The Natural HR Theory by Dr IVNS Raju

User Rating:  / 2
PoorBest 

 Combat Drug Resistance

 

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న  ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా  ప్రజారోగ్య సంరక్షణకు సంబంధించిన ఒక ప్రాధాన్యతాంశాన్ని ప్రపంచవ్యాప్తంగా  ప్రజలలోకి తీసుకెళ్లేందుకు  ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఒక ప్రచార నినాదాన్ని ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవ నినాదం “ఔషధ నిరోధకత పై పోరాడుదాం .” (Combat Drug  Resistance)

 

ఔషధ నిరోధకత అంటే ఏమిటి ?

బాక్టీరియా, వైరస్, ఫంగస్, పరాన్నజీవులు వంటి రోగకారక జీవులు తమపై ఉపయోగించబడే యాంటిమైక్రోబియల్ మందులు నిష్పలితమైపోయే విధంగా పరిణామం చెందిన పరిస్ధితిని “ఔషధ నిరోధకత” అంటాము. అంటే ఆయా రోగకారక జీవులు మామూలుగా వాడే మందులకు నశించకుండా, తట్టుకుని జీవించగల్గుతాయి.  ఔషధాలను తట్టుకునే నిరోధక శక్తి రోగకారక జీవులకు లభించిందన్నమాట ! దీన్నే మనంఔషధ నిరోధకత ” (drug resistance) అని పిలుస్తాం.పలురకాల మందులకు ఔషధ నిరోధకత కల్గిన సూక్ష్మజీవులను సూపర్ బగ్స్ అంటాము. వీటివల్ల ప్రపంచ మానవాళికి వ్యాధి తీవ్రత, ఆర్ధికభారం ఎక్కువవుతాయి.

ఈ స్ధితి  ఎందువల్ల వస్తుందంటే, విచ్చలవిడిగా , అసంబద్ధంగా యాంటిబయాటిక్స్ ని వాడటం వల్ల.  ఉదాహరణకు ఏదైనా ఒక మందు  తక్కువ క్వాలిటి రకం వాడటం వల్ల లేదా పూర్తి కోర్సు వ్యవధికాలం వాడకపోవడం వల్ల  ఈ పరిస్ధితి రావచ్చు.

 

 

ఔషధ నిరోధకత - కొన్ని వాస్తవాలు :

 • ఔషధనిరోధకత కల్గిన జీవుల వలన కలిగే వ్యాధులు మామూలుగా వాడే మందులకు తగ్గకపోవడం వల్ల దీర్ఘకాలంపాటు వ్యాధి దుష్ఫలితాలకు లోనవడం,  మరణాల రేటు కూడా ఎక్కువవడం జరుగుతుంది.

 

 • ప్రతి సంవత్సరం 4,40,000 బహుళ ఔషధ నిరోధకత కల్గిన క్షయ వ్యాధి కేసులు నమోదవుతూ, 1,50,000 మరణాలకు కారణమవుతున్నాయి. 64దేశాల్లో మొత్తం క్షయ కేసులు ఔషధ నిరోధకత కల్గినవిగా నిర్ధారించబడటం ఆందోళనకరమైన అంశం.

 

 • మలేరియా విస్త్రతంగా వ్యాపించివున్న అనేక దేశాలలో మలేరియాకు వాడబడే క్లోరోక్విన్, సల్ఫడాక్సిన్-పైరిమెధమిన్ వంటి పాతతరం మందులకు నిరోధకత సాధారణమైపోయింది.         
 • హాస్పిటల్ ద్వారా సంక్రమించే వ్యాధులలో ఎక్కువ శాతం తీవ్రమైన ఔషధ నిరోధకత కల్గివుండే  ఎం.ఆర్.ఎస్.ఏ (మెధిసిలిన్ రెసిస్టెంట్ స్టాఫిలోకోకల్ ఆరియస్) వంటి బాక్టీరియా వల్ల సంక్రమిస్తున్నాయి.
 • అసంబద్ధ, హేతురహితమైన  యాంటిబయాటిక్  మందుల వాడకం   ఔషధ నిరోధకత కల్గిన రోగక్రిములు ప్రబలడానికి, బలపడటానికీ దోహదం చేస్తున్నది.

 

 • ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచించిన ప్రకారం పిల్లల్లో రక్తవిరేచనాలకు కారణమైన షిజెల్లా వ్యాధికి సిప్రోఫ్లోక్సాసిన్ పనిచేస్తుంది. కానీ అదే సిప్రోఫ్లోక్సాసిన్ ను హేతువిరుద్ధంగా వాడిన ఫలితంగా షిజెల్లా జీవులకు సిప్రోఫ్లోక్సాసిన్ కు  ఔషధ నిరోధకత రావడంతో పరిస్ధితి జటిలమయ్యింది.

 

 • అతి సాధారణమైన  గనేరియా లాంటి సుఖవ్యాధి కూడా మాత్రల రూపంలో తీసుకునే   సెఫలోస్పోరిన్స్  అనే మందుని విచ్చలవిడిగా  వాడకం వల్ల ,  క్లిష్టమైన మందులు వాడితే కానీ లొంగని పరిస్ధితి ప్రబలుతున్నది.

 

ఔషధ నిరోధకత  కు దారితీస్తున్న కారణాలు :

 

యాంటిబయాటిక్స్  తక్కువ క్వాలిటి వాడకం, పూర్తి కోర్సు వ్యవధి వాడకపోవడం వంటి కారణాలు సాంకేతికంగా ఔషధ నిరోధకతకు దారితీస్తాయి.

 

దీనితోపాటు ఈ క్రింది అంశాలు కూడా ఔషధ నిరోధకతకు దోహదం చేస్తున్నాయి.

 

 • జాతీయస్ధాయిలో  చిత్తశుద్ధి లోపించిన ఫలితంగా సమగ్రమైన, సమన్వయంతో కూడిన కార్యాచరణ లేకపోవడం, జవాబుదారీతనం లోపించడం, క్రిందిస్ధాయి ప్రజలను భాగస్వాముల్ని చేసే ప్రణాళికలు లేకపోవడం
 • బలహీనమైన లేదా పనిచేయని స్ధితిలో పర్యవేక్షణ వ్యవస్ధలుండటం.
 • క్వాలిటి  మరియు నిరంతరాయంగా మందులు అందుబాటులో ఉండేలా చూసే వ్యవస్ధలు అసంపూర్తిగా ఉండటం
 • ఇన్ఫెక్షన్ నివారణ మరియు నియంత్రణల అమలు వైఫల్యం.
 • డయాగ్నొస్టిక్స్, మందులు, వాక్సిన్స్ ఉత్పత్తిలో మందగొండితనం, కొత్త ఉత్పత్తుల తయారీకై పరిశోధన మరియు అభివృద్ధి తగినంతగా లేకపోవడం..

 ఔషధ నిరోధకతను అడ్డుకోవాలి !

నేడు మనిషి ఆరోగ్యంగా, ఎక్కువకాలం జీవించగల్గడానికి ఒకానొక కారణం వ్యాధులను నియంత్రించగల్గే  శక్తివంతమైన ఔషధాల లభ్యత . 1940లో యాంటిమైక్రోబియల్ మందులు కనిపెట్టబడి, లభ్యమయ్యేదాకా  ప్రజలు ఇన్ఫెక్షన్లతో పెద్దఎత్తున మరణిస్తుండేవారు.   నేడు యాంటిమైక్రోబియల్స్ లేకుండా ప్రపంచాన్ని ఊహించలేము.

నేడు మనకు అటువంటి యాంటిమైక్రోబియల్స్ అందించిన శక్తివంతమైన రక్షణను కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తున్నది. గత 70సంవత్సరాలుగా మానవ, జంతు ప్రపంచంలో విచ్చలవిడిగా జరుగుతున్న ఔషధాల వినిమియం ఫలితంగా యాంటిమైక్రోబియల్స్ కు ఔషధ నిరోధకత కల్గివున్న జీవుల సంఖ్య క్రమంగా పెరుగుతూవస్తున్నది. ఫలితంగా మరణాల సంఖ్య, అనారోగ్య తీవ్రత , ఆరోగ్యసంరక్షణా వ్యయం అధికమౌతున్నాయి. ఈ పరిస్ధితి ఇలాగే కొనసాగితే, అనేక ఇన్ఫెక్షన్స్  -   వ్యాధులు  నియంత్రించలేనివిగా మారి ఇప్పటిదాకా ఆరోగ్యరంగంలో సాధించిన విజయాలు తారుమారయ్యే దుస్ధితి మానవాళికి దాపురిస్తుంది. పైగా శరవేగంతో విస్తరిస్తున్న దేశాంతర వ్యాపారాలు, ప్రయాణాల వల్ల ఈ ఔషధ నిరోధకత కల్గిన జీవులు గంటలవ్యవధిలోనే విస్తరించడానికి సులువవుతుంది. ఔషధ నిరోధకత పూర్తిగా కొత్త సమస్య కానప్పటికీ, కొన్ని దేశాలు దీని నివారణకు చర్యలు చేపడుతున్నప్పటికీ,  ఔషధ నిరోధకత ఫలితంగా యాంటిబయాటిక్స్ కనుగొనక ముందు రోజుల దుస్ధితి  లోకి మానవాళి నెట్టబడకుండా ఉండాలంటే అన్ని ప్రపంచదేశాల మధ్య సమన్వయంతో కూడిన సమిష్టి కృషి  తక్షణం ప్రారంభం కావల్సివుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్ధ,   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం-2011సందర్భంగా ఔషధ నిరోధకతకు అడ్డుకట్ట వేసేందుకు ప్రపంచ దేశాలన్నిటినీ కార్యాచరణకు సమాయత్తం చేసేందుకు ఒక 6-పాయింట్ల ప్యాకేజిని ప్రకటించింది.  

ఈ ఆరు అంశాలలో బలహీనతలను అధిగమించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిస్తోంది.

 

1.     పరిశోధన లేమి

2.     చిత్తశుద్ధి కొరత

3.     పర్యవేక్షణ లోపం

4.     ఔషధ నాణ్యత లోపం

5.     ఔషధ వినియోగంలో హేతుబద్దత లోపించడం

6.     ఇన్ఫెక్షన్ నియంత్రణ లోపాలు

ఈ అంశాలపై కేంద్రీకరించి ఔషధ నిరోధకతను పై పోరాడేందుకు సన్నద్ధం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్ధ  ఈ క్రింది రంగాలలో ఉండేవారికి పిలుపునిస్తున్నది.

=> పాలసీ నిర్ణేతలు, ప్రణాళికా నిర్దేశకులు

 

=> ప్రజలు, పేషెంట్స్

=> ప్రాక్టీషనర్స్(డాక్టర్స్, ఇతరత్రా)

=> ఫార్మసిస్టులు, ఔషధ విక్రేతలు

=> మందుల పరిశ్రమ

ప్రపంచ ప్రజల ఆరోగ్యసంరక్షణకు పెను సవాల్ గా మారనున్న ఈ ఔషధ నిరోధకతను అడ్డుకోవడం తక్షణ  ప్రాధాన్యత సంతరించుకున్నది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా ఔషధ నిరోధకత గురించి ప్రజలలో విస్త్రతంగా ప్రచారం గావించి , మానవాళికి రానున్న పెనుముప్పుపై పోరాటం జరపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

 

 

                                       డా.కె.శివబాబు

                                 జనవిజ్ఞానవేదిక రాష్ట్ర హెల్త్ కమిటి సభ్యులు

                                 జహీరాబాద్

 

 

 

 

Comments   

 
0 #2 RE: ఔషధ నిరోధకతపై పోరాడుదాం! Sivaji N 2011-04-06 17:17
good info. thx doctor garu
Quote
 
 
0 #1 RE: ఔషధ నిరోధకతపై పోరాడుదాం! KSKK 2011-04-06 09:05
Very informative article.
W/R-Saikiran
Quote
 

Add comment

* Please use the forum for healthy discussions.
* Comments should be in-line with the subject matter
* Please refrain from comments of abusive, vulgar, derogatory, racist, sexist nature.


Security code
Refresh