The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 1
PoorBest 

కోవెలలు నిర్మాణరీతులు విభిన్నతలతో మనోరంజనము గావిస్తూన్నవి. నదీతీరములు, నదీ, సాగర సంగమప్రాంతములు, గిరిశృంగములు, ప్రకృతిసౌందర్య శోభితప్రాంతములు- దేవాలయ నిర్మాణములకు అనువుగా ఎన్నిక ఔతూ సాంప్రదాయ గౌరవమును పొందుతున్నవి.

పైన నుడివిన ప్రదేశాలకు అదనంగా చెప్పవలసినవి గుహాలయాలు.

దృఢమైన కొండలలో సహజంగా ఏర్పడిన గుహలు ప్రధమగణ్యాలు. తర్వాత మానవుల ఆసక్తి ప్రకారం ఏర్పడిన గుహాలయాలు కూడా జనామోదాన్ని పొందినవి. గుహాలయాలు శిల్పుల ఓరిమికి, శిల్పవిన్నాణతలకు నికషోపలములు. అట్లాంటి గుహాలయలలో పేరెన్నిక గన్నది బృహదాంబ ఆలయం

పుదుక్కోట సమీపాన తిరుగోకర్ణము అనే ప్రాంతమున ఉన్న పెనుశిల లోపల ఉన్న జోడీలు బృహదాంబ గుడి, గోకర్ణేశ్వరగుడి. శ్రీబృహదాంబ అమ్మకు మరో పేరు ఉన్నది. ఆమెను జనులు "అరై కాసు అమ్మన్" అని ప్రేమతో పిలుస్తున్నారు.   


ఈ అమ్మవారు తొండైమాను సామ్రాట్టులు, పుదుక్కోటై చక్రవర్తులకు ఇలవేల్పు. తొండైమాను సామ్రాట్టులు అనగానే మనకు తిరుపతి దివ్యక్షేత్రము గుర్తుకు వస్తుంది. ఆ సీమకు "తొండై మండలము" అని ప్రఖ్యాతి గాంచినది. 

అన్నమాచార్య రచన "కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు” అనే కృతిని గుర్తుకు తెచ్చుకోండి.   

"కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

దొమ్ముల సేసిన యట్టి; తొండమాన్ చక్కురవర్తి (= చక్రవర్తి)  

ఇమ్మన్న వరములనెల్ల ఇచ్చినవాడు  ........  " 

అని కీర్తిస్తూ ఈ కీర్తనలో మెచ్చుకున్నాడు.                                          

తొండై మాన్ సామ్రాట్టులు ఈ అరకాసు సృజనకర్తలు.  

తొండైమాను సామ్రాట్టులు “మేము శ్రీబృహదాంబా సేవకులం!” అని వినయవిధేయతలతో చెప్పారు. వారు’శ్రీ బృహదాంబాదాసులు ‘గా రాజ్యపాలన చేసారు. ఈ పద్ధతి వలన పాలకులకు “మేమే అందరికన్నా సరాధికులము" వంటి అహంకారము, దురూహలుఏర్పడవు. నియంతలుగా మారకుండా సత్పరిపాలకులుగా అధికారులను తీర్చిదిద్దగలిగిన సదాచారము ఇది. పల్లవులు, చోళులు, తొండైమాను సామ్రాట్టులు మొదలు నాయకరాజుల దాకా శ్రీ బృహదాంబ గోకర్ణ ఆలయములను అభివృద్ధి చేశారు. అంటే 7వశతాబ్దం నుండి 17వశతాబ్దం వఱకూ  విభిన్న కళానైపుణ్యాలకు నెలవైనవి ఈ గుళ్ళు.

శ్రీబృహదాంబా అమ్మవారికి ప్రత్యేకించి చెప్పకోవలసిన ప్రత్యేకత ఉన్నది. ఈ దేవికి “అరకాసు అమ్మన్” అని ప్రసిద్ధనామధేయం కలదు. ఈ పేరు రావడానికి కొన్ని వింత హేతువులు కలవు. ఆ హేతువులు ఏమిటి?

మహారాజా కులదైవం నామముతో "అమ్మన్ కాసు" లను ఉత్పత్తిచేసి, ప్రజావళికి పంచేవారు.

రత్నమంగళం అను అందచందాలకు ఆలవాలమై, పచ్చని ప్రకృతి ఆహ్లాదకరమై, భక్తులను పలుకరిస్తూన పల్లెటూరు. అక్కడ అమ్మాళ్ చల్లని తల్లి. 1730 లలో పరిశోధకుని కృషివలన ఒక వింత నాణెం గురించి తెలిసింది. అదే “అరకాసు”. ఇది కేవలం ఒక నాణెమే. ఐతే చెప్పుకోవలసింది ఏమున్నది? “అరకాసు అమ్మన్” అని పేరుగాంచిన తల్లి “శ్రీబృహదాంబ అమ్మవారు”. 


బృహదాంబాళ్ "కాసు విలువ" - 6 నయాపైసలు/ఆరు దమ్మిడీలు.

6 కాణీల విలువలో సగమే అర్ధణా. "అరై కాసు" అంటే తెలుగు భాషలో అర్ధణా అంటే 3 పైసల విలువ గల నాణెము.   

శ్రీబృహదాంబ నాణెం స్పెషాలిటీ:-  శ్రీబృహదాంబా తల్లి పేరున ఒక కాసును రూపొందించినారు.

పుదుక్కోటై లో ఉన్న ‘నాణెముల తయారీ కేంద్రం(మింట్) లోనే ఈ కాసు తయారైనది. అటుపిమ్మట అదే నాణెమును లండన్ లో మిషన్లతో చేసారు. అంటే ఒకే నమూనా ఐన నాణెమును ఇటు కుటీర పరిశ్రమ పద్ధతితో, కళాకారులు స్వహస్తములతో చేసారు. అలాగే అటు యాంత్రిక పద్ధతితోనూ తయారైనట్టి ఈ నాణెము చారిత్రకప్రాధాన్యత కలిగినది ఐనది. అన్నిటికీ పతాకశీర్షికగా మన తెలుగువారికి గర్వకారణమైన విశేషం ‘అమ్మవారి కాసు‘ లో ఉన్నది.

అదేమిటో మీరు ఊహించగలరా!?                                  

శ్రీబృహదాంబఅంబాళ్ చిత్తరువును కాసుకు ఒకవైపున చెక్కారు. అదే చిత్రం నాణెమునకు వెనుక “శ్రీవిజయ” అని తెలుగు అక్షరములతో ముద్రణ జరిగినది. తమిళ దేశమున తెలుగులిపికి కల గౌరవము తమిళుల సహృదయతకు తార్కాణము.

నవరాత్రులలో అమ్మన్ కాసును తొండైమాన్ ప్రభువులు సందర్శకులకు ఇచ్చారు. వాళ్ళు తమను చూడడానికై కొలువుకు ఆత్మీయతతో వస్తూన వాళ్ళకు కానుకలతో పాటుగా అరకాసు బహూకరించే ఆచారాన్ని నెలకొల్పారు. దసరా వేడుకల సందర్భంగా ఇట్లా అమ్మన్ కాసు లభించిన వారు ‘అది తమ భాగ్యదాయిని ’ అని భావిస్తూ భద్రంగా దాచుకునే వాళ్ళు. అమ్మన్ పేరు పై రూపొందిన రాగి లోహం కాసులు తిరుగోకర్ణ మ్యూజియాన ఉన్నవి.    


కాసు – కథా కమామిషూ:-

రాజులు, పాలకులు ఎక్కువగా స్త్రీలు అనేక బంగారు బిళ్ళలను హారముగా ధరిస్తూండేవారు. దానిని “కాసుల  పేరు” అని పిలుస్తారు. కాసు అంటే అణా విలువ ఎత్తు- అని ఊహ కలదు. ఫదహారు అణాలు అనగా ఒక రూప్యం = ఒక రూపాయి సమానము. ఆనాటి ఈ ఆర్ధికప్రామాణికత ఆధారంగా ఏర్పడిన తెలుగు నానుడులు చాలా ఉన్నవి.         

ఈ రూపాయికి, అణాపైసల కొలమానము ప్రాచీన భారతావనిలో ఉన్నది. అనేక ఆచారాలకు ఈ కొలమానము గొప్ప పునాది ఐనది. తద్వారా వచ్చిన లోకోక్తులు చాలా భాషా కోశాగారమునందలి కలిమి, నిధులుగా ఏర్పడినవి.

పదహారు కళలు, = షోడశ కళలు; షోడశి; పదహారు = పదారు;; పదహారేళ్ళ వయసు, పదారేళ్ళ ప్రాయము; ఈ కోవకు చెందినవి.    

పదహారణాల తెలుగుదనం ఉట్టిపడుతూన్న పల్లె పడుచు; పదారు వయసు, "(నోటిలోని) పళ్ళు పదారూ రాలునులే!"

పావడా, ఓణీలను కట్టుకుని, మొగలిరేకుల పూలజడను వేసుకుని, తిలకం దిద్దుకుని ఆ పడతి పదారణాల తెనుగుదనము ఉట్టిపడుతూన్నది.


ఇలాగ రూపాయి మన దేశ విపణివీధికి మూలస్తంభం ఐనది. ఆ రూప్యమునకు పునాది పైసా. దీనింకి ప్రత్యామ్నాయ రూపములు, ఇందాక పేర్కొన్నట్లు నయాపైసలు, దమ్మిడీ, కాణీ, చిల్లికాణీ, గవ్వ మొదలైనవి. 

"ఆణా పైసలతో/ అణా కాణీలతో సహా బాకీని చెల్లుబెట్టుట" అనే వాడుక ఇందువలన వచ్చింది.            

శ్రీ బృహదాంబా అమ్మాళ్ కి రూపాయి కూడా అక్కర్లేదు, అర్ధణా చాలు, ఆమె అపార అనుగ్రహం భక్తులకు లభిస్తున్నది. ప్రజలు బెల్లం పానకమును అమ్మవారికి నైవేద్యాలుగా ఇస్తారు. “అంబాల్” ఫొటో ఎదుట ‘అరకాసు బిళ్ళ”ను ఉంచి, బెల్లం నైవేద్యం పెట్టి, భక్తితో పూజిస్తే, పోగొట్టుకున్న వస్తువులు దొరుకును, అని నమ్ముతున్నారు. భక్తుల విశ్వాసము పలుమార్లు “నిజం”ఔతూ ఋజువు అవుతూన్న సంఘటనలు భక్తిశ్రద్ధలను ఇనుమడింపజేస్తున్నవి. 

 


 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh