vBulletin statistics
Welcome to Avakaaya.com Skip to content

Newsflash

"వైకుంఠపాళీ" - జీవితం, ఆధ్యాత్మికం, మనోవైజ్ఞానిక విషయాలను మేళవిస్తూ సాగే రచన.

చదవండి - ప్రతి శుక్రవారం.

వైకుంఠపాళీ - తొమ్మిదవ భాగం Print E-mail
User Rating: / 1
PoorBest 
నవలలు - వైకుంఠపాళీ
Written by Raghothama Rao   
Friday, 18 May 2012 10:07
గతవారం: ఉద్యోగం పోగొట్టుకున్న అనంత్ నిరుత్సాహంగా ఉండడం చూసిన రంజని అతన్ని గుడికి పిల్చుకు వెళ్తుంది. అక్కడ అనంత్ తన భార్యలో అప్పటిదాకా తెలియని కోణాన్ని చూస్తాడు. అనంత్ తల్లికి ఇష్టమైన అన్నమయ్య కీర్తనను పాడుతుంది రంజని. క్షణికమైన కోపానికి, అహంకారానికి ప్రతినిధిలా ఉండే అనంత్ ఆ క్షణం రంజనిలో తన తల్లిని చూసుకుంటాడు.

ఇక్కడ కేశవశర్మ సుబ్రహ్మణ్యం చేత అతనికి ఇష్టంలేని పనిని చేయించడానికి పట్టుబట్టడం చూసి సుమతి ఆందోళనకు గురౌతుంది.

“కిమ్ కుర్వన్ ఆసీః (ఏం చేస్తున్నావు)? భవాన్ భీరుః కిమ్? (నీవు భయపడుతున్నావా)” సంస్కృతంలో అడిగాడు శర్మ, సుబ్రహ్మణ్యాన్ని చూస్తూ.

వైదిక విధులతో బాటూ వాడికి సంస్కృతాన్ని కూడా నేర్పుతున్నాడు శర్మ. వాళ్లిద్దరు రోజూ సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. శర్మ నేర్పించినవాటిల్లో సుబ్రహ్మణ్యానికి త్వరగా వంటబట్టింది సంస్కృత సంభాషణమే!

సుబ్రహ్మణ్యం జవాబునివ్వలేదు. ఆ మౌనానికి చిరాకు పడుతూ “ఏతత్ న సాధుః (ఇది బావోలేదు)” అన్నాడు శర్మ.

అక్కడే నిలబడివున్న సుమతి లోనికి వెళ్లబోయింది. “నువ్విక్కడే ఉండు సుమతీ! వెళ్ళకు.” అన్నాడు శర్మ. ఆమె ఆగిపోయింది.

సుబ్రహ్మణ్యం సుమతి వైపు చూసి తలదించుకున్నాడు.

“ఏమండి! తెలుగులో అడగండి….అంటే…నాకు అర్థం కావాలని!” అని నెమ్మదిగా అంది సుమతి.

అలాగేనన్నట్టు తలనూపుతూ “ఏం అబ్బాయ్! ఎందుకలా మాట్లడకుండా ఉన్నావ్? నేనడిగిన దాని గురించి మాట్లాడు.” అన్నాడు. శర్మ.

సుబ్రహ్మణ్యం మౌనంగానే ఉండిపోయాడు. శర్మ ఓపిగ్గా నాలుగైదుసార్లు అడిగిందే అడిగాడు. కానీ సుబ్రహ్మణ్యంలో ఎలాంటి స్పందనా రాలేదు.

’ఛళ్’మని పేలింది సుబ్రహ్మణ్యం దవడ. మరో రెండుసార్లు చెంపలు వాయించాడు శర్మ.

సుమతి నిశ్చేష్టురాలైపోయింది. “అనుకున్నంతా జరిగింది! ఆయన సహనం పోగొట్టుకున్నారు. పుణ్యానికి పోతే పాపమెదురైనట్టుగా అయ్యింది. ఎందుకిలా గుడ్డి మోహాన్ని అంటువేసుకున్నారీయన?” అని పరిపరివిధాలా ఆలోచించసాగింది సుమతి.

నొప్పిని పంటిబిగువులో నొక్కిపెట్టి, సుమతి వైపు చూసాడు సుబ్రహ్మణ్యం. ఆమె ’మాట్లాడ’మన్నట్టు సైగ చేసింది. అంతేకాదు తన రెండు చేతుల్నీ జోడించింది.

సుమతి ముఖంలోని బేలతనం సుబ్రహ్మణ్యంలోని కాష్టమౌనాన్ని దహించింది.

“ఆచార్యా!...” అంటూ ఆగిపోయాడు సుబ్రహ్మణ్యం.

నోరువిప్పి, ఆగిపోయిన సుబ్రహ్మణ్యాన్ని చూస్తూ - “సంకోచః మాస్తు! ఆవశ్యకం చేత్ పృచ్ఛతు!” అని ఆగి, “సంకోచ పడకు, చెప్పదల్చుకున్నదేదో చెప్పు” అన్నాడు శర్మ. మాటలు కరుకుగా లేకపోయినా అతని గొంతులో మెత్తదనం లేదన్నది తెలుస్తోంది.

“ఆచార్యా! అహమ్..దశవారమ్ పఠితవాన్..తథాపి…నస్మరతి.”

“తెలుగులో చెప్పు.” అన్నాడు శర్మ.

“మీరు చెప్పినదాన్ని ఒకటికి పదిమార్లు చదువుతున్నాను. కానీ గుర్తుండటం లేదు. ఎందుకలా గుర్తుండటం లేదని నాలో నేనే చాలాసార్లు అనుకున్నాను. బహుశా ఈ శాస్త్రం, సాంప్రదాయ పద్ధతుల్లో నాకు ఆసక్తి లేకపోవడం వల్లనేమో అని అనిపించింది.”

అప్పుడు, సుమతి వైపు చూసాడు శర్మ. ఆమె కూడా అతని వైపు చూసింది.

“నువ్వు ఊహించింది నిజమే సుమా!” అన్నట్టుంది శర్మ చూపు.

“దయచేసి, పసివాడిని అర్థం చేసుకోండి!” అని అంటున్నాయి ఆమె కన్నులు.

సుబ్రహ్మణ్యం చెప్పుకు పోతున్నాడు “మా తాతగారు గొప్ప వేదపండితులు. మా నాన్నగారు పెద్ద యూనియన్ లీడర్. వర్కర్స్ కోసం ఎంతో పోరాడారు. పోలీస్ ఫైరింగ్ లో చచ్చిపోయారు. ఆయన చనిపోవడంతో గవర్నమెంటు కూడా దిగిరావాల్సివచ్చింది. ఇప్పుడు ఆయన ఫోటో కొన్ని వందల వర్కర్స్ ఇళ్ళలో ఉంది. వాళ్ళల్లో ఎంతమంది తమ తల్లిదండ్రుల ఫోటోలను పెట్టుకున్నారో తెలీదు. కానీ మా నాన్నగారి ఫోటోని పెట్టుకొన్నారు. అంతేకాదు, రోజూ దండం పెడతారు. ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు నిలబడి, ఇంత అన్నం తింటున్నారంటే మా నాన్నగారు, ఆయనతో పాటూ ఫైరింగ్ లో చనిపోయిన ఇంకొంతమంది లీడర్సే కారణం. మా తాతగారు చనిపోతే బంధువులు తప్పించి ఇంకెవ్వళ్ళూ రాలేదు. అదే నాన్నగారు పోయిన రోజున బైట వూళ్ళ నుండి కూడా జనాలు వచ్చారు. కంటి నిండా నీళ్ళు పెట్టుకొన్నారు. శవాన్ని మోయడానికి పోటీలు పడ్డారు. ఇప్పటికీ యూనియన్ వాళ్ళు నాన్న వర్ధంతి రోజున బీదలకు అన్నదానం చేస్తారు.” – తను చెప్పుకుంటూ పోతున్నది ఎదుటివాళ్ళు వింటున్నారో లేదోనన్న అనుమానం వచ్చి ఆగాడు.

ఎదురుగా, ఆ దంపతులిద్దరూ సుబ్రహ్మణ్యం వైపు తదేకంగా చూస్తున్నారు. ఎవరి ముఖంలో ఏ భావం మెదుల్తుందో కనుక్కోలేకపోయాడు సుబ్రహ్మణ్యం. మళ్ళీ కొనసాగించాడు.

“నాకు నాన్నలా బ్రతకాలనివుంది. వీలైనన్ని మంచిపనులు చేసి మంచివాడినని అనిపించుకుని చచ్చిపోవాలని ఉంది. ఈ విషయాలు అమ్మకీ, మామకీ అర్థం కాదు. కాలేదు కూడా. వాళ్ళ తీరే వేరు. ఇలాంటి మంచి ఆలోచనలు కలలో కూడా రానివ్వరు వాళ్ళు.” – తను ఇప్పుడన్న మాటలు చాలా ముఖ్యమైనవని, అవి వింటున్నవాళ్ళ మనసుల్లోకి ఇంకాలన్నట్టుగా మళ్ళీ ఆగాడు సుబ్రహ్మణ్యం. వాళ్ళేదైనా చెబుతారేమోనని మౌనం వహించాడు.

ఆ దంపతులనుండి ఎలాంటి ప్రతిస్పందనా రాలేదు.

సుబ్రహ్మణ్యం మళ్ళీ మాట్లాడుతూ “ఆచార్యా! నేను వైదిక విద్యను తప్పుపట్టడం లేదు. పనికిరానిదని అనుకోవడం లేదు. నాకు ఆసక్తి లేదని మాత్రమే చెబుతున్నాను. కనుక నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నిజానికి మీకు నేనేమీ కాను. ఐనా మీరు నాపై చాలా అభిమానాన్ని పెంచుకొన్నారు. ముఖ్యంగా…’ అంటూ సుమతి వైపు చూపిస్తూ “ఆ అమ్మ! మా అమ్మ నన్ను కూలివాడిని చేసింది. ఏరోజుకారోజు నా అన్నాన్ని నన్నే వెదుక్కోమంది. కానీ ఈ అమ్మ నాలాంటి పనికిమాలినవాడిలో వామనమూర్తిని చూసి, కడుపు నిండా అన్నం పెట్టింది.” ఈ మాటల దగ్గర సుబ్రహ్మణ్యం గొంతు వణికింది. నాలుక తడబడింది.

“ఆచార్యా! మీలాంటి మంచివాళ్ళని మోసం చెయ్యడం మహాపాపం. నా మనసులోని మాటల్ని మీకు చెప్పి, మీ ఆశీర్వాదాన్ని పొందితేనే నాకు శుభం జరుగుతుంది. నాకు నచ్చినదాన్ని సాధించే అర్హత కలగాలని మనస్పూర్తిగా ఆశీర్వదించండి.” అని నేల మీద సాష్టాంగపడి శర్మ కాళ్ళను పట్టుకుని “తత్రహమ్ కిమపి న వదామి (ఇక నేనేమీ మాట్లాడను)” అన్నాడు సుబ్రహ్మణ్యం.

శర్మ ఉన్నచోటు నుండి కదల్లేదు. కళ్ళు గట్టిగా మూసుకుని నిలబడిపోయాడు.

సుమతికి ఆందోళనగా ఉంది. శర్మ భుజాల్ని పట్టుకుని కుదిపింది.

“ఏమండీ! అబ్బాయి చెప్పింది విన్నారుగా. దయచేసి వాణ్ణి కోప్పడకండీ!” అని వణుకుతున్న స్వరంతో మాట్లాడింది సుమతి.

కళ్ళు తెరచిన శర్మ “సుమతీ! వీడే నా కొడుకు అనుకుని తీసుకొచ్చాను. అది వీడు గ్రహించినట్టు లేదు. నా మనసును తెలుసుకునివుంటే ’నేను మీకేమీ కాకపోయినా అభిమానం చూపించా’రని చెప్పేవాడు కాడు. నిజమే! నా పిచ్చి వ్యామోహంలో పడిపోయి వీడిపై అనవసరంగా కోప్పడి కొట్టాను.” అంటూ సుబ్రహ్మణ్యంను లేవనెత్తాడు శర్మ.

“చూడు సుబ్రహ్మణ్యం! మీ తాతగారి నిష్క్రమణానికీ, మీ నాన్నగారి దుర్మరణానికీ ఏవో పోలికలు పెట్టి చెప్పావు. అది సరికాదురా! బంగారాన్నీ, వెండినీ విడివిడిగానే చూడాలి గానీ ఒకదానితో ఒకటి పోల్చకూడదు. ఐనా ఇది నీ తప్పు కాదు. నీకింకా అంత ఎదుగుదల రాలేదు. నిన్ను ఇబ్బంది పెట్టను. నీకిష్టమైనదాన్నే చెయ్యి. నీకంతా మంచే జరగాలని కోరుకుంటాను.” అన్నాడు శర్మ.

సుబ్రహ్మణ్యం సుమతి కాళ్ళను తాకి నమస్కరించాడు. ఆమె వాడి రెండు భుజాలనూ పట్టుకుని “వెళ్ళిపోతావా?” అని అడిగింది.

శర్మ కొట్టినప్పుడు రాని కన్నీళ్ళు అప్పుడు వచ్చాయి.

 
చిటపటలు - 23 "పార్లమెంటు పండగ" Print E-mail
Member Categories - WoW
Written by Savyasachi K   
Thursday, 17 May 2012 15:05

Lots to be sweeped!!అరవై ఏళ్ళ పండగ బ్రహ్మాండమైన తంతుగా ముగించేసారు పార్లమెంటులో మన ప్రజాప్రతినిధులు. పాత నేతల ఆదర్శాలపై ప్రసంగాలు దంచేసారు. మిగిలిన ఇద్దరు ముగ్గురు పాత తరం పార్లమెంటేరియన్లని సత్కరించేసారు. పార్లమెంటు ప్రతిష్టను పూవుల్లో పెట్టి మరి చూసుకుంటామని సురేష్ కల్మాడి, లాలు యాదవ్, కణిమొళి సాక్షిగా హామీలు గుప్పించేసారు. పార్లమెంటు ప్రతిష్టపై పిడకలు విసురుతున్న అన్నాను, పౌరసమాజాన్ని ఆక్షేపించేసారు. ఆ ఆవేశమంతా గోళీసోడాలా వెంటనే తుస్సుమంది.

ఇరవై నాలుగ్గంటలు గడవక ముండే అధికార ప్రతిపక్షాలు ఒకరి మీద మరొకరు దుమ్మెత్తిపోసేసుకున్నారు! మొత్తానికి కాకుల సాక్షిగా కలకాలం పరిఢవిల్లుతుంది మన ఘనప్రజాస్వామ్యం అని జనాలకి ఓ భరోసానిచ్చింది ఈ అరవై ఏళ్ళ పండగ.

బై ద వే, క్రిమినల్సు, అవినీతిపరులు కూడా ఈ నెలలో పండగ పండగ చేసుకుంటున్నారు. నాలుగైదు రోజుల క్రితం మాఫియా లీడర్ అబూ సలేం పైన అభియోగింపబడ్డ మోకా ను రద్దు చేసేసారట! నిన్ననే 2జి స్పెక్ట్రం కేసులో బెయిల్ పొంది ఎ.రాజా బయటకు వచ్చేసాడు. ఈ కేసుకు సంబంధించి తీహారు జైల్లో ప్రస్తుతానికైతే ఎవ్వరూ మిగల్లేదు. ఇవిలా ఉంటే, పార్లమెంటులో మన ప్రజా ప్రతినిధులు మాత్రం ఐ.పి.ఎల్. లో మ్యాచ్ ఫిక్సింగుల గురించి, యు.ఎస్.ఎ.లో కాళి మాత పేరు మీద అమ్ముతున్న బీయరు గురించి తీరిగ్గా తన్నుకు చస్తున్నారు!

 
బావి ఎదుట బొమ్మ Print E-mail
User Rating: / 1
PoorBest 
Member Categories - తెలుసా!
Written by kadambari piduri   
Thursday, 17 May 2012 14:59
ప్రాచీనత- అనేది, ప్రపంచములోని అన్ని దేశాల నాగరికతా వికాసమునకు తీపి గుర్తులు. అందుకే ప్రపంచ దేశాలలోని ప్రజలు తమ తమ ప్రాచీన జ్ఞాపకాలను పదిలపరుచుకోవడములో ఉత్సాహాన్ని కలిగిఉంటారు. ఆ అంశాలు, చరిత్ర, భాష, ఆదర్శమూర్తులైన వ్యక్తులు, సంగీత సాహిత్య శిల్ప చిత్రలేఖనాది కళలు, వివిధ వస్తువుల గురించీ ..... ఏదైనా కావొచ్చును.

బావి ఎదుట బొమ్మగోవాలో ఒక బావి వద్ద మహిళ బొమ్మ కూర్చుని ఉన్న విచిత్ర దృశ్యం ఉన్నది. ఒక స్త్రీ మూర్తి నీలం చీర, ఎర్ర జాకెట్టు ధరించి ఒక ప్లాట ఫారం పైన ఆసీన ఐఉన్నది.


బావి యొక్క ప్రాచీనతకు విశదీకరించే పద్ధతిలో ఈ శిల్పాన్ని అక్కడ ఉంచి ఉంటారు. నా ఊహ నిజమైతే- ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఉన్నది.


మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక సత్రాలూ, మంచినీటి బావులూ- కనుమరుగై పోతున్నవి. (ఈనాడు హోటళ్ళు అనేక రెస్టారెంట్లు ఈ లోటుని భర్తీ చేస్తునాయి అనుకోండి!).


మనకి, సంఘానికి మేలు కలిగించే- త్రాగు నీటి వనరులు, భోజన సదుపాయాలను యాత్రికులకు సమకూర్చే ధర్మ సత్రాలు వంటి వాటికి, వాని ప్రాచీనతకు ప్రతీకలుగా- ఇలాగ శిల్పాలు వగైరాలను నిలిపి ఉంచడం మేలు కదా!


చెరువులు, నదులకూ సైతం ముప్పు వాటిల్లుతూన్న నేటి నేపథ్యంలో వాపీ, కూప, తటాకము భద్రతలకై మన ఘోష, గోల, గగ్గోలు అనవసరమని- అంటున్నారా? హ్హూ.....! అదీ నిజమేనేమో!


ఐతే గంగా నదీ పరిరక్షణా కార్యక్రమాలకు- కొంచెం కొంచెం కదలికలు-మన ప్రజా ప్రభుత్వం వారిలో ఏర్పడుతున్నవి కదా! ఈ మాత్రం ఆశావహ దృక్పథం పొరబాటు కాదు కదా!


* * * * * *

రావల్ నాథ్/ భూతనాథ్ (Vetoba | Ravalnath | Bhootnath) కోవెల సీమలో వద్ద  ఉన్నది ఈ బావి.

 
చిటపటలు-22 "దగ్గులు తుమ్ములు" Print E-mail
User Rating: / 1
PoorBest 
Member Categories - WoW
Written by Savyasachi K   
Wednesday, 16 May 2012 14:40

ముఖ్యమంత్రి అవుదామనే దురాశతో ఉప ఎన్నికలకు జగన్ కారణమయ్యాడట! ఈ విమర్శలేవో నల్లారి వారో, నారా వారో చేస్తే సరిపుచ్చుకోవచ్చు. ఆఘమేఘాల మీద సి.ఎం. అయిపోదామని పార్టీ పెట్టి, గిరాకీ లేక ఆ పార్టీనే అమ్ముకొని, రాజ్యసభ సీటు కొనుక్కున్న కొణిదెల వారు ఖళ్ళుఖళ్ళు మంటుంటే, తిరుపతి నియోజకవర్గం హోల్ మొత్తంగా చెవులు చూపిస్తున్నదట పూలేమీ పెట్టుకోలేదని!


* * *

చంటబ్బాయ్ దగ్గులు ఇలా ఉంటే, వీహెచ్ మాత్రం గాండ్రించేస్తున్నాడు. జగన్ లాంటోళ్ళను వదిలేస్తే, ప్రజల ఇళ్ళల్లో చెంబులు, తప్పేళాలు కూడా దోచుకునేస్తారని ప్రజలు జాగ్రత్త పడాలని సలహాలిస్తున్నాడు. దేశంలో కాంగ్రెస్ పడి ఎనిమిదేళ్ళౌతుంటే ఇంకా దోచుకోటానికి ఎవరికి ఏం మిగిలి ఉంటుంది?


* * *

కాంగ్రెస్ అధినేత్రి సోనియా జీ లో ఓ గొప్ప గుణం ఉందట! ఆ పార్టీ నేతలపై ఎటువంటి ఆరోపణలు వచ్చినా ఆయా నేతలని ఆవిడ, ఇతర కాంగ్రెస్ నాయకులు గాలికి వదిలేయరట! ఆరు నూరైనా అండగా నిలబడతారట! పొరుగింటి పుల్లకూర రుచిని నోరు ఊరేలా యెడ్యూరప్ప చప్పరిస్తుంటే, సురేష్ కల్మాడి, అశోక్ చవాన్ లు గుడ్లురిమి చూస్తున్నారట, ఎ.కె.రాజా, కణిమొళి కారాలు మిరియాలు నూరేస్తున్నారట! ఇంతకి యెడ్యూరప్ప దగ్గుతున్నాడో, తుమ్ముతున్నాడో మరేదేమైనా చేస్తున్నాడో అర్ధం కాక, అటు కర్ణాటక కాంగ్రెసీయులు, భా.జ.పా.లు తలలు బాదుకుంటున్నాయని భోగట్టా.


 
<< Start < Prev 1 2 3 4 5 6 Next > End >>

Page 1 of 6

Syndication

feed-image Feed Entries

Avakaaya Image Gallery

Related Articles

Search

Subscribe to Our Newsletter

Get periodical updates on new features
Avakaaya Update


Receive HTML?

Statistics

Members : 160
Content : 580
Web Links : 30
Content View Hits : 611356

Latest Links

Type your comment in

Type in:

Today's Video



Get the Flash Player to see this player.

time2online Joomla Extensions: Simple Video Flash Player Module