The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 7
PoorBest 

ద్వైత వేదాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచార్యులు పరమాత్ముని అనంత మహిమలను ప్రతిపాదించే దిశలో జగత్తు యొక్క అచింత్యాద్భుత సృష్ట్యాది వ్యాపారాలను 'బహు చిత్ర జగద్బహుదా కరణాత్ పర: శక్తిరనంత గుణ: పరమ:' అని నిరూపించారు. జగత్తులోని చిత్ర విచిత్రాల జతకు వాటి కార్య-కారణ సంబంధాలను అవలోకించినపుడు శ్రీహరి యొక్క అసాధారణ మహిమలు యథామతిగా గోచరించకుండా వుండదన్న సూక్ష్మ విషయాన్ని తెలిపిన శ్రీ మధ్వాచార్యుల పరంపరలో వచ్చిన మంత్రాలయ నివాసియైన శ్రీ రాఘవేంద్ర తీర్థ శ్రీపాదులు తమ రచితాలైన వేదాంత కృతి రత్నాలలో ఈ విషయాన్ని అనేక ప్రమాణాల సహకృతితో వ్యాఖ్యానించి, విస్తరించి తెలిపారు. అలాంటి వాక్యాల సార రూపమే ఈ సరళ లేఖనం .

ప్రపంచంలో జడ, చేతన అనే రెండు విధాలైన వస్తువులు కనబడతాయి. వాటి లక్షణాలేవంటే జ్ఞానరహితం (జడం), జ్ఞాన గ్రాహకత్వం (చేతన). అంటే 'జ్ఞానా'న్ని గ్రహించే సామర్థ్యం జడ వస్తువుల్లో ఎక్కడా కాన రాలేదు. ఐతే మనిషి నుండి మొదలుగొని సమస్త ప్రాణుల్లో ఈ జ్ఞాన కార్యం యొక్క వ్యాపారాలు చూడవచ్చు. కానీ 'దేహం' కూడా జడమే ఐనందువల్ల వాటిలో జ్ఞానాన్ని సాక్షాత్కరింప జేయగల శక్తి గలిగిన ఒక వస్తువు వుండి తీరాలన్నది ఒప్పవలసిన విషయం. అంతేకాదు, ఆ వస్తువు 'జడ భిన్నామై వుండాలన్నదీ ఒప్పి తీరాలి. దీనినే అతీంద్రియమైన 'జీవీ లేదూ 'చేతనా అని పిలుస్తారు. పుట్టిన తక్షణం సమస్త ప్రాణుల్లో ఆకలి, దప్పిక, భయం , సంతోషం , భోగం , సుఖ దు:ఖాలు పుట్టుకొస్తాయి. అలాగే ఈ భావాల ప్రాప్తి మరియు నివారణ విషయాల్లో పరస్పర కార్యాలు కూడా కానవస్తాయి. ఇలాంటి వ్యాపారాలు కేవలం జడాలైన మన్ను-కుండ మొదలైన వాటిలో కనబడదు. అందువల్ల ఆకలి, దప్పిక మొదలైనవి 'చేతనా సంబంధాలనే నిర్ణయించాలి. ఇదే రీతిలో ఇంద్రియాల ద్వారా గుర్తించే బాహ్య వస్తువుల జ్ఞానం కూడా ఇంద్రియానికి కాక, దేహంలో వుండే అతీంద్రియమైన 'చేతనా యొక్క ధర్మం . ఇది కేవలం ఊహ కాదు. అనుభవసిద్ధమైనది కూడా. అందువలనే అదృష్టం , జీవి, అతనికి ప్రేరకుడైన, సర్వ శక్తియైన శ్రీహరి యందు నమ్మక ముంచిన వారిని 'ఆస్తికూలని పిలుస్తారు. ఇలాంటి అతీంద్రియ పదార్థాలలో నమ్మకముంచక, కేవల ప్రత్యక్ష గోచరమైన మానవ శక్తియే సర్వ శ్రేష్టమైనదని తెలుసుకుని, జడశక్తి యొక్క ప్రతిపాదకులను "నాస్తికులని" వ్యవహరిస్తారు.

ఆస్తిక-నాస్తిక మతాలు ప్రాచీనకాలం నుండీ వచ్చినవే. వీటి పరస్పర ఘర్షణ కేవలం భారత దేశంలోనే కాక పశ్చిమ దేశాల్లో కూడా నడుస్తూనే వచ్చాయి. ఈనాడు ఆధునిక విజ్ఞానం (Science) పెరిగే కొద్దీ ఆస్తికత ప్రాయశ: మాయమౌతూ, నాస్తిక వాదం కాంతి వేగంతో అన్ని చోట్లా ప్రవహించి తల్లివేరులా ధృఢంగా వేళ్ళూనుతోంది. ఆస్తికవాదానికి ముఖ్య విషయమైన భగవంతుడనేది కేవల భ్రమ మరియూ కల్పన మరియూ ఈ మూఢనమ్మకం యొక్క కుట్రతో జనసామాన్యాన్ని మోసగించి, వారిని తమ వశంలో వుంచుకునేందుకు కొన్ని మత ధర్మాలను పెట్టుకున్న కొద్ది మంది ప్రజలు చేస్తున్న ప్రయత్నాలుగా వర్ణిస్తుంది నాస్తికవాదం. అంతేకాదు సమాజానికి సైన్స్ ఇస్తున్న కానుకలను, వాటికి కారకులైన శాస్త్రవేత్తలను కొనియాడుతుంది నాస్తికవాదం . ఐతే సమగ్ర శోధనా బుద్ధి కలిగిన వారికి ఈనాటికి కూడా భారతీయ తత్త్వశాస్త్రంలోని జ్ఞాన మహత్తు, ఆధునిక సైన్స్ , దాని జ్ఞానపు పరిచయం తెలిసివస్తుంది. విచారశీలత లేని, కేవల జడతత్త్వవాదులైన (Pure Materialists) వారు దేవుడు లేడని చాటుతారు. దానికి వారిచ్చే కారణం 'భూమి పైనుండే సమస్త వస్తువులు మన దేహంలోని ఇంద్రియాలకు గోచరమయ్యేవి కనుక.' వీరి మతం (Opinion), మానవ ఇంద్రియానికి దొరకని పదార్థం లేదని.

ఐతే పాశ్చిమాత్య సుప్రసిద్ధ వైజ్ఞానికులు, తాత్త్వికులూ ఐన ఎడింగ్టన్ , మర్ఫి, ప్లాంక్ , రస్సెల్ మొదలైనవారు సైన్స్ దృక్కోణం నుండి తత్త్వశాస్త్రాన్ని (అతీంద్రియ తత్త్వాన్ని) పరిశీలించి, సైన్స్ ఎన్ని విధాల పురోగమించినా, జ్ఞానసముద్రం యొక్క ఒక్క బిందువును మాత్రమే గ్రహించగలదని ఈ సమస్త భూమండలం యొక్క సృష్టిలోని చిత్ర విచిత్రాలను, వాటి కార్య కారణ సంబంధాలను గమనించి చూచితే, ఇవన్నీ ఒక స్వతంత్ర్యుడైన చైతన్యశీలి కర వశమైనదని అభిప్రాయ పడ్డారు. తోడుగా అతీంద్రియాలైన దేవుడు, జీవి, అదౄష్టం , ధర్మాధర్మాలు మొదలినవన్నీ మన సైన్స్ ప్రయోగశాలల్లో వుండే పదార్థాలు కావనీ ఒప్పుకున్నారు.

అలాగైతే అతీంద్రియ పదార్థాలున్నాయా? జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయాలకు కారణమైన సర్వశక్త పరమచేతనమనేది వున్నదా? ఉన్నదే ఐతే అది నిత్యమూ, సత్యమూ, స్వతంత్ర్యమూ, అచింత్యాద్భుత శక్తి స్వరూపమై వుండాలి కదా? ప్రతి ప్రాణి దేహంలోనూ నానా విధాలైన జ్ఞాన విశిష్ట కార్యాలను నిర్వహించే దేహభిన్న చేతన తారతమ్యాది స్వభావ ధర్మమేది?

పై ప్రశ్నలకు జవాబు నివ్వడం జడతత్త్వ విజ్ఞానులకు ఎప్పటికీ సాధ్యం కాదు. సైన్స్ ఎలాంటి శోధన చేసినా అంతిమ తత్త్వ నిశ్చయ జ్ఞానాన్ని నిర్ణయించలేదు. కేవలం ప్రయోగాలనే చేసి చేసి అందులోనే బంధింపబడడంవల్ల వారి సిద్ధాంతాలు మాటి మాటికీ మార్పు చెందుతూ వుంటాయి. అందువల్ల జీవ విలక్షణుడైన భగవంతుడు, జడ భిన్నుడైన జీవి, వీరిద్దరికీ సంబంధించిన జ్ఞానాది అతీంద్రియ విషయాల్లో జడ వస్తువులకే పరిమితమైన సైన్స్ , సాధికార స్వరంతో మాట్లాడడానికి సాధ్యమా? కాదు.

అందుకే సైన్స్ అతీంద్రియ విషయాల్లో అపూర్ణమే. ప్రస్తుతం , మన దేహంలో నడిచే శ్వాసోచ్ఛ్వాస క్రమం , రక్తోత్పత్తి, రక్త ప్రసరణ, నాడీ మండలపు పనితనం , వాటి ప్రకంపనాలను, అహారాన్ని అరిగించే జీర్ణరసాలు, వాటి పనితనం , మెదడు, శరీరంలో చక్కెర శాతం , ఖనిజ లవణాలు, దేహ వ్యర్థాలను బైటకు పంపే వ్యవస్థ, శక్తిని విడుదల చేసే ఎంజైమ్స్ యొక్క విచిత్ర వ్యవహార రీతులు మరియు వాటి యొక్క నియమానుసార ఉత్పత్తి మొదలైన వాటిని సైంటిస్టులు చెప్పవచ్చు. వాటి కార్య వేగాన్ని హెచ్చు, తగ్గులు చేయగల వాటి గురించి తెలుసుకుని వుండవచ్చు. ఐతే ఆయా వ్యవస్థలు (Systems) ఆయా నియమాలనే ఎందుకు పాటిస్తాయి? ఆ వ్యవస్థలను మనమే తయారు చేసుకొన్నామా? అని అడిగితే ఇప్పటికీ సమాధాన మివ్వలేరు. అందువల్ల సదరు వ్యవస్థలన్నీ ఒక సర్వశక్త చేతనం యొక్క అధీనాలనే చెప్పక తప్పదు. ఒకవేళ ఈ వ్యవస్థలన్నీ పాంచభౌతికమైన శక్తి చేతిలోనిదే ఐతే నిర్జీవమైన శవంలో అవి ఎందుకు కార్యాన్ని నిర్వహించవు? అందువల్ల ఈ దేహంలో దానికి అతిరిక్తుడైన జీవి వుండి తీరాలి. అలాంటి జీవిని నియమించే, నియంత్రించే మహాద్భుతమైన మరొక చేతన వుండి తీరాలి. అది నిత్యమూ, శాశ్వతమైనందువల్లే నశ్వర దేహధారియైన జీవి నుండి భిన్నుడై వుండాలి. అట్టి సర్వ సమర్థుడైన ఈశ్వరుని చేతిలో ఈ సృష్టి ఒక బొమ్మలాంటిదనేది స్పష్టమైన విషయం. 

మనిషి మరణించిన మరుక్షణం దేహం యొక్క సర్వ క్రియలూ నిలచిపోతాయి. చివరి క్షణం వరకూ నానా వ్యాపారాలను నిర్వహించిన ఆ దేహం తక్షణంలో నిశ్చేష్టితమవడం దేనికి? దేహం నిర్వహించే నానా క్రియలకూ కారణమైన 'చేతనా, అక్కడ నుండి నిష్క్రమించడాన్నే కారణంగా చెప్పాలేగానీ మరొకటి చెప్పలేం . సైంటిస్టులు నిరూపించే విధంగా విధవిధాలైన ప్రాకృతిక , పాంచభౌతిక శక్తుల యొక్క సమ్యోగంతో 'చేతన శక్తి పుట్టేటైతే ఆ శక్తి హఠాత్తుగా అదృశ్యమవడానికి కారణమేమి? ఈ విషయలో సైన్స్ నానా ఊహలతో నిరూపించబోయి కారణాలను ఇచ్చినప్పటికీ వారికి చైతన్య శక్తి మూలాన్ని తెలుసుకోవడం సులభసాధ్యం కాదు. పాంచభౌతిక తత్త్వాలతో సర్వ ప్రాణి దేహాల నిర్మాణం అలాగే ప్రకృతిలో కనబడే అన్ని పదార్థాల నిర్మాణం జరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది సత్యమైన విషయమే. కానీ పాంచభౌతిక తత్త్వాలతోనే జీవి యొక్క ఉత్పత్తిని ఆస్తిక మతం ఒప్పుకోదు. విచిత్రమేమంటే పంచభూతాలలోని ఆకాశం , గాలి అతీంద్రియాలు. భూమి (మట్టి), నీరు, అగ్ని మాత్రమే ఇంద్రియాలు. వీటి మిలనంతో జీవుల దేహోత్పత్తి అయ్యేట్టైతే ఈ పంచభూతాల అంశాలను ఒక పరీక్షనాళికలో వేసి సంయోగం చేయిస్తే, పాంచభౌతిక శరీరాన్ని సృష్టించడం సైంటిస్టులకు సాధ్యమా? ఐతే ఇదే కార్యం మానవ గర్భంలోనే కాక ఇతర ప్రాణుల గర్భాల్లో కూడా నడుస్తున్నది. చర్మం , జుత్తు, ఎముకలు, మాంసం , రక్తం , జీర్ణరసాలు, పాలు, ఒక ఆకారానికి సీమితమైన మెదడు, గుండె, శ్వాసకోశం , కళ్ళు, చెవి, ప్రేవులు ఇలా అనేక అవయవాల రూపురేఖలు తల్లి గర్భంలో ఎలా ఏర్పడుతున్నాయి ? ఈ కార్యం ఎప్పుడు, ఎలా ఆరంభమయింది? మాంసపు ముద్దగా భావింపబడే ఈ దేహంలో జ్ఞాన సంబంధాలైన అనేక చర్యలు ఎలా ఆరంభమయ్యాయి? అతీంద్రియమైన 'చేతనా (జీవి) సంబంధం ఈ దేహంలోకి ఎలా ఒదిగింది? అన్న విశ్లేషణలు సైన్సుకు అందేవి కావు.

'From what we know abou the exceptional character of protoplasm, it seems that its origin required the concurrence f highly improbable circumstances about the origin of life we know nothing!'

అతీంద్రియాలైన జీవుల మూలాన్ని ఏ ఇంద్రియంతోనూ చూసేందుకు మనకు సాధ్యం కాదు. దాని గురించి మనకేమీ తెలియదు అని అంటాడు ఫ్రెంచ్ జీవ శాస్త్రవేత్త జీన్ రోస్టెడ్ .

ప్రకృతిలో కనిపించే సర్వ ఫల పుష్పాలలోని రుచి, వాసనలు ఒకదానికొకటి తాదాత్మ్యాలైనవి. భూమిలో సర్వ రసాలున్నవని సిద్ధాంతం . మామిడి, వేప, నేరేడు, కొబ్బరి, అరటి లాంటి చెట్లను ఒకే పరిసరంలో వేసినప్పటికీ వాటివేయైన రసాలను భూమి నుండి గ్రహిస్తాయి. పుష్పించి, ఫలాలనిస్తాయి. అంతే కాదు ఒక్కొక్క వృక్ష జాతి ఒక్కొక్క రీతిలో భూరస సేకరణను చేస్తాయి. కొన్ని చేట్లు ఆకుల ద్వార, కొన్ని వేర్ల ద్వారా, కొన్ని కాండాల ద్వారా ఇలా అనేక వైవిధ్య భరితమైన చర్యల ద్వారా రస సేకరణ జరుగుతుంది. అలాగే అన్ని చెట్లూ ఒకే చోటులో పెంచలేం. అంటే చెట్లలోని వైవిధ్య భరితమైన స్వభావ ధర్మాలను అవి తమంత తాముగా నిర్మించుకోలేవు. వీటి వెనుక ఒక పరమ శక్తియుతమైన మరొక ఉత్కౄష్ట చేతనాన్ని ఒప్పి తీరాలి.

విశ్వంలో సూర్య, చంద్రాది గ్రహాలు, గురుత్వాకర్షణ మొదలైన శక్తులన్నీ ఒకానొక జ్ఞానపూర్వక నియమానికి బద్ధులైనట్టు ప్రవర్తించడాన్ని చూస్తూనే ఉన్నాం . విద్యుచ్ఛక్తి లాంటివి కూడా ఎప్పుడూ తమకు నియమితమైన ధర్మాలను మీరి ప్రవర్తించవు. గ్రహ, నక్షత్రాలు తమ కక్ష్యలను మార్చుకోవు. ఈ అద్భుత నియమ పాలన ఆయా వస్తువుల స్వభావాలు మాత్రమే అని చెప్పడం పూర్ణమైన జవాబు అవగలదా? చాలా బరువైన చెట్టు కాండాలు నీటి పై తేలుతాయి. చిన్న రాయి ముక్క కూడా నీటిలో మునిగిపోతుంది. కానీ రామప్ప దేవాలయంలోని ఇటుక నీటి పై తేలుతుంది. ఈ వస్తువుల సాంద్రతల వల్లనే ఆ క్రియలు నడుస్తాయని సైంటిస్టులు నిరూపించవచ్చు. ఐతే ఆ వస్తువుల సాంద్రతలో ఆ భిన్నత ఎలా వచ్చింది? అన్నది తీర్మానించడం సాధ్యం కాదు. నీటిలో తేలే చెట్టు, మునిగే రాయి మొదలైన వస్తువుల స్వభావధర్మాలతో చివరి వరకూ కూడివుండేట్టుగా ఉంచే వాటి అణురచన వైచిత్ర్యాన్ని నియంత్రించే శక్తి మరొకటి వుండి తీరాలి. ఆ శక్తియే ఈ విశ్వానికి చేతన. స్ఫూర్తి.

కొన్ని ప్రాణులు కంటితో చూడలేవు. కొన్ని భూమి పై వుండి చూడలేవు. కొన్నిటికి పగలు, కొన్నింటికి రాత్రిపూట దృష్టి మందగిస్తుంది. కొన్ని ప్రాణులు నీటిలోను, భూమిపైనా చూడగలవు. రెక్కలు లేకుండానే ఎగిరే జంతువులున్నాయి. కొన్నింటికి విశాలమైన రెక్కలున్నా ఎగురలేవు. కొన్ని ప్రాణులు కంటితో శబ్ద తరంగాలను గ్రహిస్తాయి. కొన్ని చెవుల ద్వారా చూస్తాయి. ఆవు మేసిన గడ్డి పాలగా రూపాంతరం చెందుతుంది. కస్తూరి మృగపు మలం , పునుగు పిల్లి చెమట సుగంధ ద్రవ్యాలౌతాయి. స్త్రీ పురుష సంయోగం వల్ల ఉత్పత్తియైన పిండం కొలది కాలంలోనే నానా అవయవాలను సంతరించుకుంటుంది. వీటన్నిటికీ కేవలం పాంచభౌతిక శక్తులే కారణాలు కావు, కాలేవు. అందువల్లే ఈ ప్రపంచానికి అతీతమైన మరో మహాశక్తిని ఒప్పి తీరాలి.

సకల జీవులు శ్వాక్రియ వల్లనే బదికి వుంటాయి. ఐతే ఊపిరిని పీల్చే విధానంలో తేడాలుండవచ్చు. దేహానికి ఆక్సిజన్ ముఖ్యం . కానీ మనిషికి అదే ఆక్సిజన్ ను నేరుగా రక్తానికి ఎక్కించలేము. నీటిలో కలిపి పానీయంగా సేవించలేము. ప్రకృతి ధర్మం ప్రకారం శ్వాసక్రియ ద్వారానే తీసుకోవాలి. జడపదార్థమైన గాలి ప్రాణాన్ని నిలిపేదైతే శవంలో గాలి ఆ క్రియను నిర్వర్తించదెందుకు ? అలాగని శవానికి ఆక్సిజన్ సిలెండరును అమర్చితే అది లేవాలి కదా ! లేవకపోవడానికి కారణమేమి? అంటే దేహభిన్నమైన, అతీంద్రియమైన జీవి ఆ శవంలో లేదనేదే కారణమై ఉండాలి. ఎందుకంటే ఈ దేహమే జీవీయైతే శవం అన్న పదమే మన నిఘంటువుల్లో ఉండకూడదు . మానవ స్వభావం సైన్స్ యొక్క వ్యాప్తి నుండి సుదూరంగా నిలచే విషయం.

దేహసామర్ధ్యం , ధైర్య-సాహసాలు, బుద్ధి-శక్తులు మనిషి నుండి మనుషికి ఒకే రీతిలో ఉండవు. వాటి మధ్య ఘర్షణలు ఎల్లప్పుడూ నడుస్తూనే వుంటాయి. భోగ వస్తువులు ఉన్నప్పటికీ అన్ని చోట్లా, అన్ని కాలాల్లో అందరికీ సుఖ మెందుకు లభించదు?

మనశ్శాంతే సుఖానికి మూలం. సుఖ మన్నది ఆంతరంగికమైన విషయమే గానీ బైటనుండి వచ్చేది కాదు. సైన్స్ బాహ్య ప్రవృత్తిని పెంచుతుందే తప్ప అంతర్ముఖత్వానికి కారణం కాలేదు. ఆమ్లజనకం , జలజనకాల గుణాలను తెలిపే సైన్స్ ,మనిషికి అత్యావశ్యకాలైన శాంతిజనక, తృప్తిజనక, జ్ఞానజనకాదులను ఎప్పటికీ సృష్టించలేదు. సకల జగత్తు యొక్క వ్యాపారాలను లీలామాత్రంగా నడిపే అవ్యక్త, స్వతంత్ర్య, నిత్య, అచింత్యాద్భుత శక్తిస్వరూపమైన భగవంతుడు స్వేచ్ఛగా తన భక్తులకు మాత్రమే గోచరిస్తాడు. ఈ అనుభవం ప్రయోగశాలల్లో దొరికేది కాదు. సైన్స్ సమీకరణాలకు బద్ధమైంది కాదు. అందువల్ల అతీంద్రియ విషయాల్లో సైన్స్ ఎప్పటికీ అపూర్ణమే.


||శ్రీ కృష్ణార్పాణమస్తు||

 

Comments   

 
+1 #6 దేవుడు-ఆధునిక విజ్ఞానం madhavarao pabbaraju 2014-03-20 11:13
శ్రీ రఘోత్తమరావుగారి కి, నమస్కారములు.

మీ మెయిల్ అందింది. నా బ్లాగ్ చదివినందుకు ధన్యవాదములు; మరియు మీ పరిచయానికి సంతోషం.

ఇక పై వ్యాసానికి వస్తే, '' ప్రపంచంలో జడ, చేతన అనే రెండు విధాలైన వస్తువులు కనబడతాయి; 'దేహం' కూడా జడమే ఐనందువల్ల ; ఇలాంటి వ్యాపారాలు కేవలం జడాలైన మన్ను-కుండ మొదలైన వాటిలో కనబడదు'' - అని వ్రాసారు. ఇది సామాన్యంగా మనం చెప్పుకొనేది. అయితే, సృష్టిలో జడమైనది అంటూ ఏదీ లేదు. దేహాన్ని తీసుకుంటే, అది అసంఖ్యాకమైన కణాల సమూహం. ప్రతి కణం చైతన్యమే!! అంటే, శరీరం చైతన్యపు ముద్ద. ఇక, కుండ, మన్నూ మొదలైనవి తీసుకుంటే, అవికూడా చైతన్యమే. అందులోని కణాలు చైతన్యమైనవి కాబట్టే, నీళ్లు పోస్తే చల్లగా వుంటాయి; మట్టి నీటిని పీల్చుకుంటుంది, మొక్కలకి జీవపోషకాలని అందిస్తుంది.
ఇంకా మీ వ్యాసంలోని అనేక ప్రశ్నలకి నా వ్యాసం 'ఎవరీ భగవంతుడు?' (spiritual category) లో చూసి, చదవగలరు. కొంతమేరకు సమాధానాలు దొరకవచ్చును.
మీ స్నేహశీలి,
మాధవరావు.
Quote
 
 
0 #5 దేవుడు-ఆధునిక విజ్ఞానం required 2013-09-20 03:50
"సైన్స్ ఎన్ని విధాల పురోగమించినా, జ్ఞానసముద్రం యొక్క ఒక్క బిందువును మాత్రమే గ్రహించగలదని ఈ సమస్త భూమండలం యొక్క సృష్టిలోని చిత్ర విచిత్రాలను, వాటి కార్య కారణ సంబంధాలను గమనించి చూచితే, ఇవన్నీ ఒక స్వతంత్ర్యుడైన చైతన్యశీలి కర వశమైనదని అభిప్రాయ పడ్డారు."

ఏకాలంలోనైనా, ఏప్రదేశంలోనైనా తమకు తెలియనివాటిని దైవత్వాన్ని కారణంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆవిధంగా "నాకు తెలీదు" అనిచెప్పడమూ "దేవుడలా చేశాడు", "దేవుడికి తెలుసు" అనిచెప్పడమూ ఒకే రకంగా భావించబడుతూ వచ్చాయి. ఇదే విధంగా ఒకప్పటి న్యూటన్లూ, ఫారడేలూకూడా అభిప్రాయపడ్డారు . కానీ సత్యమేంటంటే అప్పటికన్నా మన విజ్ఞానం విస్తృతమవుతూ వస్తోంది. ఆమేరకు దేవునిమాత్రమే తెలిసే అవకాశమున్న విషయాలు నేను మనకూ తెలుస్తున్నాయి. ఒకప్పుడు ప్రార్ధనలూ, పూజల అనంతరం మాత్రమే తీసుకోగల నిర్ణయాలు నేడు విజ్ఞానం సహాయంతో తీసుకోగలుగుతున్ నాం.

సైన్సు మొత్తాన్నీ తెలుసుకోవడం ఎప్పటికీ తెలుసుకోలేకపోవచ ్చేమో. అలాగని ఊహల్లో విహరించమనిమాత్ర ం చెప్పదు.
Quote
 
 
0 #4 RE: దేవుడు-ఆధునిక విజ్ఞానం IVNS 2011-12-22 08:02
అంతా ఒక్క ముక్క లాగే ఉంది అందుకే అర్థం కాదు సగటు తెలుగు జీవికి నాకు కూడా.
Quote
 
 
+1 #3 RE: దేవుడు-ఆధునిక విజ్ఞానం sagatu తెలుగు jeevi 2011-06-30 06:43
వొక్క ముక్కర్థమైతె వొట్టు ratthnamsjcc ^L^
Quote
 
 
+1 #2 RE: దేవుడు-ఆధునిక విజ్ఞానం ratthnamsjcc 2011-06-29 10:35
గురువుల అనుగ్రహం అందరికీ లభించకపోవటం శిష్యులు పొందిన మానవజన్మనెత్తిన వారికి ఏది వుండవలెనో, ఏది ఉండకూడదో-ఆత్మ పరమాత్మ మహా సమాధి దివ్యాతి దివ్యమైన చరిత్ర అతీతమైన తురీయ ఆత్మ స్థితి సమాధి స్థితికి కేవలం గురువు చూపులతో ఆత్మ సాక్షాత్కారం కలిగించిన అపూర్వమైన వేదాంతము ఆత్మ సాక్షాత్కారం ఈ తురీయ స్థితిని సత్ చిత్ ఆనంద స్వరూపమైన ఆత్మ స్థితి గా చెబుతుంది. ఈ 1 అనే అంకె ఆత్మ సాక్షాత్కార స్థితికి సమాధికి ఈ ఎంచుకోవటం చాలా చక్కగా ఉంది. కనిపించింది. బ్రహ్మ ఒకటి అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వం ఆత్మా సాక్షాత్కారం శరీరాన్ని విడిచాక సూక్ష్మచైతన్య తత్వం లోపల, బయట కూడా వుందని, అంతటా వున్నది ఒకటే బ్రహ్మ అని తెలుసుకోవటమే. ఆధ్యాత్మికపరంగా చూస్తే, పరమాత్మ – (పరబ్రహ్మ), (బ్రహ్మం) :ఆరు రుచులు వేరు, సారంబు యొక్కటి, సత్య నిష్ఠ వేరు, . ఆత్మ సత్య మొకటి.ఘటము లెన్ని యైన గగనంబు యేకమే పరమ ఋషులు వేరు, భావ్యుండు యొక్కడు బ్రహ్మ మన్నిటందు పరిపూర్ణమై యుండు.అఖిల జనుల కెల్ల బ్రహ్మసాక్షి నీవు మనసునిలిచి యుండుహృదయ మందు నున్న ఆత్మదెలియరో జగన్మిధ్యా బ్రహ్మసత్యమని నమ్మర తాననువాడు ఒకడున్నాడు. తన్ను వదలినపుడే తన పరిచయం కాగలదు. తన్ను వీడి తాను నిలుచు తత్త్వమే నిత్యం. తానని గ్రహించటం ఈ 1 అనే అంకె ఆత్మ సాక్షాత్కార స్థితికి సమాధికి ఈ ఎంచుకోవటం చాలా చక్కగా ఉంది. కనిపించింది. బ్రహ్మ ఒకటి అంతటా వ్యాపించి ఉన్న సూక్ష్మ తత్వంఆత్మా సాక్షాత్కారం .'ఉపదేశం అన్న మాటకు అర్థం ఆత్మలో ఉండడం లేక ఆత్మగా ఉండడం. బయటి నుంచి ఆత్మను అన్వేషిస్తున్నం తసేపు ఆత్మ సాక్షాత్కారం అసంభవం అని చెప్పారు. అందుచేత ఆత్మ సాక్షాత్కారం కావాలంటే అమనస్కమైన చిత్తరాహిత్యం, ఆ చిత్తరాహిత్యాని కి సౌశీల్యం, సౌశీల్య సంపాదనకు వైదిక కర్మానుష్ఠానం, సదాచారా సంపత్తీ ఉండాలి. ... ఇంద్రియాలన్నిటి లోను మనస్సు గొప్పదనీ, మనస్సు కన్నా బుద్ధి గొప్పదనీ, బుద్ధికన్నా ఆత్మ సాక్షాత్కారం గొప్పదనీ వివరిస్తుంది. ఆత్మజ్ఞానం ఆత్మ చైతన్యం సూక్ష్మమౌనంలో ఉండాలి దేవునికి భాషలు తెలియవు. కనుక భాష యొక్క అవసరం లేదు. .... సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ ( ఆత్మ )సాక్షాత్కారం అని ..గురువు ద్వారానే అతి . సత్యాన్వేషణ - మొదటిభాగం : ఆత్మ జ్ఞానం అనేది ఎంతటి అత్యున్నతి స్థితి అంటే ఎదుటి .... సూక్ష్మసాధనల యొక్క అత్యున్నత లక్ష్యం దైవ ( ఆత్మ )సాక్షాత్కారం
Quote
 
 
+1 #1 RE: దేవుడు-ఆధునిక విజ్ఞానం Saikiran Kumar Kondamudi 2011-02-17 04:15
చాలా అద్భుతమైన వ్యాసం స్వామీజీ
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh