The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 5
PoorBest 

Img: boxofficehits.in

బాహుబలి.

ఈ చలనచిత్రం ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద సంచలనం. అంతర్జాతీయ మార్కెట్ లో సింహభాగాన్ని పొందిన బాలీవుడ్ హీరోలు, దర్శకులు సైతం ఉలిక్కిపడేలా చేసిన చిత్రం ఈ బాహుబలి.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు చిత్రసీమనే కాదు భారత చిత్ర పరిశ్రమను సైతం ఒక మెట్టు ఎక్కించినదిగా చెప్పవచ్చు. రాజమౌళి 3 ఏళ్ళు "కష్టపడి" తీసిన ఈ చిత్రం కొన్ని హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టినట్టుగా కొందరు చెప్పడం విన్నాను. కానీ, సినిమా విడుడలయ్యాక ఈ సినిమాలో నకలు కన్నా అసలు సత్తా ఉందని అందరూ అంటున్నారు. ఆ అభిప్రాయం పెరగడం వల్లనే బాహుబలి ఇప్పుడు ఒక సూపర్ డూపర్ బాక్సాఫీస్ హిట్!

కానీ నిజానికి ఈ సినిమా ఒకానొక పాత కథకు పూర్తిగా కాకపోయినా కొద్దిగానైనా కొత్త నకలేనన్నది నా అభిప్రాయం. ముఖ్యంగా బాహుబలి సెకండ్ హాఫ్ దాదాపు ఒక ప్రసిద్ధ కథకు మారు రూపమేనని చెప్పవచ్చు.

ఇంతకూ ఏమిటా ప్రసిద్ధ పాత కథ? అని అడిగితే - నా సమాధానం:

మహాభారతం! 

"మహభారతానికి బాహుబలికి లింకు ఏంటి?" అని మీరు అనుకుంటున్నారు కదూ! నేను వివరిస్తాను.

బాహుబలి లోని నాజర్ పాత్ర ఐన బిజ్జలదేవుడు మహా భారతంలోని ధృతరాష్ట్ర పాత్రను దృష్టిలో ఉంచుకుని రూపొందించారని నా అభిప్రాయం. భారతంలో ధృతరాష్ట్రుడు గుడ్డితన మనే అంగవైకల్యం వల్ల వారసత్వంగా తనకు దక్కాల్సిన సింహాసనానికి దూరమయ్యాడు. ఈవిధంగానే బిజ్జాలదేవుడు కూడా అవిటితనం వల్లనే సింహాసనాన్ని అధిష్టించ లేకపోతాడు.

ఇక మహాభారతంలో ధృతరాష్ట్రుడుకి పాండురాజు ఉన్నట్టే బిజ్జలదేవునికి ఒక తమ్ముడు ఉండి అతనే దేశ రాజ్యవ్యవస్థను సర్వంసహా అధికారిగా నిర్వహిస్తుంటాడు. అంతేకాదు యువకుడిగా ఉన్నప్పుడె మరణిస్తాడు కూడా! అతని భార్య ఓ మగబిడ్డకి జన్మనిచ్చి చనిపోతుంది. అనాథ ఐన ఆ పసిబిడ్డను బిజ్జాలదేవుని భార్య శివగామి తన కొడుకు ఐన భల్లాలదేవునితో బాటు పెంచుతుంది. ఆ అనాథ బాలుడే బాహుబలి. ఇది కూడా కుంతి, మాద్రి పాత్రలను దృష్టిలో ఉంచుకుని నడిపించిన కథనంలా కనిపిస్తుంది.

మహాభారతంలో పాండవ, కౌరవులు సోదరులైనప్పటికీ చిన్నతనం నుండి బద్ధ వైరులుగానే ఉంటారు. అదేవిధంగానే బాహుబలి, భల్లాలదేవుడు కూడా ఒకరికి ఒకరు శత్రువులుగా మారతారు.

ఇక మరో ముఖ్యపాత్ర  అయిన కట్టప్ప కురుకుల పితామహుడైన భీష్ముని పాత్రను పోలింది. మాహిష్మతి రాజ్య సేనాని అయిన ఈ కట్టప్ప తన రాజుకు, రాజ్యానికి కట్టుబడివుంటాడు. తండ్రికిచ్చిన మాట ప్రకారం బ్రహ్మచారిగానే మిగిలిపోయి, ఎటువంటి సందర్భంలో కూడా కురు సామ్రాజ్య సింహాసనాన్ని కబళించకుండా, కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనుని పక్షం వహించి, అతని సర్వసేనాధిపతిగా పోరాడిన భీష్ముని గుణగణాలలో కొన్నింటిని పుణికిపుచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది.

ఇక్కడ మనం బాహుబలి కథా రచయిత అయిన కె. వి. విజయేంద్ర ఫ్రసాద్ ను మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇతను మన వాళ్ళ తెలివిని గుర్తించి అత్యంత ప్రసిద్ధి చెందిన మహాభారత కథను కొద్దిగా మార్చి మన భావి భారత పౌరులకు చూపించాడు. ఒకవేళకు 100 సంవత్సరాల తరువాత ఏ బామ్మో తన మనవడికి మహాభారత కథనో లేక రామాయణ కథనో చెబితే అప్పుడు ఆమె మనవడు "బామ్మా! నువ్వు మొన్న చూసిన సినెమా కథనే చెబుతున్నావులే" అని వెళ్ళిపొతాడు. (నా పిచ్చి కాని అప్పటి బామ్మల కాలానికి మహాభారత, రామాయణాలు ఎంతవరకు మిగిలివుంటాయో! ఇది నా ఉహ మాత్రమే)

ఏదియేమైనా, మహభారతం గురించి పరిచయం ఉన్నవారు నాతో సహమతిని చూపిస్తారని భావిస్తాను!

శుభం.

@@@@@

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh