The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 5
PoorBest 

జయ తన స్నేహితురాలు రమణ తో కలసి ఒక స్వీట్ షాప్ కు వెళ్ళింది.

స్వీట్ షాప్ యజమాని చిరునవ్వుతో "రండమ్మ రండి, ఏం తీసుకుంటారు?అన్నీ తాజావే! ఇదిగో ఈ ముక్క తిని చూడండి" అంటూ చెరొక ముక్క ఇచ్చి, "ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వస్తారమ్మా. అంత నాణ్యమైన సరుకులతో తయారు చేస్తాం" అంటూ ఎంతో "నమ్మకం" గా చెప్తూనే ఉన్నాడు.

స్వీట్ బాగుంది.

స్వీట్ హాట్ కొని బయటకు వస్తూ, అందుకేనా ఈ చుట్టుప్రక్కల ఎవరిని అడిగినా "నమ్మకం"గా ఈ షాపులోనే కొనమన్నారు అనుకున్నారిద్దరూ.

ఆరోజు శ్రావణ శుక్రవారం అవటంతో అమ్మవారి ఆలయానికి వెళ్ళారు. భక్తులంతా లలిత సహస్రనామాలు చదువుతున్నారు. ఆలయం అంతా అందంగా అలంకరింపబడి ఉంది.

"ఇంకా చాలావరకు మన సాంప్రదాయాలను "నమ్మకం"తో ఆచరిస్తూ శ్రావణమాస శోభ కనబరచడం ఎంతో సంతోషంగా ఉంది కదూ" అని రమణ అంటే జయ తలూపింది అవునన్నట్లు. ఇంతలో ప్రక్కన ఎవరో "అవునమ్మా! ఈ అమ్మవారిని "నమ్ముకున్నాకే" మాకు బాగా కలిసివచ్చింది" అని ఒకావిడ తనతో వచ్చిన ఆమెతో ఎంతో "నమ్మకం"తో చెబుతోంది. అంతే అది విన్న జయ, రమణ మరింత భక్తిత్, "నమ్మకం"తో అమ్మవారికి దణ్ణం పెట్టుకున్నారు.

ఒక్కసారి తమ చిన్నతనంలో అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకున్నారు ఇద్దరూ.

"అవసరంలో ఉన్నవారికి మనం చేయగలిగినంత మేలు చేస్తే దేవుడు మనకు మేలు చేస్తాడు" అనే "నమ్మకమైన" అమ్మ మాటను పాటించడం వల్లనేమో మనలో స్వార్ధచింతన తగ్గి పరోపకారం, నైతిక విలువలు పెంపొందాయి అనుకుంటా కదా! అంటూ తాము పెరిగిన విధానం పైని "నమ్మకం"తో జ్ఞాపకాలను తవ్వుకున్నారు.

పునాది యొక్క శక్తిని బట్టే ఒక కట్టడం యొక్క జీవితకాలం ఆధారపడి ఉంటుంది. "నమ్మకం" అనే పునాది పైనే సమాజం నిర్మించబడింది. కుటుంబాల సమాహారమే సమాజం. కుటుంబం అనే కట్టడానికి నమ్మకమే పునాది. వివాహం అనే బంధానికి పునాది పెద్దల మాటలపై పిల్లలు ఉంచిన నమ్మకమే. వయసొచ్చిన ఆడపిల్లను ఇతర ప్రాంతాలలో చదివించడానికి/ ఉద్యోగం చేసుకునే స్వేచ్చనివ్వడానికి పునాది వేసినది, తల్లిదండ్రులకు వారి పెంపకం మీద ఉన్న నమ్మకమే. అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఒకరినొకరు సహకరించుకోవడానికి పునాది వారి రక్తసంబంధం పైని నమ్మకమే. పిల్లలు తమ భవిష్యత్తు గూర్చిన విషయాలను తల్లిదండ్రులపై వదిలేది "తల్లిదండ్రులను మించి బిడ్డల బాగోగులు చూసివారు ఎవ్వరూ ఉండరనే" "నమ్మకం". కుటుంబం తర్వాత అంతటి "నమ్మకానికి" స్థానం ఇచ్చేది స్నేహం అనడంలో అతిశయోక్తి లేదు. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు గూర్చి ఉపాధ్యాయుల పై ఆధారపడడానికి పునాది తమ పిల్లల జీవితాలు వారు తీర్చిదిద్దగలరనే "నమ్మకమే". భార్యాభర్తలు ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వారి బంధం లోని బలానికి పునాది ప్రేమానురాగాల మీద వారికున్న నమ్మకమే.

ఇలా ఒక్కటేమిమిటి ..... ఒక్కచోటేమిటి ...... "నమ్మకం" అనేది మనం చేసే ప్రతిపనిలోనూ, వేసే ప్రతి అడుగులోనూ ప్రతిబింబిస్తుంది. నిత్యావసర వస్తువుల నుండి బంగారం కొనుగోలు వరకూ "నమ్మకమైన"చోటుకే వెళ్తాం. దేవుడు, దేవతలు,పూజలు,నోములు,వ్రతాలు, మ్రొక్కులు, భజనలు ..... ఇవన్నీ కూడా "నమ్మకం"తోనే చేస్తాం.

ప్రతి వ్యక్తికి తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకోగలననే "నమ్మకం". తమ పిల్లలను బాగా చదివించగలమనే "నమ్మకం. వారి ఆర్ధిక స్థితిగతుల కన్నా పిల్లల ఆర్ధిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయనే "నమ్మకం"తో జీవిస్తూంటాడు.

ఆసుపత్రిలో చేరిన రోగికి డాక్టరు గారిచ్చిన మందుల కంటే ఆయన హస్తవాసి మీద "నమ్మకం"తోనే సగం రోగం తగ్గిపోతుంది. ఆ "నమ్మకమే" ఎన్నోసార్లు అతన్ని ఇంటికి నడిపిస్తుంది కూడా. ఇలా....ఎన్నో....ఎన్నెన్నో.

మొత్తానికి జీవితం అంటేనే "నమ్మకం. "నమ్మకం" అనే చుక్కాని తోడు తోనే జీవితం అనే నావ నిరంతరం అల్లకల్లోలాలు సృష్టించే మానవ సమాజంలో తొణకకుండా సాగిపోతూ ఉంటుంది.

"నమ్మకం" అనేది ఊహవచ్చినప్పటి నుండి ఊపిరి ఆగిపోయే వరకూ మనతో ఉండే ఓ అద్భుత అదృశ్య శక్తి. నమ్మకం గూర్చి ఎంత చెప్పినా తక్కువే. బంగారం, వెండి, వజ్రవైడూర్యాల కు విలువ కట్టగలం కానీ, విలువ కట్టలేని వాటిలో ముఖ్యమైనది నమ్మకం. వజ్రవైడూర్యాలు, బంగారం, వెండి అందాన్ని పెంచుతాయని చెప్పినంత నమ్మకంగా బంధాన్ని నిలుపుతాయని చెప్పలేము.

నమ్మకాన్నినీడలా అనుసరించేదే అనుమానం. నమ్మకం ఏ మాత్రం తొట్రుపడినా, తొణికినా అనుమానం నమ్మకం స్థానాన్ని ఆక్రమించేస్తుందని నమ్మకంగా చెప్పవచ్చు. ఆక్రమించడమే కాక అక్కడి పరిస్థితులను సాధ్యమైనంత నాశనం చేయడానికి నాలుకలు జాపిన అగ్నిహోత్రుడిలా నలువైపులనున్న సత్సంబంధాలను అవలీలగా నాశనం చేస్తుంది. వివేకంతో మేల్కొనే సరికి జీవితకాలం ఉండవలసిన బంధాలు నిర్జీవమై అనాధలుగా మిగిలిపోవటానికి కారణం నమ్మక లోపమే.

ఈనాడు చెదిరిపోయిన ఎన్నో కుటుంబాలకు కారణం కేవలం నమ్మకం లోపమే, అనుమానమే. ఇంకా చెప్పాలంటే ఆత్మ పరిశీలన చేసుకునే ధైర్యం లేకనే. నిజంగా తప్పు చేసి విడిపోయిన వారి కన్నా, "నమ్మకం" లేక విడిపోయిన వారే ఎక్కువ. ఇది ఎంతో బాధాకరమైన విషయం. ఇంతకంటే విషాదకరమైన విషయం విడిపోకుండా ఉండి నమ్మకం నశించినందున నిత్యం ఒకరినొకరు మాటలతో, చేతలతో హింసించుకోవడం. అంతకన్నా దౌర్భాగ్యమైనది "నన్ను నమ్మండి/నన్నునమ్ము" అంటూ భార్యాభర్తలిరువురూ తమ నిజాయితీని ప్రతిక్షణం ఋజువు చేసికోవడానికి ప్రయత్నిస్తూ, ఓడిపోతూ చిన్న జీవితాన్ని చేజార్చుకోవడం.

"నమ్మకం" ఒకరు కలిగిస్తే కలిగేది కాదు. ఎవరి వల్లో కలిగిన "నమ్మకం" శాశ్వతమైనదీ కాదు. ఏ బంధంలోనైనా ఒకరిమీద ఒకరికి ప్రేమతో ఏర్పడేది "నమ్మకం". ముందుగా మనపై మనం "నమ్మకం" పెంపొందించుకోవాల అప్పుడు ఏర్పడే బంధాలే "నమ్మకం"తో మరింత బలంగా ఉంటాయి.

జ్ఞాపకాల పొరల్లోంచి బయటకొచ్చిన మిత్రురాళ్ళు సమాజంతో

"ఏమంటారు ...... మరి?

రండి ..... చేయి, చేయి కలుపుదాం,

"నమ్మకం" తో కదులుదాం, బంధాలను బలపరుచుదాం."

అంటూ సాగిపోయారు.

**********

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh