The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 3
PoorBest 

ఆఫీసుకి అరగంటాలస్యమైపోయిందని వాచీ చూసుకుంటూ ఆదరా బాదరాగా ఆఫీసులో అడుగు పెడితే నాగవిల్లి తరువాత పెళ్ళివారిల్లులా చడీ చప్పుడులేదు.ఎవరుండాల్సిన స్తానాల్లో వాళ్ళు లేరు సరికదా ప్యూను జోగులు జోగుతూ కన్పించాడు."ఏమిటోయ్ మన ఆఫీసులో అందరికీ అర్జంటుగా సలవు కావల్సొచ్చిందా? యేమిటి ఎవరూ కనిపించటంలేదు."

"లేదు బాబూ! మన సుబ్బారావుబాబు తెల్లారీ సరికల్లాసచ్చిపోయారుట. యాదగిరిగారు ఫోన్లో చెప్తే మనోళ్ళంతా అక్కడికెళ్ళారు నేను ఆఫీసుకి కాపలా వుండి తరువాత వచ్చినవాళ్ళకి కబురు చెప్పడానికి వుండిపోయాను.

ఎలక్రిక్ షాకు తగిలినట్లయింది,నిన్న సాయంత్రం బస్టాపులో విడిపోయేవరకు నవ్వుతూ కబుర్లు చెప్పిన సుబ్బారావుకి యింతట్లో యేం ముంచుకొచ్చింది చెప్మా అనుకుంటూ "సరే, నేనూ అక్కడికేవెళ్తాను." అంటూ ఆటోలో బయలుదేరాను బస్సులో అయితే లేటవుతుందని. సుబ్బారావు యిల్లు చేరేవరకు అతన్నిగురించే ఆలోచనలు చుట్టుముట్టాయి.

సుబ్బారావు వంటరివాడు. మహా అయితే ముప్పై అయిదేళ్ళుండవచ్చు. ఏదో మాటల సందర్భంలో చెప్పాడు ’చిన్నప్పుడే తల్లి తండ్రి పోయేరని, నా అనేవాళ్ళెవరూ లేరని.’

ఈ కార్యక్రమమంతా ఆఫీసువాళ్ళే చెయ్యాలనుకుంటాను, ఆలోచిస్తుండగానే అటో సుబ్బారావు వుండే వీధి చేరుకుంది. నాలుగడుగుల ముందుగా ఆటోనాపించి దిగిపోయాను. ఆతృతలో అడుగులు పడుతున్నా తొందరగా నడిచినట్లే అనిపించటం లేదు. గుండెల్నెవరో పిండుతున్నట్లు అనుభూతి కలుగుతోంది. అక్కడ యించుమించు మా ఆఫీసు స్టాఫంతా వుంది. ఇంటి ముందు అందరూ గుమిగూడి వున్నారు. సుబ్బారావు శరీరాన్ని చాప మీద పడుక్కోపెట్టారు, నిద్రపోతున్నట్లు ప్రశాంతంగా వుంది అతని ముఖం.

ఇంటి వోనరు శ్రీనివాసయ్యంగారు అరవ యాసతో వివరిస్తున్నారు పక్కవాళ్ళతో "రాత్రి కడుపుల నొప్పిగుంది మాత్తర యామన్నవుంటే యీమన్నాడు. పాపం యామి నొప్పొ, రొంబ కష్టమయింది హాస్పిటలుకి పోదామప్పా అంటే యినుకోలా ఇంతలో యింత అవుతాదనుకోలా శానా మంచివాడు. మురుగాకి దయ లేదు."

మా బాస్ దగ్గరకి వెళ్ళి అడిగాను "సార్! యేర్పాట్లెవరు చేస్తున్నారు? నేను చెయ్యవలసిన పని యేమైనా వుంటే చెప్పండి."

"యాదగిరి అన్ని యేర్పాట్లు చేశాడు. యింకొక్క అరగంట పడుతుందేమో! ఏమైనా దురదృష్టవంతుడు." యీ మాటలు పూర్తి కానేలేదు యిద్దరు స్త్రీలు పెద్దగా రోదిస్తూ వచ్చేసరికి అందరి ముఖాల్లో ఆశ్చర్యం కొట్టవచ్చినట్లు కనబడుతోంది.

వారు తిన్నగా సుబ్బారావు శరీరం మీదపడి యేమేమిటో వర్ణిస్తూ పెద్దగా యేడుస్తున్నారు. వారి భాష యాస చూడగా హైదరాబాద్ ప్రాంతం వాళ్ళ తీరుగా వుంది. ఎంతయినా తను మాత్రం మనిషి కాదా యేదొ పెళ్ళి జంఝాటం లో యిరుక్కోకుండా యీ స్త్రీతో సబంధం పెట్టుకొని వుంటాడు. ఇద్దరూ తల్లీ కూతుర్లయి వుంటారు. చిన్నామెకు పాతికేళ్లుంటాయి. వాళ్ళు యేమంటు యేడుస్తున్నారో యేమీ అర్ధం కావడం లేదు ఓదార్చాలన్నా యెటువంటి పరిచయం లేదు.

ఒక పావుగంట గడిచింది. యాదగిరి మిగతా యేర్పాట్లు చూసాడు. శ్మశానానికి అందరం బయలుదేరాం. నిన్ననవ్వుతూ మాట్లాడిన వ్యక్తి నేడు కట్టెల్లో బూడిదవుతూంటే కళ్లు చెమర్చాయి. నా ప్రక్కనే వచ్చి నిలుచున్నాడు యాదగిరి. జేబులోంచి కర్చీఫ్ తీసి కన్నులొత్తుకుంటూ "సుబ్బారావు చాలా మంచివాడు కదా యెంత హఠాత్తుగా జరిగింది కలా నిజమా అన్నట్లుంది" అన్నాను.

"ఏంటోనండి మొదట్నుంచి మనిషి నిరాశావాది. పెండ్లెందుకు చేసుకోలేదంటే పోనిద్దూ నాకింకో బంధకమెందుకు?యిలాగే హాయిగావుంది అనేవారు. అందరితో వొకేలా మాట్లాడేవారు. ఒకరి విషయంలో అనవసరంగా జోక్యం చేసుకునేవారు కాదు.


"అన్నట్లు యాదగిరీ, నాకో చిన్న సందేహం! సుబ్బారావు పెళ్ళీపెటాకులూ చేసుకోలేదు కదా? యిందాక ఏడ్చిన స్త్రీలిద్దరూ యెవరంటావునీకేమైనా తెలుసా?"


"ప్చ్! యేం చెప్పమంటారు సార్! చనిపోయిన వ్యక్తికోసం యేడ్చే మనిషి కరువయితే ఆత్మకి శాంతి కలుగదంటారు. ఇంతమందిమి వచ్చాంగాని వాళ్ళలా ఒక్కరిమయినా యేడవగలిగామా?" ఇంతకూ వాళ్ళెవరో చెప్పనేలేదు."

"వాళ్ళు కిరాయికి దొరుకుతారు సార్! యిలాంటి కేసులు తటస్థపడితే వాళ్ళకొక యాభయి రూపాయిలిస్తే అరగంట యేడిచి యింటికెళిపోతారు."

అవాక్కయిపోయాను.

చనిపోయిన సుబ్బారావుకి వాళ్ళకి యెటువంటి సంబధం లేదు. అతని ముఖమైనా యెరుగరు. అయినా గుండెలవిసేలా ఏడ్చారంటే వాళ్ళచే ఏడ్పించినవి రక్త సంబంధాలు మమతానురాగాలు కావు..."ఆకలి!"

యిప్పుడు నా జాలి సుబ్బారావు మీంచి ఆ కిరాయి మనుషుల మీదకి మరలింది.

 

Comments   

 
0 #2 కిరాయి మనుష్యులు! పార్థ 2013-06-09 04:28
As pointed out by Dr. Kallury Syamala the plot of this story is old but the narrative style has been improvised when compared to your previous stories.

Hoping to read good stories from your Madam.
Quote
 
 
+2 #1 Dr Syamala Kallury 2013-06-06 05:30
Same theme like the Hindi film Rudali where Dimple Kapadia plays an exemplary role. Nice story.
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh