The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 1
PoorBest 

తానా పత్రిక జనవరి సంచికలోని ’అంతర్యామి’ విభాగంలో "కాయేన వాచా మనసేంద్రియైర్ వా" అన్న శీర్షికతో ఓ వ్యాసం వ్రాసాను. అక్కడ పేర్కొన్న వాటికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలను చెప్పదలచాను.

అదుఃఖ మితరం సర్వం జీవా ఏవ తు దుఃఖినః|

తేషాం దుఃఖప్రహరణాయ స్మృతిరేషామ్ ప్రవర్తతే||

మానవ జీవన ప్రాముఖ్యాన్ని, వికాసాన్ని, వికాస విధానాన్ని అత్యంత సరళంగా వివరించిన శ్లోకం ఇది.

ఈ శ్లోకా సారమేమిటంటే - ప్రాణమున్న వాటికే దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖ నివారణకు అపౌరుషేయాలు (ఎవ్వరూ వ్రాయని) ఐన వేదాలు ఉదయించాయి.

ఇదీ స్థూలంగా ఆ శ్లోక భావం.

ఉదాహరణ చెప్పుకోవాలంటే - ఓ వ్యక్తి లక్ష రూపాయల విలువ జేసే బంగారు ఉంగరాన్ని మురుగు కాల్వలోకి జారవిడుచుకున్నాడు.. ఈ స్థితిలో దుఃఖం ఎవరికి? ఎవరిది? నిశ్చయంగా ఉంగరం యజమానిదే. మురుగుకాల్వలో పడిపోయాను కదా అని ఉంగరం దుఃఖించదు.

జన్మకో శివరాత్రి అన్నట్టు ఒకరోజో, ఒకపూటో నియమపాలన చేస్తే చాలదు. ఓ నలభై రోజులు నిష్ఠలను పాటిస్తే చిత్తం కుదురుకోదు. దుఃఖం వదలదు. శిష్ఠాచార పరాయణత్వం ఒక జీవనశైలి కావాలని, నిత్యానుష్ఠానం ఓ నిత్యవ్రతంగా ఉండాలని భావించారు ప్రాచీన భారతీయులు. ఆవిధంగా స్మృతి, శ్రుతి, పురాణ, సంహితల్ని నిర్మించారు. 

ఇంతకూ ఏమిటి సంకల్పం? ఎందుకు అనుష్ఠానం? ఎక్కడ సమర్పణ?

 

వీటిని తెలుసుకోవడానికి ఓ చిన్న కథ, భవిష్యోత్తర పురాణం నుండి:

కాళహస్తి పట్టణంలో పురంధరుడనే శ్రోత్రియుడు. అతని లేకలేక ఓ మగసంతు. వానికి మాధవుడని పేరు. వయసుకు తగ్గట్టుగా సంస్కారాలు జరిపారు తల్లిదండ్రులు. ఆ కుర్రవాడు వీధిలో వెళ్తుంటే “సూర్యుడు నేలకు దిగివచ్చాడేమిటా”ని ప్రజలు ఆగి చూసేవారు. అంతటి తేజస్సు. “ద్వితీయ భాస్కరు”డైన మాధవునికి యుక్తవయసు రాగానే చంద్రలేఖ అనే కన్యతో వివాహం. సొగసైన జంట, చక్కని దాంపత్యం.

ఓనాడు పగటిపూటనే భార్యతో రమించాలనే కోరిక పుడుతుంది. భార్య ముందు వెల్లడి చేస్తాడు. ’దివా సంగమం’ అశాస్త్రీయమని ఆమె అనునయంగా తిరస్కరిస్తుంది. మాధవుడు కోపగిస్తాడు. పతివ్రతయైన చంద్రలేఖ ఊరికి బైటనున్న అడవిలోకి వెళ్దామని ఉపాయం చెప్పి బిందె తీసుకొని నీటి కోసం వెళ్తున్నట్టు చెప్పి అడవి వైపు సాగుతుంది. ఆమె కంటే ముందుగా సమిధలు తీసుకొచ్చే నెపం ఒడ్డి మాధవుడు పరుగు పరుగున అడవిని చేరుతాడు.

చంద్రలేఖ కంటే ముందుగా అడవి చేరిన మాధవునికి ఓ చెట్టు క్రింద ఓ స్త్రీ కనబడుతుంది. “సునాసాం, సుభ్రూ, సుభగాం” – చాలా గొప్పగా ఉంది. కామపీడితుడైన మాధవుని కంటికి ఆ ’కుంతల’ భార్యకన్నా అందగత్తెగా తోచింది. ఇలా అడవిలో వ్యర్థంగా తిరిగే అందాన్ని సృజించిన బ్రహ్మను “గుడ్డివాడ”ని నిందిస్తాడు. తనను వలచి, సంభోగించమంటాడు. ఆమె తిరస్కరిస్తుంది. నువ్వు నీ (బ్రాహ్మణ) ధర్మాన్ని వదిలితేనే సంగమం సాధ్యమంటుంది. ’సై’ అంటాడు మాధవుడు. ఈలోపు చంద్రలేఖ రావడాన్ని గమనించి “నీ పతిభక్తిని పరీక్షించాలని అలా అడిగాను. అంతే…” అని అబద్ధం చెప్పి వెనక్కు పంపించివేస్తాడు. ఆపై శిఖా-యజ్ఞోపవీతాల్ని తీసేసి, ఆవుమాంసం-మద్యపానం చేసి కుంతలతో రమిస్తాడు.

కొన్నేళ్ళకు కుంతల చనిపోతుంది. మాధవుడు పిచ్చివాడవుతాడు. ఊరిని, కన్న బిడ్డల్ని వదిలి దేశద్రిమ్మరిగా మారుతాడు. తిరుమల యాత్రకు బయల్దేరిన ఓ బృందం వెంట నడుస్తూ వారు దయతో ఇచ్చిన ఆహార పానీయాల్ని తీసుకుంటూ కపిలతీర్థం వద్దకు వస్తాడు. అక్కడ వారందరూ శ్రాద్ధక్రియను చేయడం చూస్తాడు. పూర్వ జ్ఞాపకాలు నిద్రలేస్తాయి. గడచిపోయిన శ్రోత్రియ జీవనం గుర్తుకు వచ్చి దుఃఖిస్తాడు. మట్టితో ఉండలు కట్టి వాటితోనే గతించిన తల్లిదండ్రులకు పిండప్రదానం చేస్తాడు. ఆపై తిరుమల కొండను ఎక్కబోతాడు. పర్వతపాదంను స్పృశించగానే భళ్ళున వాంతి అవుతుంది. ఆ దుర్గంధానికి దేవతాలోకాలు గడగడలాడతాయి. సాక్షాత్తు బ్రహ్మ దిగివస్తాడు. ప్రేమతో మాధవుని నుదుటిపై ముద్దు పెడతాడు. “భో భో మాధవ విప్రేంద్ర!” అని కీర్తిస్తాడు. స్వామిపుష్కరిణిలో స్నానం చేసి, వరాహస్వామికి మ్రొక్కి తనువును చాలించమని చెబుతాడు. మాధవుడు అలానే చేస్తాడు. తదుపరి జన్మలో ఆకాశ మహారాజుగా పుట్టి జగన్మాతకు తండ్రిగాను, జగత్పతికి మామగాను కీర్తిని గడిస్తాడు.

ఇదీ కథ.

ఇందులో మనకు కావలసి అంశం - సర్వ అకార్యాలు చేసిన మాధవునికి ఆకాశ మహారాజులాంటి ఉత్తమ జన్మ ఎలా ప్రాప్తించింది?

దీనికి సూక్తమైన సమాధానం – “సర్వ సమర్పణా ప్రకరణం.”

పరస్త్రీని పొందడానికి పూర్వం తాను చేసిన సమస్త పుణ్యకర్మలను, ఆపై స్వస్త్రీని మోసగించి, శ్రోత్రియ జీవనాన్ని వదుకొని చేసిన సమస్త అకర్మలను – అనగా పుణ్య, పాపకర్మలను తిరుమల దివ్యక్షేత్రంలో మనఃపూర్వకంగా, భక్తితో భగవంతునికి “సమర్పణ” చేసాడు. అంటే కాయేన, వాచా, మనసా, ఇంద్రియైర్, బుద్ధి, ఆత్మను అనుసరించి చేసిన సకల సత్కర్మ, దుష్కర్మలను పశ్చాత్తాప పూర్వకంగా భగవంతునికి సమర్పించాడు మాధవుడు. ఫలితంగా భావి జన్మలో పద్మావతీ జనకుడై, శ్రీనివాసుని శ్వశురుడై చిరస్థాయిగా నిలబడిపోయాడు. ఇదీ సమర్పణలో ఉండే మహత్తు.

మాధవుడిలానే మనం కూడా ఎన్నో కార్యాలను సంకల్పం చేసే మొదలెడతాము. కానీ కార్యపు కొనసాగింపులో ఆ సంకల్పం కాస్తా వికల్పమయ్యే సన్నివేశాలు తటస్థపడతాయి. ఈ అడ్డంకుల్ని దాటుకొని చేసిన కర్మకు తగిన ఫలం లభించాలంటే ’సమర్పణ’ సమయంలోనైనా ఏకాగ్రత, చిత్తశుద్ధి, తప్పిదాల పట్ల పశ్చాత్తాపం ఉండాలంటారు శాస్త్రకారులు.

"స్వల్పమప్యస ధర్మస్య త్రాయతే మహతో భయాత్" అని గీతాచార్యుడు చెప్పడంలోని అంతరార్థం ఇదే. చేసే పని అల్పమైనదైనా, ఆ చేసినదాన్ని ఫలదాత ఐన పరమాత్మునికి సమర్పించడంలో స్వల్పంగానైనా చిత్తశుద్ధి ఉంటే చాలునని శ్రీకృష్ణుని సందేశం.

ఈ సందేశం ఇటు లౌకిక జీవనంలోను, అటు పారమార్థిక ప్రయాణంలోను మనకు సహకరించే అంశం!

@@@@@

Comments   

 
+1 #1 సర్వ సమర్పణా విధి IVNS 2015-02-25 12:07
మాధవ బ్రాహ్మణుని కథ లోని అంతరం కలియుగం లో చాల మందికి వర్తిన్చేదే నా తో మొదలెట్టి :). కాని //"స్వల్పమప్యస ధర్మస్య త్రాయతే మహతో భయాత్" అని గీతాచార్యుడు చెప్పడంలోని అంతరార్థం ఇదే. చేసే పని అల్పమైనదైనా, ఆ చేసినదాన్ని ఫలదాత ఐన పరమాత్మునికి సమర్పించడంలో స్వల్పంగానైనా చిత్తశుద్ధి ఉంటే చాలునని శ్రీకృష్ణుని సందేశం.// అనే ముగింపు ఒక పెద్ద భరోసానే ఇచ్చింది. గోపీనాథ శర్మ గారు దీనిని ఇంకా విస్తారంగా చెబుతారేమో చూడాలి.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh