The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 1
PoorBest 

కొన్నేళ్ళ క్రితం (2008లో) తెలుగు సినిమా వజ్రోత్సవాల్లో 'లెజండరీ' అవార్డు గురించి చాలా గందరగోళం జరిగింది. ఒక్క తెలుగు సినిమాలు పక్కనపెట్టి, మొత్తం భారతదేశ చలనచిత్ర పరిశ్రమను ఒకసారి పరికిస్తే, నిజమైన మహానటులు దక్షిణభారతదేశంలో ఒకప్పుడు చాలామంది ఉన్నట్లుగా రుజువవుతుంది.

అసలు ఒక నటుడిని ఏ ప్రాతిపదికన మహానటుడుగా అభివర్ణించవచ్చు అనేది చర్చనీయాంశం. తన మేనరిజాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవటమా? అర్ధంపర్ధంలేని సినిమాల్లో హీరోలుగా నటించి మెగా హిట్లు సాధించటమా? ఎవ్వరి దన్నూ లేకుండా స్వంతంగా కష్టపడి ఒక్కోమెట్టు ఎక్కి ప్రేక్షకుల అభిమానం సాధించటమా?

అసలు ఈ రోజుల్లో నటుడికి అర్ధం మారిపోయింది. ఒక నటుడికి నటనకన్నా కూడా కండలు పెంచడం, డాన్సులు వేయటం, ఫైట్లు చేయటమే ప్రాధాన్యమైపోయింది.అసలు నటన విషయానికి వస్తే, ఆహార్యంతోపాటు, ఆంగికం, వాచికం కూడా స్పష్టంగా ఉండాలి. ఆ రకంగా చూస్తే, ఈనాడు చాలామంది అసలు నటుల కింద కూడా పరిగణించబడరు.

కేవలమూ సాంఘిక చిత్రాలే కాక, చారిత్రక, పౌరాణిక, జానపద చిత్రాలలో రాణించగలగటమూ ముఖ్యమైన ప్రాతిపదిక. ఈ రకంగా చూస్తే, పృధ్వీరాజ్ కపూర్, దిలీప్ కుమార్ లు తప్పించి, మిగతావారెవరూ ఉత్తరభారతంలో ముఖ్యంగా హిందీ సినిమాల్లో మహానటులుగా కీర్తించబడుతున్నవారెవరూ నిజానికి మహానటులు కాలేరు. వారైనా ఒకటి రెండు చారిత్రక నేపథ్యంలో ఉన్న సినిమాలలో నటించినవారే కానీ, పౌరాణిక చిత్రాలలో ప్రజలను మెప్పించగలిగిన రీతిగా నటించినవారు కారు.

మన దక్షిణాదిలో, ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో చిత్తూరు నాగయ్య, ఎస్.వి.రంగారావు, గుమ్మడి, ఎన్.టి.రామారావు, నాగేశ్వరరావు, ధూళిపాళ, కాంతారావు, రేలంగి, పద్మనాభం తదితరులు చెప్పుకోదగ్గ ప్రముఖులు. పౌరాణికాల్లో వీరు చేసినన్ని పాత్రలు బహుశా ఇతర చిత్ర పరిశ్రమల్లో మరెవరూ చేసి ఉండరు.

త్యాగయ్యగా, వేమనగా, భీష్ముడుగా, వాల్మీకిగా నాగయ్య, రావణాసురుడుగా, కంసుడుగా, దుర్యోధనుడుగా, పాపారాయుడుగా ఎస్.వి.ఆర్., బలరాముడుగా, ధర్మరాజుగా, తిమ్మరుసుగా గుమ్మడి, రాముడుగా, కృష్ణుడుగా, అర్జునుడుగా, భీముడుగా, రావణాసురుడుగా, దుర్యోధనుడుగా, కృష్ణదేవరాయలుగా, బ్రహ్మనాయుడుగా ఎన్.టి.ఆర్., చాణుక్యుడుగా, అభిమన్యుడుగా, అర్జునుడుగా ఎ.ఎన్నార్., కర్ణుడుగా, దుర్యోధనుడుగా, శకునిగా ధూళిపాళ, నారదుడిగా, కృష్ణుడిగా, అర్జునుడిగా కాంతారావు ప్రసిద్ధులు.

సాంఘికాలను పక్కనపెట్టి చూస్తే, పైన ఉదహరించినవారందరూ పౌరాణికాల్లోనూ, చారిత్రాత్మకాల్లోనూ ప్రేక్షకులను మెప్పించారు. అహా, తిమ్మరుసు అంటే ఇలా ఉంటాడు, రాముడు, కృష్ణుడు ఇలానే ఉండి ఉంటారు. దుర్యోధనుడు ఇంత కుత్సితుడా! అని ప్రేక్షకులను మెప్పించేలా వీరి అభినయకౌశలం ఉండేది. అదేవిధంగా స్త్రీ పాత్రల్లో, సీతగా అంజలి, ద్రౌపదిగా సావిత్రి, నాగమ్మగా భానుమతి, సత్యభామగా జమున.

కేవలమూ, బాక్సాఫీసు బేసిస్ గా మహానటులుగా ఎవరినైనా పరిగణించటంలో అర్ధం లేదు. నటుడంటే, అన్నిరకాల పాత్రల్లోనూ ప్రవేశించగలిగి ఉండాలి. 

అన్ని రకాల సినిమాల్లోనూ చేయలనే ఉంటుందంటారు మన నటులు. కానీ, అవకాశాలే రావట్లేదని వాళ్ళ బాధ అన్నట్లుగా చెబుతుంటారు. వచ్చిన అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారనటానికి ఓ ఉదాహరణ, కొన్నేళ్ళ క్రితం హిందీలో వచ్చిన అశోక సినిమా. సాంఘికాల్లోనే నటించటం రాని వ్యక్తి, ఇక చారిత్రక సినిమాలో ఏం నటించగలడు? జోధా అక్బర్‍లో హృతిక్ రోషన్ చూడ్డానికి ఫరవాలేదనిపించాడు కానీ నటనలో అత్తెసరు మార్కులే వేయొచ్చు.

అప్పుడప్పుడు వస్తున్న, అన్నమయ్య, రామదాసు, మంజునాథ లాంటి సినిమాలు ఈమధ్య కాలంలో వచ్చిన శ్రీరామరాజ్యం, జగదురు ఆదిశంకర తప్పించి, ఇప్పటి తెలుగు సినిమాలకు, తెలుగు సినీ హీరోలకు కూడా ఇందులో మినహాయింపులేదు. ఆహార్యం ఉన్నదనుకుంటే, వాచికం ఉండదు. రెండూ ఉన్నా ఆంగికం కుదరదు. అసలు డైలాగులు చెప్పటమే రానివారు హీరోలవ్వటం అన్నిటికీ మించి ఆవేదన కలిగించే విషయం.

ఒకప్పుడు, రాముడుగా నాయకుడి పాత్రలోనూ, రావణాసురుడుగా ప్రతినాయకుడి పాత్రలోనూ ప్రేక్షకులను రంజింపజేసిన మహానటుల వంటి వారికై దీవిటీ పెట్టి వెతికినా ఈరోజు కనిపించరు. ఇక అటువంటి సినిమాలు చేసే నిర్మాతలు, దర్శకులు లేరని వాపోవటం అనవసరమేనేమో!

ఏతావాతా చెప్పొచ్చేదేంటంటే, మనకు ఒకానొకప్పుడు ఉత్తమ నటులు కుప్పలుతెప్పలుగా ఉండేవారు. ఈరోజు ఉత్త నటుల్నే వెదుక్కోవాల్సిన పరిస్థితి. పిల్లల్ని, మనవల్ని ’లాంచ్’ చేయడమే ప్రధాన వ్యాపకమైపోయింది. చిత్ర పరిశ్రమ కొన్ని కుటుంబాల సొత్తుగా మారిపోయింది.

కళలు, కళాకారులు వారసత్వంగా వచ్చేవి కావని ఎప్పుడు గుర్తెరుగుతారో?

 

Comments   

 
+1 #5 మహానటులెవరు? Saikiran K 2013-09-01 13:19
నిజమేనండి రాజు గారు. ఎంతో ఊహించుకుని చూసా ఈ సినిమాను. అరుపులు కేకలు తప్పించి సో కాల్డ్ పెద్ద నటుల నటనా వైదుష్యమేమీ కనిపించలేదు. మీరు చెప్పినట్లు ఆదిశంకరుల పాత్ర ఔచిత్యం కూడా ఈ నటులు చాలా దెబ్బ తీసారు. దానికి తగ్గటు భారవి దర్శకత్వం కూడా పరమ ఛండాలంగా ఉంది. మూడు నాలుగు సంవత్సరాలు ఆదిశంకరులవారి జీవితం మీద పరిశోధన చేసామన్నారు కానీ, శ్రీచక్రానికి, మహాలక్ష్మి యంత్రానికి తేడా కూడా తెలుసుకోకపొవటం విచిత్రం! దానికితోడు సినిమాలో వాడిన భాష మరింత అభాసుపాలు చేసింది ఈ సినిమాని. శైవులు, వైష్ణవులైన బ్రాహ్మణులు "నాకొడకల్లారా.. .." అంతూ తిట్టుకోవటం చూస్తే, భారవి ఈ సినిమా తీయటంలోని అసలు ఉద్దేశ్యం ఏమిటో అని అనుమానించాల్సి వచ్చింది. మండనమిశ్రుడితో ఆదిశంకరులవారి సంవాదం ఒక కామెడీ ఎపిసోడ్ గా తీయటంలోనే భారవి చేసిన పరిశోధనల్లోని పస తెలిసింది. అసలు రివ్యూ రాద్దామనుకున్నా కానీ, భారవి దానికి అర్హుడు కాదని ఆగిపోయాను.
Quote
 
 
+2 #4 మహానటులెవరు? IVNS 2013-08-30 06:51
నాకెందుకో ఆదిశంకరుల చిత్రం లో అధికంగా ప్రముఖ నటులకు పాత్రలు ఇవ్వడం వలన శంకరుల పాత్రధారి కౌశిక్ తద్వారా ఆ పాత్ర ప్రభావం కించత్ తక్కువగా ఉన్నట్లు తోచింది.
ఈ చిత్రం లో పెద్ద నటుల పాత్రలు ముఖ్యం గా చిరంజీవి మాటలు "కర్మ కు బదులు ఖర్మ" అనడాలు రుచించలేదు
Quote
 
 
0 #3 మహానటులెవరు? Sivaji N 2013-08-29 18:16
lol :P
Quote
 
 
+1 #2 మహానటులెవరు? sri 2013-08-29 16:13
KCR and his family members, Chiranjeevi, Jagan, YS Vijaya, Sharmila, KK, KodandaRam, Lagadapati, Undavalli, Ambati these great great actors.. :cry:

Chandrababu and co are regular actors. Because they don't know completely how to jump the places.. :-?
Quote
 
 
+2 #1 మహానటులెవరు? sarma 2013-08-25 06:45
"కళలుఉ, కళాకారులూ వారసత్వంగా వచ్చేవి కావని ఎప్పుడు గుర్తెరుగుతారో"

ఇంక ఎరిగేదేముందీ, పట్టవలసిన తెగులు, పట్టడం, చెయ్యవలసిన చేటు చెయ్యడం, జరిగిపోయకా?
ఎంతటి సీనైనా ఒకే టేక్ లో ఓకే చెయ్యగలిగేలా నటించేవాడు, క్యారక్టర్ ఏక్టర్, రెండు మూడు టేక్ లు తీసుకునేవాడు కమేడియన్, టేకులను కేకుల్లా తినేవాడు హీరో అతనే మన మహానటుడూనూ.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh