The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 3
PoorBest 

సుబ్బారావు పాపం చికాకుల్లో ఉన్నాడు. అనుకున్న ప్రొమోషన్ రాలేదు సరికదా, కంపెనీ ఈసారి ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు. పైగా రమేష్ బాబుకి ప్రొమోషన్ రావడం, వాడు కాలర్ఎత్తుకు తిరగటం అస్సలు జీర్ణించుకోలేక పోతున్నాడు. ఆఫీసు వాళ్ళ జాలి చూపులు, ఇంట్లో ఎత్తిపొడుపులు మరీ చికాకు తెప్పిస్తున్నాయి. మేనేజెర్నిఅడిగితె ఇదింతే, ఉంటే ఉండు లేకపోతే పో అన్న రీతిలో మాట్లాడేడు.

ఆఫీసు నించి ఇంటికెళుతూ దారిలో గుడికెళ్ళేడు. ఈ మధ్యన దైవదర్శనాలు ఎక్కువయ్యేయి. గుడిలో దేవుణ్ణి ప్రార్ధించేడు. "భగవంతుడా, వచ్చే సారైనా ప్రొమోషన్ వచ్చేట్టు చెయ్యి స్వామీ" అని. ఈ మధ్యనే పిచ్చాపాటీలో ఎవరో చెప్పేరు. “దేవుణ్ణి అందరూ ప్రార్ధిస్తారు. మరి దేవుడు అందరి కంటే ముందుగా మనల్ని గమనించాలంటే ఎలాగ? అందుకే ప్రతిరోజూ కాకపోయినా ప్రతి వారమైనా పూజ చెయ్యాలి. దేవుణ్ణి వేడుకోవాలి. సాధ్యమైనన్ని సార్లు దేవుడా దేవుడా అని ఎలుగెత్తి పిలవాలి. పదిసార్లు మన దగ్గరకొచ్చేవాడి పని మనం చేసేటట్టే, దేవుడుకూడా పదిసార్లు ప్రార్ధించేవాడినే కరుణిస్తాడు” అని. ఈ విషయం సుబ్బారావుకి చాల న్యాయంగా అనిపించి మనసుకి హత్తుకుంది.

మరో ఆర్నెల్లు గడిచేయి. సుబ్బారావు పరిస్తితి ఏమీ మారలేదు. ఇంక్రిమెంటూ రాలేదూ, ప్రొమోషనూ రాలేదు. జాలి చూపులూ,ఎత్తిపొడుపులూ ఆగలేదు. దైవ ప్రార్ధనలు మాత్రం ఎక్కువైయ్యేయి. దేవుడా దేవుడా అని ఎలుగెత్తి పిలవడం కూడా ఎక్కువయ్యింది. ఈ తంతంతా పైనించి దేవుడు చూస్తూనే ఉన్నాడు. సుబ్బారావుని చూసి నవ్వుకొని “నీ ఖర్మ ఫలితాన్ని నేనెలా మర్చగలనురా వెర్రినాయనా”, అనుకున్నాడు.

ఆరోజు దేవుడు మరీ బిజీ. ఐదువేలమందిని పుట్టించాలి. నాలుగువేల మందిని లేపెయ్యాలి. పది మందికి మోక్షం. వాళ్ళు పైకి రాగానే స్వాగతం పలకాలి. రెండు లక్షల మందికి చిన్న చిన్న కష్టాలు, 75వేల మందికి అనుకోని సుఖాలూ. ఇవన్నీ సక్రమంగా జరిగేట్టు చూడాలి. దేవుడు చకచకా పని చేసుకు పోతున్నాడు. ముక్కలు వెంటవెంటనే పేర్చేడు. న్యూయార్క్ లో తుఫాను, బీజింగ్ లో పొల్యూషనూ, ఒరిస్సాలో వడిగాలి, సూడాన్లో సుడిగాలి, బర్మాలో వరదలూ, ఇండోనేషియాలో భూకంపం. ఇలా దేవుడు రోజువారి పనిలో బిజీగా వుండగా సుబ్బారావు అలవాటు ప్రకారం ఎలుగెత్తి పిలవటం మొదలెట్టేడు. “ స్వామీ, నాకు ప్రొమోషన్ వచ్చేట్టు చెయ్యి స్వామీ, నేను ఐఫోను, ఎల్సీడీ టీవీ కొనుక్కోనేట్టు దీవించు స్వామీ” అంటూ. మామూలుగా అయితే దేవుడు చిరునవ్వుతో ఓ సారి చూసి తన పని తాను చేసుకు పోతాడు. ఆ రోజు మరీ బిజీగా ఉండడంతో కాస్త చికాకు కలిగింది. సరేలే, మానవ మాత్రుడు అని తల తిప్పేసరికి అనుకోకుండా ఓ తోకచుక్క వేగంగా భూమి వైపు వెళ్తూ కనబడింది. అయ్యో దీన్ని ఆపాలి, లేకపోతే అనర్ధం అని ఎడమ చేత్తో దాన్ని ఆగ మన్నట్టు సైగ చేసేడు. ఇంతలో మళ్లీ సుబ్బారావు దేవుడా అంటూ గొంతుక లేపేసరికి, ఈ సారి దేవుడికి నిజంగానే ఒళ్ళు మండింది. “ఎవనుకుంటున్నాడీయన, ఖాళీగా ఉన్నాననుకుంటున్నాడా? ఇంత గోల చేస్తున్నాడు.” అని, ఇక లాభంలేదు. వీడికి విషయం విడమర్చి చెప్పాలని ఫళానున సుబ్బారావు ముందు ప్రత్యక్షం అయ్యాడు.

కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ దేవుడు ముందు ప్రత్యక్షమయ్యేసరికి సుబ్బారావుకి నోట మాట రాలేదు. నోరు పెగిలించుకొని “ఇన్నాళ్ళకి నా మీద దయ కలిగిందా స్వామీ” అన్నాడు. “దయ కాదురా మూర్ఖుడా!! నీ పని పడదామని వచ్చేను” అన్నాడు. ఖంగు తిన్న సుబ్బారావు “అదేంటి స్వామీ” అంటే, “లేకపోతే మరేమిటి? నేన్నీకు ఏం తక్కువ చేసేనని ఇలా రోజూ నా ప్రాణం తీస్తున్నావ్? నిన్ను కుంటి, గుడ్డి, మూగ, చెవుడు ఇలా ఏమైనా అంగవైకల్యంతో పుట్టించేనా? మంచి కుటుంబంలో పుట్టించేను. బాగా చదువు వచ్చేటట్టు చేసేను. తెలివితేటలిచ్చేను. మంచి భార్యా పిల్లల్నిచ్చేను. ఉద్యోగం ఇప్పించేను. ఇంత నేను చేస్తే, నేను ఇచ్చిన వన్నీ సరిగ్గా వాడకుండా, కష్టపడి పని చెయ్య కుండా, ఏదో నేను నీకు తక్కువ చేసినట్టు దేవుడా దేవుడా అంటూ రోజూ ఏంటీ గోల?...... ఒక సారి తల తిప్పి చూడు. ప్రమాదాల్లో కాళ్ళూ చేతులూ పోగొట్టుకున్నవాళ్ళూ, పుట్టడమే రోడ్ల మీద పుట్టిన వాళ్ళూ, అఘాయిత్యాలకి గురైనవాళ్ళూ, నిర్భాగ్యులు ఎంతో మంది ఉన్నారీ ప్రపంచంలో. వాళ్ళు నన్నుప్రార్ధించినా, దేనికైనా అర్ధించినా అర్ధం చేసుకోవచ్చు. నీలాగా బాగా బలిసిన వాళ్ళు నన్ను రోజూ డిస్టర్బ్ చేస్తే నాకు ఒళ్ళు మండుతుంది. మళ్లీ దేవుడా దేవుడా అంటూ అరిచావా, తెల్లారేసరికి ఏ లారీతోనో తొక్కిన్చేస్తాను జాగ్రత్త” అని చటుక్కున అంతర్దానమయ్యేడు.

సుబ్బారావుకి బుర్ర తిరిగిపోయింది. ఆ రోజంతా ఏమీ పాలుపోలేదు. మెల్లిగా దేవుడి కోపం అర్ధమయ్యింది. ‘అవును కరెక్టే. ఆయన నాకేం తక్కువ చేసేడని! నేనే కష్టపడి పని చెయ్యట్లేదు. నిజం చెప్పాలంటే రమేష్ బాబే బెటర్. అందుకే ఆయనికి ప్రొమోషన్ వచ్చింది.’ అనుకున్నాడు.

ఆ తర్వాత్తర్వాత సుబ్బరావులో మార్పొచ్చింది. పని చేసే పధ్ధతి కూడా మారింది. కష్టపడి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయడం ప్రారంభించేడు. గుడికెళ్ళినప్పుడు కూడా ఇక ఏమీ కొత్తవి అడక్కుండా, దేవుడిచ్చిన వాటికి ధాంక్స్ చెప్పుకోవడం మొదలెట్టేడు. క్రమేణా ఆఫీసులో జాలి చూపులూ, ఇంట్లో ఎత్తిపొడుపులూ ఆగిపోయేయి. ఇతరుల కళ్ళల్లో, ముందు కనబడని గౌరవం కనబడటం మొదలైంది.

పైనించి చూస్తున్నదేవుడు తృప్తిగా నవ్వుకున్నాడు.

Comments   

 
+2 #2 దేవుడికి ఒళ్ళు మండింది! Ranga 2013-07-31 08:53
Short & sweet. Good one.
Quote
 
 
+1 #1 దేవుడికి ఒళ్ళు మండింది! పార్థ 2013-07-27 14:45
Nice..
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh