ఈ పార్టీ ధ్యేయంగా కనిపిస్తున్నది. దీనివల్ల ఒనగూడే ప్రచారమే, తమ అధికారానికి సోపానాలుగా భావిస్తున్నది. ఇప్పటి రాజకీయ పార్టీల మీద ప్రజలకు - ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఉన్న అసంతృప్తిని సాధ్యమైనంతమేరా ఉపయోగించుకోవాలన్న ఆలోచనలే కనిపిస్తున్నాయి కానీ, నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం మాత్రం ఈ పార్టీలోనూ కనిపించటం లేదు. కాబట్టి కొత్త పేరుతో పాత రాజకీయాలకన్నా ఘోరంగా నీచాతినీచమైన రాజకీయాలాడుతున్న ఆమ్ఆద్మీ పార్టీ ప్రజలకు అవసరమైన సరైన ప్రత్యామ్నాయం మాత్రం కాదు. ఈ పార్టీ వల్ల దేశానికి జరిగే కీడే ఎక్కువ.

 

Pictures Courtesy : Google

Comments   

 
0 #1 ఎన్నిక(ల)లు - 02 IVNS Raju 2014-03-09 15:18
AAP can never become an alternative for this current political system that we have. AAP suffers many gaps. First it is similar to any traditional political party - person based. Thus the list goes on.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh