The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 1
PoorBest 

ఎట్టకేలకు ఎన్నికల నగారా మోగింది. ఇక ఎన్నికల సమరం మొదలైనట్లే. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఇదివరకే రణదుందుభులు మోగించాయి. ప్రధానమంత్రి అభ్యర్ధిగా ప్రకటించకపోయినా, అటు గాంధీ వారసుడుగా యువరాజు రాహుల్, ఇటు గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఎదిగిన ఓ సామాన్య కార్యకర్తగా నరేంద్ర మోడీలు ఇరువురు తమతమ వ్యక్తిగత ప్రతిష్టలు పణంగా పెట్టి అటు యు.పి.ఎ.,  ఇటు ఎన్.డి.ఎ. ల తరుఫున శంఖనాదాలు చేస్తున్నారు. గంతకు తగ్గ బొంతలుగా మూడో కూటమి, అతుకుల బొంతగా నాలుగో కూటమి, అరువు తెచ్చుకున్న ఆదర్శాలతో వామపక్షాలు, వాపు చూసి బలుపుగా భావిస్తున్న ఆమ్ఆద్మీ పార్టీ, గోడమీద పిల్లుల్లా కాచుకు కూర్చున్న మరికొన్ని చిల్లరమల్లర పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటేయగలమని ఆశిస్తున్నాయి.

 

ఒకింత నిరాశ, నిస్పృహలతో ఆలోచిస్తే, ఏ కూటమి అయినా దేశాన్ని ఉద్ధరిస్తుందనే నమ్మకం పోయి చాలా కాలమయ్యింది. సగటు పౌరుడికి అయిదేళ్ళకి ఒకసారి ఉపయోగపడే ఆయుధంగానే ఓటు పనికొస్తున్నది కానీ, గెలుపు గుర్రాలు మారినా ప్రజలకు ఓటమే ఎదురౌతున్నది. అధికారంలోకి వచ్చే పార్టీలు మారినా, అభివృద్ధి మృగ్యంగానే ఉంది. ప్రజాస్వామిక హక్కును ఉపయోగించుకుంటున్నామే కానీ, ఆ హక్కు ద్వారా మనకు లభించాల్సిన సుపరిపాలన లభించకపోయినా, ఆ దుస్థితికి దాసోహమంటూ మరో అయిదేళ్ళు నిరీక్షణలో గడిపేస్తున్నాం. పనికిరాని పాలకులను వెనక్కు లాగే హక్కు లేకపోవటం కూడా మన దుస్థితికి మరో కారణం.

 

1977 సార్వత్రిక ఎన్నికలు తప్పించి ఇంతవరకూ జరిగిన ఎన్నికలన్నీ ప్రజలకు పనికొచ్చే అంశాల మీద, అభివృద్ధి ప్రాతిపదికగా జరిగినవి కాదు. తండ్రి పోయాడని కూతురుని, అమ్మ పోయిందని కొడుకుని, ఆయన పోయాడని ఆయన పార్టీని, పాకిస్తాన్‌తో యుద్ధంలో గెలిచారనో, మందిరం కావాలనో, మసీదు కూల్చారనో జరిగిన ఎన్నికలే! ఇప్పుడు జరగబోయే ఎన్నికలు, నిజానికి ఆయా పార్టీలకన్నా కూడా ప్రజలకే ఓ విషమ పరీక్ష.

 

ఇంతకాలమూ, ఏ ముసుగులో ఎవరి చాటున ఉంటే ఎంత లాభమో బేరీజు వేసుకొని ప్రజలకు పోటు పొడుస్తున్న పార్టీలకు ప్రజలు సరయిన గుణపాఠం చెప్పకపోతే, మరో అయిదు సంవత్సరాలు అవినీతి అశుద్ధాన్ని భరించకతప్పదు. ఓటు బ్యాంకు రాజకీయాలకు చరమగీతం పాడాల్సింది ప్రజలే కానీ, పార్టీలు కాదన్న విషయాన్ని ఓటర్లు గుర్తెరగాలి. అభివృద్ధి పేరుతో అవినీతికి కొత్తమార్గాలు అన్వేషిస్తూ నైతికవిలువలన్నీ అడుసులో తొక్కేసిన అరాచక పార్టీలను భూస్థాపితం చేయగల అవకాశం ఇప్పుడు వచ్చిందని ప్రజలు గమనించాలి. అధికారానికి నిచ్చెనలుగా ప్రజల పేదరికాన్ని, నిరక్షరాస్యతను వాడుకునే పార్టీలకు బుద్ధి చెబుతూ వందకో, మందుకో కక్కుర్తిపడటం మాని, బడి కోసమో, మంచి బతుకు కోసమో ఓట్లు వేయాల్సిన అవసరం ఉన్నదని గుర్తించాలి.

 

1977లో చీలికపీలిక పార్టీలతో జనతా ప్రభుత్వ ప్రహసనం తర్వాత, 1991 నుంచి ఇప్పటి దాకా దేశంలో ఏ ఒక్క పార్టీకీ ప్రజలు పట్టం కట్టలేదు. ఆయా పార్టీల కూటములతో మాత్రమే ప్రభుత్వాలు ఏర్పడటం జరిగింది. అందులో ముఖ్యంగా యు.పి.ఎ., ఎన్.డి.ఎ. కూటములు మాత్రమే అయిదేళ్ళ అధికారాన్ని నిలుపుకోగలిగాయి. అత్తెసరు పార్టీలతో అంట కాగటమనే వంకలతో అవినీతి పంకిలాన్ని ప్రతి ప్రభుత్వమూ అంటించుకుంది.  పట్టుమని పది ఎం.పీ.లు కూడా లేని పార్టీలు కూడా తమ తమ ప్రాంతీయ రాజకీయాల కళ్ళద్దాలతో దేశ భవిష్యత్తును దిద్దటానికి పూనుకుంటున్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, కొన్ని పార్టీల ప్రాంతీయ అవసరాలకు దేశ అవసరాలని తాకట్టు పెట్టటం కూడా జరుగుతున్నది. కాదంటే అధికారం కొడిగొట్టే దీపం కాబట్టి, పెద్ద పార్టీలు కూడా సంక్లిష్టమైన సంకీర్ణ ప్రభుత్వాలను నడపటానికి ఆపసోపాలు పడుతున్నాయనేది కూడా వాస్తవం.

 

ఈ స్థితికి దేశం చెల్లించుకున్న మూల్యం దాదాపు 23 సంవత్సరాల అభివృద్ధి! కాబట్టే, స్వతంత్ర భారతావనిలో మహాప్రహసనంలా ఇప్పటివరకూ కొనసాగిన సార్వత్రిక ఎన్నికలు, మునుపెన్నడూ లేనివిధంగా దేశానికి దిశానిర్దేశం కావించబోతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకి ప్రత్యామ్నాయం అవసరమా? అవసరమైతే అది భా.జ.పా.నా లేక ఆ.ఆ.పా.నా లేక చిల్లరమల్లర పార్టీలతో కూటములు కట్టే కమ్యూనిస్టులా? ఇవేమీ కాని మరో అతుకుల బొంతా? ఆ మాటకొస్తే, అసలు ప్రజలకి తామకు కావలసినదేమిటో ఎరుకేనా? ఉచితానుచితాలు మరచి ఉచితంగా అందించే ఉచ్ఛిష్టం కోసం కక్కుర్తిపడితే దేశం ఏమైపోవాలి? ఇన్ని గందరగోళాల మధ్య ప్రజలను తొలిచే ప్రశ్న - ఏకపార్టీ పాలన కోరుకోవటమా, సమాఖ్య స్ఫూర్తిని నిలబెట్టే విధంగా పరిపాలన చేసే కూటమిని ప్రత్యామ్నాయంగా ఎన్నుకోవటమా?

 

ఒకే పార్టీగానూ, కూటమితోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ దేశాన్ని ఎలా భ్రష్టుపట్టించిందో ఓసారి గమనిద్దాం. స్వాతంత్ర్యం వచ్చి 67 సంవత్సరాలైనా, మనం ఇంకా "అభివృద్ధి చెందుతున్న దేశం"గానే మిగలటానికి వ్యవస్థీకృతమైన అవినీతే కారణం. ఆ పాపంలో ప్రధాన భాగస్వామి కాంగ్రెస్సే! మొదటి ముప్ఫై సంవత్సరాలలో జవహర్‌లాల్ నెహ్రూ , ఇందిరా గాంధీ కలుపుకొని దాదాపు 28 సంవత్సరాలు పరిపాలించగా, లాల్‌బహదూర్‌శాస్త్రి, గుల్జారీలాల్‌నందా కలుపుకొని రెండు సంవత్సరాలు పరిపాలించారు. 1977 తర్వాత 25 సంవత్సరాలు కాంగ్రెస్సే అధికారంలో ఉంది. అంటే, మొత్తం 67 సంవత్సరాలలో 53 సంవత్సరాలు కాంగ్రెస్సే పాలించింది. గడచిన పదేళ్ళ పాలనలో సంకీర్ణ ప్రభుత్వపు సంక్లిష్టతలే అభివృద్ధి లేకపోవటానికి కారణం అనుకున్నా, 43 సంవత్సరాలు దేశం ఏకపార్టీ పాలనలోనే (కాంగ్రెస్) ఉన్నా అభివృద్ధి శూన్యమే అయ్యింది. పదేళ్ళ సంకీర్ణ ప్రభుత్వమూ వెలగబెట్టిందేమీ లేదు.

 

1991-96 మధ్యకాలంలో పి.వి.నరసింహారావు ప్రభుత్వంలో ఆర్ధికమంత్రిగా మన్‌మోహన్‌సింగ్ ఉన్నప్పుడు కూడా హర్షద్‌మెహతా స్టాక్ఎక్స్ఛేంజ్ కుంభకోణం, అబ్దుల్‌కరీం తెల్గీ స్టాంపుల కుంభకోణంలో వేలాదికోట్ల అవినీతి బయటపడినా ఆ ప్రభుత్వం ఓ లక్ష్యం దిశగా నడిచిందనే నమ్మకం ఉండేది. గడచిన పది సంవత్సరాలలో వెలుగు చూసిన అవినీతి లక్షల కోట్లలో దిగటమే కాకుండా "సంకీర్ణ ప్రభుత్వపు మొహమాటాలే" దీనికి పరోక్ష కారణంగా ప్రధానిగా మన్‌మోహన్‌సింగ్ ప్రకటించటం అందరికన్నా అసమర్ధుడైన ప్రధానిగా ఆయన్ని నిరూపించాయి. చరిత్ర తనను వేరే దృష్టికోణంలో చూడాలని ఆశించిన మన ప్రధాని, సమర్ధుడైన అధికారిగా పేరుపొందినా, ఒక మంత్రిగానూ, ఒక ప్రధానమంత్రిగానూ అసమర్ధుడిగానే మిగిలిపోయాడు. పేరుకే ప్రధానిగా మిగిలిన మన్‌మోహన్ అధిష్టానం ఆడిన ఆటలో పావుగా మిగిలిపోయాడు. మూడోసారి ఈ కీలుబొమ్మ ఆశించినా, ప్రజలు యు.పి.ఎ.ను గెలిపించినా, అధిష్టానం ఈయన్ని ప్రధాని చేసే అవకాశం లేదు.

 

డిసెంబరులో వెలువడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో, ప్రజలు మార్పు కోరుకుంటున్నారనేది స్పష్టమయ్యింది. ఆ విషయం గ్రహించబట్టే, ప్రధాని అభ్యర్ధిని ప్రకటించటం మా అనవాయితీ కాదని కాంగ్రెస్ కబుర్లు చెబుతున్నదనేది వాస్తవం. ఇదే కాంగ్రెస్ గతంలో ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఆగకుండా, మూడో ఫ్రంటును ప్రధాని అభ్యర్ధిని ప్రకటించమని ఎద్దేవా చేసిన విషయం కూడా మరిచిపోరాదు. ఏదేమైనా అప్రకటిత కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి రాహుల్‌గాంధీ అనేది బహిరంగ రహస్యమే.

 

అవినీతి మీద రాహుల్ గాంధీ ఆలోచనా విధానానికి, ఆచరణలో పాటిస్తున్న విధానాలకి ఏమాత్రమూ పొంతన లేదనేది వాస్తవం. ఆదర్శ్ కుంభకోణానికి సంబంధించి ఒక రిటైర్డ్ న్యాయమూర్తి ఇచ్చిన నివేదికను మహారాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆ తర్వాత, రాహుల్ గాంధి జోక్యంతో, ఆ నివేదికలోని కొన్ని అంశాలనే పాక్షికంగా ఆమోదిస్తూ ఆదర్శ్ కుంభకోణంలో ప్రధాన పాత్రధారులైన కాంగ్రెస్ నాయకులను పక్కనపెట్టి, వారికి వంతపాడిన అధికారులను కుంభకోణానికి బాధ్యులుగా ప్రకటించి వారి మీద చర్యలు తీసుకుంటున్నది. ఆ అవినీతికి అంతే బాధ్యత వహించాల్సిన కాంగ్రెస్ నాయకుల గురించి పల్లెత్తు మాట అనలేకపోయాడు రాహుల్ గాంధీ.

 

అలానే, కోర్టు తీర్పును అవహేళన చేసే విధంగా, అవినీతి ఆరోపణలతో జైలు పాలైన వ్యక్తులకు కూడా ఎన్నికల్లో పాల్గొనే అర్హత కల్పించటానికి హడావుడిగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఒక ఆర్డినెన్సును చించి బుట్ట దాఖలా చేయాలని రాహుల్ గాంధీ కోరటం ఆ వెంటనే ఆ ఆర్డినెన్సు ఆగిపోవటం కూడా మనకు తెలుసు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ ఆర్డినెన్సు రూపొందించే సమయంలో దిక్కులు చూసిన నేత, రాష్ట్రపతి ఆ ఆర్డినెన్సుపై తన సందేహాలు వ్యక్తం చేసిన తక్షణం ఆఘమేఘాల మీద అడ్డుకోవటం. ఇంత ముఖ్యమైన ఆర్డినెన్సు కాంగ్రెస్ అధిష్టానానికి తెలియకుండానే, పార్టీ వేదికపై చర్చించకుండానే తయారయ్యాయని ప్రజలకు నమ్మబలుకుతున్నారా?

 

చూస్తుంటే, ఈ ఎన్నికలలో కాంగ్రెస్‌కు అవినీతి అనేది ఒక అంశమే కాదనిపిస్తున్నది. ఆ అంశంతో పోరాడుతున్న ఆమ్ఆద్మీ పార్టీకి ఢిల్లీలో మద్దతు పలికినా, అది భా.జ.పా.ను పక్కన పెట్టటానికే కానీ, రాహుల్ గాంధీ చెబుతున్నట్లు ఆ.ఆ.పా. ఆలోచనలు నచ్చి మాత్రం కాదు. పది సంవత్సరాల పరిపాలన గురించి చెప్పుకోవాల్సి వస్తే మాత్రం కాంగ్రెస్‌కు మిగిలే అంశాలు, మొన్న తీసుకొచ్చిన లోక్‌పాల్, తెలంగాణా, అంతకన్నా ముందు తీసుకొచ్చిన కోరలు లేని ఆర్.టి.ఐ.లు మాత్రమే. మొన్నటి టైమ్‌స్ నౌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహిళా సాధికారత గురించి చిలకపలుకులు వల్లె వేసిన రాహుల్‌గాంధీ పదేళ్ళల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురాలేకపోవటానికి కారణాలు అడిగినా చెప్పలేడేమో! అమెరికాతో చేసుకున్న అణుఒప్పందాన్ని ఖరారు చేస్తూ పార్లమెంటులో అడ్డదిడ్డంగా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకున్న సర్కారుకు, మహిళా రిజర్వేషన్‌బిల్లు మాత్రం కొరకరాని కొయ్యలా అయ్యిందంటే ఎవరు నమ్ముతారు? ఏదేమైనా, పదేళ్ళ పాలనలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమాత్రమూ సాధించలేకపోయినా, అవినీతిలో మాత్రం పాతాళపు అంచులను మాత్రం తాకారంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో ఆ రెండు అంశాల గురించి మాట్లాడే ధైర్యం, నైతిక స్థైర్యం కాంగ్రెస్‌కు, యు.పి.ఎ. భాగస్వాములకు లేదు. కాబట్టే, 2002 గుజరాత్ అల్లర్లే వారి ఆశలకు ఊపిరులు పోస్తున్నాయి.

 

ఏదేమైనా, మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యు.పి.ఎ.కు అధికారాన్ని కట్టబెట్టే యోచనలో ప్రజలు లేరని మొన్నడి డిసెంబరు ఎన్నికల్లోనే స్పష్టమయ్యింది. అలానే, ఏకపార్టీ పాలనకు మొగ్గి, కాంగ్రెస్‌కు మాత్రమే ప్రజలు అధికారం కట్టబెట్టగలరనుకోవటం కూడా అత్యాశే! మరి ప్రత్యామ్నాయాలేమిటనేది చర్చించాల్సిన అవసరం ఉంది.

 

Pics Courtesy : Google

Comments   

 
0 #1 ఎన్నిక(ల)లు - 01 IVNS 2014-03-05 08:22
కిరణ్ గారు చాల చక్కని విశ్లేషణ తో వ్యాసం వ్రాసారు. ఇలాంటి వ్యాసాలే వోటర్లను సరియైన అభ్యర్ధి ని ఎన్నుకోవాదానికి తోడ్పడతాయి. తరచూ మీ నుంచి ఈ వ్యాసాలూ ఎదురు చూస్తాను .
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh