The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 2
PoorBest 

ప్రత్యూష కిరణాలతో "ఆకాశవాణి, శుభోదయం" అనే వాక్కులు నిద్ర మగతను  చెదరగొట్టేవి. భక్తిరంజని, సూక్తిముక్తావళి, వారం వారం "గాంధీ మార్గం", ప్రమదావనం, పాడిపంటలు,జనరంజని, ఈ పద్ధతిగా శ్రోతలను నిరంతరం అలరిస్తూ, నిత్యం ప్రజలను సాహితీసంపన్నులను చేస్తూ, భావిభారత పౌరులను తీర్చిదిద్ది, దశాబ్దం క్రితం దాకా (దూరదర్శన్ ప్రజా జీవనములోనికి వచ్చే దాకా) అందరికీ అందుబాటులో ఉన్న ఏకైక వినోదసాధనం రేడియో.

కరెంటుతో పని లేకుండా, బాటరీలతో నడిచే పెట్టె - ఒకటుంది, అదే 'ట్రాన్సిస్టర్ ' అనగా రేడియోకి సిస్టర్ (సోదరి).

బుల్లిపెట్టెనుండి వీనులవిందుచేసే కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న సాధనోపకరణమే "ఆకాశవాణి".  ఈ "ఆకాశవాణి" నామధేయాన్ని ఏ బారసాల కార్యక్రమాలలో ఎవరు నిర్ణయించారు? ఎక్కడ ఈ పేరుకు బీజం ఏర్పడింది?

*****

ఆకాశవాణి అంటే “అశరీరవాణి” అనవచ్చును. దేవతలు భక్తులకు, లోకానికి ఏవైనా  సందేశాలనూ, ముందు జాగ్రత్తలనూ  హెచ్చరికలనూ – తాము కనబడకుండా కేవలము వాక్కుద్వారా తెలుపుతారు. ఇలాంటి నమ్మకములు వివిధ సమాజములలో ఉన్నవి. హిందూ ఇతిహాసములలో ఇలాటి కథలు ఉన్నవి. శ్రీమద్ భాగవతము” లో సింహభాగము శ్రీక్రిష్ణలీలలు.

దేవకీ వసుదేవులకు పరిణయము జరిగింది. దేవకీదేవి సోదరుడు కంసుడు. చెల్లెలి పెళ్ళి చేసిన తర్వాత; ఆ నవవధూవరుల జంటతో రధములో పట్టణానికి బైలుదేరాడు. వారిని వ్యాహ్యాళికి తీసుకువెళ్తూండగా మహామాయాదేవి గగనము నుండి మేఘగర్జన ధ్వనితో పల్కింది.

ఆమె ఆకాశవాణిగా “శ్రీక్రిష్ణ జననము”ను గురించి మేనమామ కంసునికి “తస్మాత్ జాగ్రత్త”పలికింది. అటు తర్వాత శ్రీక్రిష్ణావతారము- క్రిష్ణయ్య సాహసాలు యశోదను, గోపికలనూ, నందబాలురను మాత్రమే కాదు, నిఖిల లోకాలనూ పరవశింపజేస్తూన్నవి. జగత్తు అతనిని దైవముగా ఎన్నుకుని, పూజించడానికి
ఆస్కారం ఏర్పడింది. తదాది శ్రీకృష్ణుడు  అవతారపురుషుడు ఐ దశావతారములలో సుస్థిర స్థానము కలిగినది.

గాధలోని ఈ పదమే స్ఫూర్తినిచ్చినది. ఎం.వి.గోపాలస్వామి గారికి తటాలున ఆ పదము స్ఫురించినది. కన్నడసీమలో అలాగ నామకరణం జరిగి, “ఆకాశవాణి” అనే పేరు రేడియోకి ఏర్పడినది.

*****

 

ఎం.వి.గోపాలస్వామి నివాసగృహము పేరు “విఠల్ విహార్”.

ఆల్  ఇండియా రేడియో (నేడు) ఉన్న స్థలానికి దగ్గరలో ఉన్నది ఆ ఇల్లు. అక్కడ కన్నడ సాహితీ అభిమానులు లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కేవలం పిచ్చాపాటి అనుకుంటే పొరబడినట్లే! వారివి ఆషామాషీ కబుర్లు, మాటల దొంతర్లు కావు. ఆ లోగిలిలో రూపు దిద్దుకుంటూన్నట్టి ఆశావహ దృక్పథాలు. స్వాతంత్ర్యభారతావని యొక్క బంగారుభవిష్యత్తును తీర్చిదిద్దవలసిన విధివిధానముల సోపానపంక్తులు.

దేశప్రగతి, భావిభారత పురోభివృద్ధికై పౌరులుగా తాము చేయాల్సిన బృహత్ కార్యాలు మున్నగు అనేక విలువైన అంశాలు మాటల, చర్చల సోపానాలు ఔతున్నవి.

 

*****

ఆంగ్లేయుల ప్రభావముచే తొట్ట తొలి రోజులలో “All India Radio ” అనే పేరు ఉండేది.

వందల సంవత్సరాలపాటు పరపాలనలో మ్రగ్గినది ఇండియా. స్వాతంత్ర్యాన్ని పొందిన భారతావనికి స్వాతంత్ర్యచింతన పొంగే కొత్త ఆలోచనలు తన మానససరోవరాన నింపుకోవలసిన అగత్యం కలిగింది. స్వాతంత్ర బానిసత్వపు ఛాయలను గుర్తుకు తెచ్చే ప్రతి యోచన కంటగింపుగా ఉండేది. స్వేచ్ఛా భావాలకు ప్రతిబింబాలైన పథకరచనలకై పండితపామరుల కృషి ప్రశంసాత్మకంగా ఉండేది.

అవిగో! అప్పటి అట్లాంటి భావాజలాల నుండి ఉత్పన్నమైన అనేక పదప్రసూనములలో ఈ ఆకాశవాణి అనే శృతిసుభగత్వమైన పలుకు. 

English ఛాయలు కలిగి ఉన్నది, కాబట్టి ఆల్ ఇండియా రేడియో అనే పేరుకి బదులుగా ఏమని పిలిస్తే బాగుంటుంది? దీనికి ప్రత్యామ్నాయమైన నామమును ఆలోచించాల్సిన అక్కర కలిగినది. వారు కొన్ని పేర్లను గూర్చి సూచనలు ఇస్తూ ఆలోచిస్తూన్నారు.

అప్పుడు “ఆకాశవాణి” అనే పేరు తెఱ పైకి వచ్చింది.  ఆ పేరును సూచించిన వ్యక్తి ఎం.వి.గోపాలస్వామి. మొట్టమొదట మైసూరు నుండి ప్రసారాలు ప్రారంభమైనవి. M.V.Gopalaswami ఇంటిలో కొత్త నామధేయానికి ఊతం వచ్చింది. అప్పుడు ప్రస్తుతం మన శ్రవణేంద్రియలలో చేరే మధుర మాధుర్య నామం "ఆకాశవాణి"  ఊపిరిపోసుకున్నది.  

రవీంద్రనాధటాగూరు ఈ పదాన్ని సాహిత్యంలో తన రచనలలో వాడారు. ఐతే ‘రేడియోకి ఆ పేరు పెట్టవలెను ‘ అనే దృష్టితో కాదు- అని వాదాలు  ఉన్నవి.

@@@@@

Comments   

 
+1 #3 ఆకాశ వాణి - అశరీర వాణి IVNS 2014-08-05 09:05
ఏది ఏమైనా పేరు అమోఘం. సంస్కృతం మన dna లో ఉంది.
Quote
 
 
+1 #2 ఆకాశ వాణి - అశరీర వాణి Raghothama Rao 2014-08-03 11:57
ఎం.కె. శర్మగారు,

నాకూ ఇదే అనుమానం ఉంది. కానీ ఇంటర్నెట్ లో వెదికితే గోపాలస్వామిగారి పేరే కనబడుతోంది. మీ వద్ద ఏదైనా ఆధారం ఉందా? ఉంటే దయచేసి ఇవ్వండి.
Quote
 
 
0 #1 ఆకాశ వాణి - అశరీర వాణి M.K. SARMA 2014-08-02 10:01
The name Akaasavaani is given by Dr.Rallapalli Anantha Krishna Sharma.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh