The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 3
PoorBest 

పూలమొక్కల నడుమ వనకన్యలా, సంగీతపరికరాల మధ్య సరస్వతి తనయలా, గాత్రంలో గానకోకిలలా....ఇంటిని దిద్దుకోవడంలో సగటు మధ్యతరగతి ఆడపిల్ల మధులత.

ఆమెకు వివాహం కుదిరింది. బంగారు బొమ్మైనా బంగారం పెట్టకపోతే కుదరదుగా, అందుకే ఆమెకు పాతిక కాసుల బంగారం,కట్నకానుకలతోపాటు ఆడపడచులాంఛనాలతో సహా మగపెళ్ళివారికి అందించి ఆమె వివాహం జరిపించారు. మధులత అత్తవారింటికి వెళ్ళే ముందు ఆమెతో ఆమె తల్లి ఒక మాట చెప్పింది "అమ్మా! మధు అత్తవారింటి గౌరవం తరతరాలు నిలబెట్టే బాధ్యత నీదే, నీ బాధ్యతాయుతమైన ప్రవర్తన మీదే నీ పుట్టింటి గౌరవం కూడా ఆధారపడి ఉంటుంది" అంతే మధులతకు ఆ క్షణం నుండి తన బాధ్యత రెట్టింపయ్యిందనిపించింది.

మెట్టినింట అడుగు పెట్టింది. కొత్తకొత్తగా అనిపించింది. ఎవరూ తనతో మాట్లాడడం లేదు. తనకేమో మొహమాటంగా ఉంది, అయినా వారిలో కలవడానికి ప్రయత్నించింది. చిత్రవిచిత్రమైన వ్యక్తులు .పిలిచినా పలుకరు, అడిగితే సమధానమివ్వరు. వారంతా ఒకరితో ఒకరు బాగానే మాట్లాడుకుంటున్నారు కదా..మామగారు పలుకరిస్తే అత్తగారు రుసరుసలు, ధుమధుమలు. పోనీ భర్త మాట్లాడతాడా? అంటే అతనూ అంతే. మౌనంగా మునిలా ఉంటాడు. అదే భర్త తన స్నేహితులు వచ్చేసరికి గలగలా మాట్లాడుతూ "అహ్హహ్హ" అని నవ్వుతూ జోకులేస్తూ హుషారుగా ఉండి, వారెళ్ళిన తర్వాత మౌనంగా మారిపోయేసరికి మధులతకు మతిపోయినంత పనైంది. ఇంట్లో ఉన్న భార్య అనే మనిషి కేవలం తన పనులకు తప్ప కనబడదు,ఆమె మాటలు అసలు వినబడనే వినబడవు ఆ భర్తకు.

స్వతహాగా నలుగుర్ని కలుపుకుపోతూ, గలగల కబుర్లు చెబుతూ, కిలకిలానవ్వుతూ, చకచకా పనులు చేసుకుంటూ పోయే మధులత ఒక్కసారిగా మూగదైపోయింది. ఒంటరిదైపోయింది. ఇంట్లో పనితో పాటు పశువుల పని కూడా చేయాలి అనేసరికి అలవాటు లేకపోయినా చేయసాగింది. పూలు కోసే చేతులు పేడలు ఎత్తడం, వీణను మీటిన చేతులు పిడకలు చేయడంతో ఆమె కాళ్ళుచేతులు నానిపోయి పుళ్ళు పడి నానా బాధ మౌనంగా అనుభవించిందే కానీ...ఎవరికీ చెప్పుకోలేదు, మూగగా రోదించిందే గానీ...ఎవరికీ వినిపించలేదు.

కాలం ఆగక సాగుతూనే ఉంది. మూడేళ్ళు గడచిపోయాయి. మధులత ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చింది. ఆ యింటి పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. పిల్లల ఆరోగ్య రక్షణకు దేవురించినా ప్రయోజనం లేదు. జ్వరం వచ్చినా...ఏం వచ్చినా దేవుడే చూస్తాడు అనే వారి వితండ వాదానికి తెరదించలేక మౌనంగా తలదించుకునేది. ఇంటికి వచ్చిన వారిని చూసి చిన్న చిరునవ్వు నవ్వేది.

అయిదు సంవత్సరాల కాలం గడచిపోయింది. మామగారు గుండెపోటుతోమరణించారు. మామగారి చావు మధులతను కృంగదీసింది. ఆ యింట్లో ఆమెతో కొంచెమైనా మాట్లాడేది ఆయనే. అయినా తప్పదు! కాలంతో పాటు వచ్చే మార్పులను మౌనంగానే అంగీకరించక తప్పలేదు. ఆమెకది తీరని లోటయింది.

పిల్లలకు ఫీజులు కట్టే విషయంలో కూడా ఆమెకు మానసిక హింసే. ఆ పసి హృదయాలు దెబ్బతినే విధంగా యాజమాన్యం ప్రతిరోజూ తరగతిలో క్రింద కూర్చోబెట్టేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత వరండాలో క్రింద, ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత మట్టి నేలమీద....అంతే వారి మనసుల్లో వ్యతిరేక భావాలు మొదలయ్యాయి. పదవ తరగతికి, ఇంటెర్మీడియట్ కి వచ్చేసారు పిల్లలు. ఫీజ్ విషయంలో చిన్నవాడు తల్లిలా సరిపెట్టుకున్నా పెద్దవాడు మాత్రం సరిపెట్టుకోలేదు.

ఓ రోజు పెద్దవాడు తండ్రిని నిలదీసాడు. "అత్తకైతే అంతంత ఫీజు కడుతున్నావు! మాకు ఎందుకు కట్టవు నాన్నా?" అన్నాడు. అంతే తండ్రికి కోపం వచ్చింది. భార్య వంక చూసాడు. మధులత నిదానంగా "పిల్లలు చిన్న వయసులో అడుగరు. పెద్దవాళ్ళయ్యాక ఊరుకోరు కదా...మీ అమ్మ చెల్లెళ్ళ మీద ఉన్న ప్రేమలో ఆవగింజంతయినా మన పిల్లల మీద చూపారా మీరు" అనేసరికి, భర్త అగ్రహోదగ్రుడయ్యి "అవును. అమ్మచెల్లెలు చనిపోతే తిరిగిరారు. అదే భార్యాబిడ్డలైతే చనిపోతే మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు,పిల్లల్ని కనవచ్చు" అన్నాడు మూర్ఖంగా. అంతే తల్లీ పిల్లలు హతాశులయ్యారు. ఆ యింట్లో వాళ్ళ స్థానమేమిటో అప్పుడర్ధమయ్యింది వాళ్ళకి.

మధులత మనసులో ఆ మాటే మారుమ్రోగుతోంది. వారం రోజులయ్యింది. చిన్నవాడు ఆడుకుందామని స్నేహితులతో కృష్ణానదికి వెళ్ళి నీళ్ళలో కొట్టుకొనిపోయాడు. మూడు రోజుల తర్వాత దొరికిన బిడ్డను చూసి ఆ తల్లి గుండె పగిలిపోయింది. భర్త ఏ ముహూర్తాన అన్నాడో గానీ అలానే జరిగేసరికి ఆమెకు భర్తతో బాధను పంచుకోవాలని అనిపించలేదు. మౌనంగానే రోదించింది.

పెద్దవాడిలో బాధతో కూడిన కసి పెరిగిపోయింది. ఇంటికి దూరంగా ఉండసాగాడు. పోయిన వాడితో పోలేక, ఉన్నవాడికి చెప్పలేక, భర్తతో బాధను పంచుకోలేక మౌనంగా....ఆ యింటిలో ఒక కుర్చీలానో ,మంచంలానో, స్తంభంలానో అయిపోయింది మధులత. చేదోడువాదోడుగా ఉండే చిన్నకొడుకు ఫోటోలు ఇంటిలో నలువైపులా అతికించుకుని వాడు తనతోనే ఉన్నట్లుగా భావిస్తూ, వాడిని చూసుకుంటూ యాంత్రికంగా పనులు చేసుకుంటూ పోతోంది. ఎవరైనా వెళితే పేలవంగా చిన్న నవ్వు నవ్వుతోంది.ఆర్నెల్ల వ్యవధిలోనే ఆమె తండ్రి మరణించేసరికి ఆమె వేదన వర్ణనాతీతమే అయింది. అదీ మౌనంగానే భరించింది.

సంవత్సర కాలం గడిచింది. భర్తకు బైపాస్ సర్జరీ చేయవలసి వచ్చింది. ఉన్న బాధలకు ఇదొకటి కూడికయింది. ఉన్న ఆస్తినంతా కూతురికే ఇవ్వాలని ఆశించే అత్తగారు ఆఖరి నిమిషంలో ఆపరేషన్ చేయించింది. మధులత భర్తకు కావలసినవన్నీ సమయానికి అందిస్తూ, అవసరాలకు అత్తగారి ముందు చేయి చాస్తూ, ఆమె మాట్లాడే మాటలకు అవమానపడుతూ మానసికంగా కృశించిపోయింది. ఇంటికి వచ్చాక డాక్టర్ చెప్పిన ఒక్క మాటైనా వినక పోవడం...దానికి అత్తగారు వంత పాడడంతో మౌనంగానే ఉండిపోయింది.తనకు అందుబాటులో ఉన్నంత వరకూ చేయగలిగినంత సేవ చేస్తూ భర్తను జాగ్రత్తగా చూసుకుంటూనే ఉంది.

కొంచెం బాగుంటే చాలు, స్నేహితులతో కలిసి బిర్యానీలు, పలావులు తినడం, ఇంటికి వచ్చిన దగ్గర నుండి తను బాధ పడుతూ భార్యను బాధ పెట్టడం. ముదిరిపోయే వరకు ఇంటిలో ఉండి ఇక ప్రాణాలు పోతాయనగా హాస్పిటలుకు తీసికెళ్ళడం, డాక్టర్లు "ఇప్పటి వరకు ఏం చేస్తున్నారమ్మా!" అంటూ ఛీత్కరించడం - ఈ ఇరవై ఏడేళ్ళ వైవాహిక జీవితంలో బాగా అలవాటై పోయింది.

ఎన్నిసార్లు సిగరెట్టు కాల్చవద్దని చెప్పినా, వినక కాల్చీకాల్చీ మళ్ళీ డాక్టర్ వద్దకు వెళ్ళేసరికి డాక్టరుగారు చూసి "ఇక నీవు ఏవైనా తినవచ్చు. ఎన్ని సిగరెట్లైనా కాల్చవచ్చు! ఎందుకంటే నీకు చాలా ధైర్యం ఉంది. ఈ రోజు కాకపోతే రేపు చనిపోతామని ఎప్పుడూ నీ భార్యతో అంటావుకదా,కాబట్టి నీకే చెప్పేస్తున్నాను..ఇక నీ జీవితకాలం కేవలం నెలలు మాత్రమే!" అన్నది విని మధులత కుప్పకూలి పోయింది.

భర్త వంక చూడలేదు.బయటకు వచ్చింది. అమ్మ దగ్గర కూర్చుని "అమ్మా!నీవు చెప్పిన ప్రతి మాటా విన్నానమ్మా! ,నా బంగారం, నా కట్నం, నా స్వేచ్ఛ, నా సంతోషం....అన్నీ ఈ కుటుంబానికే ఇచ్చాను కదమ్మా! అయినా నన్నెవరూ ఇంత వరకూ వారితో కలుపుకోలేదే అమ్మా" అనే సరికి తల్లి కూతురిని దగ్గరగా తీసుకుని మౌనంగా ఓదార్చడం తప్ప ఏమీ చేయలేక పోయింది. కన్నీళ్ళు తుడుచుకుని తనను చూడడానికి వచ్చిన అక్కచెల్లెళ్ళను చూసి పేలవంగా నవ్వుతూ.....

సమయం త్వరగా గడచిపోతున్నట్లుంది కదా! సమయాన్ని మనం ఆపలేము కదా! సమయం ఆగిపోతే బాగుండు కదా! బావగారు ఇప్పుడు ఎన్ని సిగిరెట్లు కాల్చినా ఫర్వాలేదు కదా! మందులు వాడక పోయినా ఫర్వాలేదు కదా!

చిన్నోడు చనిపోతే నే చనిపోయానా ఏమిటి? ఎవరు లేకపోయినా ఈ గుండె పగిలిపోదు కదా! అందరూ ఉన్నప్పుడే నాకా ఇంటిలో స్థానం లేదు కదా! మీ అందరినీ చాలా టెన్షన్ పెడుతున్నా కదా! అంటుంటే అక్కచెల్లెళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి.

మధులత మాత్రం "ఎందుకు ఏడవడం ఊరుకోండి!" అని పేలవంగా నవ్వుతో...

******

Comments   

 
-1 #1 మధ్యతరగతి ఆడపిల్ల Syamala Kallury 2014-03-23 17:49
the story appears incomplete or is it to be continued?
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh