- Member Categories - తెలుసా!
- Written by kadambari piduri
- Friday, 13 December 2013 09:16
- Hits: 1516
పౌర్ణమినాడు జాబిల్లిని పరీక్షగా చేస్తే అక్కడ పేదరాశి పెద్దమ్మ కూర్చుని అట్లు పోస్తూ ఉంటుంది. మన ఇండియాలో ఈ కవితాత్మకమైన ఊహ “పేదరాశిపెద్దమ్మ కథలు” కు పునాది వేసింది. (ఈ పేరుతో నిర్మలమ్మ నటించిన సినిమా కూడా హిట్ ఐనది).
పాశ్చాత్య దేశాలలోమధ్య యుగములలో “మూడు కుందేళ్ళు” బొమ్మ ప్రాధాన్యాన్ని కలిగింది. చర్చిలలో ఈ బొమ్మ ఉన్నది. ఐతే ఈ శిల్ప మూర్తిమత్వం లోని విశిష్టత ఏమిటి? అంత స్పెషాలిటీ ఉన్న దాని మూలము ఎక్కడిది? డిసెంబర్ 25 క్రిస్ మస్ పండుగ రోజు. క్రిస్ మస్ పండుగ వచ్చేస్తున్నది కదా! కనుక ఈ విశేష అంశము వైపు దృష్టి సారిస్తున్నాము.
*****
మన జాతీయ చిహ్నాలలో ఒకటి నాలుగు తలల సింహము. సారనాధ్ స్థూపము నుండి ఈ సింబల్ ను స్వీకరించారు. మనకు మూడు మాత్రమే కనిపిస్తూంటాయి. ఆ నాలుగవ సింహము- వెనక వైపు ఉంటుంది కాబట్టి మనకు మూడే కనిపిస్తాయి. శిల్పి ఊహా చమత్కారానికి "శభాష్!" అనాల్సిందే!
అలాటి మరో శిల్పము/ మురల్/ చిత్తరువు - మూడు కుందేళ్ళు. మూడు కుందేళ్ళు వలయాకారంలో, ఒక హారమువలె ఏర్పడినవి. ఇవి ముక్కోణములో ఒకదాని వెనుక ఒకటి పరుగెడుతూన్నవి. ట్రయాంగిల్ ఆకారంలో ఏర్పడిన ఈ three hares కనికట్టు చమత్కారాలను చేస్తూన్న శిల్పము. కుందేళ్ళు ఇక్కడి శిల్పములో ఒక చమత్కారం అగుపిస్తుంది. ప్రతి ఒక్కకుందేలుకూ రెండు చెవులు ఉంటాయి. ఐతే రెండు కుందేళ్ళుకూ కలిపి- మూడు చెవులు ఉన్నవి.
అంటే “6 చెవులకు” బదులు – ఈ చెక్కడములో ‘మూడు చెవులు” మాత్రమే సాక్షాత్కరిస్తూ ఉన్నవి.
*****
బౌద్ధ ఆరామములలో పారమార్ధిక ప్రతీక (Motif)కుందేలు. బౌద్ధ మతములో జంతువులకు చాలా ఇంపార్టెన్సును ఇచ్చారు. గౌతమ బుద్ధుని జాతక కథలలో కుందేలు ఉన్నత స్థానాన్ని కలిగి ఉన్నది. చైనా జాతక, రాశి చక్రం లో (China Zodiac ) నాలుగవ జంతువు "కుందేలు", "Yin" అని; దారు (చెక్క) స్వభావ సంబంధిగా గ్రహించారు.
లోహము, భూమి, నీరు, నిప్పు మున్నగు పృధ్వీ సంబంధిత వస్తువులకు ఒక్కొక్క జంతువు ప్రతీకగా ఎన్నుకొన్నారు. చైనా జాతక చక్రము వరుసగా 12 సంవత్సరములకు పట్టికను చైనీయులు ఏర్పరిచారు. ఆయా ఏడాదిలలో జన్మించిన మనుష్యుల స్వభావ, జీవన విధానాలను చెబుతారు. (మన హిందూ దేశ పంచాంగములలో సాయన, చాంద్ర మానములు పునాది చేసుకుని, నక్షత్ర - రాశి పొంతనలనూ, జన్మ లగ్నములనూ లెక్క కట్టి- భవిష్యత్తు ఎలా ఉంటుందో విశ్లేషించే ప్రయత్నాన్ని చేస్తారు. ఈజిప్టు, పర్షియా మున్నగు దేశాలలో "రమదా" వంటి గణనలు ఉన్నాయి.) జపాన్, కొరియా, వియత్నాం, మున్నగు ఆసియా దేశాలలో ఈ జాతకమును ఆసక్తిగా పరికిస్తారు.
*****
మళ్ళీ అసలు సంగతికి వద్దాము. ఈ త్రి శశముల ప్రాచీనతను నిర్ధారించే అన్వేషణలో హిస్టారియన్సు కనుక్కున్న సంగతులు విస్మయాన్ని కలిగిస్తాయి. చైనాలో క్రీస్తు పూర్వము 6వ శతాబ్దముల నాటివి-అని వీటి ప్రాచీనతకు చారిత్రక ఆధారములు లభించినవి. మగావు గుహలలో ఈ బొమ్మలను చరిత్రకారులు కనుగొన్నారు. 518 - 618 లలో పరిపాలించిన సూయి వంశ చక్రవర్తులు గుహ ఆరామాలను నిర్మింపజేసారు. 407 Mogao Cave; Sui dynasty (581-618) లలో ఈ అద్భుత శిల్పాలు ప్రత్యక్షమైనవి.
*****
తూర్పు నుండి పడమటి సంధ్యా రాగం- ఎలాగ చేరినది?
"ప్రాచీన చీనా లో పట్టు వస్త్రాలు నేసారు. వానిపై చందమామను అందులో మూడు కుందేళ్ళు చిత్రించారు. ఈ 3 కుందేళ్ళు బొమ్మతో , పత్ర హరిత పురుషుడు (Green Man ) బొమ్మ కూడా సమాన ప్రాధాన్యతను గడించింది.
******
చైనా దేశములో ఉత్పత్తి ఔతూండే పట్టు దుస్తులు, హిందూదేశంలో చేనేత వస్త్రాలు (సిల్క్/ చీనీ సిల్క్), సుగంధ పరిమళ దినుసులు, శిల్ప, చిత్రలేఖనాది లలితకళాఖండాలూ ప్రపంచ సముద్ర యానానికి "వర్తకపు దారులను" వేసాయి. కళాజగత్తులోని కొన్ని అంశాలలో ఈ/ రెండు అంశాలూ చోటుచేసుకున్నవి. చైనా గుహలలోని త్రి శశముల చెక్క శిల్పాలు సాగరయానమార్గాల ద్వారా పాశ్చాత్య ప్రపంచానికి పరివ్యాప్తి ఐనవి. అవి ఎంతగా వ్యాప్తి గాంచాయంటే- తూర్పు దేశాలలో ఇంచుమించు విస్మరించబడినవి- కానీ పాశ్చాత్య యూరపు దేశాల లోగిళ్ళలో కళకళలాడుతూన్నవి.
ఆద్యంతము లేని హారము వలె ఏర్పడిన చిన్ని జంతువులు ఈ 3 కుందేళ్ళు. మన వాళ్ళు వీటినే "చెవుల పిల్లులు" అంటారు. ఈ విచిత్ర దారు చెక్కడములు ఆ పదమును సార్ధకము చేసినవి అనిపిస్తుంది. చెవుల పిల్లులు చర్చిలలో ప్రధాన జాగాలలో గ్రీన్ మ్యాన్, మూడు కుందేళ్ళు ఉండేవి. ఆహూతులకు బాగా అగుపించే చోట్లు- అంటే ప్రవేశ ద్వారము పైన, మధ్య కమ్మె మీదనో, పై కప్పు నడుమ గానీ చటుక్కున ఎల్లరికీ కనిపించేలా ఎంపిక చేసిన ప్రదేశాలలో విటిని అలంకారములుగా ఉంచుతున్నారన్న మాట.
ఛాన్సెల్ రూఫుల మీద, సెంట్రల్ రిబ్ ల మీద- ఇలా ప్రత్యేక ప్రాంతా లలో ఉండటానికి కారణము - చర్చిలను , అందులోని శిల్ప, చిత్రలేఖనాదుల నిర్మాణదార్లు- 'తమ యొక్క కట్టడము ' అనే ఆనవాళ్ళుగా (the builders' signature marks )- వీటిని ఉంచేవారు - అని విశ్లేషణ ఉన్నది.
*****
వర్తక వాణిజ్యముల కార్యక్రమాలలో- ఆదాన ప్రదానములు కూడా చారిత్రక పరిణామముగా నిర్మితమౌతూ వస్తూన్నవి. అలాటి కళా వస్తు, సంస్కృతీ భావజాలాలలో ఇవి కూడా విపణివీధిల నుండి- ప్రజల మనసులను హత్తుకున్నవి ఇవి.
*****
Church, Chapel, Cathedral and Basillica- మొదలగునవి ఆరాధనా కేంద్రములు. వీనిలో చర్చి, చాపెల్ ల ప్రధాన ద్వారాల కమ్మెల పై మూడు కుందేళ్ళు బొమ్మ ఉన్నది. మధ్య శతాబ్దములలో ఇవి జనబాహుళ్యము ఇష్టపడిన కళా ఖండము ఇది. కనుకనే "కానుక"గా లభించిన ఈ ఆర్టును వారు హత్తుకున్నారు.
నేడు టిబెట్, మున్నగు దేశములలో శ్రవణేంద్రియ భాగ్యశాలులైన కుందేళ్ళు- పజిల్ బొమ్మలు కనువిందు చేస్తూన్నవి.
*****
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.