The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 1
PoorBest 

పుల్లయ్య గుప్తనిధి

 

కొండ మీదకు

పుల్లయ్య కూర్చొన్న కొమ్మ మీదకు ఓ పిచ్చుక వచ్చి కూర్చుంది. చిన్ని చిన్ని పుల్లల్లా వున్న కాళ్ళనేసుకొని అటు ఇటు ఆగకుండా తిరుగుతూ అరుస్తోంది.

“ఏయ్ పిచ్చుకా! నీ పేరేంటి?” అని అడిగాడు.

ఏవో అపరిచిత శబ్దతరంగాలు తగలడంతో తికమకపడినట్టుగా గెంతడం, అరవడం ఆపి నిలుచుంది పిచ్చుక.

చెవులు రిక్కించాడు పుల్లయ్య. ఆ క్షణంలో పిచ్చుక మానవ భాషలో మాట్లాడబోతోందేమోనని అనుకొన్నాడు వాడు.

“కిచ్ కిచ్…” అంది పిచ్చుక.

పకపకా నవ్వాడు పుల్లయ్య. “నీ పేరు కూడా పుల్లయ్యేనా! నీకా పేరంటే ఇష్టమేనా?” అన్నాడు.

పిచ్చుక ఈసారి పుల్లయ్యకు వీపు చేసి “కిచ్ కిచ్…” అంది.

“ఆహా…నీకిష్టం లేదా. ఐతే కొండయ్య అని మార్చేసుకో!”

పిచ్చుక పుల్లయ్య వైపుకు తిరగకుండానే మళ్ళీ అరిచింది.

“మీ నాన్న కూడా మా నాన్నలా మొండోడా? అంటే మీ పిచ్చుకల్లో కూడా ఆచారమనేదివుందా! మీ నాన్న దాని మాటలే తప్ప నీ మాట వినడా?” అన్నాడు పుల్లయ్య.

తుర్రుమని ఎగిరిపోయింది పిచ్చుక.

పుల్లయ్యకు బాగా నిరాశ కలిగింది. పిచ్చుకలకి ఏ ఆచారం లేదని అది చెప్పివుంటే వెంటనే వెళ్ళి నాన్నతో గొడవపెట్టుకోవాలని అనుకొన్నాడు.

ఇంతలో పైనుండి “బుస్”మన్న శబ్దమైంది. తలెత్తి చూసాడు.

నాగుపామొకటి జారుతూ, ఆగుతూ నెమ్మదిగా పై కొమ్మ నుంచి దిగుతోంది.

పుల్లయ్యకు భయమేసి ఒక్క గెంతుతో కిందికి దూకాడు. అక్కడి నుండి కొద్దిదూరం పరుగెత్తి ఆవులు మేస్తున్న చోటికి వచ్చాడు.

ఓ చక్కటి, తెల్లటి ఆవు నింపాదిగా నెమరువేస్తూ నేల మీద కూర్చొనివుంది. తోక అదేపనిగా ఆడుతోంది…ఈగల్తో!

పుల్లయ్య దానికెదురుగా కూర్చున్నాడు. ఆవు అరమోడ్పు కన్నుల్తో నెమరువేసుకొంటోంది.

“పుల్లమ్మా!” అని పిలిచాడు పుల్లయ్య.

నెమరువేయడం ఆపేసింది ఆవు.

“అయ్…నీ పేరూ పుల్లమ్మేనా?” అన్నాడు హేళనగా పుల్లయ్య.

ఒక్కసారి తల విదిలించిది ఆవు. మెడలోని గంటలు ఘల్లుమన్నాయ్.

“ఏయ్! నిజంగా? నీ పేరు పుల్లమ్మేనా?”

మరోమారు గంటలు ఘల్లుమన్నాయ్.

“ఓహో! మరి నీకాపేరంటే ఇష్టం లేదు కదా?”

ఈసారీ గంటలు ఘల్లుమంటాయేమో అని ఆశపడ్డాడు పుల్లయ్య. కానీ ఆవు మాత్రం మళ్ళీ అరమోడ్పు కళ్ళతో నెమరువేయడంలో మునిగిపోయింది.

“చెప్పూ…” అన్నాడు పుల్లయ్య.

ఆవు నోరు మాత్రం ఆడిస్తోంది. మాట లేదు. గంటల ఘల్లూ లేదు.

“తొండి…” అన్నాడు పుల్లయ్య.

తన మాట పూర్తవగానే గంటలు చిన్నగా, వినబడీవినబడనట్టుగా శబ్దం చేసినట్టు అనుమానం వేసింది పుల్లయ్యకి.

తొండి పెట్టిన ఆవు మీద కూడా కోపం వచ్చేసింది. తన ఆచారం ప్రకారం చెట్టెక్కెయ్యాలనుకొన్నాడు కానీ అక్కడున్న నాగుపాము గుర్తుకొచ్చి ఆగిపోయాడు.

కోపమొచ్చినా చెట్టెక్కలేకపోవడం పుల్లయ్యను బాధిస్తోంది. అసహనానికి గురి చేస్తోంది. ఏదో పోగొట్టుకొన్నతనాన్ని లోనుండి ఎగదోస్తోంది.

తలెత్తి చూసిన పుల్లయ్యకి అల్లంత దూరంలోనే ఉన్న ఓ కొండ శిఖరం పలకరించింది. పుల్లయ్యకు ఎక్కెయ్యాలనిపించింది. చెట్టు కంటే కొండ ఎత్తైంది కదా!

రెండడుగులు ముందుకేసి ఆగిపోయాడు. గుండెలో ఏదో గుబులు ఆలోచనల రూపంలో పుల్లయ్యను చుట్టుముట్టేసింది.

“పుట్టినప్పటి నుండీ పదహారేళ్ళొచ్చేసినా కూడా ఈ పచ్చికబయలు దాటి కొండలకేసి వెళ్ళలేదు. ఊళ్ళో వాళ్ళెవ్వరు కూడా వెళ్లరు. ఎందుకో తెలీదు. పసువుల కాపర్లు కూడా మందల్ని కొండనెక్కనీయరు. ఎందుకో తెలీదు. ఒకవేళ వాళ్ళకి తెలిసినా చెప్పరు.”

“అవును. నీకు చెప్పనే చెప్పరు.” అంది పుల్లయ్య ’బుర్ర.’

“ఎందుకలా?” అన్నాడు పుల్లయ్య. వాడికి చాలా నిరాశగా ఉంది. ఉక్రోషం కూడా తన్నుకొచ్చేస్తోంది.

“ఎందుకంటే నీ పేరు పుల్లయ్య కనుక. అసలు పుల్లయ్య పేర్లో ఉన్నంత వెర్రిదనం ఇంకే పేర్లో కూడా లేదురా. అదే కొండయ్య అని పెట్టుకొనివుంటేనో….”

పుల్లయ్యలో కోపం కస్సుమంది. వాడి ’బుర్ర’ దాన్ని ఎగదోస్తున్నట్టుగా బుస్సుమంది.

పుల్లయ్య అడుగులు చకచకా పడసాగాయి. వాడి కాళ్ళ కింద గడ్డి పరకలు నలిగిపోతున్నాయు. వాటి అంచులకి విరిసిన చిట్టి చిట్టి పూలు చిట్లిపోతున్నాయి. ఆ పూలలోని తేనెను తాగడానికి వచ్చిన చిన్నారి పురుగుల్లో అదృష్టమున్నవి ఎగిరి బ్రతికిపోయాయి, లేనివి నలిగి చచ్చిపోయాయి.

నింపాదిగా నెమరువేస్తున్న ఆవు లేచి నిలబడి “అంబా” అని రంకె వేసింది.

పుల్లయ్య నిదానించి వెనక్కు తిరిగి చూసాడు. తెల్లావు మరోమారు రంకెవేసింది. పుల్లయ్యకు అది అపశకునంలా అనిపించింది. ముందుకెళ్ళకూడదని అనుకొన్నాడు. అంతే, లోపలి ’బుర్ర’ బుసలు కొడుతూ - “ముందుకే వెళ్ళరా! నువ్వు కనబడకుండా పోయేసరికి బెంబేలెత్తేస్తాడు మీ నాన్న. దానికి తోడుగా మీ అమ్మ గొడవ గొడవ చేసేస్తుంది. దాంతో మీ నాన్నకి తిక్క కుదుర్తుంది. ఆ తర్వాత నీకు కొండయ్య పేరునే ఖరారు చేస్తాడు. ఆగొద్దు. పద పద!” అంటూ తొందరిస్తోంది.

“మరి ఈ పుల్లావు ఎందుకలా అరుస్తోంది? ఆవులట్లా బేలగా అరవడం మంచి శకునం కాదు గదా?” అని ’బుర్ర’ని అడిగాడు పుల్లడు.

“నీ మొహం! ఆవులెక్కడైనా మనుషుల మెదళ్ళను చదువుతాయా? తలరాతల్ని మారుస్తాయా? ఒకేళ వాటికే అంత తెలివేవుంటే మనుషులుగానే పుట్టేవిగా!” అంది బుర్ర.

“నిజమే!” అని అనుకొన్నాడు వాడు.

“నువ్వు పుల్లయ్యవి గనకనే ఇట్లా వెర్రిమొర్రి ఆలోచన్లు చేస్తావు. అదే కొండయ్య ఐతేనో….”  - రెచ్చగొడ్తోంది ’బుర్ర.’

ముందుకు నడవడానికే నిశ్చయించుకొన్నాడు పుల్లయ్య.

ఆవు మరోసారి అరిచింది. గంటలు ఘల్లుమని మోగాయి.

పుల్లయ్య అడుగులు ముందుకే సాగాయి.

- - - -

తరువాయి భాగం రేపు

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh