The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 0
PoorBest 

పుల్లయ్య గుప్తనిధి

 

సంచిలో బంగారం

రాత్రి ఎంతసేపు గడిచిందో పుల్లయ్యకు అర్థం కాలేదు. మధ్యాహ్నం ఔషధం తాగి బాగా నిద్రపోయినందువల్ల కళ్ళు మూతబడ్డం లేదు. దానికి తోడు సన్యాసితో జరిగిన వాగ్వివాదం వాడిలోని నిద్రను పూర్తిగా తరిమేసింది.

కొద్దిసేపు ఊరకే కూర్చొన్నవాడికి ఆపై కూర్చో బుద్ధి కాలేదు. నెమ్మదిగా లేచి, అలికిడి కాకుండా అటు ఇటు తిరగసాగాడు.

ఆ గుడిసెలో పుస్తకాల్లేవు. రెండు చెక్క భోషాణాలున్నాయి కానీ వాటి మూతలు బరువుగా ఉండడంతో ఎత్తడానికి పుల్లయ్య చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వాడి చేతులకి దెబ్బలు తగిలినందువల్ల బరువును మోయలేకపోయాయి.

ఉన్నట్టుండి వాడి కళ్ళని ఈశాన్య మూలం ఆకర్షించింది. అక్కడ మనిషి పోయేందుకు వీలుగా ఒకవైపు కొద్దిగా జాగాను వుంచి మిగతా మూడువైపులా తడికెలు వేసివున్నాయి.

పుల్లయ్యలో కుతూహలం పెరిగింది.

సన్యాసి వైపుకు చూసాడు. అతనిలో ఎలాంటి చలనమూ లేదు. ఊపిరి మాత్రం లయబద్ధంగా ఆడుతోంది. అదొక్కటే ఆ గుడిసెలో వినబడుతున్న ఒకే ఒక్క చప్పుడు.

అడుగులో అడుగు వేసుకొంటూ తడికెల్ని దాటుకొని లోపలికెళ్ళాడు.

అక్కడంతా ఏవేవో సరంజామాలున్నాయి. ఆ గది మధ్యలో ఒక చెక్క బల్ల, దాని మీద కొన్ని గాజు నాళాలు, పాత్రలూ ఉన్నాయి. వాటి నిండా రంగు రంగుల పదార్థాలు. నేల మీద కొన్ని గుడ్డ సంచులున్నాయి. అవి కట్టివేయబడక వదులు చేసివున్నాయి.

పుల్లయ్య చప్పుడు కాకుండా నెమ్మదిగా వంగి ఒక మూటను తీసి చూసాడు. అందులో ఇనుము ఉంది. మరో మూటను చూసాడు. అందులో రాగి ఉంది. ఇలా అన్ని మూటల్నీ తీసి చూసాడు. ఒక్కోదాంట్లో ఒక్కో లోహముంది.

అక్కడున్న మూటలన్నీ చూడ్డం ఐపోవడంతో నిటారుగా నిలబడి తలపైకెత్తి చూసాడు. ఆశ్చర్యంగా పైన ఒక తోలుసంచీ వేళ్ళాడుతోంది. ఇన్ని మూటలు నేల మీదవుండగా ఆ ఒక్క సంచీ అలా పైన వేళ్ళాడ్డమెందుకని ఆలోచించాడు. అందులో ఇంకేదో విచిత్రముండొచ్చని అనుకొంటూ మునివేళ్ళ మీద నిలబడి చేత్తో పట్టుకొన్నాడు.

ఆ మూటలో ఏదో గట్టి పదార్థం తగిలింది. పుల్లయ్య బరువు వల్ల ఆ సంచీ కిందకు లాగబడ్తూ చిన్నగా చప్పుడు చేయసాగింది. చప్పున వదిలేసాడు.

సన్యాసి ధ్యానం చెడగొట్టడం వాడికి ఇష్టం లేదు. అంతేగాదు, అతన్ని మేలుకొల్పి తను దొంగలా దొరికిపోవడమూ ఇష్టం లేదు.

ఇప్పుడు వాడికి ఆ తోలు సంచీలో ఏముందో చూడాలన్న ఉత్సుకత పెరిగిపోయింది.

ఏదైనా ఎత్తైన వస్తువు కనబడుతుందేమోనని చుట్టూ వెదికాడు. ఒక మూల చిన్న చెక్క పీట కనబడింది. చకచకా వెళ్లి దాన్ని తీసుకొచ్చి వేసుకొన్నాడు. దాని మీదకెక్కి జాగ్రత్త మునివేళ్ళపై లేచి తోలుసంచీ మూతికి కట్టివున్న దారాన్ని నెమ్మదిగా విప్పదీయసాగాడు.

సంచీ జారి వాడి గుండెల్ని భారంగా, బలంగా తాకింది. నొప్పి కలగడంతో “స్ స్ స్” అంటూ చప్పుడు చేసాడు పుల్లయ్య. వెంటనే తమాయించుకొని పీట నుండి మెల్లిగా దిగి, ఆత్రుతగా సంచీని విప్పదీసాడు.

ఆశ్చర్యం.

లోపల జిగేల్మంటూ మెరుస్తున్నదో లోహం.

“బం…గా…రం” అని పైకే అనేసాడు పుల్లయ్య.

ఇంట్లో నాన్న తట్టలో అమ్మ వేసే రాగి ముద్దంత పెద్దగా ఉంది ఆ బంగారు ముద్ద.

“ఈ సన్యాసి బంగారం చేస్తాడా?”

వెంటనే పక్కింటి అవ్వ ఒకరాత్రి చెప్పిన బంగారు మాంత్రికుడి కథ గుర్తుకొచ్చింది. అందులో స్వర్ణవిద్య కోసం ఒక మాంత్రికుడు తన లాంటి మంచి అబ్బాయిని బలియిచ్చేస్తాడు. కానీ ఈ సన్యాసికి బంగారం చెయ్యడం వచ్చేసింది గదా!

ఐతే వీడు బంగారాన్ని వజ్రం చేసే విద్య కోసం ప్రయత్నిస్తుంటేనో? ఆ విద్య సిద్ధించడం కోసం నరబలి ఇవ్వాల్సి వస్తేనో? దాని కోసం తనని బలి ఇవ్వడం కోసం తీసుకొనివచ్చి ఉండొచ్చు కదా!

అవ్వ చెప్పే కథల్లోని ప్రతి మాంత్రికుడూ తన బలిపశువును బాగా చూసుకొనేవాడే. వాళ్ల ఒంటి మీద దెబ్బలేమైనా వుంటే అవి మానేదాకా చక్కగా చూసుకొని, ఉన్నపళాన ఒకానొకరోజున నరికేసేవాడే. లేకపోతే వీడు కూడా తననెందుకు అంత బాగా చూసుకొంటాడు?

పుల్లయ్యకి జంకు పట్టుకొంది.

తోలు సంచీని యథాస్థానంలో కట్టేసి, పీటను ఎక్కడ్నుంచి తీసాడు అక్కడే పెట్టేసి, తడికెల్ని దాటుకొని గుడిసె వాకిలి దాకా పిల్లిలా శబ్దం రాకుండా నడిచి వెళ్ళాడు.

వెళ్తూ వెళ్తూ సన్యాసి వైపుకు చూసాడు. ఊపిరిని పీలుస్తూ, విడుస్తూ అతడింకా సమాధిస్థితిలోనే ఉన్నాడు.

పుల్లయ్య వాకిలి మీద చేయి వేసి మెల్లిగా లాగాడు. ఎంత మెల్లిగా లాగినా అది “కిర్ ర్ ర్” మంటూ చప్పుడు చెయ్యనే చేసింది.

సన్యాసి కదిలి, తల తిప్పాడు.

పుల్లయ్యకు ప్రాణాలు పోయినట్టుగా అయింది.

అతను నెమ్మదిగా కళ్ళు తెరచి – “పుల్లయ్యా! ఇప్పుడు బైటకు వెళ్లావంటే అన్యాయంగా చనిపోతావ్. ఈ కొండ మీద పులి ఉంది. నాలుగైదు కొండ చిలువలు ఉన్నాయి. లెక్కలేనన్ని త్రాచుపాములున్నాయి.” అని మళ్ళీ కళ్ళు మూసుకొన్నాడు.

పుల్లయ్యకు అడుగు ముందుకు పడలేదు. అలాగని వెళ్ళి కూర్చోవాలనీ అనిపించడం లేదు.

“బల్ల మీద కూర్చో. మరో పది నిముషాల్లో నా జపం ముగుస్తుంది. నీకు నిద్దరొచ్చే వరకూ మాట్లాడుకొందాం.” అని అన్నాడు సన్యాసి కళ్ళు తెరవకుండానే.

దూరంగా ఎక్కడో గూబ అరిచింది. చాలా వికృతంగా అరిచింది.

పుల్లయ్యకా అరుపు అపశకునంగా తోచింది. బైటికెళ్లడం కంటే లోపల కూర్చోవడమే మేలనిపించింది. వెళ్ళి బుద్ధిగా బల్ల మీద కూర్చొన్నాడు.

చెప్పినట్టుగానే పది నిముషాల్లో ఆసనం నుండి లేచి, సాష్టాంగం పడి ఒక నిముషం అలానే ఉండి మోకాళ్ళపై లేచి, తలనెత్తి ఆకాశం వైపుకు చూస్తూ ఏదో గొణిగి గొణిగి పైకి లేచాడు సన్యాసి.

నూనె దీపం వెలుగులో సన్యాసి ముఖాన్ని అదేపనిగా పరీక్షించి చూసాడు పుల్లయ్య.

అవ్వ చెప్పినట్టుగా చింతనిప్పుల్లాంటి కళ్ళూ, గుబురైన కనుబొమ్మలూ, చింపిరి జుట్టూ ఏవీ కనబడలేదు. బదులుగా వెలుగుతున్న కళ్ళు, చక్కటి నవ్వూ అగుపించాయి. కాసింత సమాధాన పడ్డాడు పుల్లయ్య.

వాడు కూర్చొన్న బల్ల కెదురుగా గుండ్రంగా చుట్టివుంచిన ఒక బొంతను ఆనుకొని నడుం వాల్చాడు సన్యాసి.

ఏమైనా మాట్లాడ్తాడేమోనని ఎదురుచూసాడు కానీ సన్యాసి నోరు విప్పలేదు.

పుల్లయ్య మనసు మళ్ళీ ఆ తడికెల గది వైపుకు మళ్ళింది.

సన్యాసితో కొట్లాడినంతసేపూ తనతోనే ఉన్న ’బుర్ర’ తాను ఆ తడికెల గదిలోకి వెళ్ళినప్పటి నుండీ మాయమైనట్టు గుర్తించాడు. అంతేకాదు, ఈ సన్యాసి తనను బలిస్తాడేమోనని భయపడి చచ్చినప్పుడూ తనకు ధైర్యం చెప్పలేదు.

“ఎక్కడపోయింది చెప్మా?” అని అనుకోసాగాడు.

వాడి ఆలోచనల్ని చెరిపేస్తూ వినబడింది సన్యాసి గొంతు.

“నిద్ర రావడం లేదా?”

లేదన్నట్టు అడ్డంగా తలవూపాడు పుల్లయ్య.

“ఐతే, ఏదైనా కబుర్లు చెప్పు.” అన్నాడు సన్యాసి.

“నువ్వే చెప్పు. నీ పేరేమి? ఊరేది? ఒంటరిగా ఈ కొండ మీద ఏం చేస్తున్నావ్?”

చివరి వాక్యాన్ని బాగా నొక్కి అడిగాడు పుల్లయ్య. ఈ సన్యాసి కొండమీద ఎందుకుంటున్నాడో వాడికి తెలిసిపోయింది గదా!

అందుకు ప్రతిగా “ముందు నీ గురించి చెప్పు. ఆ తర్వాత నా గురించి తప్పకుండా చెప్తాను.” అన్నాడు సన్యాసి.

“నిజంగా చెప్తావా? ఒట్టు!” అని అడిగాడు పుల్లయ్య.

చెబుతానన్నట్టుగా తల వూపాడు సన్యాసి.

“మా నాన్న పేరు శరభయ్య. ఈ కొండ దిగితే తూర్పు వైపు వుంది మా వూరు. ఆ ఊళ్ళో మా జాతోళ్ళే ఎక్కువమంది ఉంటారు. వాళ్ళందరికీ మా నాన్నే పెద్ద. పెద్ద అంటే వయసులో కాదు. ఏ జగడమొచ్చిన నాన్న మాట ఆఖరుదన్న మాట, అందుకే ఆయన పెద్దోడని అంది.”
“ఓహో! శరభయ్య గొప్పవాడన్న మాట!” అన్నాడు సన్యాసి.

పుల్లయ్యకి సన్యాసి మాటలోని శ్లేష అర్థం కాలేదు. బదులుగా గర్వంగా అనిపించింది. గొప్ప నాన్న ఉంటే అట్లా గర్వమొస్తుందేమో మరి.

ఉత్సాహంగా చెప్పుకుపోసాగాడు – “మా తాత కంటే ముత్తాత చానా గొప్పోడని చెప్తాడు మా నాన్న. ముత్తాత కంటే ఆయన నాన్న ఇంకా గొప్పోడని అందరూ చెప్తారు.”

“ఎందుకు?” అడ్డు తగిలాడు సన్యాసి.

“మా పెద ముత్తాత కాలంలో పక్కూరి రాజు దండెత్తి వచ్చి మా ఊరిని, పొలాల్ని, తోటల్నీ తగలబెట్టేసాడంట. ఆరు నెలలు తినడానికేమీ లేకపోతే మా పెదముత్తాత ఊరికి దూరంగా పాతరలో దాచిన రాగి గింజల్ని తీసుకొచ్చి సంగటి ముద్దలు చేయించి వేసాడంట. అందుకనే ఆయన్ని ముద్దల దాసప్పా అని పిల్చేవారంట.” అని సన్యాసి మెచ్చుకోలు కోసం ఆగాడు పుల్లయ్య.

అది అర్థమైన సన్యాసి “ఆహా…నిజంగా చాలా గొప్పోడు.” అని అన్నాడు.

“ఆయన కొడుకే మా ముత్తాత. ఆయన పేరు పుల్లయ్య. అదే నా పేరు.”

“ఓహో…” అని మాత్రమే అన్నాడు సన్యాసి.

“మా ముత్తాత కాలంలో కూడా కరువొచ్చిందంట. అప్పుడు ఆయన కూడా అదే పాతర నుంచి రాగులు తీసుకొచ్చి పంచాడంట. మా పెద ముత్తాతకి చానా కాలం పిల్లలేరంట. అంటే లేరని కాదు, పుట్టి పుట్టి చచ్చిపోయేవాళ్ళంట. మా పెద్ద ముత్తవ్వ కడుపుతో ఉన్నప్పుడు ఇల్లొదిలి వెళ్ళిపోయిన పెదముత్తాత కాన్పు వేళకొచ్చి ’కొడుకు పుడ్తాడు. వాడికి పుల్లయ్య అన్న పేరే పెట్టాలి. అప్పుడు బతుకుతాడు.’ అని చెప్పాడంట. అందుకే మా ముత్తాతకి పుల్లయ్య పేరే పెట్టారు.”

“ఓహో! మీ తాత ముత్తాలు చాలా గొప్పోళ్ళు.” అన్నాడు సన్యాసి.

“అవును. అద్సరే, నీ పేరేమి?” – సన్యాసి ఇచ్చిన మాటను గుర్తు చేస్తున్నట్టుగా అడిగాడు పుల్లయ్య.

గట్టిగా ఊపిరి తీసుకొని – “నాకెవ్వరూ లేరు. నేను అనాథను.” అని మాత్రమే అన్నాడు.

“అంటే నువ్వెక్కడ పుట్టావో నీకే తెలిదా!”

అది తెలుసునన్నట్టుగా సైగ చేసాడు సన్యాసి.

“మరి మీవాళ్ళ దగ్గర ఉండకుండా ఈ కొండ మీద ఎందుకుంటున్నావ్? ఎందుకు?” అని గుచ్చి అడిగాడు పుల్లయ్య.

వాడడిగిన రెండో ప్రశ్నకు సమాధానం వాడికే తెలసు. ఎందుకంటే వాడు సన్యాసి చేసిన బంగారం చూసేసాడు గదా!  కానీ సన్యాసి ఏం చెబుతాడో తెలుసుకోవాలని తహతహ.

దాంతో చర్చ మొదలైంది.

“చెప్పు…ఎన్నిరోజులైంది ఈ కొండ మీద వుంటూ?”

“ఈ కొండ మీదా….చాలా రోజులైపోయింది.”

“అంటే ఎన్ని రోజులు?”

“ఏమో తెలీదు…ఎప్పుడూ లెక్క పెట్టలేదు. కానీ చాలా కాలమే ఐపోయివుంటుంది.”

“ఆహా…మరి ఈ కొండ మీద ఏం చేస్తుంటావు?”

“చూసావుగా! ధ్యానం చేసుకొంటుంటాను.”

“నేన్నమ్మను.”

“సరే, నీ ఇష్టం.”

“నువ్వు అబద్ధం చెబుతున్నావ్…” అని ఆవేశంగా అన్నాడు పుల్లయ్య.

“ఈ ముసలి బుర్రలు అంతేరా…ఎప్పుడూ అబద్ధాలు చెబుతాయ్. మన కుర్రోళ్ళకి బుద్ధి చెప్పడానికొస్తాయ్…హా…” అని ఎక్కడినుంచి వచ్చేసిందో వచ్చేసింది పుల్లయ్య ’బుర్ర’.

దాని బుసకు ఉలిక్కిపడ్డాడు పుల్లయ్య. “ఇందాకట్నుంచీ ఎక్కడికెళ్ళావ్?” చిరాగ్గా అడిగాడు.

“ఉన్నా…నీతోనే ఉన్నాలే. వదలకు ఈ సన్నాసి బుర్రని.”

“అలాగేలే…” అంటూ “పెద్దవాడివి. సన్యాసివి. ధ్యానం చేసుకొనేవాడివి ఇలా అబద్ధం చెప్పొచ్చా?” – నిలవేసాడు పుల్లయ్య.

“అరే…ఎందుకంత కోపం?” అన్నాడు సన్యాసి నవ్వుతూ.

“నువ్వు ఒట్టు పెట్టావ్!” తప్పితే నరకానికి పోతావన్నట్టుగా ధ్వనించింది వాడి గొంతు.

“అరే…భలే….హా….బుస్” అంటూ ఆ బుర్ర కూడా జుగల్‍బందీ చేసింది.

నిట్టూర్చాడు సన్యాసి. “సరే, నీకంత పంతమైతే చెబుతాను విను.”

- - - -

 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh