The Natural HR Theory by Dr IVNS Raju

Articles

User Rating:  / 0
PoorBest 


"ముద్దబంతి పూవులో..."

"నీవేనా నను పిలచినది..."

"శివశంకరి... శివానందలహరి..."

"మనసున మనసై, బ్రతుకున బ్రతుకై..."

"దేవదేవ ధవళాచల..."

"ఘనాఘన సుందరా..."

"కుడిఎడమైతే..."

"జేబులో బొమ్మ..."

"తెలుగువీర లేవరా..."

"రాజశేఖరా నీపై..."

"కనుపాప కరువైన..."

పాడాలని పాడేసిన పాటలు కావివి. ఒక్కో పాట ఆణిముత్యమనటంలో నేను కొత్తగా చెప్పేదేమీ లేదు. సినిమా చూసినా చూడకపోయినా, ఆయన పాటలు వింటే చాలు, సినిమా చూసినట్లే అంటే అతిశయోక్తి కాదు. కవి వ్రాసిన కవిత్వాన్ని గొంతుతో చిత్రంగా ఆవిష్కరించగలిగిన నేర్పరి. అందుకే ఆయన, ఆయన గాత్రం అజరామరం.

చాలామంది గాయనీగాయకులకు "వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం" గా కొన్ని అవకాశాలొస్తాయి. అవి పాడి చరిత్రలో నిలిచిపోతారు. కానీ, పాడిన ప్రతిపాటని లైఫ్ టైం అవకాశంలా మలుచుకుని, పాటలని అవి వ్రాసిన కవులను చిరంజీవులుగా చేసినంది ఘంటసాల. 

ఘంటసాల గురించి చెప్పటానికి ఎలా మొదలుపెట్టాలో , ఎక్కడ ముగించాలో తెలియదు. ఆయనను మించిన గాయకులు ఉండిఉండవచ్చు. అసలు ఉన్నారా లేదా అనేది కూడా ప్రశ్న కాదు. ఒక గాయకుడుగా, ఒక సంగీతదర్శకుడుగా తరాల అంతరాలేవీ అడ్డురాకుండా, అఖిలాంధ్రప్రజల అభిమానాన్నిచూరగొనటం ఎక్కడా కనీవినీ ఎరుగనిది.

అసలు చెప్పాలంటే, ఘంటసాల పాట విననివాడు, ఘంటసాల తెలీనివాడు ఆంధ్రుడై మాత్రం ఉండడు. ప్రజల అభిమానాన్ని చూరగొనే గాయకులెందరో ఉంటారు. కానీ, ప్రజలకు ఆరాధ్యుడుగా, ఓ సంస్కృతికి చిహ్నంగా మాత్రం
నాకు తెలిసి ఏ గాయకులూ లేరు. ప్రతి తెలుగు కుటుంబంతో పెనవేసుకొన్న గాత్రం ఘంటసాలది.

'జగమే మాయ, బ్రతుకే మాయ...' పాట వింటూ వైరాగ్యంలో ఉన్నవాడిని పట్టి కుదిపేసి 'నా హృదయంలో నిదురించే చెలి...' అంటూ మరోలోకానికి తీసుకెళ్ళగలరు. 'చిటపట చినుకులు పడుతూ ఉంటే...' పాటతో గిలిగింతలు పెట్టి, ఆ వెంటనే చాచి కొట్టినట్లు 'ఇది కుళ్ళిన సంఘం...' అంటూ కర్తవ్య బోధ కూడా చేయగలరు. 'అమ్మా అని అరచినా ఆలకించవేవమ్మా...' అంటూ ఆర్తిని, 'శేషశైలావాస శ్రీ వేంకటేశా...' అంటూ భక్తిని చూపిస్తూనే 'ఉన్నావా అసలున్నావా...' అంటూ విరక్తినీ కళ్ళకు కట్టినట్లు చూపగలరు. ఆయా అనుభూతుల్లోకి లాక్కుపోగలడు కాబట్టే ఆయన గంధర్వుడు. నిజానికి ఆయన అసలు పేర్లు చాలానే ఉన్నాయి. అమరగాయకుడు, గానగంధర్వుడు. ఘంటసాల మాత్రం ఆయన మారుపేరు.

అటు సంగీతదర్శకుడుగా మాయాబజార్, లవకుశ, చిరంజీవులు, గుండమ్మకథ...చెప్పుకుంటూ పోతే, వందకుపైని చిత్రాలు.

అందుకే అక్కినేని లాంటి మహానటుడు కూడా ఓసారి అన్నారు "దేవదాసులోని నా అభినయంపై నాకు ఇంకా కొద్దిగా అసంతృప్తి ఉంది. కానీ, ఆ లోటును తన గాత్రంతోనే పూరించారు ఘంటసాల" అని.

పాటలు మధురంగా పాడటమే కాదు, తెలుగువారికే సొంతమైన పద్యాలకు కూడా ప్రాచుర్యాన్ని కల్పించటలో ఘంటసాల చేసిన కృషి అభినందనీయమైనది. నటనలో కూడా ప్రవేశం ఉండబట్టేనేమో; రాగాలాపనే కాకుండా, ఆయా పాత్రౌచిత్యాన్ని పరిగణనలోకి తీసుకొని సందర్భానుసారం ఆయన రక్తి కట్టించిన విధానం, పద్యాలను పామరులకు దగ్గరగా తీసుకెళ్ళగలిగింది. పాండవ వనవాసంలో, పాంచాలికి జరిగిన పరాభవానికి పగతో రగిలిపోయిన భీముడి గాత్రం ఆయన పాడిన 'ధారుణి రాజ్యసంపద...' లో గమనించవచ్చు. అలానే, 'కురువృద్ధుల్ కురువృద్ధ బాంధవు....' అనే పద్యం కూడా. ఇంకా పుష్పవిలాపం, పాండవోద్యోగ పద్యాలు.

అన్నిటినీ మించి 'భగవద్గీత'. స్వయానా ఆ శ్రీకృష్ణుడే గీతోపదేశం చేసినట్లుగా అనుభూతి చెందని వారు ఉండరు.

భగవద్గీతలో చెప్పినట్లు ఆత్మకేమో కానీ, ఘంటసాల గాత్రం మాత్రం తెలుగుజాతి గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోతుంది.

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh