The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 4
PoorBest 

విరాజి వంటింట్లో పని చేసుకుంటోంది. ఆమె ఆరేళ్ళ కొడుకు విహారి రెండవ తరగతి తెలుగు పుస్తకంలో సంయుక్త అక్షర పదాలు చదువుతూ "అమ్మా ఇది ఒకసారి చెప్పవా" అంటూ పుస్తకంతో వచ్చాడు.

విరాజి ఆ పదం చూసి "స" కింద "ప" ఒత్తు ఇస్తే "స్ప", "ర" కింద "శ" ఒత్తు ఇస్తే "ర్శ", " స్పర్శ " అంటూ వివరించింది. విహారి ఆ పదం చదివి "అమ్మా! స్పర్శ అంటే ఏమిటి?" అని అడిగాడు. విరాజి నవ్వుతూ విహారి చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుని, ఇదీ స్పర్శంటే అంది. బుగ్గపై ముద్దు పెట్టుకుని ఇదీ స్పర్శే అంది.

"ఓహో! స్పర్శ అంటే నాకు తెలిసిందిలే!" అంటూ ఎంతో అర్ధమైనట్లు పరుగున వెళ్ళిపోయాడు. చదువుకుంటూనే నిద్ర పోయిన విహారిని సరిగా పడుకోబెట్టి జో.... కొడుతూ ఆలోచనల్లోకి జారిపోయింది విరాజి.

"స్పర్శ" కేవలం రెండక్షరాల పదం. కానీ అది ఎంత శక్తివంతమైనది, అమోఘమైనది, ఎంత అర్ధవంతమైనది. ఎన్నో భావాల్ని మాటలతో పనిలేకుండా వ్యక్తం చేస్తుంది. నిజంగా మన చేతిలో ఉన్న దివ్యమైన అస్త్రం "స్పర్శ".

ఇంద్రుని వజ్రాయుధం, అర్జునుడి పాశుపతాస్త్రం ఎంత వరకు పనిచేస్తాయో తెలియదు కానీ "స్పర్శ" అనే మన దివ్యాస్త్రం ఏ పనినైనా చేయించగలదు అనటంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు.

విరాజి ప్రకృతిలోకి తొంగి చూసింది.

చల్లని గాలి, ఆ గాలి స్పర్శ కి తలలు ఊపుతూ పరవశిస్తున్న లతలు, మొక్కలు, పురివిప్పి ఆడుతున్న నెమళ్ళు, తొలకరి చినుకుల స్పర్శతో పరవశిస్తున్న భూమి, మొక్కలు, చెట్లు, రైతులు, ప్రజలు. ఎండకు ఎండి బీటలు వారి తొలకరి వానతో నాగలి స్పర్శకు పులకరించిన భూమిలో విత్తనాలు చల్లాడు రైతు. ఎండి,ఎండి ఉన్న విత్తనాలు నీటి స్పర్శతో పులకించి మొలకెత్తాయి.

నానాటికి ఎదుగుతున్న పైరును చూస్తూ దాన్ని స్పర్శిస్తూ పరవశించిపోతున్నాడు రైతు. చల్లని సాయంత్రం సన్నజాజులు కోస్తుంటే ఆ స్పర్శకి జాజులు విరబూసేస్తున్నాయి. మంచు స్పర్శతో మల్లెమొగ్గలు విరబూసి సుగంధాన్ని గాలికి అందిస్తున్నాయి. ప్రతి పూవునూ తుమ్మెద సునిశితంగా స్పర్శిస్తుంటే పూవులు పులకరిస్తూ తమ మకరందాన్ని తుమ్మెదలకు అందిస్తున్నాయి. ఆ మకరందాన్ని ఆస్వాదించేవారు మరల మరల తమ నాలుకతో పెదవులను స్పర్శించుకుంటూనే ఉంటారు.

లేగదూడను విడువగానే చెంగుచెంగున తల్లి చెంతకు వెళ్ళిందే తడవుగా ఆవు తన దూడను ప్రేమగా తన నాలుకతో స్పర్శిస్తుంటే, ఆ స్పర్శ లోని మాధుర్యాన్ని చవి చూడడానికి తోక ఎత్తి సవారీ చేస్తూ తిరిగి తిరిగి తల్లి వద్దకు వస్తోంది.

ఆవుకి మేత వేసి యజమాని దాని మెడను ప్రేమతో స్పర్శించాడు. అంతే! ఆవు గారంగా మారం చేస్తూ మెడను మరింత ముందుకు జాపుతూ యజమాని స్పర్శ కోసం ఆరాటపడిపోతోంది. ఇంటి గుమ్మంలోని కుక్కపిల్లను దగ్గరకు తీసుకుని తన చేత్తో దాని శరీరాన్ని నిమిరాడు. అంతే! అది తోక ఊపుతూ యజమాని స్పర్శ ను తిరిగి పొందడానికి అతని కాళ్ళల్లో, కాళ్ళల్లో తిరుగుతూ ఒడిలో చేరే ప్రయత్నం చేస్తోంది.

ఇలా ప్రకృతిలోకి తొంగి చూస్తున్న విరాజికి విహారి కదిలేసరికి ఇలలోకి వచ్చింది.

విహారిని దగ్గరకు తీసుకుని జోకొట్టసాగింది. అలజడిగా కదిలిన విహారి, తల్లి చేతి స్పర్శతో ఆత్మస్థైర్యంతో పడుకున్నాడు. విహారిని చూస్తూ చిన్నగా నవ్వుకుంది విరాజి. మరల ఆలోచిస్తూ మానవ సంబంధాలలోకి తొంగి చూడడం ప్రారంభించింది.

పిల్లలు నిద్రించేటప్పుడు జోకొట్టే స్పర్శ, అన్నం తినిపించేటపుడు అనునయిస్తూండే స్పర్శ, ఒడిలో కూర్చోపెట్టుకుని కథలు చెప్పేటపుడు పెద్దవారి స్పర్శతో పిల్లలలోని సంతోషం, కేరింతలు, మారం రూపంలో బయటకు వస్తుంది.

పిల్లలు చదువుకునేటపుడు, వారు అలసిపోయినపుడు వారి వద్ద కూర్చుని వారి తల మీద, వీపు మీద చేతితో నిమిరితే ఆ స్పర్శతో వారికెంతో మనోనిబ్బరం చేకూరినట్లుంటుంది. వారు చేసే పనిని ప్రోత్సహించడానికి, పందెంలో గెలవడానికి "స్పర్శ" (తల్లిదండ్రులు/స్నేహితులు/పెద్దలు ఎవరైనా కావచ్చు) ఎంతో అవసరం. ఆ స్పర్శ వారిలోని ఉత్సాహాన్ని, శక్తిని, రెట్టింపు చేస్తుంది. అంతే కాక ఏదైనా నిరుత్సాహం, నిరాశ చెందినా వారికి అదే స్పర్శ ఆశను, నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది.

విరాజికి ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి.

తన స్నేహితురాలి భర్త చనిపోతే వెళ్ళింది. అక్కడ అందరూ ఆమెకు ఆమడ దూరంలో నిలబడి"అసలేం జరిగింది? ఎలా జరిగింది?" అంటూ ప్రశ్నించే వారే కానీ ఓదార్చే వారు కనబడలేదు. అంతే తాను ఒక్క ఉదుటున స్నేహితురాలి వద్దకెళ్ళి ఆమెను తన రెండు చేతులతో దగ్గరకు తీసుకుని తలను, వీపును నిమిరింది. ఆ స్పర్శ ఆమెకు ఎంతో ఓదార్పు నిచ్చినట్లయి అలానే కదలకుండా, కదిలితే ఆ స్పర్శ, ఆ ఓదార్పు పోతుందేమోనన్నంత భయంతో అలానే ఉండిపోయింది ఎంతోసేపు.

గుండెపోటుతో హాస్పిటల్లో జాయినయ్యాడు సుబ్బారావు. అతనికి సంబంధించిన వారిని ఎవ్వరినీ లోనికి రానీయడం లేదు సిబ్బంది. సుబ్బారావుకు భయం, ఆందోళన అధికం అయ్యాయి. ఇంతలో అతని కోసం నియమించబడిన నర్సు లోనికి వచ్చింది. సుబ్బారావు ఆమె వంక బేలగా చూశాడు.

నర్సు సుబ్బారావు చేతిని తన చేతిలోకి తీసుకుని "మీకు ఏం ఫర్వాలేదు, తగ్గిపోతుంది. నే జాగ్రత్తగా చూసుకుంటానుగా" అంది చిరునవ్వుతో. అంతే ఆ స్పర్శతో, ఆ మాటతో సుబ్బారావుకి సగం అనారోగ్యం తగ్గిపోయిందా! అనిపించింది.

వానలో తడిసి జలుబు, జ్వరం తెచ్చుకుంది దేదీప్య. తల్లి కోప్పడి మందు వేసింది. ప్రక్కనే కూర్చుని బిడ్డను చేత్తో నిమురుతూ, జుట్టు సవరిస్తూ రాత్రంతా మరో రెండు మార్లు మందు వేసింది. ఆ మందు ప్రభావం కంటే ఆ స్పర్శలోని ఆత్మీయభావం వల్ల ఆత్మస్థైర్యం పెరిగి జ్వరం తగ్గింది దేదీప్యకు.

స్పర్శ ఎంతో గొప్పది!

"భాషలేనిది భావమున్నది" భాషతో పనిలేదు. భావాన్ని స్పర్శ ద్వారా తెలియచేయగలం. సంతోషం, విషాదం, ఓదార్పు...ఇలా దేన్నయినా మనం కంటి చూపుతో పలుకరిస్తూ చేతి స్పర్శతో ఏ భావాన్నైనా వ్యక్తం చేయగల శక్తి ఉంది మనవద్ద. అందుకే స్పర్శను ఒక దివ్యాస్త్రం అనటంలో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు.

కారు హారన్ విన్పించేసరికి విరాజి ఆలోచన స్పర్శకు ఆనకట్ట వేసి టైము చూసింది.

రాత్రి గం 11.30 ని. అయింది.

"అమ్మయ్య! విజయ్ వచ్చా"డనుకుంటూ లేచి తలుపుతీసింది. ఎంతో అలసి వచ్చిన విజయ్ ని చూసి చిరునవ్వుతో చేయి పట్టుకుంది. అంతే!

ఆమె చేతి స్పర్శతో విజయ్ లోని నీరసం అంతాపోయింది. విరాజిని చూసి ఆమె బుగ్గపై చిటికె వేశాడు. ఆ స్పర్శతో ఆలోచనలతో వేడెక్కిన విరాజి బుర్ర చల్లబడింది.

స్పర్శకు ఇంతటి మహిమ, శక్తీ ఉన్నాయని ఇప్పటికైనా గ్రహిస్తే వైకుంటం మన చేతిలోనే ఉంటుంది. అవునా?

మరి మీరంతా ఏమంటారు?

*********

Comments   

 
+1 #1 స్పర్శ IVNS 2013-10-04 10:30
బాగుంది శ్రీదేవి గారూ మీరు వ్రాసిన స్పర్శ పై వ్యాసం. స్పర్శ కు దూరమై ఎందఱో తల్లులు తండ్రులు మలి దశలో, ;ఎందఱో పిల్లలు తొలి దశలో మన భారత జాతి లో ఉన్నారు. స్పర్శ కు చక్కని అర్ధం, విలువ ఇచ్చిన ఈ జాతి లో ఇది ఒక జాడ్యం అయింది .
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh